Kiran kumar public meeting on new party

Kiran Kumar Public meeting on new party, Chief Minister Kiran Kumar Reddy, Kiran Kumar political party, AP tate bifurcation

Kiran Kumar Public meeting on new party

సొంత పార్టీ మీద కిరణ్ కుమార్ బహిరంగ సభ?

Posted: 01/18/2014 10:15 AM IST
Kiran kumar public meeting on new party

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానంతో మొదటి నుంచి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత పార్టీ పెట్టే విషయంలో ఎన్నో నెలలుగా ఊహాగానాలు వస్తూవున్నాయి.  ఇక అవి నిజమై ఊపిరి పీల్చుకోబోతున్నాయన్న సంకేత పవనాలు సంక్రాంతికి ముందు నుంచే వీస్తూ కనిపించాయి- ఫ్లెక్సీల రూపంలో.  ఎవరు తయారు చేయించారో, వాటిల్లో ఏ పేరు లేకుండా ఎందుకు ముద్రించారో, రాత్రికి రాత్రే గుట్టుచప్పుడు కాకుండా ఎందుకు అన్ని చోట్లా కట్టించారో తెలియలేదు కానీ, వాటి వెనుక కిరణ్ కుమార్ రాజకీయ వ్యూహం ఉందన్న విషయం మాత్రం అందరూ నమ్ముతున్నారు. 

ముందు విజయవాడ, ఇతర సీమాంధ్ర ప్రాంతాలలో వెలిసిన ఫ్లెక్సీలు ఇంకా ఊపందుకుని విజయవాడతో పాటు రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లలోనూ, విమానాశ్రయంలోనూ ప్రత్యక్షమయ్యాయి.  దీనితో, ఈ విధంగా చెయ్యగలిగిన వాళ్ళు కేవలం అధికారంలో ఉన్నవాళ్ళే అని, అందువలన కర్త కిరణ్ కుమార్ రెడ్డి అని, అంతర్యం కొత్త పార్టీని ప్రకటించటానికి ముందు చేస్తున్న ఏర్పాట్లని అర్థం అవుతోంది. 

ఇక, బహిరంగంగా ఈ విషయాలు బయటపడటానికి కూడా ఆట్టే సమయం లేదని, జనవరి 21, 22 లలో విజయవాడలో బహిరంగ సభ ఏర్పాటు చేసి కిరణ్ కుమార్ రెడ్డి తన భావి కార్యకలాపాలను, రాజకీయ నిర్ణయాలను బయటపెట్టబోతున్నారని కూడా బాగా వినపడుతోంది.  అందుకు వేదిక విజయవాడ స్వరాజ్ మైదాన్ అని కూడా చెప్పుకుంటున్నారు. 

అయితే, వార్తలలో కిరణ్ కుమార్ సొంత పార్టీ గురించి వచ్చిన ప్రతిసారీ కేంద్ర మంతులు దాన్ని కొట్టిపారేస్తూ వచ్చారు.  కిరణ్ కుమార్ రెడ్డి లాంటి కాంగ్రెస్ పార్టీ విశ్వాసపాత్రుల అలా చెయ్యరంటూ నమ్మబలుకుతూ వచ్చారు.  లేక అది కిరణ్ కుమార్ రెడ్డికి అలాంటి పని చెయ్యకూడదనే హెచ్చరిక కూడా కావొచ్చు. 

గాలిలో పల్టీలు కొడుతున్న మరో వార్త ఏమిటంటే, ఇదంతా కూడా అధిష్టానం చేయిస్తున్నదేనని, సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయినా కిరణ్ కుమార్ రెడ్డి ఆసరాతో అక్కడా పుంజుకోవటానికి ఇదో ఎత్తుగడని కూడా చెవులు కొరుక్కుంటున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles