Excellent and wonderful Uttarakhand tour

Telugu content

Tour, Uttarakhand, Beauty, Tourism, India, Tourist places

Excellent and wonderful Uttarakhand tour. Uttarakhand will give lot of thrill and excites you. In the Himalayan beauty, the Uttarakhand will give best tourism experience ever.

హిమాలయాల ఒడిలో పర్యాటకుల మనసు దోచుకునే ఉత్తరాఖండ్

Posted: 12/21/2015 04:35 PM IST
Telugu content

హిమాలయాల ఒడిలో పర్యాటకుల మనసు దోచుకునే ఉత్తరాఖండ్ విహారం... వారి మదిలో చిరకాలం గుర్తుండిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉత్తరాఖండ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది డెహ్రాడూన్. కానీ, ఇప్పటిదాకా భయటపడని ఎన్నో అందాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రకృతి అందాలతో పర్యాటకులను పరవశుల్ని చేయడమే కాదు సంస్క�ృతీ సాంప్రదాయల్లో కూడా ఉత్తరాఖండ్ ఎంతో పేరెన్నికగన్నది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కుంభమేళ. అంతేకాకుండా మనదేశంలో గోల్ఫ్ ఆటకు అనువైన ప్రదేశాలలో ఉత్తరాఖండ్ కూడా ఒకటి. 'కోర్బట్ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్'... అంతరించిపోతున్న మన జాతీయ జంతువు పెద్దపులికి ఇష్టమైన నివాసం. అంతేకాకుండా పర్వాతారోహలకు ఎంతో ఇష్టమైన పర్వతశిఖారాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాంటి వాటిలో 'నందాదేవి పీక్' ప్రముఖమైనవి. జాతీయ వింతలు 'వాలీ ఆఫ్ ఫ్లవర్స్', 'నందాదేవీ జాతీయ ఉద్యానవనం' లాంటి ప్రదేశాలు తప్పకుండా చూసి తీరాల్సిందే. 'యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్'లు గా గుర్తింపు సంపాదించుకున్న ఈ ప్రదేశాలు పర్యాటకులను ఆకట్టుకోవడంలో ముందువరుసలో నిలుస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే సందర్శకుల మనసుదోచే ఇలాంటి పర్యాటక కేంద్రాలు ఇక్కడ అనేకం ఉన్నాయి.

సరస్సుల నగరంగా గుర్తింపు పొందిన నైనితాల్ లో ఒకప్పుడు సుమారు 60కి పైగా చెరువులు, సరస్సులు ఉండేవట. ఇందులో 'నైనీ' అనే సరస్సు ఎంతో పేరుగాంచింది. ఇక్కడ మహాఋషులు, మునులు నివాసం ఉన్నట్టు స్కందపురా ణంలో ఉంది. నైనితాల్ సరస్సును 'ట్రై రిషి సరోవర్' (ముగ్గురు ఋషుల సరోవరం) కూడా పిలుస్తారు. అత్రి, పులస్త్య, పులహ అనే మహాఋషులు... నీరు దొరకకుండా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నైనితాల్‌లో ఒక సరస్సు నిర్మించాలని తలపెట్టారు. అలా ఒక లోతైన గుంతను తవ్వి... టిబెట్ దగ్గర ఉన్న పవిత్ర మానస సరోవరం నుండి నీటిని తెచ్చి నింపారని ప్రతీతి. అలా ఏర్పడిందే నేడు మనం చూస్తున్న నైనితాల్ సరస్సు. ఈ సరస్సులో స్నానం చేస్తే సాక్షాత్తు ఆ మానస సరోవరంలోనే స్నానమాచరించినంత పుణ్యం దక్కుతుందట.

దేశంలో ఉన్న 64 శక్తిపీఠాలలో నైనితాల్ కూడా ఒకటి. 64 ముక్కలైన పార్వతీ దేవి శరీరభాగాల్లో ఆమె కన్ను ఈ ప్రాంతంలో పడిందట. అలా ఈ ప్రాంతానికి నైనితాల్ (హిందీలో నయన్ అంటే కన్ను) అనే పేరు వచ్చిందని ప్రతీతి. అందుకే ఆ శక్తి స్వరూపిణిని ఇక్కడ నైనాదేవి పేరుతో పిలుస్తారు. నైనాదేవీ ఆలయం దేశంలోని శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. పర్యాటకులు ఇక్కడి చేరుకోవాలంటే... దగ్గరి విమానాశ్రయం పంత్‌నగర్. ఇది నైనితాల్‌కు 71 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుండి రోడ్డు మార్గం గుండా వెళ్లవచ్చు. రైలుమార్గం ద్వారా చేరుకునే పర్యాటకులు కథ్‌గోదామ్ రైల్వే స్టేషన్ గుండా వెళ్ళవచ్చు (ఈ స్టేషన్ నైనితాల్‌కు 31 కి.మీ).

ఉత్తరాఖండ్‌లో పచ్చదనంతో మైమరిపించే మరో ప్రదేశం ఆల్మోరా. ఇక్కడి ప్రకృతి పచ్చదనానికి పరవశించని పర్యాటకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ప్రశాంత వాతారణంతో కొండకోనలతో అలరారుతున్న ఈ ప్రాంతాన్ని చూస్తే ప్రకృతీమాత తన నైపుణ్యాన్నంతటినీ రంగరించి మరీ తీర్చిదిద్దిందా అనిపిస్తుంది. కోశీ, సుయాల్ నదుల ప్రవాహం ఆల్మోరాకు మరింత అందాన్ని చేకూర్చింది. ఆల్మోరా ప్రకృతి అందాలతోనే కాదు, ప్రముఖుల నివాసాలతో ప్రసిద్ధిగాంచింది. స్వామీ వివేకానంద తన హిమాలయాల పర్యటనలో ఆల్మోరాను తాత్కాలిక విడిదిగా ఎంచుకున్నారట. అలా ఆయన కొన్నాళ్ళు ఇక్కడే గడిపాడట. అంతేకాకుండా స్వాతంత్య్ర సమరయోధుడు గోవింద్ వల్లభ్ పంత్, ప్రముఖ హిందీ విద్వాంసుడు సుమిత్రానందన్ పంత్, నోబెల్ గ్రహీత సర్ రొనాల్డ్ రాస్‌లకు జన్మస్థలం ఆల్మోరా. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా తన బాల్యంలో కొంతకాలాన్ని ఇక్కడే గడిపాట. ధోని తండ్రికి రాంచీలో స్థిరపడక మునుపు ఇక్కడ ఫామ్‌లు ఉండేవట. ఇక్కడి చేరుకోవాలంటే నైనితాల్‌కు మాదిరిగానే పంత్‌నగర్ విమానాశ్రయం నుండి చేరుకోవాలి. రైలుమార్గం గుండా వచ్చే పర్యాటకులు కోథ్‌డామ్ రైల్వేస్టేషన్ నుండి చేరుకోవచ్చు.

మనదేశంలో గోల్ఫ్ ఆటకు సంబంధింన మైదానాలకు మారుపేరు రాణీఖేత్. ఎటుచూసిన పచ్చని తివాచీ పరిచనట్లుండే ఈ ప్రాంతంలో 9 మౌంటేన్ గోల్ఫ్ లింక్‌లు ఉన్నాయి. ఓక్ అడవుల్లో విస్తరించి ఉన్న ఈ గోల్ఫ్ కోర్స్‌లు పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తాయి. చలికాలంలో మంచు దుప్పటి పరుచుకున్నట్లుండే ఈ ప్రదేశం వేసవిలో మాత్రం సైనిక స్థావరంగా సేవలందిస్తుంది. ఇవేకాకుండా ఝులా దేవి ఆలయం, చౌభాటియా ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు. సమీపంలోని కథ్‌గోదామ్ రైల్వేస్టేషన్ గుండా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. దూరప్రాంతం నుండి వచ్చే పర్యాటకులకు దగ్గరి విమానాశ్రయం... పంత్ నగర్. ఇది రాణీఖేత్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Tour  Uttarakhand  Beauty  Tourism  India  Tourist places  

Other Articles