సౌమ్యుడైన కొడుకుగా, అండగా నిలిచే అన్నగా, ఉత్తముడైన తమ్ముడిగా, పవర్‌ఫుల్ పోలీసాఫీర్‌గా... పలు రకాల పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న నటుడు రవిప్రకాశ్. అందరూ డాక్టర్ కాబోయి యాక్టరయ్యానంటారు... కానీ డాక్టర్ అయ్యాక యాక్టరైన రవిప్రకాశ్ తన మనసులోని మాటలు. మీ బ్యాక్‌గ్రౌండ్ గురించి...? నాన్న విజయవాడలో బిజినెస్‌మ్యాన్. నేను అక్కడే పుట్టాను కానీ పెరిగింది, చదివింది అంతా వైజాగ్‌లో. ఇంటర్ పూర్తయ్యాక మాస్కో (రష్యా)లో ఎంబీబీఎస్ చేశాను. డాక్టర్ అయ్యుండి యాక్టర్ ఎందుకయ్యారు? నటన మీద ఇష్టంతో సెలవుల్లో వైజాగ్ వచ్చినప్పుడు సత్యానంద్‌గారి దగ్గర యాక్టింగ్ గురించి తెలుసుకున్నాను. ‘శుభవేళ’ తీస్తున్నప్పుడు కొత్త నటుడి కోసం సత్యానంద్‌ని సంప్రదిస్తే, ఆయన నా ఫొటోలు ఇచ్చారట! దాంతో ఎంబీబీఎస్ పూర్తి చేసి నేను హైదరాబాద్‌కి రావడం, హీరోగా సెలెక్ట్ కావడం, షూటింగ్ మొదలైపోవడం... వెంటవెంటనే జరిగిపోయింది. ‘శుభవేళ’ తర్వాత గ్యాప్ ఎందుకొచ్చింది? హౌస్ సర్జెన్సీ చేయడం వల్ల ఓ సంవత్సరం గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఆరు నెలలపాటు మళ్లీ అవకాశాల కోసం ప్రయత్నిస్తే ‘ఈశ్వర్’ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత సీతయ్య, ఘర్షణ చేశాను. ‘ఘర్షణ’తో కెరీర్ మలుపు తిరిగింది. మళ్లీ హీరోగా ఎందుకు చాన్స్ రాలేదు? ఏడాదిన్నర గ్యాప్‌లో నాకు అర్థమైనదేంటంటే, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కంటిన్యుయస్‌గా కనబడుతూ ఉండాలి. అలా చేయకపోవడం వల్లే కొన్ని అవకాశాలు మిస్సయ్యానని అనుకుంటున్నాను. అలాగే ఏ బ్యాక్‌గ్రౌండ్ లేని నాలాంటివాళ్లు హీరోయే అవుతానంటే కుదరదు. వచ్చిన పాత్రనల్లా చేసుకుంటూ పోవాలి. ముందు మంచి నటుడిగా నిరూపించుకోవాలి. హీరోగా వచ్చి సహనటుడిగా చేస్తున్నందుకు ఫీలవుతున్నారా? అందుకు బాధపడటం లేదు. ఇంత కాలంగా నటిస్తున్నా, నా టాలెంట్‌కి సరి పోయే పాత్రలు రావడం లేదని బాధపడుతున్నాను. నేను బాగా నటించగలను కదా, ఇంకా మంచి అవకాశాలు ఇవ్వొచ్చు కదా అనిపిస్తుంది. కానీ ఎందుకు రావడం లేదో! మీకు బాగా పేరు తెచ్చిన పాత్ర ? ‘ఘర్షణ’లో పోలీస్ పాత్ర నాకు బాగా పేరు తెచ్చింది. వేదంలో చేసిన పాత్ర నటుడిగా చాలా సంతృప్తినిచ్చింది. అత్యంత సంతోషపెట్టిన ప్రశంస...? ఒక్కోసారి డీజీపీ లాంటి హైరేంజ్ ఆఫీసర్స్‌ని కలిసినప్పుడు ‘మీరు పోలీసాఫీసర్‌గా బాగా సూటవుతారు, అసలైన పోలీసులాగే ఉంటారు’ అంటూ ఉంటారు. వాళ్లలా అన్నప్పుడు చాలా ఆనందపడుతూ ఉంటాను. నటుడిగా మీ రోల్ మోడల్ ఎవరు? ఎన్టీఆర్ గారు (సీనియర్). క్రమశిక్షణ, కమిట్‌మెంట్ ఆయన్ని చూసే నేర్చుకోవాలి. మీలో మీకు నచ్చేది/నచ్చనిది...? నచ్చేదంటే... ఏదైనా అనుకుంటే సాధించేవరకూ వదిలిపెట్టను. అలాగే తిండి, బట్టలు దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ సింపుల్‌గానే ఉండటానికి ఇష్టపడతాను. ఇక నచ్చనిది... నాకు రిలేషన్స్ మెయింటెయిన్ చేయడం రాదు. ఎవరి దగ్గరకైనా ఎక్కువసార్లు వెళ్లాలన్నా, ఏదైనా అడగాలన్నా వాళ్లను విసిగిస్తున్నానని అనుకుంటారేమో అని భయపడుతుంటాను. నటన కాకుండా...?పుస్తకాలు బాగా చదువుతాను. ‘ద హీరో విత్ థౌజండ్ ఫేసెస్’ నాకిష్టమైన పుస్తకం. రొమాంటిక్ సినిమాలు చూస్తుంటాను. పెళ్లి, పిల్లలు...? నా భార్య పేరు మాధురి, చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ డాక్టర్. మాకు ఒక బాబు... వాడికి నాలుగేళ్లు. మీ నటన చూసి వాళ్లెలా ఫీలవుతారు? నా భార్య చాలా ప్రోత్సహిస్తుంది. ఇక మావాడు ఇప్పుడిప్పుడే సినిమాల్లో నన్ను పోల్చుకుంటున్నాడు. నేను చచ్చిపోయే సీన్ ఉంటే ‘డాడీ, నువ్వు చచ్చిపోయావు’ అంటాడు. మొదట్లో భయపడేవాడు కానీ, ఇప్పుడు వాడికీ అలవాటైపోయింది. మీ డ్రీమ్ రోల్...? నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేయడం ఇష్టం. మన ప్రతిభ పూర్తిస్థాయిలో బయటకు రావాలంటే అలాంటి పాత్రలే చేయాలి. భవిష్యత్ ప్రణాళికలు...? త్రివిక్రమ్, క్రిష్‌ల సినిమాలు, విష్ణు నటిస్తున్న సినిమాతో పాటు, సూర్య చేస్తున్న సినిమా, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో జీవా నటిస్తోన్న చిత్రాల్లో కూడా నటిస్తున్నాను. మరిన్ని వైవిధ్యమైన పాత్రలు చేసి, రవిప్రకాశ్ అనే మంచి నటుడు ఉండేవాడు అని తర్వాతి తరాల వారు చెప్పుకునేంతగా ఎదగాలన్నదే నా లక్ష్యం.
‘ఈశ్వర్’ సినిమా షూటింగప్పుడు ఓ ఫైట్ సీన్ చేశాను. షాట్ పూర్తి కాగానే బాగా చేశానని అందరూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. చాలా సంతోషపడ్డాను. అలాగే స్టార్ క్రికెట్ జరుగుతున్నప్పుడు నేను అందరికంటే వెనక నిలబడ్డాను. చిరంజీవిగారు నన్ను దాటుకుంటూ ముందుకు వెళ్లిపోయి, మళ్లీ వెనక్కి వచ్చారు. నా భుజం తట్టి, ‘వేదం చూశానమ్మా బాగా చేశావు’ అన్నారు. అది ఎప్పటికీ మర్చిపోలేను.
|