తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పనిచేస్తానని ఆమధ్య (సెప్టెంబర్ లో) నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తెదేపా తరఫున పోటీ చేస్తానని కూడా అన్నారు. ఈ ప్రకటన చాలా సామాన్యంగా సాధారణ పరిస్థితుల్లో చేసినా, తెలుగుదేశం పార్టీలో ఉత్సాహాన్ని నింపింది. బాలయ్యబాబు క్రియాశీల ప్రమేయం పార్టీకి బలం చేకూరుస్తుందని పార్టీ నాయకులు, సభ్యులూ ఆశాభావాన్ని, సంతోషాన్ని వెలిబుచ్చారు. పార్టీలో పనిచేస్తానని చెప్పినా, ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన లేదని కూడా బాలకృష్ణ స్పష్టం చేసారు. తన తండ్రి ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీని నిలబెట్టి, పటిష్టం చేసి, ముందుకు తీసుకునిపోవటానికి తన శాయశక్తులా కృషి చేస్తానని ఆయన అన్నారు.
నటరత్న ఎన్టీఆర్ హయాంలో పార్టీలో ఉన్న సినీ మెరుపులు ఆతర్వాత కరువైనా, ప్రాదేశిక పార్టీ అవటంతోనూ, పగ్గాలు చేపట్టిన చంద్రబాబు వ్యవహార దక్షతతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టటమే కాకుండా రాష్ట్రంలో సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి సాధించటం వలన నిలదొక్కుకుంది. కానీ మెగా స్టార్ చిరంజీవి తన సొంత పార్టీ పెట్టి ప్రజలలోకి వెళ్ళటం చూసిని తెదేపాకు మళ్ళీ ఒక సినిమా మెరుపు పార్టీలో రంగులు వెదజల్లుతే బావుంటుందని అనిపించింది. జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగం వహించటం చూసి మరోసారి తెదేపాలో వెలుగులు చిమ్మాయి కానీ, కారణాంతరాల వలన నందమూరి హరికృష్ణతో పొసగలేదు. దానితో జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీకి దూరమయ్యారు. కొన్నాళ్ళు సినీ నటి రోజా పార్టీలో పనిచేసినా, ఆమెకున్న కొద్దిపాటి సినీ గ్లామరు పెద్దగా ఉపయోగపడలేదు.
ఎన్టీఆర్ తర్వాత ఆ కుటుంబంలో మళ్ళీ అంత ఎత్తున అభిమాన గణాన్ని సంపాదించుకున్న బాలకృష్ణ మరోసారి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారనే ఆశ పార్టీలో అందరిలోనూ కలగటానికి కారణం, అంతకు ముందెప్పుడూ రాజకీయాలలో ఆసక్తి కనబరచని బాలయ్య ఒక్కసారిగా తాను పార్టీలో క్రియాశీల రాజకీయాల్లో పనిచేస్తానని చెప్పటమే. దానికి తగ్గట్టుగానే ఆయన వాస్తు దోషాలను సవరించటానికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి పోయి స్వయంగా కొన్ని సూచనలు చేసి మార్పులు చేయించటం, బాలయ్య రాజకీయాల్లోకి వస్తున్నారనే విషయాన్ని ధృవపరచింది. బాలకృష్ణ తో చంద్రబాబుకి పొసగకపోవటమనేది ఉండదు. ఎందుకంటే బాలయ్య కూతురిని చంద్రబాబు కుమారుడు లోకేష్ కి ఇవ్వటంతో ఇద్దరూ వియ్యంకులయ్యారు కాబట్టి.
ఇటు కూతురినిచ్చిన కుటుంబానికి మేలు చెయ్యాలనే ఉద్దేశ్యంతో పాటు, ప్రతిష్టాత్మకంగా ప్రాదేశిక పార్టీని స్థాపించి, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి, అత్యధిక మెజారిటీతో చరిత్రను సృష్టిస్తూ రాష్ట్ర అధికార పగ్గాలను అందుకున్న తన తండ్రి దివంగత ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలవాలన్నా ఆ పార్టీని నిలబెట్టాల్సిందే. ఒక పక్క తెలంగాణా ఉద్యమం, మరో పక్క వైయస్ జగన్ కొత్త పార్టీని పెట్టటం వలన ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితి పాలకపక్షమైన కాంగ్రెస్ పార్టీకే కాకుండా ప్రధాన ప్రతిపక్షమైన తెదేపాకు కూడా తాకింది.
2014లో జరిగే సాధారణ ఎన్నికలకల్లా బలం పుంజుకోవటానికి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్రలు, రైతు సమస్యలను చేపట్టటం, అవిశ్వాస తీర్మానంలాంటివి పెట్టటం ఎలాగూ చేస్తునే ఉన్నారు. కానీ ఈ సమయంలో చంద్రబాబుకి తోడుగా పార్టీ పగ్గాలను పట్టుకోవటమే కాకుండా, ఒక పేరున్న కళాకారుడిగా పార్టీకి కళ తీసుకునిరావటమే కాకుండా, నాయకత్వం కోసం పోటీ పడని వ్యక్తిగా చేయూత నివ్వటానికి, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా అభిమానులున్న నందమూరి బాలకృష్ణకంటే అర్హులు మరెవరుంటారు.
పార్టీలోని అంతర్గత పోరు, బయట ఇతర ప్రతిపక్షాలతోనూ, పాలకవర్గంతోనూ శీతల సమరం సాగుతున్న తరుణంలో కడప, పులివెందుల ఎన్నికల సందర్భంగా మరోసారి రాజకీయ రంగంలో తెరమీదకు వచ్చిన తెలుగుదేశం పార్టీ బాహాటంగానే అధికార పక్షంతోనూ పోరు సలిపింది. ఒక పక్క జగన్, మరో పక్క అధికార పక్షం, తెలంగాణా ఉద్యమం వలన సభ్యులలో ఏర్పడుతున్న చీలికలు ఈ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తెదేపా దీపపు వెలుగులకు పూర్తిగా ఆగిపోకుండా అడ్డుపెట్టి కాపాడే చేతులు కావలిసి వచ్చినపుడు బాలకృష్ణ ఆ బాధ్యతను వహించటం పార్టీలో నూతనోత్సాహాన్ని నింపుతోంది.
దానికి తోడు, బాలకృష్ణ బహిరంగ ప్రకటన చేసిన దగ్గర్నుంచే పార్టీలో మార్పులు కనిపిస్తున్నాయి. ఈమధ్యకాలంలో లేనివిధంగా తెదేపా ప్రజల్లోకి పోవటం జరిగింది. వాస్తు మార్పులు చేస్తూనే చంద్రబాబు మీద దర్యాప్తుల ఉధృతం తగ్గిపోయింది. తెలంగాణా ఆందోళన మూలంగా ఆ ప్రాంతమంతా తెరాస కు తప్ప ఇతర పార్టీలకు ప్రవేశం లేదని ప్రకటనలిస్తూ ఇతర నాయకులను రాకుండా చేసి తమ ఉపన్యాసాలకు ఎదురు చెప్పే అవకాశమే లేకుండా చేసుకున్న తరుణంలో ఎన్నికల సమయంలో కానీ మరే సందర్భంలోనూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చొరబడకుండా అభేద్యమైన కంటుకోటలా చేసుకునివున్న సమయంలో, ఉత్తర తెలంగాణా ప్రాంతమైన అదిలాబాద్ జిల్లాలో రైతు పోరు బాటను విజయవంతంగా ముగించుకుని రావటం కూడా జరిగింది. రాబోయే ఎన్నికలలో ఘన విజయం సాధిస్తామన్న దానికి ఇవన్నీ సూచనలేనని పార్టీలోనే కాకుండా రాజకీయ వర్గాల్లో అందరూ అనుకుంటున్నారు.
ఈ మార్పుకి కారణం బాలకృష్ణ ప్రవేశమేనని గట్టిగా నమ్ముతున్న పార్టీ శ్రేణులు అతనికి పార్టీ అదనపు అధ్యక్షుడుగానో ఉపాధ్యక్షుడుగానో పట్టం కడితే ఇంకా బావుంటుందని భావిస్తున్నారు. బాలకృష్ణ వైఖరి కూడా సర్వసమ్మతంగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలివిడిగా ఉండటమే కాకుండా నందమూరి కుటుంబ సభ్యులను, చంద్రబాబుని కూడా విమర్శించే లక్ష్మీ పార్వతి సహితం బాలయ్యను ఏమీ అనకపోవటం, ఎక్కడా ఎటువంటి వివాదాల్లోకి పోకపోవటం బాలయ్యకు రాజకీయ నాయకుడికి ఉండవలసిన అదనపు అర్హతలే.
మొత్తం మీద బాలకృష్ణ రాకతో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందనే అనిపిస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more