Formation of 29th state of india

formation of 29th state of India, Telangana bill passed in Rajyasabha, T Bill sent to President, Prime Minister Manmohan Singh, BJP Arun Jaitley, BJP Venkaiah Naidu

formation of 29th state of India

పురిటి నొప్పులు తీరి దేశంలో 29 వ రాష్ట్ర ఆవిర్భావం

Posted: 02/21/2014 07:57 AM IST
Formation of 29th state of india

రాజ్యసభలో కూడా రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం లభించటంతో చరిత్ర సృష్టించిన ఆనందం తెలంగాణా కాంగ్రెస్ నాయకులలో పెల్లుబికింది.  జైపాల్ రెడ్డితో సహా అందరూ పార్లమెంటు భవన్ లోని గాంధీ విగ్రహం దగ్గర ఆనందంతో కేరింతలు కొడుతూ జై తెలంగాణా అంటూ సంతోషాతిశయంతో పాటు జై జై సోనియా గాంధీ అంటూ విభజన బిల్లును ఉభయ సభలలో గట్టెక్కించినందుకు నాయకులు పార్టీ అధినాయకత్వానికి తమ కృతజ్ఞతలను కూడా తెలుపుకున్నారు.  

సోనియా గాంధీ పోస్టర్ ని ప్రదర్శిస్తూ జైజై లు పలకటమే కాక మిఠాయిలతో నోరు తీపి చేసుకున్నారు.  జూలై 30 2013 న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విభజన బిల్లుకు అంకురార్పణ జరిగిన తర్వాత దిన దిన గండంగా పురిటి నొప్పులను పడుతూ ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రాన్ని ప్రసవించింది.  ఇక బొడ్డు కోసి స్నానం చేయించే పని మాత్రమే మిగిలిపోయింది.  రాష్ట్రపతి ఆమోదంతో ఆ పని కూడా పూర్తై, కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పాయింట్ మెంట్ డే ప్రకటనతో ఇక నామకరణ మహోత్సవం కూడా జరిగిపోయినట్లే.   

ఆఖరి ప్రయత్నంగా సీమాంధ్ర ఎంపీలు రాజ్యసభ వెల్ లోనే రోజంతా గడిపుతూ అంతరాయం కలిగిస్తున్నా, రాజ్యసభ ఉపాధ్యక్షుడు తన పని తాను చేసుకుంటూ పోయారు.  

ప్రధాన ప్రతిపక్షమైన భాజపా నుంచి అడ్డంకులేమీ రాకుండా చూసుకుని, రాజ్యాంగ సవరణల్లాంటి పనులతో జాప్యం జరగకుండా చూసి బిల్లను గట్టెక్కించిన ఘనత ప్రధాన మంత్రికే దక్కుతుంది.  హైద్రాబాద్ ని 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ప్రకటిస్తూ హైద్రాబాద్ వాసుల భద్రత కోసం ప్రత్యేక ప్రతిపత్తిని ఇవ్వటం జరిగింది.  5 సంవత్సరాల కాలం శేషాంధ్రప్రదేశ్ లో పన్ను రాయితీని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.  

విభజనకు తమ సమర్ధనను తెలియజేస్తూనే భాజపా నాయకులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు అధికార పక్షం బిల్లును ఆమోదించిన తీరుని తప్పు పట్టారు.  సభలో చర్చైతే జరిగింది కానీ సభ్యుల కంఠశోష మాత్రమే మిగిలింది.  బిల్లు అధిష్టానం ఆశించిన రీతిలో పాసైపోయింది.

ధృఢ నిశ్చయంతో ముందుకెళ్ళి విభజన బిల్లును ఆమోదింపజేసిన సోనియా గాంధీకి తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ తెలంగాణా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  ఈ విధంగా అడ్డంకుల మధ్య బిల్లు పాసవకపోతే కాంగ్రెస్ కి, ముఖ్యంగా సోనియా గాంధీకి తెలంగాణా ప్రజలకు ప్రత్యేక రాష్ట్రాన్నిచ్చిన పేరు వచ్చుండేది కాదేమో!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles