Mera bharat mahan

indian independance, indian independance movement, indian history, indian freedom fight, freedom fighters, mahatma gandhi, nehru, alluri sitarama raju, netaji, subash chandra bose latest news, modi, kcr, chandra babu naidu

indian independance day history : importance of indian independance

మేరా భారత్ మహాన్

Posted: 08/14/2014 05:30 PM IST
Mera bharat mahan

భారత దేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. మనమిప్పుడు పీలుస్తున్న స్వేచ్చా వాయువులు ఎందరో మహనీయుల త్యాగఫలం. వేలమంది బలిదానాల ప్రతిరూపమే నేటి స్వతంత్ర్య భారతం. గాంధీజి, నేతాజి, వల్లబాయ్ పటేల్, నెహ్రూ, అల్లూరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహనీయులు. వారు సలిపిన నిర్విరామ పోరాటమే ఇవాళ మనం అనుభవిస్తున్న స్వేచ్చా, స్వాతంత్ర్యాలు. 68వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపకుంటున్న వేళ భారతీయులందరికీ శుభాకాంక్షలు. యావత్ జాతి పండగ జరుపుకుంటున్న వేళ నాటి పోరాట యోధులను ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

చింతపండు అమ్ముకోవటానికి వచ్చిన బ్రిటీషు వారు మన అమాయకత్వాన్ని చూసి అధికారం చెలాయించే స్థాయికి వచ్చారు. మన సంపదను కొల్లగొట్టి, పాతాళంలోకి తొక్కారు. బ్రిటీషు పాలనలోని భారత దేశాన్ని ఊహించుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. వారి ఆకృత్యాలను తలుచుకుంటేనే రోమాలు నిక్కబొడుస్తాయి. వ్యాపారం కోసమని వచ్చి చివరకు మనమీదే అజమాయిషీ చేసే స్థాయికి వారు ఎదిగారు. బ్రిటీషు వారు చెప్పిందే వేదం..,చేసిందే శాసనం. ఒక్కమాటలో చెప్పాలంటే వారు ఆడిందే ఆట.. పాడిందే పాట. బారత దేశాన్ని దోచుకోవటానికి పరిపాలన పేరుతో గవర్నర్లు, లార్డులు, కలెక్టర్లు వంటి పోస్టులను ఏర్పాటు చేశారు. రెండువందల ఏళ్ళపాటు సాగిన పాలనలో అడుగడుగునా అవమానాలు, అన్యాయాలు, అడ్డుకోలేని ఆగడాలు. దేశంలో అప్పటికే పాలన చేస్తున్న సంస్థానాలను భయపెట్టి, ప్రలోభపెట్టి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. విభజించి పాలించు సిధ్దాంతంతో దేశాన్ని బలహీన పర్చి పూర్తిగా హస్తగతం చేసుకున్నారు.

ఈ ఆగడాలను భరించలేక ఒక ఉద్యమం మొదలయింది. అదే భారత స్వాతంత్ర్య ఉద్యమం. బ్రతుకు తెరువుకు ఇక్కడకు వచ్చి చివరికి భారతంపై పెత్తనం చెలాయిస్తున్న దుష్ట పాలకులపై దేశం తిరగబడింది. అలా  మొదలయిందే 1857 సిపాయిల తిరుగుబాటు ఉద్యమం. భారత తొలి స్వతంత్ర్య సంగ్రామం. ఆ తర్వాత అనేక రూపాల్లో.., వివిధ మార్గాల్లో సాగిన ఉద్యమం చివరకు గాంధీ చూపిన అహింసా మార్గంలో స్వాతంత్ర్యం సాధించింది. భారతీయుల అసమాన పోరుకు బ్రిటీషు తలవంచింది. రవి అస్తమించని సామ్రాజ్యం ఆగస్టు 15 1947న పడమరకు దిక్కును చూసింది. మమ్మల్ని క్షమించండి అంటూ దేశాన్ని వదలి వెళ్లిపోయారు తెల్ల దొరలు. ఇందుకు ఎందరో జీవితాలను త్యాగం చేశారు.

అటువంటి అమరుల త్యాగఫలం ఇవాళ ఏమవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అభివృద్ధిలో ఎందుకు వెనకచూపులు చూస్తోంది. ఇందుకు ప్రధాన కారణం అవినీతి, అధికార దాహం, స్వార్ధం, కుల, మత రాజకీయాలు. బ్రిటీషు వారు పాటించిన విభజించి పాలించు అనే సిద్ధాంతాన్నే మన నేతలు కూడా తు.చ. తప్పక కొనసాగిస్తున్నారు. కులం, మతం, బాష, ప్రాంతం పేరుతో రాజకీయాలు చేసి ప్రజల మద్య చిచ్చు పెడుతున్నారు. మన దేశం విశాల ఆలోచన నుంచి నా వర్గం, నా కులం, నా ప్రాంతం అనే స్వార్ధపు గోడలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎందుకు వచ్చిందా ఈ స్వతంత్ర్యం అని భరతమాత కుమిలిపోతుంది. తన బిడ్డలే తనపై కుట్రలు చేస్తుంటే చూసి తట్టుకోలేకపోతుంది. అరవై ఎనమిది ఏళ్ళ స్వతంత్ర్య దేశంలో వెనక్కి తిరిగి చూసుకుంటే లెక్కలు తేలని స్కాములు, ప్రజా ధనాన్ని దోచుకున్న నాయకులే మనకు కన్పిస్తున్నారు తప్ప.., ప్రజలకు సేవ చేసే వారి కోసం బూతద్దాలను వాడాల్సి వస్తోంది. ఈ దుస్థితి ఇకనైనా పోవాలి. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాలయినా ప్రజల గురించి ఆలోచించాలి. స్వార్థ ప్రయోజనాలు పక్కన బెట్టి, సమాజ హితం గురించి దృష్టి పెడితే సువర్ణ భారత్ తొందర్లోనే సాక్షాత్కారమవుతుంది. జై హింద్.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian independance  freedom fight  68th independance celebrations  latest news  

Other Articles