ప్రత్యేక హోదా లేనట్లే | Arun Jaitley's RS speech on AP Special Status

Arun jaitley s rs speech on ap special status

AP Special Status discussion, Arun Jaitley's no clarity on Special Status, BJP no for special status

AP Special Status discussion in Rajya Sabha. Arun Jaitley's not given any clarity on AP Special Status.

ITEMVIDEOS: ప్రత్యేక హోదాపై చేతులెత్తేశారు

Posted: 07/29/2016 05:51 PM IST
Arun jaitley s rs speech on ap special status

ఉత్కంఠ నడుమ రాజ్యసభలో పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై ప్రైవేటు బిల్లుపై ఏం తేలకుండానే చర్చ ముగిసింది. హోదాపై ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఏపీ ప్రజలకు బీజేపీ సారీ చెప్పేసింది. దాదాపు అరగంటకు పైగా సాగిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగంలో ఎక్కడా ప్రత్యేకం అనే పేరు రాకుండా సాగటం విశేషం. అనవసరమైన లెక్కలు చెప్పి ఈ సమయంలో ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ చెప్పకనే ఆయన చెప్పేశారు. ఒక ముడి రాకపోతే ఇంకో రెండు ముడులు వేసి దాన్ని చిక్కుముడిగా మార్చేయటం ద్వారా హోదా అంశాన్ని పూర్తిగా కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తుందని జైట్లీ ప్రసంగం విన్న ఎవరికైనా అర్థం అవుతుంది. అంతేకాదు ఆశగా ఎదురు చూస్తున్న ప్యాకేజీ, ప్రత్యేక రైల్వే జోన్ విషయంలో కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే గందరగోళంలోకి నెట్టేలా ఆయన ప్రసంగం సాగింది. జైట్లీ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని ప్రతిపక్ష కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేయగా, చర్చ అర్థాంతరంగా ముగిసినట్లయ్యింది.

చర్చ లో ఎవరేం మాట్లాడారు:

చర్చ ప్రారంభం కాగానే ముందుగా మైక్ అందుకున్న తెలుగుదేశం సభ్యుడు సీఎం ర‌మేష్ మాట్లాడుతూ.. ఎంపీ వెంక‌య్య నాయుడు చెప్పిన స‌మాధానంపై తాము సంతృప్తిగా లేమ‌ని అన్నారు. గురువారం స‌భ‌లో అన్ని పార్టీలు ఏపీకి మ‌ద్దతు ఇచ్చాయ‌ని గుర్తు చేశారు..

ఒకవేళ ప్రత్యేక హోదా ఇవ్వక‌పోతే రాష్ట్రానికి మ‌రో రూపంలో సాయం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ కోరారు. విభజన ద్వారా తెలుగు రాష్ట్రాలకు మంచే జరిగిందని, అభివృద్ధి పరంగా ఎదిగేందుకు పోటీపడుతున్నాయని పోటీపడుతున్నాయని అన్నారు. అదే సమయంలో బీజేపీ ద్వంద్వ ధోరణి తేటతెల్లమయ్యిందని, రెండు రాష్ట్రాలకు అధికారంలో ఉండి కూడా ఏమీ చేయదనే విషయం ప్రజలకు తెలిసొచ్చిందని అన్నారు. బీహార్, ఒడిశా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కు కూడా ప్రత్యేకహోదా లాంటిది ఇస్తే బాగుంటుందని ఆయన తెలిపారు.

పునర్వవ్యస్థీకరణ ద్వారా అన్యాయానికి గురవుతారని తాను ఏపీ నేతలకు ఆనాడే చెప్పానని అకాళీదళ్ ఎంపీ నరేష్ గుజ్రాల్ తెలిపారు. గతంలో విభజన సందర్భంగా చేసిన హామీలు నెరవేర్చక ఛండీగఢ్ నాశనమైపోయిందని అన్నారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్ విషయంలో కూడా అదే జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఏపీ విషయంలో అదే సీన్ రిపీట్ అయ్యిందని చెప్పారు. హైదరాబాదును ఏపీ నుంచి వేరు చేయడం ద్వారా ఆ రాష్ట్రాన్ని, ప్రజలను పేదరికంలోకి నెట్టారని ఆయన ఆరోపించారు. దీనిని పూరించాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని ఆయన తెలిపారు.

నవ్యాంధ్రకు న్యాయం జ‌ర‌గాల‌ని ప్రజలు కోరుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఎంపీ సీతారామ‌ల‌క్ష్మి కోరారు. ప్రపంచానికి తెలీకుండా తలుపులు వేసి మరీ ఆనాడు స‌భ‌లో విభ‌జ‌న చేశారని, ఆ టైంలో ప్రత్యేక హోదా ఐదు కాదు పదేళ్ల కావాలని వెంకయ్య నాయుడు కోరిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ప్రకటిస్తేనే పరిశ్రమలు వ‌స్తాయని, తద్వారా రాష్ట్రాభివృద్ధి జ‌రుగుతుంద‌ని ఆమె పేర్కొన్నారు.

అనంతరం టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదాకు ఎన్నడూ వ్యతిరేకం కాదని, కేంద్రంతో కలిసున్నందుకు తాము మాటలు పడుతున్నామని అన్నారు. అందరితో సంప్రదించకుండానే సంఖ్యాబలముంది కదా అని రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని ఆరోపించారు. కనీస ప్రజాస్వామ్య నిబంధనలు పాటించకుండా విభజన జరిగిపోయిందని అన్నారు. విభజనకు కాంగ్రెస్, బీజేపీలే కారణమన్న అభిప్రాయం ఏపీ ప్రజల్లో బలంగా ఉందని, అది తొలగాలంటే, హోదా ఇవ్వడం ఒక్కటే మార్గమని అన్నారు. ఈ విషయమై ఎన్నో మార్లు ప్రధానితో తమ అధినేత చర్చించారని అన్నారు. ఏపీని విభజించేందుకు తొందరపడ్డ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉత్తరప్రదేశ్ ను విడగొట్టేందుకు వెనుకాడుతున్నాయని, అదంతా పొలిటికల్ గేమ్ అని సుజనా చౌదరి ఆరోపించారు.

రాజకీయాల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ విభజించిందని, విభజనకు జాతీయ పార్టీలే కారణమని ఆయన చెప్పారు. ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చటం సరికాదని, తాము ఎదుర్కొంటున్న సమస్యలు వేరు, ఇతర రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు వేరని ఆయన చెప్పారు. అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ అంశంపై సమాధానమిచ్చారు.

అరుణ్ జైట్లీ సమాధానం ఎలా ఉందంటే...

‘చిన్న రాష్ట్రాలకు బీజేపీ మొదటి నుంచి అనుకూలం. గతంలో బీజేపీ హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేశాం. విభజన భావోద్వేగాలతో కూడిన అంశం. కేవలం కాంగ్రెస్ తొందరపాటు వల్లే ఈ పరిస్థితి తలెత్తింది’ అని ఆరోపించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంటుందన్న ఆయన విభజనతో ఏపీ నష్టపోయిన విషయాన్ని అంగీకరించారు.

ఎంతగానో అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరం, విభజన తరువాత తెలంగాణలో ఉండిపోయింది, హైదరాబాద్ నగరం ఆదాయం తెలంగాణకు రావడంతోనే ఏపీ లోటులోకి జారి పోయిందని తెలిపారు. ఇప్పటికే తన ఆదాయంలో 42 శాతం వాటాను రాష్ట్రాలకు ఇస్తున్న కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆర్థికంగా సంతృప్తి పరచలేదంటూ చెప్పుకోచ్చారు. ఏపీ కి ఎంతో చేస్తున్నాం. అభివృద్ధి చెందేవరకు చేస్తూనే ఉంటాం. ఆర్థికంగా నిలదొక్కుకునేంత వరకు కేంద్రం సాయం అందిస్తూనే ఉంటుందని, హామీలన్ని నేరవేరుస్తాం అంటూ ప్రకటించారు.

ఇక ఇప్పటిదాకా ఏపీకి చాలా చేశామని చెప్పుకోచ్చిన జైట్లీ పలు అంశాలను చదివి వినిపించారు

- విభజన చట్టం సెక్షన్ 9లో ఉన్న విధంగా రెండు తెలుగు రాష్ట్రాలకూ అదనపు పోలీసు ఉద్యోగాలను కేటాయించాం.
- హైకోర్టును విభజించాలని తెలంగాణ పట్టుబడుతోంది. అందుకూ ప్రయత్నిస్తున్నాం.
- సెక్షన్ 46 ఎంతో ముఖ్యం. ఆదాయ పంపిణీపై ఉంది. జనాభా ప్రాతిపదికన 58 శాతం ఏపీకి, 42 శాతం తెలంగాణకూ కేటాయించాం.
- ఏపీలో వెనుకబడిన జిల్లాలను ఆదుకునేందుకు నిధులు అందించాము.
- సెక్షన్ 90లో తెలిపిన విధంగా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిధులిస్తున్నాం. మరిన్ని నిధుల కోసం నాబార్డుతో చర్చిస్తున్నాం.
- ఒకసారి పార్లమెంటులో చట్టం ఆమోదం పొందిన తరువాత మరేమీ చేయలేము.
- సెక్షన్ 93లోని 13వ షెడ్యూల్ లో పేర్కొన్న విధంగా పలు జాతీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేశాం.
- ప్రధాని ఎంతో చొరవ తీసుకుని ఏపీ పారిశ్రామికాభివృద్ధికి ఎంతో చేశారు.
- ఐఐటీని ఇప్పటికే ప్రారంభించాం. ఎన్ఐటీ కూడా పనిచేస్తోంది. ఐఐఎం లో విద్యా సంవత్సరం ప్రారంభంకానుంది.
- రాష్ట్రం ఏర్పడి కేవలం రెండేళ్లే అయింది. ఎన్నో సంస్థల ఏర్పాటు దిశగా, ఏపీ సర్కారును స్థలం అడిగాము.
- జాతీయ వర్శిటీ ఏర్పాటుకు స్థలాన్ని చూశాం.
- పట్టణాభివృద్ధి దిశగా విశాఖకు మెట్రోను ప్రకటించాం. దానికి ప్రాథమిక అనుమతులు వచ్చాయి.
- సున్నితమైన రైల్వే జోన్ విషయంలో అదే రాష్ట్రం నుంచి ఎంపికైన సురేష్ ప్రభు చర్చిస్తున్నారు.
- జాతీయ హైవేలను నితిన్ గడ్కరీ ఇప్పటికే ప్రకటించారు.
- కృషి సంచాయ్ యోజన కింద 8 ప్రాజెక్టులు చేపట్టాము.
- నీటి పారుదల రాష్ట్రాల బాధ్యతే అయినా, ఏపీ విషయంలో కల్పించుకుని నిధులిచ్చాం.
- రాజధానిని నిర్మించాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. దశలవారీగా నిధులిచ్చేందుకు సిద్ధం.
- మా హామీలను నెరవేర్చుకోవడానికి కూడా నిధులు ఉండాలి కదా?

విశాఖలో మెట్రో డీసీఆర్ పరిశీలనలో ఉందన్న ఆయన ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేసే విషయంలో ఒడిషా నుంచి అభ్యంతరాలు ఉన్న నేపథ్యంలో ఆ అంశం రైల్వే మంత్రి సురేష్ ప్రభు చూసుకుంటారని చెప్పారు. దీంతో రైల్వే జోన్ విషయంలో కూడా కేంద్రం హ్యాండ్ ఇచ్చినట్లుగానే భావించవచ్చు.

ఎన్నో రాష్ట్రాలు ఆర్థికంగా వెనుకబడి వున్నాయని, ఆర్థిక సంఘం సూచించిన విధంగా, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల ప్రకారం ముందుకు సాగుతామే తప్ప, కేవలం ఒక మాట చెప్పి తప్పించుకున్న కాంగ్రెస్ పార్టీ అవకాశవాదాన్ని సమర్థించలేమని చెప్పటంతో ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితుల్లో కేంద్రం లేదని తేల్చేశారు.

అనంతరం కాంగ్రెస్ నినాదాలు చేస్తుండగా, "హోదా హోదా అంటూ కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. చట్టానికి అనుగుణంగా మాత్రమే మేము నడుచుకోగలం. అంతకుమించి చేయడానికి ఏమీ లేదు. ఏపీ అభివృద్ధికి సహకరిస్తాం. హోదాపై ప్రభుత్వం చేతుల్లో ఏమీ లేదు. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల వెంటే వెళతామని మరోసారి చెబుతున్నా" అన్నారు. జైట్లీ ఆన్సర్ మరింత గందరగోళానికి దారి తీసేలా ఉందని సీతారాం ఏచూరి, ఈ సమాధానాన్ని అంగీకరించడం లేదని కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. జైట్లీ వ్యాఖ్యలను తప్పుబట్టిన దిగ్విజయ్ సింగ్, హోదా ఇవ్వకుంటే, ప్రజల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ, జైట్లీ సమాధానాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి సభ నుంచి వాకౌట్ చేశారు.

ఆ ఒక్కటీ అడక్కు...
 
ప్రత్యేక హోదాను ఒక రాష్ట్రానికి ఇస్తే, పది రాష్ట్రాలు కూడా అడుగుతాయని అన్న జైట్లీ అది సాధ్యమయ్యే పని కాదని చెప్పుకొచ్చారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై 14వ ఆర్థిక సంఘాన్ని నియమించామని వారు ఇచ్చే సిఫార్సులకు అనుగుణంగానే తమ నిర్ణయాలు ఉంటాయని అన్నారు. వచ్చే ఐదేళ్ల వ్యవధిలో ఏ రాష్ట్రాన్ని ఎలా ఆదుకోవాలన్న విషయమై, తమ వద్ద సమగ్ర సమాచారం ఉందని, దానికి అనుగుణంగానే సాగుతున్నామని వివరించారు. మధ్యలో వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి కల్పించుకుని ఆర్టికల్ 280 గురించి ప్రస్తావించారు. దాని ప్రకారం 14వ ఆర్థిక సంఘం ఇచ్చినవి కేవలం సూచనలు మాత్రమే. దాన్ని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇ‍వ్వాలా, వద్దా అని నిర్ణయించవలసింది ప్రభుత్వమే. ఇప్పటివరకు ఇచ్చిన రాష్ట్రాలన్నింటికీ ప్రభుత్వం నిర్ణయంతోనే ఇచ్చార'ని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

అయితే వాజ్ పేయి హయాంలో ఏర్పడిన రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ కు మాత్రమే ప్రత్యేక హోదాను ఇచ్చామని, అది కూడా ఆనాటి ఆర్థిక సంఘం సూచిస్తేనే ఇచ్చామని, ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి తక్కువగా ఉంది కాబట్టే హోదా అమలవుతోందని చెప్పారు. అన్ని వనరులూ పుష్కలంగా ఉన్న ఏపీ వంటి రాష్ట్రం కష్టాల్లో ఉన్న మాట వాస్తవమేనని, అభివృద్ధి దిశగా తమవంతు సాయం చేస్తామే తప్ప ఇంకేమీ చేయలేమని జైట్లీ సమాధానమిచ్చారు.

మేమేం పారిపోవడం లేదు: వెంకయ్య

ఏపీ ప్రత్యేక విషయంలో కేంద్రం ఏం చేయదని గురువారం రాజ్యసభ చర్చలో పిట్ట కథలు చెప్పిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నేడు దానికి కొనసాగింపు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అన్యాయం చేయబోమని, ఎట్టి పరిస్థితుల్లో కష్టాల్లోకి నెట్టబోమని ఆయన అన్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఏపీ ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి అందరూ కలిసి రావాలని కోరారు. ప్రతిపక్షాలు ఆరోపించినట్లు తాము తమ హామీలనుంచి పారిపోవడం లేదని, ఏపీకి చేయాల్సిదంతా చేస్తున్నామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP Special Statusm Rajyasabha  discussion  Arun Jaitley  

Other Articles