Baahubali 2 Review | Baahubali The Conclusion Telugu Movie Review

Teluguwishesh బాహుబలి-2 (ది కంక్లూజన్) బాహుబలి-2 (ది కంక్లూజన్) Find all about Baahubali 2 review and rating along with story highlights in concise. Check Indian's biggest Telugu movie Baahubali 2 The Conclusion Review here. Product #: 82097 4.5 stars, based on 1 reviews
 • చిత్రం  :

  బాహుబలి -2 (ది కంక్లూజన్)

 • బ్యానర్  :

  ఆర్కా మీడియా వర్క్స్

 • దర్శకుడు  :

  ఎస్ ఎస్ రాజమౌళి

 • నిర్మాత  :

  శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్

 • సంగీతం  :

  ఎం ఎం కీరవాణి

 • సినిమా రేటింగ్  :

  4.54.54.54.5  4.5

 • ఛాయాగ్రహణం  :

  కే కే సెంథిల్ కుమార్

 • ఎడిటర్  :

  కోటగిరి వెంకటేశ్వర రావు

 • నటినటులు  :

  ప్రభాస్, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా, రానా, సత్యరాజ్, నాజర్, అజయ్ తదితరులు

Baahubali 2 Review

విడుదల తేది :

2017-04-28

Cinema Story

కథ...

మొదటి పార్ట్ కొనసాగింపుగా కట్టప్ప చెప్పే కథ కంటిన్యూ అవుతుంది. రాజుగా ప్రకటించిన తరువాత ఆనవాయితీ ప్రకారం దేశంలో ప్రజల సంక్షేమాలు చూసి రమ్మని కట్టప్పను తోడు ఇచ్చి అమరేంద్ర బాహుబలిని పంపిస్తుంది శివగామి. ఆ క్రమంలో కుంతలకు వెళ్లిన అమరేంద్రుడు ఆ రాజ్య యువరాణి దేవసేనను చూసి తొలిచూపులోనే ఆమె ప్రేమలో పడిపోతాడు. దేవసేన ప్రేమను గెలుచుకోవడానికి ఆమె రాజ్యంలోనే అతిథిలుగా ఉండిపోతారు. వేగుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న భళ్లాలదేవుడు దేవసేనపై కన్నేస్తాడు. కుట్రతో తానూ దేవసేనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, ఎలాగైన ఆమెతో తన వివాహం జరిపించాలని శివగామి దగ్గర మాట తీసుకుంటాడు.

కొడుకు కోరికను మన్నించిన శివగామి, దేవసేనను తన కొడలిగా చేసుకోవాలని భావిస్తున్నాని వర్తమానం పంపుతుంది. అయితే శివగామి వర్తమానం పంపిన తీరు నచ్చని దేవసేన, శివగామి పంపిన బహుమతులను తిప్పిపంపుతుంది. దీంతో శివగామి కోపంతో ఊగిపోతుంది. దేవసేన అభిప్రాయం తెలుసుకోకుండా రాజమాత తీసుకున్న నిర్ణయాన్ని బాహుబలి తప్పు పడతాడు. దీంతో బాహుబలి మీద కోపంతో రాజమాత శివగామి దేవి, భల్లాలదేవుడిని రాజుగా, బాహుబలిని సైన్యాధ్యక్షుడిగా ప్రకటిస్తుంది. 

రాజుగా పట్టాభిషేకం జరిగిన తరువాత బాహుబలిని ఎలాగైన రాజమాతకు దూరం చేయాలనుకున్న భల్లాలదేవుడు, తండ్రి బిజ్జాలదేవుడితో కలిసి కుట్రలు పన్ని బాహుబలి, దేవసేనల కోట నుంచి వెలివేసేలా చేస్తారు. ఎవరినీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని అమరేంద్రుడు సామాన్యులతో కలిసి ఉంటూ అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంటుంటాడు.

ఇది సహించలేని భళ్లాలదేవుడు.. బాహుబలి బతికుండగా తనకు రాజుగా గుర్తింపు రాదని నిర్ణయించుకుంటాడు. పన్నాగం పన్ని కట్టప్పతో బాహుబలిని చంపించేలా పథకం వేస్తాడు? ఏంటా పథకం.. భళ్లాలదేవుడు చేసిన మోసాలు రాజమాత శివగామి దేవికి తెలిశాయా..? అసలు భళ్లాలదేవుడు శివగామిని ఎందుకు చంపాలనుకున్నాడు(ఫస్ట్ పార్ట్ మొదట్లో చూపించినట్లు)..? తండ్రి కథ తెలుసుకున్న మహేంద్ర బాహుబలి, భళ్లాలదేవుడ్ని ఎలా ఓడించి.. అంతమొందించాడు.? అన్నదే కథ.

cinima-reviews
బాహుబలి-2 (ది కంక్లూజన్)

ఒక తెలుగు సినిమాను సగర్వంగా తలెత్తుకునేలా, అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుకునేలా బాహుబలి ది బిగినింగ్ ను తీర్చిదిద్దాడు ఎస్ ఎస్ రాజమౌళి. అయితే అసలు కథ లేకుండా కేవలం పాత్రల పరిచయాల కోసమే తెలివిగా ఫస్ట్ పార్ట్ ను వాడేసుకున్నాడు. అయినప్పటికీ గ్రాండియర్ విజువల్స్ మూలంగా చిత్రం ఘన విజయం సాధించింది. అలాంటి అసలు కథ, ట్విస్ట్ లతో కూడిన రెండో పార్ట్ ఎలా ఉండబోతుందన్న అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అమరేంద్రుడి-దేవసేన కథ,  ఎమోషన్ సీన్లు, అంతకు మించి కట్టప్ప బాహుబలిని ఎందుకు పొడిచాడు? ఏడాదిన్నరగా కోట్లాది ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రశ్నలకు ఎట్టకేలకు సమాధానం దొరికింది. అయితే ఈ క్రమంలో బాహుబలి ఫ్రాంచైజీ కంక్లూజన్ ఆ హైప్ ను అందుకుందా? రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

విశ్లేషణ...

అన్నదమ్ముల మధ్య రాజ్యం కోసం పోరాటం అన్న ఓ కాన్సెప్ట్ ను వెండితెరపై ఆవిష్కరించేందుకు ఐదేళ్లపాటు తపస్సు చేసిన రాజమౌళి అద్భుత విజయాన్ని అందుకున్నాడు. బాహుబలి తొలి భాగంలో వినిపించిన విమర్శలన్నింటికీ సీక్వెల్ లో నోళ్లు వెళ్లబెట్టేలా సమాధానమిచ్చాడు. తండ్రి అందించిన ఓ ఫాంటసీ కథను ఈ స్థాయిలో తీర్చిదిద్దబోతున్నాడని బహుశా జక్కన్న కూడా అప్పుడు ఉండి ఉండడేమో. బాహుబలి 1స్థాయికి మించి అనేకన్నా హాలీవుడ్ ను బీట్ చేసేలా విజువల్ ఎఫెక్ట్స్, భారీ యుద్ధ సన్నివేశాలతో పాటు ఎమోషన్స్, డ్రామాతో సినిమాను తీర్చిదిద్దాడు. రాజమౌళి ప్రతి సీన్‌ని హృద్యంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా తన మార్క్ ఉద్వేగాన్ని ఎక్కడా మిస్ కాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సినిమాను తన విజన్‌తో ప్రపంచ స్థాయికి చేర్చాడు. ఇలాంటి బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ఇండియాలో రావటానికి కొన్ని దశాబ్దాలు పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో.

ఇక కంక్లూజన్ విషయానికొస్తే... ఫస్టాఫ్‌లో సిచ్యువేషనల్‌ కామెడి క్రియేట్‌ చేశాడు. అలాగే ఎమోషన్‌ సన్నివేశాల్లో, శివగామికి నిజాన్ని చెప్పే సందర్భంలో, బాహుబలిని చంపే సీన్‌లో సత్యరాజ్‌ నటన ఎక్సలెంట్‌. ఇక దేవసేనగా అనుష్క చాలా అందంగా కనిపించింది. నటన పరంగా కూడా మెప్పించింది. తమన్నా పాత్ర క్లైమాక్స్ కే పరిమితమైంది. సన్నివేశాల పరంగా చూస్తే ప్రతి సీన్‌ అద్భుతం. ప్రతి సీన్‌ను ఎమోషనల్‌గా డైరెక్టర్‌ రాజమౌళి తెరకెక్కించిన విధానం చూసి ఆశ్చర్య పోవాల్సిందే.

ముఖ్యంగా ప్రభాస్‌, అనుష్క మధ్య వచ్చే డ్యూయెట్‌ సాంగ్‌, కుంతల దేశాన్ని పిండారిల భారీ నుండి బాహుబలి కాపాడే సందర్భంలో ప్రతి సన్నివేశం ఎంతో గ్రాండియర్‌గా ఉంటుంది. ఇక సెకండాఫ్‌ విషయానికి వస్తే తల్లి కొడుకుల మధ్య, అన్నదమ్ముల మధ్య ఎమోషనల్‌ సన్నివేశాలు, బాహుబలి చనిపోయే సీన్‌ ఇలా అన్నీ ఆకట్టుకున్నాయి. అయితే నిడివి ఎక్కువగా ఉండటం అనే కంప్లైంయిట్ ఉన్నప్పటికీ ఇలాంటి కథ, కథనాలు ముందు అవి వెంట్రుకవాసే అని గుర్తుంచుకోవాలి.

నటీనటుల విషయానికి వస్తే అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్‌ అద్భుతమైన నటనను కనపరిచాడు. ఐదేళ్లు ఒకే సినిమా కోసం పడ్డ కష్టం కనిపిస్తుంది. ముఖ్యంగా మొదటి పార్ట్ లో మిస్సయిన అమరేంద్రుడి వీర విన్యాసం ఇందులో చూడొచ్చు. అయితే శివుడు రివెంజ్ మాత్రం చివర్లో తొందరగా ముగియటం కాస్త నిరాశ కలిగించేదే. భళ్లాలదేవుడుగా రానా విలనిజం సినిమాకు పెద్ద హైలైట్‌ అయ్యింది. తొలి భాగంతో పొలిస్తే శివగామి పాత్ర తక్కువగా అనిపించినప్పటికీ ఆ పాత్ర మెప్పిస్తుంది. బిజ్జాల దేవుడిగా నాజర్ కన్నింగ్ యాక్టింగ్, కట్టప్పగా బాహుబలిని చంపే యత్నంలో సత్యరాజ్‌ తనదైన నటనతో మెప్పించాడు. ఇక అనుష్క బావ కుమారవర్మ పాత్రలో సుబ్బరాజు కూడా కామెడీతో మెప్పించాడు.

టెక్నికల్ అంశాల విషయానికొస్తే... కీరవాణి సంగీతంతో పాటు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అదరగొట్టాడు. భళి భళిరా సాంగ్‌, దండాలయ్యా సాంగ్స్‌ సహా అన్నీ సాంగ్స్‌ బావున్నాయి. అలాగే సన్నివేశాల మధ్య బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో గాఢతను పెంచాడు. సెంథిల్‌ కుమార్‌ సినిమాటోగ్రఫీ ది బెస్ట్‌. ఇక కమల్‌ కణ్ణన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమాను హాలీవుడ్‌ రేంజ్‌లో నిలిపింది. ‘నువ్వు నా పక్కనుండేంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామ...సహా డైలాగ్స్‌ అన్నీ సందర్భానుసారం ఆకట్టుకుంటాయి.

ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యుద్ధ సన్నివేశాలు..ఆ సీన్స్‌ చూస్తుంటే తెలుగు సినిమా స్టాండర్డ్‌ను హాలీవుడ్‌ రేంజ్‌లో చేసినందుకు అభినందించకుండా ఉండలేరు. సాబుశిరిల్‌ ప్రొడక్షన్‌ డిజైనింగ్‌ ఇలా అన్నీ సినిమాను మరో రేంజ్‌లోనిలిపాయి. ఎమోషనల్ ఫీలింగ్ ను క్యారీ చేస్తూ విజయేంద్ర ప్రసాద్ అందించిన కథ.. తనయుడు రాజమౌళి టేకింగ్ అనిర్వచనీయం. ఇక స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఆర్కా మీడియా నిర్మాతల గురించి. రాజమౌళిపై నమ్మకంతో వాళ్లు తీసుకున్న సాహసోపేత నిర్ణయం ను అభినందించి తీరాల్సిందే.

తీర్పు:

ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అనే పదం బాహుబలి ది కంక్లూజన్ కి చాలా చిన్నదిగా కనిపిస్తుంది. సూపర్బ్ ఫస్టాఫ్.. ఎమోషనల్ సెకండాఫ్. ఏదో అద్భుతం చూడబోతున్నామన్న అన్న ఫీలింగ్ తో అడుగుపెట్టే ప్రేక్షకుడికి అంతకు మించే అందించాడు. ఈ విషయంలో రాజన్నకు హాట్సాఫ్ చెప్పక ఉండలేం. మొత్తానికి దర్శకుడు రాజమౌళి.. నటీనటులు ప్రభాష్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్, తమన్నాతో పాటు ఇతర చిత్ర బృందం పడ్డ ఇన్నేళ్ల కష్టానికి ఫలితం దక్కినట్లే. ఇక మిగిలింది రికార్డుల మోతే.

చివరగా.. సాహోరే బాహుబలి.. సాహోరే రాజమౌళి...

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.

Photos from బాహుబలి-2 (ది కంక్లూజన్) Movie

 • Baahubali-2-The-Conclusion-Movie-Stills-01
 • Baahubali-2-The-Conclusion-Movie-Stills-02
 • Baahubali-2-The-Conclusion-Movie-Stills-03
 • Baahubali-2-The-Conclusion-Movie-Stills-04
 • Baahubali-2-The-Conclusion-Movie-Stills-05
 • Baahubali-2-The-Conclusion-Movie-Stills-06
 • Baahubali-2-The-Conclusion-Movie-Stills-07
 • Baahubali-2-The-Conclusion-Movie-Stills-08
 • Baahubali-2-The-Conclusion-Movie-Stills-09
 • Baahubali-2-The-Conclusion-Movie-Stills-10
 • Baahubali-2-The-Conclusion-Movie-Stills-11