Crowd funding a boon for new ventures

crowd funding, banks, financial institutions, bank loans, ventures that need loans, seed capital, crowd funding investors

crowd funding a boon for new ventures

బ్యాంక్ లోన్ రానివారికి క్రౌడ్ ఫండింగ్ ఒక వరం

Posted: 06/21/2013 06:10 PM IST
Crowd funding a boon for new ventures

బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే చాలా తతంగం ఉంటుంది.  ఋణాలు ఇవ్వనూ అంటే బ్యాంక్ లకు ఆదాయం ఎలా వస్తుంది.  అలా అని ఎడా పెడా ఇచ్చుకుంటూ పోతే తిరిగిరాకపోతే వడ్డీ కాదు అసలుకే మోసమొస్తుంది.  అందువలన బ్యాంక్ లు ఆచి తూచి ఋణాలను మంజూరు చేస్తాయి.  తిరిగి ఎలా ఇవ్వగలవు అనే ప్రశ్నకు ఋణం కోసం బ్యాంక్ ని ఆశ్రయించేవారు సరైన సమాధానంతో పాటు అవసరమైన పత్రాలను దాఖలాలను హామీలను ఇవ్వవలసివుంటుంది.  అప్పటికీ నువ్వు కొంత పెట్టుబడి పెడితే మిగతాది మేమిస్తామంటాయి బ్యాంకులు.

ఇక కొత్త రకమైన వ్యాపారం చేద్దామన్నా, తీసుకున్న ఋణాన్ని తిరిగి ఈ విధంగా ఇవ్వగలనని ఆమోదయోగ్యమైన విధంగా చెప్పలేకపోయినా అటువంటివారికి ఋణం లభించదు.  ఎటువంటి వ్యాపారం చేసి ఎలా సంపాదించి మా డబ్బు మాకు ముట్టచెప్తావో కచ్చితంగా చెప్పమని బ్యాంకులు అడుగుతాయి.  ఇంతవరకూ లేని వ్యాపారం చెయ్యటానికి, ఇంతవరకు అనుభవంలేని వ్యాపారికి ఋణం ఇవ్వమంటే బ్యాంక్ మొఖమాటం లేకుండా ఇవ్వను పొమ్మంటుంది.

అటువంటివారికి క్రౌడ్ ఫండింగ్ విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  చిన్న చిన్న మొత్తాలలో పెట్టుబడి పెట్టగలిగే వారినుంచి సమకూర్చిన సొమ్ముని బ్యాంక్ లు ఇవ్వలేని ప్రణాళికల్లో పెట్టుబడి పెట్టటానికి ఉపయోగించేదే క్రౌడ్ ఫండింగ్.

పెట్టుబడి పెట్టేవారు మూడు విధాలుగా పెట్టవచ్చు.  ఒకటి దానరూపంలో, రెండు ఋణరూపంలో, మూడు వ్యాపారంలో వాటా తీసుకుంటూ.

ఒక మంచి పని చేస్తున్నాం కదా అని తిరిగి డబ్బు ఆశించకుండా ఇచ్చినవారి పేర్లను ప్రచురించటం, వారికి కొన్నిఉచిత బహుమతులు, కొన్ని ముఖ్యమైన వేడుకలకు టికెట్లు ఇవ్వటం ద్వారా వారి సద్భావనను గుర్తించినట్లవుతుంది. 

ఇక ఋణంలా ఇచ్చేవారికి వడ్డీ రూపంలో ఆదాయం ఇవ్వబడుతుంది.  ఆదాయానికి ఆదాయం, మంచి పనికి సాయం చేసామన్న తృప్తీ వారికి మిగుల్తుంది.  బ్యాంక్ చుట్టూ తిరగకుండా ఋణగ్రాహకులకు కూడా పని సులభమౌతుంది.  అయితే పేదలకు, అభివృద్ది చెందుతున్న దేశాలకు ఇచ్చే ఋణాలమీద వడ్డీ లేకుండా ఇవ్వటం జరుగుతుంది.

మరి మూడవది వాటా ద్వారా.  ఈ పద్ధతిలో పెట్టుబడిపెట్టే వెంచర్లలో వాటాల రూపంలో తిరిగి తీసుకోవటం జరుగుతుంది. ఇందులో ఆదాయం వెంటనే రాకపోవచ్చు.  నెమ్మదిగా వ్యాపారం పుంజుకుంటుంటే లాభంలో వాటా రూపంలో తిరిగి రావచ్చు.  అయితే ఇందులో పెట్టుబడి నష్టపోయే అవకాశం ఉంది.  అందుకు సిద్ధపడి ఇచ్చేవారే ధనసాయం చేస్తారు. అందువలన పెట్టుబడి పెట్టేముందు జాగ్రత్తగా చూసి అది నచ్చితేనే అందులో పెట్టుబడి పెడతారు.  అయితే బ్యాంక్ లో ఉన్నంత నియమనిబంధనలుండవు కాబట్టి తీసుకునే వారు వారి కలలను సాకారం చేసుకోవటానికి అవసరమైన ధనసహాయాన్ని పొందే అవకాశం ఉంది.

క్రౌడ్ ఫండింగ్ కోరుకునేవారికి కొన్ని సూచనలు-

క్రౌడ్ ఫండింగ్ కావాలనుకునేవారు వారి ప్రణాళికను సాధ్యమైనంత వివరంగా స్పష్టంగా తెలియజేయాలి.  వీలయితే ముందు కొంత పెట్టుబడి పెట్టి ఆ ప్రణాళికను ముందుకు సాగించాలి.  ఎందుకంటే ఏమీ లేకుండా అంతే మీరే పెట్టండి నేను వ్యాపారం చేసుకుంటా అంటే నమ్మశక్యంగా ఉండకపోవచ్చు.  తమ బంధుమిత్రులచేత కూడా పెట్టుబడి పెట్టిస్తే మంచిది.  మీ వాళ్ళే మిమ్మల్ని నమ్మటంలేదే మరి మేమెలా నమ్ముతామని వాళ్ళు అనుకోకుండా ఉంటుంది.  మీరు చెయ్యబోయే వ్యాపారం గురించి ఓపిగ్గా వివరించటానికి సిద్ధమౌతూ ఎన్ని రకాల ప్రశ్నలుదయించే అవకాశముందో ముందే ఊహించుకుని తయారవండి.  మరి ఇన్నీ బ్యాంక్ లో కూడా అడుగుతారు కదా అంటే, బ్యాంక్ లో ఇవ్వవలసిన హామీలు, తనఖా పెట్టవలసిన ఆస్తులు ఇందులో ఉండవు కాబట్టి త్వరగా ప్రాసెస్ అవుతుంది. 

మొత్తం మీద,  డబ్బు లేక ఆగి పోయే మంచి ప్రాజెక్ట్ లకు క్రౌడ్ ఫండింగ్ నిజంగా వరప్రదాయని అవుతుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles