Supreme court judgement on coalgate scam

coat scam, coal gate, supreme court on coal gate, cbi, cbi enquiry on coal gate, upa, monmohan singh, nda, narendra modi, latest news, coal blocks, scams in india

supreme court pronounced judgement on coal gate scam : from 1992 all coal allocations are illegal says supreme court and cancels allocations

కోల్ స్కాంలో కాంగ్రెస్, బీజేపికి సుప్రీం షాక్

Posted: 08/25/2014 04:59 PM IST
Supreme court judgement on coalgate scam

దేశాన్ని కుదిపేసిన బొగ్గు కుంభకోణంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 1993 నుంచి జరిగిన కేటాయింపులన్ని అక్రమంగా తేల్చిచెప్పింది. కేటాయింపుల్లో ఎక్కడా పారదర్శకత లేదనీ.., అన్ని చట్టవిరుద్ధంగా ఉన్నయని చెప్తూ.., కేటాయింపులన్నిటినీ రద్దు చేసింది. కేటాయింపులు ఎలా ఉండాలో తాము ప్రభుత్వానికి చెప్తామని స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది. ఈ తీర్పు అధికార, ప్రతిపక్షాలకు చెంప పెట్టు లాంటిది. ఎందుకంటే పీ.వీ. హయాం మొదలుకుని మన్మోహన్ వరకు అన్ని ప్రభుత్వాలు అక్రమాలకే పాల్పడ్డాయని తాజా తీర్పు చెప్తోంది. ఏ ప్రభుత్వమూ ఇందుకు అతీతం కాదని స్పష్టం చేస్తోంది. పైకి మాత్రం విమర్శలు చేస్తూ.. నేతలతా కలిసి 1లక్షా 86వేల కోట్ల ప్రజా ధనాన్ని లూటీ చేశారు. సహజవనరులను బ్రిటీషు వారిలా కొల్లగొట్టారు. కోర్టు తీర్పుతో బొగ్గు మసి కాంగ్రెస్ తో పాటు బీజేపికి కూడా అంటుకుంది.

93నుంచి అక్రమాల ఆరంభం

సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 1992-93 నుంచి జరిగిన కేటాయింపులన్ని అక్రమమే. అంటే పీవీ నరసింహ రావు మొదలుకుని, దేవెగౌడ, గుజ్రాల్, వాజ పాయ్, మన్మోహన్ సింగ్ హయాంలో జరిగినవన్ని అక్రమ కేటాయింపులే. వీరంతా అక్రమాలకు పాల్పడ్డారని తీర్పు కాదు. కాని వీరి ప్రభుత్వ కాలంలో జరిగినవి అక్రమ కేటాయింపులు. అన్ని ప్రభుత్వాల్లో అవినీతి జరిగింది వాస్తవమని.., ఇందుకు ఏ ప్రధాని అతీతుడు కాదని తీర్పు కుండ బద్దలు కొడుతోంది. అధికారులు కావచ్చు, ప్రభుత్వ నేతలు కావచ్చు, కంపనీలే అక్రమాలకు పాల్పడి ఉండవచ్చు. ఏ ప్రభుత్వము కూడా తమ హయాంలో తప్పు జరిగినట్లు ఒప్పు కోలేదు. కనీసం ఆ దిశగా ధర్యాప్తు కూడా చేయించుకోలేదు. ఏదేమైనా అత్యంత విలువైన సహజ వనరు కొల్లగొట్ట బడింది. 1.86 లక్షల కోట్ల ప్రజా ధనం దోపిడికి గురయింది. ఇదే డబ్బు ఉంటే ఒక రాష్ర్టానికి అన్ని అవసరాలు తీర్చగల బడ్జెట్ ను మించిపోతుంది.

యూపీఏను కుదిపేసిన కోల్ మసి

కుంభకోణాల ప్రభుత్వంగా అపఖ్యాతి మూటగట్టుకున్న యూపీఏ ప్రభుత్వానికి కోల్ స్కాం మాయని మచ్చలా ఉంది. అప్పటికే 2జీ, కామన్ వెల్త్ కుంభకోణాలతో తీవ్ర విమర్శనలెదుర్కుంటున్న యూపీఏ.., నెత్తిన పిడుగులా కోల్ స్కాం పడింది. మన్మోహన్ సర్కారు పాతాళం నుంచి ఆకాశం వరకు అన్నిటినీ దోచుకుందని ఆరోపణలు వచ్చాయి. బొగ్గు శాఖ స్వయంగా ప్రధాని మన్మోహన్ ఆధీనంలో ఉండటంతో ఆయనపై, ప్రధాని కార్యాలయంపై కూడా ఆరోపణలు వచ్చాయి. పార్లమెంటు సభలను కోల్ గేట్ స్కాం వరసగా కుదిపేసింది. కేటాయింపులు సభ ముందు పెట్టాలని నాటి ప్రతిపక్షం బీజేపి పట్టుబట్టింది. అక్రమంగా కేటాయించిన గనులన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అందుకు తగ్గట్టు అక్రమంగా గుర్తించిన గనులను ప్రభుత్వం రద్దు చేసింది. అయితే వచ్చిన చెడ్డపేరు మాత్రం పోలేదు. ప్రభుత్వానికి అంటుకున్న బొగ్గు మసి.., ఎన్నికల్లో స్పష్టమైన ఓటమి ఫలితాన్ని చూపింది. చివరకు కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని స్థాయికి తీసుకొచ్చింది.

బీజేపీకి షాకిచ్చిన కోర్టు

సుప్రీం కోర్టు తాజా తీర్పు కాంగ్రెస్ తో పాటు బీజేపికి కూడా షాకిచ్చింది. వాస్తవానికి బొగ్గు కేటాయింపుల కుంభకోణాన్ని బయటపెట్టింది భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రకాష్ జవదేకర్, హంసరాజ్ కలిసి బొగ్గు కేటాయింపులపై విచారణ జరపించాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పరిశీలించిన కోర్టు.., కేటాయింపులపై విచారణ జరపాలని సీబీఐని ఆదేశించింది. అలా రంగంలోకి దిగిన సీబీఐ తీగ లాగితే అన్ని ప్రభుత్వాల డొంకలు కదిలాయి. అంతా శ్రీరంగ నీతులు చెప్తున్నారు.. తప్పచేసేవి దొంగ పనులే అని తేటతెల్లమయింది. బొగ్గు కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కోర్టుకు సీబీఐ ప్రాధమిక ధర్యాప్తు నివేదిక అందించింది.  దీంతో యూపీఏ ప్రభుత్వాన్ని ఎన్ని విధాలుగా ఇరుకున పెట్టాలో అంతకంటే ఎక్కువే చేసింది బీజేపీ, ఎన్డీఏ మిత్ర పక్షాలు. అలా మన్మోహన్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతూ., ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే వాజ్ పాయ్ ప్రభుత్వం (1998-2004) జరిపిన కేటాయింపులూ అక్రమమే అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఎన్డీఏ కేటాయింపులపై కూడా విచారణ జరపాలని యూపీఏ ప్రభుత్వం కోర్టును కోరింది. దీన్ని బీజేపి తీవ్రంగా వ్యతిరేకించింది. కేసును తప్పుదోవ పట్టించేలా, తప్పును కప్పిపుచ్చుకునేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని విమర్శించింది. ఇప్పుడు కోర్టు తీర్పుతో కమలం నోటిలో వెలగపండు పడినట్లయింది. తన కింద ఉన్న నలుపు ఎరుగక.., ఎదుటి వారిపై విమర్శలు చేసింది. బొగ్గు మసిని యూపీఏకు పూసి కుర్చి ఎక్కిన్న బీజేపీ.., తమకు అంటుకున్న మసిని ఎలా తుడుచుకుంటుంది. ఇప్పుడు  ప్రజలకు ఏం సమాధానం చెప్తుంది.

పంజరంలో చిలకలా సీబీఐ

కేసు ధర్యాప్తును ప్రభావితం చేసేందుకు యూపీఏ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. తప్పును కప్పి పుచ్చుకునేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. చివరకు సుప్రీం కోర్టు.., సీబీఐ నిస్సహాయత పట్ల అసహనం వ్యక్తం చేసింది. సీబీఐ పంజరంలో చిలకలా మారిందనీ.., స్వేచ్చ కరువైందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు సంస్థ పనిలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని మొట్టి కాయలు వేసింది. అంతేకాకుండా సీబీఐకి ప్రత్యేక అధికారాలు, ప్రతిపత్తి కల్పించాలని ఆదేశించింది.

దోపిడిలో బ్రిటీషును మించిన దేశ నేతలు

వర్తకం కోసం భారత్ కు వచ్చి దేశాన్ని దోచుకున్నారు బ్రిటీషు పాలకులు. దేశ ప్రజల అమాయకత్వం, నాయకుల మద్య సమన్వయ లోపం, భేదాభిప్రాయాలు వారికి కలిసొచ్చాయి. రెండు వందల ఏళ్ళపాటు సహజవనరులు అన్నిటిని కొల్లగొట్టి.., సంపన్న భారతాన్ని.., సర్వ నాశనం చేశారు. చివరకు ప్రజా చైతన్యంతో వణుకు పుట్టి అర్ధరాత్రి దేశాన్ని వదిలి పారిపోయారు. దోపిడిలో మన పాలకులు బ్రిటీషును తలదన్నిపోయారు. నాటి పాలకులు నాయకత్వ లోపాన్ని ఆసరాగా చేసుకున్నారు. కాని ఇక్కడా అంతా కలిసి దోచుకున్నారు. ఏ ఒక్కరూ తక్కువని చెప్పలేము. బ్రిటీషు పాలకులు రెండు వందల ఏళ్ళలో వేల కోట్ల రూపాయల సంపద దోచుకుంటే.., మన నేతలు రెండు దశాబ్దాల్లోనే దాదాపు రెండు లక్షల కోట్లను దోచుకున్నారు. తల్లి పాలు తాగి.., రొమ్మునే అమ్ముకున్న ఘనులు దేశ నేతలు.

ఏడుపదుల వయస్సుకు దగ్గరవుతున్న స్వతంత్ర్య భారతం ఇవన్నీ చూస్తూ కూడా మౌనంగా కూర్చుంటుంది. తన బిడ్డలే కదా అని వీరిని క్షమిస్తే రేపు ఇంకొక తప్పు చేయటానికి ఏ మాత్రం వెనకాడరు. ఒకరిని మించి మరొకరు పోటి పడి తప్పు చేస్తారు. కాబట్టి 2లక్షల కోట్లు తిన్న, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని కోరుకుందాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coal scam  supreme court  cbi  latest news  

Other Articles