రేపు జనవరి 26 రిపబ్లిక్ డే. భారతదేశానికి 1947 లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సంపూర్ణంగా పార్లమెంటులో చర్చించి, మార్పులూ చేర్పులూ చేసి, తుదకు పూర్ణ స్వరూపాన్ని ఆమోదించిన రాజ్యాంగాన్ని అమలుపరచిన రోజు జనవరి 26, 1950. అందుకే భారతదేశ స్వాతంత్రదినోత్సవాన్ని ఆగస్ట్ 15 న చేసుకున్నా, గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26 న చేసుకుంటున్నాం. ఈ రెండు రోజులూ, అక్టోబర్ 2న భారత పిత మహాత్మా గాంధీ జయంతి, ఈ మూడు రోజులను జాతీయ శలవుదినాలుగా పాటిస్తున్నాం.
జనవరి 26కి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే స్వతంత్రం రాకముందునుంచే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇతర పార్టీలు కూడా జనవరి 26 ని స్వాతంత్ర దినంగా వేడుక చేసుకునేవారు. అందుకే దేశం కోసం అసువులు బాసిన అమరవీరులను గౌరవిస్తూ 1949 వసంవత్సరంలో జనవరి 26నే కొత్త రాజ్యాంగాన్ని పార్లమెంటులో ఆమోదించటం జరిగింది. కానీ ఎన్నికలు జరిగి 1950 సంవత్సరంలో జనవరి 21 న రాజేంద్రప్రసాద్ భారత రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత, 1950 జనవరి 26 నుంచి అది సంపూర్ణంగా అమలులోకి వచ్చింది.
1947 ఆగస్ట్ లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, కలోనియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టంలో కొన్ని మార్పులు చేసిన ప్రభుత్వ విధివిధానాలుండేవి. జార్జ్ 6 దేశానికి ప్రధానిగానూ, ఎర్ల్ మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్ గానూ వ్యవహరించేవారు. ఆగస్ట్ 28, 1947న భీమ్ రావ్ రామ్జీ అంబేద్కర్ నాయకత్వంలో భారతదేశానికో శాశ్వత రాజ్యాంగ ముసాయిదా రూపొందించటానికి ఒక బృందం ఏర్పడింది. 1947 నుంచి 1950 వరకూ 166 రోజుల పార్లమెంట్ సెషన్స్ నడిచాయి. వాటిలో సామాన్య ప్రజలకు కూడా ప్రవేశముండేది. చర్చలు, వాదోపవాదాలు జరిగి మార్పులూ చేర్పులూ చేసిన తర్వాత చివరకు 1950 లో జనవరి 26 నుంచి అది అమలులోకి వచ్చింది.
మన రాజ్యాంగం లో ఉన్న మరో విశేషమేమిటంటే, కాలానుగుణంగా అవసరమైనప్పడు అందులో సవరణలు చెయ్యటానికి కూడా సులభమైన విధానముండటం. ఫెడరల్ సిస్టమ్ లో నడిచే భారత ప్రభుత్వ విధానం బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూడా ఆశ్చర్యపరచింది. 1955 నుండి 1957 వరకూ యుకె ప్రధాన మంత్రిగా వ్యవహరించిన సర్ ఆంథోనీ ఇడెన్, ఇంత పెద్ద దేశంలో ఈ విధంగా గణతంత్ర విధానాన్ని రూపొందించి అమలు పరచటం నిజంగా సాహసోపేతమైన విషయమేనని అన్నారు. అందునా వాళ్ళ దేశంలోని రాజ్యాంగాన్ని ఎత్తిరాసి అటూ ఇటూ ఏదో మార్పులు చేసి తీసుకోకుండా ఎంతో ఆలోచించి మేధస్సుని ఉపయోగించి తయారుచేసుకున్నారని ఆయన శ్లాఘించారు.
గణతంత్ర దినోత్సవాన్ని దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది.
రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ గుండా రాజ్ పథ్ లో పరేడ్ జరుగుతుంది. దీన్ని తిలకించటానికి రాష్ట్రపతి ముఖ్య అతిథితో కలిసి రాష్ట్రపతి భవన్ నుంచి గుర్రాల బగ్గీలో ప్రత్యేకంగా ఏర్పరచిన వేదిక వరకూ వస్తారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశానికి చెందిన ప్రధాన హోదాలో ఉన్నవారిని ముఖ్య అతిధిగా ఆహ్వానిస్తారు.
ముందుగా రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేయగా జాతీయ గీతం ఆలపించబడుతుంది. తర్వాత 21 గన్ సెల్యూట్ జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి, యోగ్యులైనవారికి ప్రతి సంవత్సరం జరిగే జాతీయ పురస్కారాలైన అశోక చక్ర, కీర్తి చక్ర ప్రదానం చేస్తారు. వాటిని బహూకరించే సమయంలో వారి సాహస కృత్యాలను కీర్తిస్తూ వారిని అందరికీ పరిచయం చేస్తారు.
తర్వాత పరేడ్ ప్రారంభమౌతుంది. ఆ పరేడ్ లో రక్షణ శాఖలోని మూడు అంగాలైన మిలిటరి, నేవీ, ఎయిర్ ఫోర్స్ వారు తమ తమ నవీన ఆయుధ సంపత్తిని కూడా ప్రదర్శిస్తూ బ్యాండ్ తో కలిసి మార్చ్ చేసుకుంటూ వచ్చి రాష్ట్రపతికి అభివాదం చేస్తారు. దేశ రక్షణ శాఖకంతటికీ రాష్ట్రపతి కమాండర్ ఇన్ ఛీఫ్ కాబట్టి రక్షణ శాఖల నుంచి అభివాదాన్ని స్వీకరిస్తారు.
పరేడ్ లో దేశరక్షణ శాఖ వెనకాలే సాంస్కృతిక కార్యక్రమాలతో వివిధ రాష్ట్రాల నుంచి బృందాలు వస్తాయి. ఆ సంవత్సరం పురస్కారాలను గ్రహించిన సాహస బాలురు ఏనుగుల మీద పరేడ్ లో పాల్గొంటారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారిచేత ఫ్లైపాస్ట్ విన్యాసాలు జరుగుతాయి. రక్షణ శాఖలో పనిచేసి పదవీ విరమణ చేసిన వయోవృద్ధులు కూడా పరేడ్ లో పాల్గొని రాష్ట్రపతికి అభివాదం చెయ్యటం విశేషం. విద్యార్థులు, ఎన్ సి సి కేడెట్ లు ప్రదర్శనలు చేస్తారు. వివిధ రాష్ట్రాల నుంచీ వారి వారి విశేషతలను ప్రదర్శించే అలంకరణలతో ఆకర్షణీయమైన రథాలు చూపరులను ఆకర్షిస్తాయి.
విభిన్న శైలి, నమ్మకాలు, ఆచరణలు ఉన్న దేశం లోని నలుమూలలనుంచీ వచ్చి అందరూ కలిసి భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించి ఆనందంగా, దేశభక్తితో వేడుకలు చేసుకోవటంతో రిపబ్లిక్ డే సుసంపన్నమౌతుంది. దానివలన మూడు నేషనల్ హాలిడేస్ లో రిపబ్లిక్ డే ప్రత్యేకతను సంతరించుకుంటుంది.
ఈ వేడుకను రాష్ట్రాల్లో కూడా చేసుకుంటారు. రాష్ట్ర గవర్నర్ గౌరవవందనాన్ని స్వీకరిస్తారు. ఏ కారణం చేతనైనా గవర్నర్ రాలేని సమయంలో ముఖ్యమంత్రి వందనాన్ని స్వీకరిస్తారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్లే కాకుండా సామాన్య ప్రజానీకంలో కూడా సాహసాన్ని చూపి సమాజానికి మంచి చేసినవారిని కూడా రాష్ట్రపతి పతకం (మెడల్) ప్రదానం చేసి సత్కరిస్తారు.
బీటింగ్ రిట్రీట్
చాలామంది ఈ వేడుకను తిలకించరు. దానికి కారణం ఇది జనవరి 29 సాయంత్రం జరుగుతుంది. ఆరోజు శలవు దినం కాదు. పైగా సాయంత్రం సమయమవటంతో రోజువారీ పనుల్లో వ్యస్తులైవుంటారు. అన్నిటికన్నా మించి బీటింగ్ రిట్రీట్ గొప్పదనం చాలా మందికి తెలియకపోవటం.
రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్ పథ్ వచ్చేటప్పుడు ఎత్తుగా ఉన్న స్థలాన్ని రైజినా హిల్స్ అంటారు. దాని ఎదురుగా ఉన్నది విజయ్ చౌక్. ఈ వేడుక జరిగే స్థలమదే. ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి తన అంగరక్షకులతో వస్తారు. మూడు రక్షక శాఖలూ రాష్ట్రపతికి అభివందనం చేస్తారు, జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఇది పూర్తిగా రక్షకదళాలు ప్రదర్శించే వేడుకే. మూడు దళాలూ వారి వారి బ్యాండ్ లనుపయోగించి దేశభక్తి గీతాలను వాటి మీద వినిపిస్తారు. చివరగా సారే జహా సే అచ్ఛా... గీతంతో సంపూర్ణమైతుంది.
ఈ వాయిద్యాలు, వాటి ప్రదర్శనలు చూడదగ్గవి. వేడుక మొత్తంలో కొట్టొచ్చినట్టుగా కనిపించేది వారి క్రమశిక్షణ. మొదట్లో రైజినా హిల్స్ మీద రెండు వైపులా ఒంటెలు వచ్చి నిలబడతాయి. గుర్రాల మీద అంగరక్షకులు వస్తారు. గుర్రాలు కానీ ఒంటెలు కానీ తల కూడా తిప్పకుండా ఎక్కడ నిలబెట్టినవి అక్కడే శిలాప్రతిమల్లా చివరివరకూ నిలుచుని కనిపిస్తాయి. వాటికిచ్చిన శిక్షణ అలాంటిది.
బీటింగ్ రిట్రీట్ అంతంలో, విద్యుద్దీపాలతో అలంకరించిన రాష్ట్రపతి భవన్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, పార్లమెంట్ భవన్లు ఒక్కసారిగా వెలుగులు నింపుతాయి. చూడచక్కని దృశ్యం, విన సొంపైన బ్యాండ్. అన్నిటినీ మించిన క్రమశిక్షణా ప్రదర్శన. ఇవీ బీటింగ్ రిట్రీట్ విశేషాలు.
ప్రతి సంవత్సరం విదేశ ముఖ్య అతిథులు గణతంత్ర దినోత్సవంలో పాల్గొంటారు. 1950 లో మొదటి సారిగా వచ్చిన విదేశ అతిథి ఇండొనేషియా అధ్యక్షుడు సుకర్నో. పోయిన సంవత్సరం కూడా ఇండోనేషియా అధ్యక్షులే, సుసిలో బాంబాంగ్ యుధోయోనో వచ్చారు. ఈ సంవత్సరం అతిథి థాయ్ ల్యాండ్ అధ్యక్షురాలు ఇంగ్లూక్ షినావాత్రా.
రిపబ్లిక్ డే రోజున ఉదయాన్నే ప్రధాన మంత్రి ఇండియా గేట్ దగ్గరున్న అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించటం కూడా ఆనవాయితీగా వస్తోంది. ఇండియా గేట్ అమరవీరులకు ప్రతీకగా దాని మీద వారి పేర్లు చెక్కబడి ఉంటాయి. మధ్యలో నిరంతర ప్రజ్వలనలో జ్యోతి ఉంటుంది.
భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, వేషభాషలూ ఉన్న భారతదేశ ప్రజలంతా కలిసి అత్యంత వైభవంగా చేసుకునే వేడుక ఇదొక్కటే.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more