Telangana due to tussle between congress and bjp

Telangana due to tussle between congress and BJP, Venkaiah Naidu, Telangana bill passed in two houses, Prime Minister Manmohan Singh, Telangana bill in Rajyasabha,

Telangana due to tussle between congress and BJP, Venkaiah Naidu

కాంగ్రెస్ భాజపాల దాగుడుమూతల్లో బయటపడ్డ తెలంగాణా!

Posted: 02/22/2014 11:08 AM IST
Telangana due to tussle between congress and bjp

తెలంగాణా మీద నీకు చిత్తశుద్ధి లేదంటే నీకు లేదంటూ రెండు పార్టీలూ ఒకదానిమీద మరొకటి నిందలు వేసుకుంటూ తెలంగాణాకి తూతూ మంత్రంలా ఏదో చేసినట్లుగా నటిద్దామనే అనుకున్నారు కానీ చివరకు వారి పోటీల్లో తెలంగాణా పురుడుపోసుకుని బయటపడింది. 

ఫిబ్రవరి 4 న జరిగిన అఖిలపక్ష సమావేశంలో బడ్జెట్ మీద ఓటాన్ అకౌంట్ తప్ప మరే బిల్లుల జోలికీ పోవద్దని, రాహుల్ గాంధీ కోరుకునే అవినీతి నిరోధక బిల్లులు కానీ తెలంగాణా బిల్లు కానీ ఎన్నికల తర్వాత రాబోయే ప్రభుత్వమే చూసుకుంటుందని అభిప్రాయపడ్డారు. 

అయితే, తెలంగాణాబిల్లును కనీసం రాజ్యసభలో ప్రవేశపెట్టటం ద్వారా మేమైతే మా పని చేసాం, రాజ్యసభలో ఆమోదం కూడా పొందింది అని చెప్పవచ్చు, లోక్ సభలోకి వచ్చినప్పుడు చూసుకోవచ్చు అనుకున్న కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ వలన బిల్లుకి సజీవరూపం వస్తుంది, ఏమైనా తేడా వస్తే భాజపా మెడకే ఆ పాపం చుట్టుకుంటుంది అని భావించింది.  అందుకే రాష్ట్రపతి నుంచి రాజ్యసభలో ప్రవేశపెట్టటానికే ముందుగా అనుమతి తీసుకోవటం జరిగింది.

కనీసం తెలంగాణా మీద తన చిత్తశుద్ధిని ఆవిధంగా చాటుకోవచ్చని అనుకున్న కాంగ్రెస్ పార్టీకి అది ద్రవ్య బిల్లు కిందికి వస్తుందని, అందువలన లోక్ సభలోనే ముందుగా ప్రవేశపెట్టవలసి వుంటుందని రాజ్యసభ అధ్యక్షుడు హమీద్ అన్సారీ కచ్చితమైన స్వరంలో చెప్పటంతో కాంగ్రెస్ పార్టీ ఇరుకునపడింది.  క్యాబినెట్ సమావేశ పరచి లోక్ సభలోనే తెలంగాణా బిల్లును ప్రవేశపెట్టాలని చెప్పిన తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ బిల్లు ఎలాగైనా లోక్ సభలో పాసవాల్సిందేనని గట్టిగా చెప్పారు.  దానితో అందుకు అనుగుణంగానే వ్యూహ రచన సాగింది.

ఈలోపులో భాజపా తెలంగాణా విషయంలో కాంగ్రెస్ కప్పదాటు వేస్తోందని, తన సొంత పార్టీ నాయకుల వలన వస్తున్న వ్యతిరేకతలకు తలవొగ్గక తప్పదనుకుని తెలుగు దేశం పార్టీతో చేతులు కలిపే ప్రయత్నం చేసింది.  అయితే చంద్రబాబు మీద వ్యతిరేకతతో భాజపా కూడా తెలంగాణాకు వ్యతిరేకమేననే సంకేతాలు వస్తుండటంతో జాగ్రత్తపడ్డ భాజపా తెలంగాణాకు వ్యతిరేకం కాదని, అయితే సీమాంధ్రకు న్యాయం చెయ్యటం కూడా అవసరమేనని తెదేపా రాగాన్నే తన బాణీలో ఆలపించసాగింది.  అందులో తెదేపా వాదన ప్రస్ఫుటంగా కనిపించసాగింది. 

ఈ అపవాదులకు స్వస్తి చెప్పాలన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ భాజపా నాయకులు కలిసి మంతనాలు సాగించారు.  ఇందులో రాష్ట్రానికి చెందిన రాజ్యసభ ఎంపీ వెంకయ్యనాయుడు ప్రముఖపాత్ర వహించారు.  తెలంగాణా ఇస్తూనే సీమాంధ్రకు న్యాయం చేసే పద్ధతిలో వ్యవహారం సాగాలని కోరిన వాళ్ళలో ప్రధముడు వెంకయ్యనాయుడైతే ఆ తర్వాత సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ సమావేశాలు జరిపారు.  వెంకయ్యనాయుడు జీవోఎమ్ సభ్యుడు జైరాం రమేష్ తో వరసగా భేటీ అయ్యారు.  అందులో ఎన్నో సూచనలు చేసారు.  హైద్రాబాద్ ను తెలంగాణాకు ఇవ్వాలి కానీ అందుకు తగ్గ పరిహారం సీమాంధ్రకు దక్కాలని ఆయన తన అభిప్రాయాన్ని గట్టిగా వినిపించారు. 

అందుకు ఆర్థిక సహాయం రూపంలో పదివేల కోట్ల రూపాయల నిధిని ముందుగా ప్రకటించాలని ఆయన కోరగా ప్రధానమంత్రి సంశయిస్తూ ప్రణాళికా సంఘం నుంచి అనుమతులను ఇంత త్వరగా తేవటం కుదరదని అన్నారు.  అందుకు సమాధానంగా ప్రణాళికా సంఘం ఛైర్మన్ హోదాలో ప్రధాన మంత్రి ఆ దిశగా ప్రకటన చేయవచ్చని చెప్పి ఆయనచేత రాజ్యసభలో ప్రకటన చేయించారు.  ప్రధాన మంత్రి స్వయంగా ప్రకటనలు చెయ్యటం, ఆయన సమక్షంలో చర్చలు జరగటం వెంకయ్యనాయుడు పట్టుదల మీదనే జరిగింది. 

వెంకయ్య నాయుడు సీమాంధ్రలో పర్యటనలు చేస్తున్నప్పుడు చేసిన వ్యాఖ్యల వలన భాజపా మడమ తిప్పుతోందన్న అభిప్రాయం తెలంగాణాలో కలగటం, అందువలన కేంద్ర నాయకులు స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరటం జరిగింది.  అందువలన తన మీద, పార్టీ మీదా పడుతున్న అపవాదును పోగొట్టుకునే దిశగా వెంకయ్య నాయుడు తెలంగాణా కోసం శాయశక్తులా పాటుపడ్డారు.

సోనియా రాహుల్ గాంధీలు గట్టిగా చెప్పటం వలనే వ్యూహరచనతో ముందుకు సాగిన కమలనాధ్, షిండేలు వ్యక్తిగతంగా ఈ విభజన ప్రక్రియకు వ్యతిరేకమేనన్న విషయాన్ని బయటపెట్టారు కూడా.  ఎందుకంటే దీని వలన విదర్భ ప్రత్యేక రాష్ట్రం విషయంలోనూ నాగపూర్ లోనూ సమస్యలు ఉత్పన్నమవచ్చని వారిద్దరూ భావించారు.  జైరాం రమేష్ కూడా వ్యక్తిగతంగా తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి మొగ్గు చూపలేదు. 

రాజ్య సభలో ఆమోదం పొంది లోక్ సభలో ఆమోదానికి నోచుకోని మహిళా రిజర్వేషన్ బిల్లులా సజీవ రూపంలో ఉంటే చాలు అనుకున్న కాంగ్రెస్ పార్టీకి, తన మీద అపవాదు లేకుండా చేసుకోవాలనుకునే భాజపాకు మధ్యన వచ్చిన సంఘర్షణలో తెలంగాణా బిల్లు బయటపడిపోయింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles