Popular telugu comedian actor avs special story

Popular Telugu comedian actor AVS special story, Comedian AVS Cine Journey Special Story, Telugu cinema actor AVS passes away, actor Amanchi Venkata Subrahmanyam, Telugu actor AVS, AVS Cine Journey

Popular Telugu comedian actor AVS special story, Comedian AVS Cine Journey Special Story

టాలీవుడ్ నవ్వుల తుత్తి ఇకలేదు

Posted: 11/09/2013 12:24 PM IST
Popular telugu comedian actor avs special story

ఇరవైఏళ్ల క్రితం తెలుగు సినీరంగం ఓ హాస్య నటుడికి జన్మనిచ్చింది. 'పువ్వు పుట్టగానే పరిమళించును' అన్న చందాన తొలి చిత్రంతోనే ఆయన సత్తా ఏంటో పరిశ్రమతో పాటు ప్రేక్షకులూ గ్రహించారు. ఆ తర్వాత క్రమంలో చిత్రసీమలోని హాస్యనట వర్గంలో కీలక నటుడిగా గుర్తింపు పొందడమే కాదు రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా తన అభిరుచిని చాటుకున్న ఆ వ్యక్తి ఎవరో కాదు ఏవీయస్‌. ఆయన నట ప్రస్థానం చిన్నతనం నుంచీ మొదలుకాలేదు. కాలేజీలో చేరిన తర్వాత నుంచే ఆయనలోని నటుడు బయటకువచ్చాడు.

 

స్వస్థలమైన తెనాలిలో కాలేజీలో చదువుతున్నప్పుడు తొలిసారిగా ఆయన తన ముఖానికి రంగు వేసుకున్నారు. అప్పట్లో అంతర్‌ కళాశాల పోటీల్లో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఇంటర్‌ యూనివర్శిటీ నాటక పోటీలలో 'దేవుడా నీకు దిక్కెవరు' అన్న నాటకానికి నాలుగు అవార్డులు అందుకున్నారు. కాలేజీ విద్య పూర్తయిన తర్వాత మొదటి ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌ను ప్రారంభించిన ఆయనకు కొంతకాలం తర్వాత ఉదయం పత్రికలో పాత్రికేయుడిగా అవకాశం లభించింది. ఒంగోలులో స్టాఫ్‌ రిపోర్టర్‌గా కూడా పనిచేస్తున్నప్పుడే ఆంధ్రజ్యోతిలో కూడా ఆయనకు అవకాశం లభించింది.

ఆ తర్వాత విజయవాడలో చీఫ్‌ సబ్‌ ఎడిటర్‌గా, డెస్క్‌ ఇంఛార్జ్‌గా పనిచేశారు. అదే సమయంలో ఏవీయస్‌లోని నటనాసక్తిని గమనించిన ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ఆయనను బాపు, రమణలకు పరిచయం చేశారు. అప్పట్లో ఎన్టీఆర్‌ నటించిన 'శ్రీనాథ కవిసార్వభౌమ' చిత్రంలో ఆయనకు బాపు, రమణలు అవకాశం కల్పించారు. ఆ సందర్భంగా ఏవీయస్‌ నటనను చూసి ఎన్టీఆర్‌ మెచ్చుకోవడంతో ఆయన నట జీవితానికి మంచిపునాది పడ్డట్టయ్యింది.

 

ఏవీయస్‌ తొలి చిత్రం 'శ్రీనాథ కవిసార్వభౌమ' అయినప్పటికీ, షూటింగ్‌ జరిగి, ముందుగా విడుదలైన చిత్రం 'మిస్టర్‌ పెళ్లాం' కావడంతో అదే ఆయన తొలి చిత్రంగా భావిస్తారు. 'మిస్టర్‌ పెళ్లాం'లో హాస్యనటుడిగా తుత్తి అనే డైలాగ్‌ ఆయనను ఎంతగానో పాపులర్‌ చేసింది. ఇక అప్పట్నుంచీ నటుడిగా వెనుదిరిగి చూసుకునే అవకాశమే లేకపోయింది.

తెలుగు సినీరంగంలోని హాస్య కుటుంబంలో తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని సముపార్జించుకున్నారు. నటుడిగా తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ, రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా తన అభిరుచిని చాటుకున్నారు. దర్శక, నిర్మాతగా తాను చేసిన చిత్రాలు అనుకున్నంతగా ఆడకపోయినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతోనే మెలిగారు. సినీరంగంలో తాను ఏ ఇతర శాఖలోకి ప్రవేశించినా నటనను ఆయన ఏనాడూ వదిలిపెట్టలేదు. తాను ఎక్కడ వున్నా, ఏం చేస్తున్నా పదిమందితో కలేగలుపుగా మాట్లాడటమే కాదు నవ్వుల పువ్వులను పూయించేవారు. ఇంకా చెప్పాలంటే సినిమా వేడకులలో వ్యాఖ్యాతగా తనదైన హాస్యశైలితో అలరింపజేయడం ఆయన ప్రత్యేకత.

 

ఇంతవరకు దాదాపు 500 చిత్రాల్లో నటించిన ఆయన లోగడ నిర్మాతగా 'అంకుల్‌', దర్శకనిర్మాతగా 'ఓరి నీ ప్రేమ బంగారం కానూ', దర్శకుడిగా 'సూపర్‌హీరోస్‌', 'రూమ్‌మేట్స్‌', 'కోతిమూక' వంటి చిత్రాలను చేశారు. గతంలో కాలేయ సమస్యతో తాను బాధపడినప్పుడు కుమార్తె ప్రశాంతి తనకు పునర్జన్మను ఇచ్చిందని ఆయన ఎప్పుడూ అంటుండేవారు. అల్లుడు సైతం తన కాలేయంలో భాగం ఇవ్వడానికి ముందుకు వచ్చా రని, అంతకంటే ఇంకేవాలని ఆయన చెబుతుండేవారు. కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఆయనకు కాలేయ సంబంధిత సమస్య తలెత్తి మృత్యువు కబళించడం దురదృష్టకరం. ఆయన మృతిపట్ల అటు ప్రేక్ష కులు, ఇటు పరిశ్రమ ఎంతగానో చింతిస్తోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles