Different kinds of ananda and brahmananda

different kinds of ananda and brahmananda, brahmanandam

different kinds of ananda and brahmananda, brahmanandam

anandam-analysis.gif

Posted: 11/22/2011 03:10 PM IST
Different kinds of ananda and brahmananda

     "బ్రహ్మానందం అంటే ఏమిటి, అది ఎలా దొరకుతుంది, దానికోసం ఏం చెయ్యాలి?" అంటూ ఒకాయన అడిగారు.  అప్పుడు నాకూ, 'అసలు ఈ అనందమంటే ఏమిటి?' అనే సందేహం వచ్చింది.  'ఆ ఆనందాల్లో రకాలు కూడా ఉంటాయా? ఏమిటీ బ్రహ్మానందం అంటే? అన్న ప్రశ్నలు ఉదయించాయి. 

     "దానికోసం ప్రత్యేకంగా ఏమీ చెయ్యనక్కర్లేదు.  మీరు మీ ఆధ్యాత్మిక సాధనను కొనసాగించండి చాలు.  మీరు చేరుకుంటున్న స్థాయినిబట్టి ఎప్పటికప్పుడు మీకు దొరికే ఆనందం మీకు దొరకుతుంది" అని జవాబిచ్చారు గురువుగారు.  అడిగినాయనకేమర్థమైందో తెలియదు కానీ తలూపి కూర్చున్నారాయన.

     పెళ్ళయితే కానీ గృహస్థు ఆనందం ఏమిటో తెలియదు.  పిల్లలు కలిగినప్పుడు కానీ తల్లి లేక తండ్రికి లభించే ఆనందమేమిటో అర్థం కాదు.  "గృహస్థు సౌఖ్యం లభించాలంటే నేనేం చెయ్యాలి?" అంటూ పది సంవత్సరాల పిల్లవాడు అడిగితే ఏం చెప్తారు?  "పెద్దయితే నీకే తెలుస్తుంద"ని అంటారు అంతేకదూ! 

     ఆనందపడగూడదని ఎవరనుకుంటారు.  శోకాన్ని ఎవరు కోరుకుంటారు.  కాకపోతే ఆనందంగా ఉండటానికి కొన్ని షరతులు పెట్టుకుంటారు.  కిచెనంతా యంత్రాలమయం చేసుకుంటేనే కానీ తృప్తి ఉండదు కొంతమందికి.  ప్లాస్మా టివి, రెండు తలుపుల ఫ్రిజ్, ఎసి లేనివి ఇళ్ళా అని కొందరంటే.  ధన్ ధన్ మని హోమ్ థియేటర్ గుండెలను అదరగొడుతూ మోగకపోతే ఎదిగిన పిల్లలకెంత నామోషీ!  మల్టీమీడియా, ఇంటర్ నెట్, 3జి ఫోన్ ఇలా విఙాన శాస్త్ర విజృంభన మనుషులకు లేని వస్తువుల సంఖ్యని పెంచుకుంటూ పోతుంటే, సగటు మానవుడు తన అసంతృప్తినీ తన తన శాయశక్తులా పెంచుకుంటూ పోతున్నాడు.  ఏదైనా కొత్తగా వచ్చిన వస్తువు తన కళ్ళని తప్పించుకోలేదు కదా అని రోజూ వచ్చే వార్తాపత్రికల్లోని ప్రకటనలను చూసేవారే ఎక్కువమంది. 

     అయితే, "ఇవన్నీ భ్రమలు, మిథ్యలు, ఈ ఆనందాలను మించిన ఆనందం వేరేవుంది, దాన్ని బ్రహ్మానందం అంటారు, దాని కోసం పాటుపడండి, అంతవరకూ దీన్ని వదిలెయ్యండి" అని చెప్తే దాన్ని కూడా నమ్మకండి.   ఆనందం ఏదైనా ఆనందమే.  అందులో చెడు ఆనందమూ, మంచి ఆనందమంటూ ఉండవు.  ఆనందించే మనిషి మంచివాడు, చెడ్డవాడు అయ్యుండొచ్చు కానీ అతను పొందే ఆనందం మాత్రం మంచీ చెడూ, పెద్దా చిన్నా, పాపపుణ్యాలకు అతీతం.  హిందీలో దగ్గాడా, తమిళంలో తుమ్మాడా, కన్నడంలో కనిపించాడా అన్నట్టుంటుంది.  ఈ ఆనందం ఎలాంటిది అని అనుకోవటం.

   ఆనందంగా ఉండండి, ఎప్పుడూ దుఖాన్ని దరికి రానివ్వకండి అని చెప్పటానికి నేనెవరిని?  ఎవరైనా చెప్పినా దానికెంత విలువుంటుంది?  అలాంటప్పుడూ ఈ ఆనందం వద్దు, ఆ ఆనందం పొందండి అని ఎవరైనా ఎలా చెప్పగలరు?  పొట్టిగా ఉన్నవాడిని పొడుగ్గా ఎదగమని ఆఙాపించినట్టు, నల్లగా ఉన్న అమ్మాయిని తెల్లగా తయారవమన గద్దించినట్టవుతుంది.

     ఆనందం పుట్టేది మనసులో.  అనుభవాల కొలిమిలో కాలుతూ వచ్చిన మానసంలో, మారుతున్న దశనుబట్టి, చుట్టూ జరుగుతున్న వాటికి ప్రతిస్పందనగా పెల్లుబికే భావనల్లో ఒకటి అనందం.  భయం, కోపం, విచారం, ఆశ్చర్యం లాంటి ప్రకంపనే ఆనందం కూడా!  "ఇక చాల్లే ఊరుకో" అన్నా, కట్టలు తెంచుకుని పెల్లుబుకుతున్న నవ్వు ఆగక పోవచ్చు.  భర్తను పోగొట్టుకున్న స్త్రీకి, ఆమె భర్తకు వచ్చిన ఆమరణాంతర పురస్కారం కానీ,  లభించిన బీమా సొమ్ము కానీ, భర్త స్థానంలో కొడుక్కి వచ్చిన ఉద్యోగం కానీ, ఆమె దుఖాన్ని పోగొట్టలేకపోవచ్చు.  అందువలన, "ఊఁ కానీ, ఇక ఆనందించు" అని అంటే, సరే మాస్టారూ అని తలాడించవచ్చునేమో కానీ అనంద 'దించటం' కష్టం.

     రోడ్డు మీద పోతున్న మహాకాయుడు ధభ్ మని జారి కిందపడిపోతే చూసినవాళ్ళందరికీ గిలిగింతలు పెడుతుంది.  అనుకోకుండా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే ఎంత సంతోషం! కూతురి మొదటి కాన్పు!  కనిపించినవారందరికీ చెప్పినా తరగని సంతోషమది!  ఇష్టమైన సినిమా యాక్టర్తో కలిసి మాట్లాడగలిగితే!  మనసు ఎగిర గంతులు వేయదూ. ఈ సంతోషమనేది దానంతటది వచ్చేదే కానీ, ప్రణాళిక వేసి నిర్బంధించీ తెప్పించుకునేది కాదు.  ఆనందాలను వర్గీకరణ చేసి చూస్తే,

1.    వస్తులాభం వలన కలిగే ఆనందం:-  వస్తులాభం ఏదైనా కావొచ్చు స్థిరాస్తీ చరాస్తీ, డబ్బూ దస్కం, కలిమీ చెలిమీ బలిమీ వగైరాలు.

2.    వ్యక్తిగత గుర్తింపు వలన ఆనందం:-  బహుమానాలు, పదవులూ, బిరుదులూ, సన్మానాలు గుర్తింపుని తెచ్చి, జనసామాన్యం నుంచి పైకి ఎదిగిన సంతోషం ఆవరిస్తుంది

3.    ఇతరులకు కలిగిన నష్టం వలన ఆనందం:- అది తప్పా ఒప్పా అన్నది వదిలేస్తే సంతోషం కలిగిందంతే.  తనకి వచ్చిన వస్తు లాభం వలన కలిగిన సంతోషం మంచిదైతే, ఎదుటివారికి కలిగిన నష్టం వలన పొందే ఆనందం కూడా మంచిదే.  టెన్నిస్ లో బాగా ఆడినప్పుడే కాదు- ప్రత్యర్థి బాల్ ని నెట్ కి కొట్టినప్పుడూ జనంలోంచి చప్పట్లు, కేరింతలు వినవస్తాయి.

4.    ఇతరులక కలిగిన అవమానం.  వ్యక్తిగత గుర్తింపు వలన ఆనందం ఎలా లభిస్తుందో, అలాగే తనకి శత్రవు అని కానీ తన దారికి అడ్డు అని అనుకున్నవారికి కలిగిన అవమానం, పరువు నష్టం, తలవంపులు కూడా సంతోషానిన కలిగించవచ్చు.  అయితే బాగుండదని బయటకు ప్రదర్శించకపోవచ్చు కానీ లోపల లేకుండా చేసుకోలేరు. 

     పై నాలుగు వర్గాల ఆనందాలు మరొకరితో పోల్చి చూసుకుంటే వచ్చే ఆనందాలు.  పోల్చిచూసకుని ధనవంతుడో దరిద్రుడో, అదృష్టమో దురదృష్టమో తేల్చుకోవటం జరుగుతుంది.  సాపేక్ష సిద్ధాంతం మీద ఆధారపడ్డ ఆనందాలవి.  కానీ ఈ కింది ఆనందాలు వేరు.

5.    వ్యక్తిగత ఆనందం:-  చల్లగాలి సోకినా, కోయిలరావం వినిపించినా, కమ్మని సంగీతంలో లీనమయినా, ఆకట్టుకునే సాహిత్యంలో మునిగినా కలిగే ఆనందం కేవలం వ్యక్తిగతమైనది.  ఎవరితోనో పోల్చి చూసుకునే ఆనందం కాదిది. 

 

6.    వేరొకరి ఆనందం ద్వారా:-  కొడుకూ కోడలూ చెట్టాపట్టాలేసుకుని బయటకు వెళ్తుంటే చూసి ఆనందించటం,  టెన్నిస్ ఆడి గెలిచినవారికి కలిగిన ఆనందం దాన్ని తిలకించినవారికీ కలగవచ్చు.  భార్య కళ్ళల్లో సంతృప్తితూ కూడిన మెరుపు భర్తకు ఆనందాన్నిస్తుంది. 

7.    ప్రేమ వలన ఆనందం:-  ప్రేమ, అభిమానం అమితమైన ఆనందాన్ని నింపుతాయి.  పైన క్రమ సంఖ్య 6లో చెప్పుకున్న దానికీ దీనికీ తేడా ఉంది.  అభిమానితో కలిసి మాట్లాడినప్పుడు కలిగే ఆనందం ఆరవదైతే, ఆ అభిమాని దగ్గర్లోకి పోలేకపోయినా, తనెవరో ఆ అభిమానికి తెలియకపోయినా కలిగే ఆనందమిది.  పిల్లలను ఎత్తుకుని ముద్దు చేసేటప్పుడు కలిగే ఆనందం ఆరవదైతే, ఆ పిల్లలు సంతోషంగా ఉంటే చాలు తన స్పర్శ వలన, తను పెట్టిన ఆహారం వల్లనే కాకపోయినా సరే అనుకునేది ఈ ఏడవ రకం ఆనందం. 
మరికొంత వివరణ.

     కొడుకుకి కడుపునిండా భోజనం పంపించి, తాను మంచి నీళ్ళు తాగి పడుకోవలసి వచ్చినా, తన కొడుకు ఆకలిగా లేడు అన్న తృప్తి ఈ ఏడవ నంబరు ఆనందమయి.  ఆ తల్లే, కొడుకు తింటూవుంటే చూసికానీ సంతృప్తి పడని గుణం కలిగినదైతే ఆమె ఆరవ నంబరు ఆనందం పొందే తల్లి.  ఆమే తను చేసిన త్యాగం కొడుక్కి తెలిసేట్టుగా చేస్తే, అప్పడు రెండవ నంబరైన గుర్తింపు వలన కలిగే ఆనందం పొందే తల్లి.  అలా, చేసిన వనినిబట్టి కాకుండా వారి మనోస్థాయినిబట్టి వారికి కలిగే ఆనందంలో వ్యత్యాసం ఉంటుంది. 

8. ప్రేమ వలన ఆనందం-2:-   ఏడవ నంబరు వర్గీకరణలోని ప్రేమ రక్త సంబంధీకులు, బంధుత్వాల వలన కలిగే ప్రేమ.  దానిని సహజమైన ప్రేమ (Natural love and affection) అంటారు. అలా కాకుండా ఒక గొప్ప వ్యక్తి, ఙాని, పండితుడు, కళాకారుడు లేక గురువు మీద అభిమానం ఇవి ప్రేమలో మరో ఉచ్ఛస్థితి ప్రేమ. 

9. ప్రేమ వలన ఆనందం-3:-   మూడవ రకం ప్రేమ భగవంతుడి మీద ప్రేమ.  సర్వేశ్వరుడు, జగద్రక్ష, ఆది మధ్యాంతరహితుడూ అయిన భగవంతుని మీద భక్తి సర్వోతృష్టమైన ప్రేమ. కంటికి కనిపించని, చేతికి అందని, ఎటువంటి రక్తసంబంధమూ లేని, ఏనాడూ ఎటువంటి మార్గదర్శనం కానీ ఉపదేశాలు కాని కటాక్షించని దేవుడి మీద భక్తి భావం కలగటమన్నది సామాన్యమైన విషయం కాదు.  "శనివారం ఉపవాసమున్నా కదా, మరి నా మొర ఆలకించవా" అనే భక్తి కాదిది.  హుండీలో కానుకలు, రాత్రంతా భజన్లు చేసినంత మాత్రాన అబ్బేది కాదు.  భక్తిలో ఇచ్చి పుచ్చుకోవటాలు, ఆశించడాలు, మెప్పు పొందటాలు ఉండవు.  సంపూర్ణమైన అర్పణ అది.

10. బ్రహ్మానందం:-  ఆత్మఙానం వలన కలిగే ఆనందమిది.  బ్రహ్మము తెలిసి, బ్రహ్మములో చరించేవారికి కలిగే ఆనందమే బ్రహ్మానందం. 
బ్రహ్మము అంటే అన్నిటికన్నా గొప్పదైన అని అర్థం.  "తుచ్ఛ ఆనందాల జోలికి పోకండి, బ్రహ్మానందాన్ని పొందండి" అని చెప్పేవాళ్ళని చూసి, ఆపని చెయ్యటం ఎలాగా అని నివ్వెరపోకండి.  ఆ ఆనందం కోసం, ఉన్న ఆనందాన్ని స్పీకరించకుండా బిగుసుకోకండి.  మీరున్న దశలో దొరుకుతున్న ఆనందాన్ని సమ్మతించండి.  ఎప్పుడూ ఆనందంగా ఉండాలి కాబోలనుకుని ముఖానికి నవ్వుని పూసుకుని తిరుగుతారు కొంతమంది.. దానివలన లాభమేమీ ఉండదు, వృత్తి ధర్మమైతే తప్ప. 

     ఆత్మపరిశీలనతో మీరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవచ్చు.  జీవితంలో తారసపడే వ్యక్తులు ఏ సందర్భంలో ఎలాంటి ఆనందాన్ని పొందుతున్నారన్నది గమనించవచ్చు.  ఎవరైనా ఈ పది వర్గాల్ల దేనిలోనో ఒకదానిలో ఇముడుతారు. 

     సజ్జన సాంగత్యం స్వాధ్యాయం, ఆత్మతర్కం, ఆత్మ విమర్శనలతో తనను తాను ఎరుగుతూ, గురువుల బోధనలు వింటూ, తన ఆత్మ స్థాయిని పెంచుకుంటూ పోతే, ఎప్పటికప్పుడు తన స్థాయి ఆనందాన్ని తాను పొందుతూ వుంటారు.  వెలుగు వుంటే చీకటి లేనట్టే, ఆనందం ఉన్న చోట చింతకు స్థానం లేదు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Loksabha and rajyasabha adjourned without key point discussions
Kcr praises mayawathi seeks t bill  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles