Banks get busy from april 1

banks get busy from April 1 with exchange of notes, 500 and 1000 notes prior to 2005, Exchange of 500 and 1000 notes, Reserve Bank Of India

banks get busy from april 1 with exchange of notes

పెద్ద నోట్ల రద్దుతో రద్దీగా మారనున్న బ్యాంక్ లు?

Posted: 01/23/2014 12:06 PM IST
Banks get busy from april 1

2005 సంవత్సరానికి ముందు విడుదల చేసిన రూ.500, రూ.1000 నోట్లు మార్చి 31 వరకే చెల్లుతాయని, వాటిని ఏప్రిల్ 1 నుంచి బ్యాంక్ నుంచి మార్చుకోమని బుధవారం రిజర్వ్ బ్యాంక్ చేసిన ప్రకటన సంచలనం రేపింది. 

అయితే భయపడవలసిన పనేమీ లేదని, తమ దగ్గరున్న కరెన్సీ నోట్లలో అటువంటి పాత నోట్లు ఉన్నట్లయితే వాటిని ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు ఏ బ్యాంక్ నుంచైనా మార్పిడి చేసుకోవచ్చని, ఆ సమయంలో చేసుకునే కరెన్సీ నోట్ల మార్పిడిలో ఎవరినీ ఏ ప్రశ్నలు అడగటం ఉండదని కూడా తెలియజేసారు.  నోట్ల మార్పిడి కోసం తీసుకెళ్ళే బ్యాంక్ లో వాళ్ళకి ఖాతా ఉండవలసిన అవసరం లేదు.  పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లు తీసుకోవటమే చెయ్యవలసింది.  దీని ప్రభావం ఎలా ఉండబోతోందన్నది ఊహించుకుంటే,

1. ఏప్రిల్ 1 న బ్యాంక్ ల ముందు క్యూలలో బారులు తీరే జనాలు కనిపిస్తారని అంచనాలు వస్తున్నాయి.  అయితే, మనవాళ్ళు చివరి రోజు వరకూ వేచి చూడటానికి ఇదేమీ కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లు కాదు.  ఇంకా రెండు నెలల పై చిలుకుంది.  ఈ లోపులో పెద్ద నోట్ల తీసుకోకుండా జాగ్రత్త పడుతూ, తమ దగ్గరున్న పెద్ద నోట్లను వదిలించుకుంటారు చాలామంది. 

2. మరీ ఎక్కువ నోట్లు ఉన్నవాళ్ళకి కూడా కావలసినంత సమయం దొరుకుతోంది.  అందువలన ఏప్రిల్ 1 న మరీ ఎక్కువ క్యూలైతే లేకపోవచ్చు.  అందుకు మరో కారణం జూన్ 30 వరకు గడువు ఇవ్వటమే. 

3. ఉపాధి పెరగవచ్చు.  నోట్ల మార్పిడి చెయ్యటానికి దళారులు ముందుకొస్తారు.  వాళ్ళు క్యూలో నిలబడి రోజంతా గడపటానికి బ్యాంక్ లకు తిరగటానికి అయ్యే ఖర్చు మీద కాస్త ఎక్కువ తీసుకుని తమ పబ్బం కూడా గడుపుకుంటారు.  ప్రస్తుతం చిల్లర తో వ్యాపారం చేసేవాళ్ళకి ఇక కొద్ది కాలంపాటు రెండు చేతులా పని.

4. ఇక ఈ లోపులో, అంటే ఈ రోజు నుంచి జూన్ 30 వరకు  చిన్న నోట్లకి మహా గిరాకీ పెరుగుతుంది.  విరివిగా కనిపించే పది, ఇరవై యాభై వంద రూపాయల నోట్లు కనుమరుగు కావొచ్చు. 

5. రూ.500, 1000 రూపాయల నోట్లకి చిల్లర ఎవరూ ఇవ్వరు.  పెద్ద కొనుగోళ్ళకు తప్ప ఆ నోట్లు పనికి రావు. 

జూలై 1 తరువాత (ఎప్పటి వరకు అన్నది చెప్పలేదు రిజర్వ్ బ్యాంక్) అటువంటి నోట్లు 10 నోట్ల కంటే ఎక్కువ సంఖ్యలో మార్పిడికి తీసుకెళ్తే మాత్రం వాళ్ళు తమ వ్యక్తిగత గుర్తింపుకి సంబంధించిన సాక్ష్యాధారాలతో పాటు నివాసముంటున్న చిరునామాను కూడా నిర్ధారణ చెయ్యవలసివుంటుంది. 

దీనికీ విరుగుడు మంత్రం ఉంది.

1. క్యూలో నిల్చుని ఒక సారి పది కంటే ఎక్కువ నోట్లను బయటకు తీయకుండా మార్పిడి చేసుకోవచ్చు.  లేదా వివిధ బ్యాంక్ లు వాటి శాఖలు ఉండనే ఉన్నాయి. 

2. నోట్ల మార్పిడి చేసే వారికి ఉపాధి జూలై తర్వాత కూడా ఉంటుంది.  వాళ్ళ పని రోజంతా వివిధ బ్యాంక్ లలో నోట్లను మార్పిడి చెయ్యటమే.  అందుకు వాళ్ళకి కమిషన్ లభిస్తుంది. 

నల్లధనం కలవారి కలలు చెదరకుండా ఉండటం కోసమే చేసినట్లుంది కదూ ఈ వ్యూహరచన.  కమిషన్ ఇచ్చినా, లేక ఉపాధి కల్పించినా అప్పటికీ వాళ్ళకి ఆదాయ పన్ను కంటే తక్కువ భారమే పడుతుంది, పైగా వాళ్ళ వ్యక్తిగత గుర్తింపు మరుగునే వుంటుంది. 

ఇక పాత రూ.500, రూ.1000 నోట్లను గుర్తించటమెలా. 

పాత నోట్ల వెనక వాటిని ముద్రించిన సంవత్సరం రాసి వుండదు.  కానీ 2005 తర్వాత విడుదల చేసిన నోట్ల వెనక వాటి సంవత్సరం కూడా ముద్రించబడివుంటుంది.  ఇదీ వాటిని గుర్తించటానికి రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన క్లూ.

నల్లధనాన్ని వెలికి తీయటానికి ఏదో ఒక పద్ధతిని అనుసరించవలసిందే కానీ ఇది మరీ నల్లధనం కలవారి కొమ్ముకాయటానికే ఉన్నట్లుంది ఈ వ్యవహారం అంటూ కొందరు విమర్శిస్తున్నారు.  బ్లాక్ మనీని అధికశాతం పెద్ద నోట్లలో దాచుకుంటారు తక్కువ స్థలం ఆక్రమిస్తుంది కాబట్టి.  అందువలన వాటిని రద్దు చెయ్యటం వలన అవి బయటకు వస్తాయన్నది నిర్వివాదం.  అయితే ఇలా జూన్ వరకు ప్రశ్నలు వెయ్యం, ముఖం కూడా పరికించి చూడం, తల వంచుకునే మీ నోట్లకు బదులు వేరే నోట్లు ఇస్తాం అనటం వరకు బాగానే వుంది కానీ, జూలై తర్వాత పది నోట్ల వరకే మార్పిడి చెయ్యటం, అలా ఎంతవరకు చేస్తారో చెప్పకపోవటం మాత్రం ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. 

అయితే ఒక లాభం మాత్రం ఉంది.  నల్ల ధనంతో పాటుగా దొంగనోట్లు కూడా అంతరించిపోతాయి.  ఎటిఎంలనుంచి కూడా 500, 1000 రూపాయల నోట్లలో దొంగనోట్లు వచ్చిన దాఖలాలున్నాయి.  అవి మీ ఎటిఎం నుంచి వచ్చినవే అన్నా వినకపోవటం, ఆ నోట్లను కాల్చిపడేయటం జరిగాయి.  అలాంటి నోట్లు ఇప్పుడు పూర్తిగా అంతరించిపోతాయి. 

1. అటువంటి నోట్లను బ్యాంక్ మార్చటానికి ఒప్పుకోకపోవటం,

2. ఒకవేళ పొరపాటున వాటినీ మార్చినా, మళ్ళీ అలాంటి నోట్లయితే చెలామణీలోకి వచ్చే అవకాశం పోగొట్టుకుంటాయి.  అంటే, దొంగ నోట్లను చెలామణి చేస్తున్నవారి ఆటకట్టు అవుతుంది.

ఏమైనా పెద్ద తలకాయలు, ఆర్థిక శాస్త్రంలో పండిపోయినవారు తీసుకున్న నిర్ణయం కాబట్టి దీని వెనక నున్న చిదంబర రహస్యం నెమ్మదిగా బహిర్గతమయ్యే అవకాశం ఉంది.

జూన్ తర్వాత కూడా చిన్న సంఖ్యలో మార్చుకోవచ్చనే అభిప్రాయం కలుగజేసిన రిజర్వ్ బ్యాంక్, జూలై 1 నుంచి మార్పిడి చేసే ప్రతి నోటు వెనకనున్న వ్యక్తి ఆరాలు తీయటానికి ప్రయత్నిస్తూ, ఎక్సేంజ్ ని వాళ్ళ ఖాతాలలోనే జమకడతాం అని అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.  అదే జరిగితే మాత్రం దేశంలో ఉన్న నల్లధనంలో అధికశాతం వాడకంలోకి వస్తుంది.

అయితే రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం మీద ఫలితాలను ఇంకా వేచి చూడాల్సి వుంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles