Stamps registrations income increases in andhra pradesh falls down in telangana

stamps, registrations, andhra pradesh, real boom, Telenagana, Hyderabad, rangareddy, Medak, Warangal, vijayawada, vishakapatnam, guntur

stamps registrations income increases in andhra pradesh, falls down in telangana

ఆంధ్రలో అమ్మాకాల జోరు.. తెలంగాణలో లక్ష్యాలు చేరలేక దిగాలు..

Posted: 11/14/2014 11:57 AM IST
Stamps registrations income increases in andhra pradesh falls down in telangana

రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ భూమ్ పరిస్థితులు భిన్నంగా వున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ రంగం జోరందు కోగా, తెలంగాణలో లక్ష్యాలను చేరుకోడానికి కూడా అధికారులు తంటాలు పడుతున్నారు.  రాష్ట్ర విభజన, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని నిర్మాణం, ఆర్థిక రాజధానిగా విశాఖ తదితర అంశాలు నవ్యంధ్రకు బాగా కలిసోచ్చాయ్. జూన్ - అక్టోబర్ నెలల మధ్య స్థిరాస్తి క్రయ విక్రయాలు భారీగా పెరిగాయి. గత ఏడాది ఈ మధ్యకాలంలో జరిగిన రిజిస్ట్రేషన్ల కంటే రెట్టింపు సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్టేషన్లతో పాటు ఆదాయం కూడా నవ్యంధ్రకు బాగానే కలిసోచ్చింది. రాష్ట్ర రాజధాని ఏర్పాటవుతుందని గత కొన్ని నెలలుగా ప్రచారం సాగిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య రెట్టింపు కంటే అధికంగా నమోదయ్యింది.

అటు తెలంగాణలో మాత్రం ఆస్తుల క్రయవిక్రయాలపై మందకోడిగా సాగుతున్నాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తగ్గిన రిజిస్ట్రేషన్లు కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా పుంజుకోలేదు. స్వరాష్ట్రం సిద్ధిస్తే రాజకీయ స్థిరత్వంతో ‘రియల్’ బూమ్ పునరావృతమవుతుందని రియల్టర్లు వేసిన అంచనాలు తప్పుతున్నాయి. కొత్త రాష్ట్రానికి వలసలు పెరిగి, భూముల క్రయవిక్రయాల్లో చలనం వస్తుందని ప్రభుత్వం పెట్టుకున్న ఆశలు కూడా నెరవేరడం లేదు.

నవ్యంధ్రలోని మొత్తం 13 జిల్లాలకు గాను ఆరు జిల్లాల్లో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది దాదాపు రెట్టింపు సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో గత ఏడాదికంటే రెట్టింపు సంఖ్యలో డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. రిజిస్ట్రేషన్ల వృద్ధిలో ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. గత ఏడాది జూన్ - అక్టోబర్ నెలల మధ్య మొత్తం 3,08,445 డాక్యుమెంట్లు రిజిష్టర్ కాగా ఈ ఏడాది ఇదే కాలంలో 5,96,385 రిజిస్ట్రేషన్లు జరిగాయి.

నవ్యాంధ్రకు భారగీ పెరిగిన ఆదాయం..

రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పటితో పోల్చితే విభజన తర్వాత రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు 2013 -14 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్ - సెప్టెంబర్) ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో వచ్చిన దానికంటే ఈ ఏడాది ఇదే కాలంలో దాదాపు రెట్టింపు ఆదాయం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రూ.624.83 కోట్లు రాగా ఈ ఏడాది ఇదే కాలంలో రూ. 1,316 కోట్లు వచ్చింది. అయితే ఈ ఏడాది అక్టోబర్‌లో మాత్రం రాబడి తగ్గిపోయింది.

రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు వరకు రూ.1,469.95 కోట్ల రాబడి వచ్చింది. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి నూతన రాజధాని ఏర్పాటుపై, వివిధ జిల్లాల్లో విద్యాసంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుపై అనేకరకాల ప్రకటనలు చేస్తూ వచ్చింది. ఈ కారణంగానే అన్ని జిల్లాల్లో స్థిరాస్తి రంగం పుంజుకుంది. అయితే అదే అక్టోబర్‌కు వచ్చేసరికి రాజధాని ప్రాంతం మినహా మిగిలిన జిల్లాల్లో పెద్దగా ఏ సంస్థగానీ, పరిశ్రమలు గానీ వచ్చే అవకాశం కనిపించడంలేదనే భావానికి ప్రజలు వచ్చారు.

తెలంగాణలో కానరాని పురోగతి..

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదు నెలల కాలంలో కూడా రిజిస్ట్రేషన్లలో పెద్దగా పురోగతి లేదు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ శాఖ అంచనా వేసిన ఆదాయ లక్ష్యం ఇప్పటికీ అందనంత దూరంలో ఉంది. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లలో అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే భూముల మార్కెట్ విలువలు తగ్గుతాయని కొనుగోలుదారులు, బూమ్‌లేక ఇప్పటికే పడిపోయిన ధరలు కొత్త రాష్ట్రంలో పెరుగుతాయని రియల్టర్లు భావించడమే ఈ పరిస్థితికి కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

జనవరి నుంచే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో క్రయవిక్రయాలు తగ్గిపోయాయి. జిల్లా కేంద్రాలు, భవిష్యత్తులో జిల్లా కేంద్రాలుగా మారుతాయని భావి స్తున్న సిద్ధిపేట, మంచిర్యాల, వికారాబాద్, నాగర్‌కర్నూలు, వనపర్తి, సూర్యాపేట, జనగామ తదితర పట్టణాల్లో భూముల రేట్లు పెరిగాయి. అక్కడ రిజిస్ట్రేషన్లూ జరిగాయి. తెలంగాణ ఆవిర్భావం (జూన్2) నాటికి మళ్లీ స్తబ్ధత ఏర్పడింది. కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పట్లో ఉండదని కేసీఆర్ ప్రకటించిన తర్వాత ఆయా ప్రాంతాల్లో కూడా రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. దీంతో తెలంగాణలో రాష్ట్ర ఆధాయానికి భారీగానే గండి పడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రెవెన్యూ శాఖ రూ. 4,766.79 కోట్లు రాబట్టుకోవాలని అంచనా వేసింది. ఇప్పటి వరకు కేవలం రూ.1,418.91 కోట్లు రూపాయల ఆదాయం మాత్రమే సాధించింది. అయితే కొంత కాలం పాటు స్థబ్దుగా వున్నా.. ఆ తరువాత మాత్రం మళ్లీ మార్కెట్ పుంజుకుంటుందని వ్యాపార విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles