Police new programme on radio to prevent naxals

naxals, chattisgarh, police, basthar, radio, development, jagadalpur

police new programme on radio to prevent naxals. chattisghar police launch new programmee to prevent naxals in the state. police commence to spread awarness about development.

రేడియో ప్రచారం ద్వారా నక్సల్స్ కు అడ్డుకట్ట.. ఛత్తీస్ ఘడ్ పోలీసుల కొత్త ఆలోచన

Posted: 03/02/2015 12:13 PM IST
Police new programme on radio to prevent naxals

దాదాపు మూడు దశాబ్దాలుగా నక్సల్స్ సమస్యతో పోరాడుతున్న చత్తీస్‌గఢ్ పోలీసులు ఇప్పుడు రేడియో ద్వారా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు చేరువ కావడానికి, వారి విశ్వాసాన్ని చూరగొనడానికి ప్రయత్నిస్తున్నారు. నిషేధిత మావోయిస్టు పార్టీ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి రాష్ట్ర పోలీసు విభాగం స్థానిక గిరిజన భాషలైన చత్తీస్‌ఘరీ, హల్బీ, గోండీతో పాటుగా హిందీలో 30కి పైగా జింగిల్స్ (ప్రచార నినాదాలు)ను రూపొందించింది. ‘మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు ముఖ్యంగా బస్తర్‌లోని మారుమూల ప్రాంతాల ప్రజలకు చేరువ కావడానికి రేడియో ఒక బలమైన సాధనం. ‘నక్సలిజం కారణంగా అభివృద్ధి ఫలాలు వారికి ఎలా అందడం లేదన్న మా సందేశాన్ని బస్తర్ ప్రాంతంలోని ప్రతి గ్రామంలోని ప్రతి ఒక్కరికీ చేరేలా చేయడమే ఈ ప్రచారం ముఖ్యోద్దేశం’ అని రాష్ట్ర పోలీసులు తెలిపారు.ఈ జింగిల్స్ ద్వారా పోలీసులు నక్సల్స్‌కు తమ ఉద్యమాన్ని వదిలిపెట్టి జన జీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేయడంతో పాటు విద్య, అభివృద్ధి ఎంత ముఖ్యమో గ్రామస్థులకు తెలియజేస్తామని పోలీసులు అంటున్నారు.. గ్రామస్థులకు, గ్రామ పెద్దకు మధ్య సంభాషణల రూపంలో ఉండే జింగిల్స్‌లో నక్సల్స్ తమ ఉద్యమంలో చేరేలా గ్రామస్థులను ప్రోత్సహించడం ద్వారా వారిని ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారో గ్రామ పెద్ద వారికి చెప్తాడు. అంతేకాదు నక్సల్స్ ఉద్యమం అభివృద్ధిపథంలో ఎలా అడ్డంకిగా మారుతోందో, ఆ ప్రాంతంలో పాఠశాలలు, ఆస్పత్రులు, పంచాయతీ భవనాలు అభివృద్ధి చెందకుండా ఎలా అడ్డుకుంటున్నాయో కూడా అవి ప్రధానంగా వివరిస్తాయి.

జగదల్ పూర్ జిల్లా ప్రధాన కేంద్రంలో ఉన్న తమ సబ్ స్టేషన్‌నుంచి ఆకాశవాణి గత నెలనుంచి ఈ జింగిల్స్‌ను ప్రసారం చేయడం ప్రారంభించింది. ఉదయంనుంచి సాయంత్రం దాకా ప్రతి అరగంటకోసారి వాటిని ప్రసారం చేస్తున్నారు. చత్తీస్‌గఢ్ మాజీ డిజిపి విశ్వరంజన్ పోలీసులు చేపట్టిన ఈ చర్య చాలా మంచి పని అని ప్రశంసిస్తూ, గిరిజనులు మావోయిస్టు సిద్ధాంతానికి దూరం కావడంలో ఇది విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. గ్రామస్థులను జన జీవన స్రవంతివైపు ఆకర్షించడానికి ఇది ఓ మంచి ఆలోచన. దీని ఫలితాలు సమీప భవిష్యత్తులోనే కనిపిస్తాయి అని ఆయన అన్నారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naxals  chattisgarh  police  basthar  radio  development  jagadalpur  

Other Articles