Ap state reorganization bill 2013

AP State Reorganization Bill 2013, Cricket match at Delhi, Cricket match to determine bifurcation, Seemandhra Telangana Cricket Match

AP State Reorganization Bill 2013, Cricket match at Delhi

కొలిక్కి వచ్చిన రాష్ట్ర విభజన సమస్య

Posted: 02/07/2014 06:58 PM IST
Ap state reorganization bill 2013

చివరకు రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ఒక అవగాహనకు వచ్చింది.  సమావేశాలు, అందులో అందరి ఆవేశపూరిత వాదనలను వినటం, అధిష్టానం తన అంతరంగంలో ఉన్న ఎటూ తేలని ఆలోచనలతో రకరకాల ప్రకటనలు చేసి గందరగోళం సృష్టించటం, ఈ లోపులో న్యాయసలహాలు తీసుకోవటం ఇవన్నీ ఎందుకు చాలా సులభంగా ఈ సమస్యను పరిష్కరించవచ్చని భావించటానికి కారణం అంతకు ముందు రోజు సోనియా గాంధీ సలహాదారుడు అహ్మద్ పటేల్ అంతకు ముందు రాత్రి టివిలో వచ్చిన అమీర్ ఖాన్ పాత సినిమా లగాన్ చూసారు.

లగాన్ లో బ్రిటిష్ వారితో భారతీయులు క్రికెట్ ఆడతారు.  అందులో గెలిచినట్లయితే భారతీయులు ఆ గ్రామంలో పన్ను కట్టవలసిన అవసరం లేదు.  అదీ ఆట నియమం.  ఇంకేముంది, తళుక్కున వచ్చిందో ఆలోచన ఆహ్మద్ పటేల్ బుర్రలో.  వెంటనే సోనియా గాంధీ చెవిలో దాన్ని ఊదటం జరిగింది.  రెండో చెవిలోంచి అంతా విన్న రాహుల్ గాంధీ ఎగిరి గంతేసారు.  అదేమిటంటే, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు, తెలంగాణా కాంగ్రెస్ నేతలకు మధ్య క్రికెట్ మ్యాచ్.  అందులో ఎవరు గెలిస్తే వాళ్ళ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది.

ఇది విన్న నాయకులంతా ముందు కాదు కూడదు అన్యాయం అన్నా చివరకు ఇదే బాగుందని ఒప్పుకున్నారు.  అయితే సీమాంధ్రలో కిరణ్ కుమార్ కెప్టెన్సీలో లగడపాటి, పయ్యావుల లాంటి యువకులు అద్భుతంగా ఆడే అవకాశం ఉంది కాబట్టి తెరాస ఒక ప్రతిపాదన చేసింది.  తెలంగాణాలో తెరాస ఎలాగూ కాంగ్రెస్ లో కలుస్తుందన్న భరోసా ఉంది కాబట్టి ఆ పార్టీలోంచి కూడా హరీష్ రావు కెటిఆర్ లాంటి వాళ్ళని తీసుకుంటే ఆట రంజుగా ఉంటుందని కెసిఆర్ అన్నారు.  దీనికి సీమాంధ్ర నాయకులు కూడా అంగీకరించారు. 

నేను చెప్పానా, ఆఖరి బంతి ఇంకా అవలేదు అన్నారు కిరణ్ కుమార్ ఈ ఏర్పాటుకి తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ.  హరీష్ రావుని ఔట్ చెయ్యాలనే కోరిక ఈ విధంగా తనకి దక్కుతుందనే నమ్మకం కూడా వెలిబుచ్చారాయన. 

మరి మిగతా పార్టీల అభిప్రాయాల సంగతేమిటి అన్న ప్రశ్న వచ్చింది.  సరే అందరికీ ఈ విషయాన్ని తెలియజేద్దాం అని అఖిలపక్ష సమావేశంలో ఈ క్రికెట్ ప్రతిపాదనను ప్రకటించారు. 

బావుంది. కానీ నేను రిఫరీగా ఉంటానన్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.  నాకు రెండు ప్రాంతాలు రెండు కళ్ళు.  అందువలన నేను ఎటువైపు ఆడలేను కాబట్టి నేను సమన్యాయం చెయ్యటానికి ఆటను పరిశీలిస్తానన్నారాయన. 

జనసత్తా పార్టీ ఇది రాజ్యాంగ విరుద్ధమని తేల్చివేసింది.  దీనికంటే మీరు లాటరీ తీస్తే ఇంకా బావుండేదేమో అని చెప్పి సమావేశంలోంచి వాకౌట్ చేసారు జయప్రకాశ్ నారాయణ.  మామాట ఎవరూ ఎత్తరేం.  వార్తల్లో కానీ ఇతర విషయాల్లో కానీ మేము కూడా ఉన్నామన్న సంగతి ప్రజలు మర్చిపోయేలా చేస్తున్నారంటూ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఆగ్రహాన్ని వెలిబుచ్చాయి. 

ఇది నాకు విషమ పరిస్థితి అన్నారు వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి.  నేను క్రికెట్ బాగా ఆడగలను కానీ కాంగ్రెస్ ప్రార్టీతో కలిసి ఆడటం వలన నాకు చెడ్డపేరు వస్తుంది కాబట్టి నేను న్యూట్రల్ గా ఉంటాను.  ఒకవేళ తెదేపా ఆడితే మేము కూడా ఆడేవాళ్ళమే కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మేము ఆడటం వేరే సంకేతాలిస్తాయి అన్నారు జగన్. 

ఇందులో ఆడవాళ్ళం కూడా ఆడతాం అంటూ ఉత్సాహం చూపించారు విజయశాంతి, కవితలు.  నేను కృష్ణుడి వేషంలో వచ్చి ఆడతా అభ్యంతరమా అన్నారు ఎంపీ శివప్రసాద్. 

సరే ఇక తేదీని స్థలాన్ని నిర్ణయించుకుందాం అన్నారు దిగ్విజయ్ సింగ్. 

ఇంకేంది నిర్ణయించేడిది.  ఎట్లాగూ ఢిల్లీలోకి వస్తనేవున్నం.  ఈడ్నే ఆడితే పోద్ది అన్నారు కెసిఆర్. 

అవునవును మనం మన రాష్ట్రంలోకన్న ఇక్కడే ఎక్కువ కలుసుకుంటున్నాం ఇక్కడే ఆడేద్దాం అన్నారు లగడపాటి రాజగోపాల్, 

జంతర్ మంతర్ లో ఆడదామా అన్నారొకాయన. 

జంతర్ మంతర్ల ఎట్ల ఆడతవయ్య దిమాక్ గిట్ల పోయిందా.  అది ఒట్టిగ ఆందోళన చేసే చోటు అన్నారు కెసిఆర్. 

ఈ వాదనకు ఫుల్ స్టాప్ పెడుతూ, ఒక వారంలో ఆట ఆడదాం, స్థలాన్ని మేం చెప్తాం అని దిగ్విజయ్ సింగ్, షిండేలు అన్నారు.  ఈలోపులో బాగా ప్రాక్టీస్ చేసుకోండి అని సలహా కూడా ఇచ్చారు.

ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు అహ్మద్ పటేల్ ని అందరూ అభినందించారు.   ఈ లోపులో ఎక్కడి వచ్చారో కానీ విహెచ్, శంకర్రావులు గబగబా వచ్చి, తెలంగాణా గనక వస్తే లేదా, సోనియా గుడి పక్కన క్షేత్రపాలకుడిగా మీ విగ్రహం పెడతం అన్నారు అహ్మద్ పటేల్ తో. 
అందరూ నవ్వులతో కరచాలనాలు చేసుకుని ఎవరి బసకు వారు వెళ్ళిపోయారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles