beautiful and wonderful Turkey calling you

Beautiful and wonderful turkey calling you

Turkey, Tour, World Tour, Tourism, yatra, Best Place to tour

beautiful and wonderful Turkey calling you. The best tourist spot in the world is Turkey. Turkey is the best ever place to visit.

కళ్లు చెదిరే అందాలతో పిలుస్తున్న టర్కీ

Posted: 12/18/2015 04:40 PM IST
Beautiful and wonderful turkey calling you

టర్కీ...పురాతన నాగరక దేశం. దీనిని ప్రాచ్యదేశం- అప్రాచ్యదేశం అని వర్గీకరించడానికి వీల్లేదు. దేశంలో కొంత భాగం ఆసియా ఖండంలో, మరికొంత భాగం యూరప్‌లో ఉన్న యురేషియా దేశం. ప్రాచ్య - అప్రాచ్యల కలయిక. మౌలిక వసతులలో టర్కీ మీద పాశ్చాత్య ప్రభావం ఎక్కువ. అంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే ఈ దేశంలో పెద్ద నగరం ఇస్తాంబుల్ ఈ రెండు ఖండాల్లోనూ విస్తరించింది. బ్లాక్ సీ ఇస్తాంబుల్ దగ్గర ఈ రెండు ఖండాలను విభజిస్తూంటే ఫతే సుల్తాన్ మెహ్‌మెట్ బ్రిడ్జి ఖండాలను కలుపుతోంది. ఈ దేశం ఎక్కువ భాగం ఆసియా ఖండంలో ఉండడంతోనో ఏమో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు వృత్తుల రీత్యా వలసలు పోవడంతో కుటుంబ పరిధి చిన్నదైంది. గతంలో బహుభార్యాత్వం చాలా సహజమైనదిగా భావించేవారు. ఇప్పుడు ప్రభుత్వ చట్టాలు, ఉన్నత చదువుల కారణంగా సమాజంలో మార్పు వస్తోంది. ఇష్టం వచ్చినంతమందిని వివాహమాడే స్వేచ్ఛకు పరిమితులు వచ్చాయి. అలాగే టర్కీ స్త్రీ ఓటు హక్కు లేని స్థితి నుంచి ఓటు హక్కు సాధించే దశకు చేరింది. కుటుంబ సభ్యుల్లో ప్రధాన వ్యక్తిగా పరిగణించాల్సిన చట్టాలు ఉన్నాయి కానీ సామాజికంగా రెండవ శ్రేణిగానే ఉంది.

ఇప్పటికీ టర్కీలో ‘భర్త ఆహారాన్ని ఆర్జించేవాడు, దానిని ఇంట్లో అందరికీ సర్ది పంచేది భార్య’ అనే అభిప్రాయం ఉందని, ఈ నానుడి స్త్రీ స్థానాన్ని తెలియచేస్తుందని అధ్యయనకారులు చెబుతారు. పూర్తిస్థాయిలో సమానత్వం రాకపోయినప్పటికీ టర్కీ గతంలోలాగ మతతత్వ దేశం కాదు, సెక్యులర్ దేశంగా మారింది. ఇక్కడి మహిళలు యూనివర్శిటీ చదువులు చదువుతున్నారు. డాక్టర్లు, లాయర్లు, జడ్జిలు, పైలట్లు, పోలీస్ ఆఫీసర్లు, ఆర్మీ ఆఫీసర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. రాజకీయ రంగంలో తక్కువ శాతం ఉన్నప్పటికీ ఈ దేశానికి తాన్సు సిల్లెర్ ప్రధానమంత్రి అయింది. ఆమె టర్కీ దేశానికి తొలి మహిళా ప్రధాని. ఎనభైల నుంచి ఇక్కడ మహిళాసాధికారత, సమానత్వం కోరుతూ ఫెమినిస్ట్ కార్యకలాపాలు కూడా ఎక్కువయ్యాయి. మహిళలు బురఖా ధరించాల్సిన నిబంధన మీద కూడా మేధోమధనం జరుగుతోంది. టర్కీలో పెద్ద నగరం ఇస్తాంబుల్ కొంత భాగం ఆసియాలోనూ కొంత భాగం యూరప్ ఖండంలో ఉండడంతో యూరప్‌కు రాకపోకలు ఎక్కువగానే ఉంటాయి.

ఆ ప్రభావం నేటి టర్కీ జీవనశైలిలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతోపాటు దేశంలో సంప్రదాయం పట్ల నిబద్ధత కూడా కనిపిస్తుంది. కొత్త పెళ్లికూతురు గర్భం ధరిస్తే ఆ శుభవార్తను కుటుంబం అంతా సెలబ్రేట్ చేసుకుంటుంది. వార్త తెలిసిన వెంటనే అత్తగారు కోడలికి కడియాన్ని బహూకరించడం ఇక్కడ ఆనవాయితీ. బంధువులు కూడా బహుమతులిస్తారు. గ్రామాల్లో గర్భిణులు స్కార్ఫ్, పూల దుస్తులు ధరిస్తారు. ఇక్కడ మరో సంప్రదాయం ఏమిటంటే... పిల్లలు పుట్టినప్పుడు పెరట్లో ఒక చెట్టు నాటుతారు. అమ్మాయి పుడితే చెస్ట్‌నట్, మల్బరీ, ఆపిల్ చెట్లను నాటుతారు. అబ్బాయి పుడితే పాప్లర్, పైన్ చెట్లను నాటుతారు. ఇవి పెద్దయి పెళ్లినాటికి పండ్లు, దారు సంపదతో ఆ పిల్లలకు అందివస్తాయని ఇందులో ఉద్దేశం.

సమృద్ధదేశం!

ఆహారధాన్యాలను దేశ అవసరాలకు సరిపడినంత పండించుకుంటున్న స్వయంసమృద్ధదేశం టర్కీ. నీటి వసతి, పంటలు పండడానికి అనువైన వాతావరణం ఉన్న నేల ఇది. ఒకప్పుడు దేశ ఆదాయంలో ప్రధానమైన కంట్రిబ్యూషన్ వ్యవసాయరంగం నుంచి ఉండేది. ఇప్పుడది క్రమంగా తగ్గుతూ రైతు టెక్నాలజీ రంగం వైపు అడుగులు వేస్తున్నాడు. ఇందుకు ప్రభుత్వం సాంకేతికంగా ఎదిగే క్రమంలో నీటి పారుదల వ్యవస్థను మెరుగు చేయడంలో కొంత అలసత్వం కనబరచడమూ ఒక కారణం. కొన్ని ఒడిదుడుకులున్నప్పటికీ టర్కీ... పండ్లు, కూరగాయలు, గోధుమలు, చిరుధాన్యాలు, టీ, పత్తి, ఊలు ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి పది స్థానాల్లో ఉంది.

చారిత్రక సంప్రదాయ కళల సమ్మేళనం:

టర్కీ చారిత్రక, సంప్రదాయ, సాంస్కృతిక ఆనవాళ్లను పరిరక్షించడానికి ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. ఇక్కడి ఆర్కియాలజీ మ్యూజియం, మ్యూజియం ఆఫ్ ఏన్షియెంట్ ఓరియెంట్, మ్యూజియం ఆఫ్ టర్కిష్ అండ్ ఇస్లామిక్ ఆర్ట్‌ల మ్యూజియాలు ఒకేచోట ఉన్నాయి. వీటిలో అలెగ్జాండర్ ది గ్రేట్ విగ్రహంతోపాటు టర్కీ, రోమ్ దేశాల కళాకృతులు లెక్కలేనన్ని ఉన్నాయి. క్రీ.పూ పదమూడవ శతాబ్దంలో (1258) ఈజిప్టు, హైతీ పాలకులు రామ్‌సెస్ టు, హట్టుసిలి త్రీల సంతకాలు చేసిన ‘కాదేష్ పీస్ ట్రీటీ’ ఒప్పంద పత్రాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నిర్మాణాలు ఎక్కువగా ఓట్టోమన్ వాస్తుశైలిలో ఉన్నాయి. యుద్ధంలో మరణించిన లక్షలాదిమంది టర్కిష్ వీరుల విగ్రహాలను ప్రదర్శనకు ఉంచారు. క్రీస్తుపూర్వం నుంచి ఇక్కడ నాగరకత విలసిల్లిందనడానికి నిదర్శనంగా టర్కిష్ ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి. వీటిని చూస్తుంటే పూర్వం టర్కీ ప్రజల జీవనశైలి, నాగరకత కళ్ల ముందు మెదలుతాయి. ఇంత పెద్దవి కాకపోయినా ఇస్తాంబుల్‌లో చెప్పుకోదగినంత విశాలమైన మ్యూజియాలు ‘ద టైల్‌డ్ కియోస్క్ మ్యూజియం, యెల్డిజ్ ప్యాలెస్ మ్యూజియం, టాప్‌కోపి ప్యాలెస్ మ్యూజియం... వంటివి ఏడెనిది ఉన్నాయి.

ప్రాచీన వ్యాపార కేంద్రం!

టర్కీలో పెద్ద షాపింగ్ జోన్ ఇస్తాంబుల్ నగరం. ఇక్కడికి వచ్చిన వాళ్లు కోన్‌ర్యాడ్ హోటల్‌ను బయటి నుంచి ఆయినా చూడాలనుకుంటారు. అంత క్రేజ్ ఎందుకంటే... ఒసామా బిన్ లాడెన్ ఇస్తాంబుల్ వస్తే ఈ హోటల్‌లోనే బస చేసేవాడు. ఈ హోటల్ దగ్గరలో షాపింగ్ డిస్ట్రిక్ట్ ఉంది. అందులో లెక్కలేనన్ని మాల్స్ ఉంటాయి. వాటిలో గ్రాండ్ బజార్ ప్రధానమైంది. ఒక్కొక్క మాల్‌లో 180 - 200షాపుల వరకు ఉంటాయి. గ్రాండ్ బజార్‌లో ఏకంగా మూడువేల షాపులున్నాయి. ఇది ప్రపంచంలో పురాతనమైన వ్యాపారకేంద్రం, గ్రాండ్‌బజార్ అరవై వీథులతో ‘న్యూరోస్‌మానియె మసీదు నుంచి బెయాజిత్ మసీదు వరకు ఉంటుంది. ఇందులో ఇస్తాంబుల్ సంప్రదాయ వస్తువులను విక్రయించే షాపులు, ఆభరణాల దుకాణాలు ఉంటాయి. అటు సంప్రదాయ మోడల్స్‌తోపాటు మోడరన్ డిజైన్స్ కట్టిపడేస్తాయి. దేనికది యునిక్‌గా ఉండడంతో దేనిని సెలెక్ట్ చేయాలన్నది అంత త్వరగా డిసైడ్ చేసుకోలేం. ముత్యాలు, ముత్యాల ఆభరణాలకు ప్రత్యేకంగా దుకాణాలున్నాయి, పాతిక-ముప్పై రంగుల ముత్యాలు చూపుతిప్పుకోనివ్వవు, లైట్ల వెలుతురులో ఇంద్రధనస్సును తలపిస్తాయి.

టర్కీలో క్రైమ్‌రేట్ తక్కువ. అరకొర చిల్లర నేరాలు తప్ప కరడుకట్టిన నేరాలు ఉండవు. ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతున్న దేశమిది. ఇక్కడి వాళ్లకు మధ్యధరలో ఈతకొట్టి బీచ్‌లో సేదదీరడం గొప్పగా అనిపిస్తుందో లేదో కానీ సోషల్ బుక్‌లో ఏళ్ల పాటు దీని గురించి చదివిన మనకు అనిర్వచనీయమైన అనుభూతి. టర్కీ అంటే కోడి కూడా గుర్తొస్తుంది. కానీ అ టర్కీకి, ఈ టర్కీకి సంబంధం లేదు. మరో తమాషా... తూర్పుదేశాల వాళ్లు టూర్ అంటే యూరప్ దేశాల బాట పడుతుంటే, ఆ దేశాల వాళ్లు టర్కీలో పర్యటించడానికి ఉబలాటపడుతుంటారు.

టర్కీలో చూడాల్సినవి

ఇక్కడ పర్యాటకులకు క్రూయిజ్ జర్నీ తీపి గుర్తుగా మిగులుతుంది. అందులోనే పార్టీ, డిన్నర్ అన్నీ అరేంజ్ చేస్తారు. ఏడంతస్తుల భవనం నీటి మీద తేలుతున్నట్లుంంది క్రూయిజ్. ఇక్కడి పర్యాటక ప్రదేశాల విషయానికొస్తే మొదటిది హజియా సోఫియా మ్యూజియం. రోమన్ పాలకులు కట్టిన చర్చ్ ఇది. ఈ ప్రదేశాన్ని 15వ శతాబ్దంలో ఓట్టోమన్ రాజవంశం స్వాధీనం చేసుకుని మసీదుగా మార్చింది. ఇప్పుడు ప్రభుత్వం దీనిని మ్యూజియంగా మార్చింది. ఇది ఇస్తాంబుల్‌లో సుల్తానాహ్‌మెట్ స్క్వేర్‌లో ఉంది.

బ్లూ మాస్క్... ఇది కూడా ఇస్తాంబుల్‌లోనే ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలో ఆరు మినార్‌లున్న మసీదు ఇదొక్కటే. అద్భుతమైన నిర్మాణశైలితోపాటు ఈ మసీదు లోపల సీలింగుకి ఇరవై వేల నీలిరంగు పలకలు అతికారు. అందుకే ఇది బ్లూ మాస్క్‌గా వాడుకలోకి వచ్చింది. దీని అసలు పేరు సుల్తాన్ అహ్మద్ మసీదు. ఇది యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపద. సెల్సస్ లైబ్రరీ... క్రీ.శ రెండవ శతాబ్దం నాటి ఈ లైబ్రరీ ఏన్షియెంట్ వండర్. మౌంట్ నెమ్రుత్... ఏడు వేల అడుగుల ఎత్తు పర్వతం. శిఖరం మీద గ్రీకు, పర్షియన్ దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఇది పురాతనమైన హెరిటేజ్ సైట్.

బోడ్రమ్ బీచ్... ఆహ్లాదంగా గడపడానికి అనువైన సహజ సౌందర్యం, ఆధునిక సౌకర్యాల మేళవింపు ఈ బీచ్. ఇది పురాతన అద్భుతాల్లో ఒకటి. ఇక్కడ 15వ శతాబ్ది క్రూసేడర్ పాలకుల మాన్యుమెంట్‌లు భూకంపాల్లో నేలమట్టమయ్యాయి. నాటి నైపుణ్యానికి ఆనవాళ్లు కొన్ని చారిత్రక నిర్మాణాలు ఇప్పటికీ ఉన్నాయి. పత్రా బీచ్... మధ్యధరా సముద్రం ఒడ్డున దాదాపు 15 కి.మీ.ల దూరం విస్తరించిన బీచ్ ఇది. ఇక్కడ సముద్రం, బంగారు రంగులో మెరిసే ఇసుక తప్ప ఇంకేమీ ఉండవు. కానీ ప్రశాంతవిహారానికి బావుంటుంది. పతారా సెయింట్ నికొలాస్ సొంత ఊరు. యాస్పెండాస్ థియేటర్... ఇది మరో అద్భుతమైన పురాతన నిర్మాణం. క్రీ.శ రెండవ శతాబ్దంలో కట్టిన ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో జరిగే కార్యక్రమాలను 20 వేల మంది వీక్షించడానికి వీలుగా నిర్మించారు.

కాలుష్యం లేని దేశం!

హైదరాబాద్ పొల్యూషన్ నుంచి వచ్చిన వాళ్లకు టర్కీ ఒక సుందరస్వప్నం. ఇస్తాంబుల్ వంటి పెద్ద నగరంలో కూడా ట్రాఫిక్ జామ్‌లు ఉండవు, వాతావరణ కాలుష్యం ఉండదు, చల్లగా పూర్తిగా ఆహ్లాదకరమైన వాతావరణం. టర్కీ బెస్ట్ హాలిడే స్పాట్ అనే చెప్పాలి. టర్కీ మనకు చరిత్ర పాఠాల్లో పరిచయం కావడంతో మనం చూసిన బొమ్మలు కూడా దాడులకు గురై శిథిలావస్థలో ఉన్న చారిత్రక భవనాలే కనిపిస్తాయి. యుద్ధాలు, దాడులతో అస్తవ్యస్తమైన జీవనం అనే తలంపే ఉంటుంది. వెరసి టర్కీ అంటే రక్తంతో కలుషితమైన నేల అనే దురభిప్రాయమూ కలుగుతుంది. కానీ దేశంలో సహజసౌందర్యం ఉంది. సముద్రతీరాలు, పర్వతశిఖరాల వంటి ప్రకృతి దృశ్యాలున్నాయి. కన్ను నలుపుకున్నా కానరాని చీకటిలాంటి నల్లసముద్రం ఉంది. ఇక్కడి ప్రజల్లో సినిక్ బ్యూటీని ఆస్వాదించే ఈస్తటిక్‌సెన్స్ ఉంది. ఖండాలను కలిపే ఫతే సుల్తాన్ మెహ్‌మెట్ బ్రిడ్జిని చూస్తే ప్రపంచంలో ఏడు వింతలే ఎందుకుండాలి? ఎనిమిదో వింతగా ఈ నిర్మాణాన్ని ఎందుకు చేర్చకూడదు అనిపిస్తుంది.

టర్కీ గురించి మరికొంత!......
టర్కీ సరిహద్దులు బ్లాక్‌సీ, మధ్యధరాసముద్రం, ఏజీయన్ సీ, మర్మరా సీ, గ్రీస్, బల్గేరియా, సిరియా, ఇరాక్, ఇరాన్, ఆర్మీనియా, జార్జియా దేశాలు.
టర్కీ రాజధాని అంఖారా. దేశంలో పెద్ద నగరం ఇస్తాంబుల్. హోపా, ట్రాబ్‌జాన్, సివాస్, సాంసన్, అనతోలియా, కోన్యా, అంటాల్యా, ఇజ్మీర్, మానిస, బాలికేసిర్, బుర్సా, గెమ్లిక్, కోషెలి, వాన్ వంటివి ఇతర ప్రముఖ నగరాలు.
టర్కిష్, కుర్దిష్, అరబిక్, గ్రీక్, ఆర్మీనియన్ భాషలు మాట్లాడే ప్రజలున్నారు.
టర్కీ కరెన్సీ టర్కిష్‌లిరా. ఒక టర్కిష్ లిరా దాదాపుగా 30 రూపాయలు. ఒక లిరాకు వంద కురులు.
టర్కీ సమయం మనకంటే 3-30 గంటల వెనుక ఉంటుంది. మనకు సాయంత్రం ఆరైతే టర్కీలో మధ్యాహ్నం రెండున్నర.
రోమన్ చక్రవర్తి మొదటి కాన్‌స్టాన్‌టైన్ నిర్మించిన నగరం కాన్‌స్టాన్‌టినోపుల్. అదే నేటి ఇస్తాంబుల్.
పదివేల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ దేశంలో ఎక్కువ భాగం అడవులు, సరస్సులు, వ్యవసాయభూమి, పచ్చికబయళ్లు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Turkey  Tour  World Tour  Tourism  yatra  Best Place to tour  

Other Articles