Telugu poet c narayana reddy special story

cnare, c narayana reddy, karimnagar, famous poet in telangana, famous poet in andhra pradesh, famous poet in india, writer c narayana reddy, cine writers

c narayana reddy wellknown as cinare. famous poet in telugu states. and gnaapeet awadree aslo. some words about him

తెలుగు సాహిత్యంలో తిరుగులేని వజ్ర మకుటం

Posted: 12/10/2014 06:37 PM IST
Telugu poet c narayana reddy special story

సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి, తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి గాను ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.
సి.నారాయణరెడ్డి 1931, జూలై 29 న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామము హనుమాజీపేట్లో జన్మించాడు. తండ్రి మల్లారెడ్డి రైతు. తల్లి బుచ్చమ్మ గృహిణి. నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య అదే గ్రామంలోని వీధిబడిలో సాగింది. బాల్యంలోనీ హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఆకర్షితుడయ్యాడు. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్ల లో మాధ్యమిక విద్య, కరీంనగర్ లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించాడు.తెలుగు ఒక ఐచ్ఛికాంశాంగానే ఉండేది. హైదరాబాదులోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందాడు.విద్యార్థిగా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంలో శ్రద్ధగా అనేక గ్రంథాలు చదివాడు సి.నా.రె గా ప్రసిధ్దుడు.
ఆరంభంలో సికింద్రాబాదు లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి అటు తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడుఉస్మానియా విశ్వవిద్యాలయము లో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, పురస్కారములు పొందాడు. విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు ఆయనే.విశ్వంభర కావ్యానికి ఆయనకి ఈ అవార్డు లభించింది.

ఆయన ప్రముఖంగా కవి అయినప్పటికీ అయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి వెలువడ్డాయి. కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించేవాడు. సినారె కవిత తొలిసారి జనశక్తి పత్రిక లో అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించాడు. 1953 లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సి.నా.రె తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి. రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది. 1962 లో గులేబకావళి కథ చిత్రం లోని నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ అనే పాటతో ప్రారంభించి నేటి వరకు 3500 గీతాలు రచించాడు.

సినారె గ్రంథాలు ఇంగ్లీషు, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మళయాళం, ఉర్దూ, కన్నడం మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయనే స్వయంగా హిందీ, ఉర్దూ భాషల్లో కవితలల్లారు. ఆయన కవిత రాస్తుంటే ఆయన రాస్తున్న కలం కూడా ఆ సాహిత్య పరిమాళల్లో పడి తన్మయత్వానికి గురి అయ్యేది. అంత అధ్బుతంగా ఉండేది ఆ కవిత.  అమెరికా, ఇంగ్లండు, ఫ్రాన్స్, రష్యా, జపాన్, కెనడా, ఇటలీ , డెన్మార్క్,థాయ్ ల్యాండ్, సింగపూర్, మలేషియా, మారిషస్, యుగోస్లోవియా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలను సందర్శించారు. 1990 లో యుగోస్లేవియాలోని స్రూగా లో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనం లో భారతీయ భాషల ప్రతినిథిగా పాల్గొన్నాడు.

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ, కేంద్ర సాహిత్య అకాడెమీ, భారతీయా భాషా పరిషత్, రాజలక్ష్మీ పురస్కారం, సోవియట్-నెహ్రూ పురస్కారం, అసాన్ పురస్కారం
మొదలైనవి ఆయన్ను వరించాయి. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ గౌరవాలతో సత్కరించింది. ఆంధ్ర, కాకతీయ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మీరట్, నాగార్జున విశ్వ విద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి.

వ్యక్తిగత జీవితం
ఆయనది బాల్య వివాహం. భార్య పేరు సుశీల. నలుగురు కుమార్తెలు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి. నాలుగు నదుల పేర్లను ఆయన తన కుమార్తెల కు పెట్టుకున్నారు.

విద్యా పరంగా, పాలనా పరంగా ఎన్నో పదవులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు (1981), అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు (1985), పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు (1989), ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు (1992),  రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా ఏడేళ్ళు పని చేసారు.
భారత రాష్ట్రపతి ఆయన్ను 1997 లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు.ఆరేళ్ళపాటు సభలో ఆయన ప్రశ్నలు, ప్రసంగాలు, చర్చలు , ప్రస్తావనలు అందరి మన్ననలనూ అందుకున్నాయి. 1993 నుంచి అంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా విలక్షణ కార్యక్రమాలు రూపొందించి తెలుగు భాషా సాహిత్య, సాంస్కృతిక అభ్యుదయానికి తోడ్పడుతున్నాడు.

విశ్వంభర, ఆరోహణ, మనిషి - చిలక, ముఖాముఖి, భూగోళమంత మనిషి, దృక్పథం, కలం సాక్షిగా, కలిసి నడిచే కలం, కర్పూర వసంతరాయలు, మట్టి మనిషి ఆకాశం, తేజస్సు నా తపస్సు ఇలా ఎన్నో ప్రసిద్ది గాంచిన రచనలు ఆయన సొంతం. ఇవీ కాకా ఆయన ఎన్నో సినీ గేయాలను కూడా రచించారు. ఆయన పలుకు అధ్బుతం, ఆయన అక్షరం అమృతం.

ఆయన రచించిన విశ్వంభర కావ్యం లోని కొన్ని పదాలు మల్లి ఒక్కసారి గుర్తు చేసుకుందాం..
బురద నవ్వింది కమలాలుగా
పువ్వు నవ్వింది భ్రమరాలుగా
పుడమి కదిలింది చరణాలుగా
జడిమ కదలింది హరిణాలుగా
నీటికి రెక్కలు మొలిచి నింగినందుకుంది
నింగికి అడుగులు కదిలి నేలనందుకుంది... అబ్బ ఇలాంటి పదాలకు దేవుడైన ముగ్దుడై పోడా..!! ఆయన కావ్యం కమనీయం.. ఆయన రచనలు రమణీయం. ఆయన కలం ఇంకా కదలాడుతూనే ఉంది. సాహిత్య రంగంలో వెలుగులు  విరజిమ్మటానికి ఆయన కలం నిరంతరంగా కృషి చేస్తూనే ఉంది.  ఇంకా ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో ఆయన కలం నుండి జారువారాలని తెలుగు సమాజం మనస్పూర్తిగా కోరుకుంటుంది. తెలుగు సాహిత్య రంగానికి కొత్త సొబగులు అందిన వజ్ర మకుటానికి తెలుగు విశేష్ వందానిభివందనాలు.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : c narayana reddy. cinare  karimnagar  telangana  andhra pradesh  

Other Articles