Director murugadoss role model real hero his father

Director Murugadoss role model real hero his father, Murugadoss movie successful movie Tupakki, Tupakki remake in Hindi Holiday

Director Murugadoss role model real hero his father

దర్శకుడు మురుగదాస్ రియల్ హీరో ఆయన ఇంట్లోనే!

Posted: 06/21/2014 10:20 AM IST
Director murugadoss role model real hero his father

దర్శకుడు మురుగదాస్ రియల్ హీరో ఆయన ఇంట్లోనే!

"నాకు ఇష్టమైన తెరమీది హీరోలు కమలహాసన్, రజనీ కాంత్, హాలీవుడ్ హీరో రాబర్ట్ డి నీరో కానీ నా జీవితంలో నాకు నిజమైన హీరో నా తండ్రి" అంటారు దర్శకుడు మురుగదాస్.  తనకి జన్మనిచ్చి, ఇంటిపేరిచ్చిన తన తండ్రిని మనసులో ఉన్నత పీఠం మీద ప్రతిష్టించిన మురుగదాస్ ఆయనే తనకి ఆదర్శప్రాయులంటారు.  కానీ ఆయన బాధల్లా ఒకటే.  దర్శకుడిగా పేరు తెచ్చుకోవటమే కాక తనదంటూ సంపాదన సమకూరి ఆర్థిక స్వాతంత్రం వచ్చే సమయానికి తండ్రి ఈ లోకంలో లేకపోవటం! 

tupaki-movie

తమిళ్ లో సూపర్ హిట్ మూవీ "తుపాకి" రిమేక్ హిందీలో "హాలీడే" పేరుతో చేస్తున్న దర్శకుడు మురుగదాస్ చెన్నై కి 200 కి.మీ. దూరంలో ఉన్న కల్లాకురిచి అనే కుగ్రామం నుండి వచ్చారు.  ఆ గ్రామంలో మరే సదుపాయాలూ లేకపోయినా వినోదాన్ని కలిగించే ఏకైక సాధనంగా రెండు సినిమాహాళ్ళుండేవట.  వాటి ప్రభావం బాగా పడిన మురుగదాస్ తన 9 సంవత్సరాల ప్రాయంలోనే జీవితంలో సినిమా తీసి చూపించాలని నిర్ణయించుకున్నారట.  

తండ్రి ప్రోత్సాహం

ముందుగా చిన్న చిన్న కథలు రాసి పత్రికలకు ఇస్తే అవి అచ్చయ్యాయి.  అలా 23 కథలు రాసేటప్పటికి మురుగదాస్ కి రచయితగా మంచిపేరు రావటం జరిగి రాయటమనేది జీవితంలో ఒక పెద్ద ఆకర్షణగా తయారై వ్యసనంలా మారి ఆదే ఆయన లోకమైంది.  గ్రాడ్యుయేషన్ అవగానే సినిమా రంగంలో ప్రవేశించటం కోసం అడుగుపెట్టిన అతనికి సంపూర్ణమైన ప్రోత్సాహం, ఆర్థికంగా పూర్తి సహకారం లభించింది ఆయన తండ్రి నుంచే.  "నీ కలను సాకారం చేసుకో నేనున్నా" నంటూ గ్రామంలో పాత్రలమ్మే చిన్న దుకాణం నడుపుతున్న మురుగదాస్ తండ్రి మొత్తం ఐదుగురు సంతానం మీద నెలకి రూ.500/- ఖర్చు పెడితే అందులో మురుగదాస్ కే రూ.400/- పంపించేవారట.  ఎందుకంటే చెన్నై మహాపట్నంలో ఉండటం, సినిమారంగంలో పైకి ఎదగటానికి డబ్బు కావాలి కనుక! 

సినిమారంగంలో కృషి

అసిస్టెంట్ డైరెక్టర్ గా పని నేర్చుకుని 2001 లో అజిత్ కుమార్ తో ధీనా అనే సినిమాను తీసిన మురుగదాస్ కి మొదటి సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.  కానీ అందరి తండ్రులూ వాళ్ళ పిల్లలు మంచి చదువు చదువుకుని ఇంజినీరో డాక్టరో అవాలని కోరుకునే సమయంలో మురుగదాస్ ని సినిమాలు చూడనిచ్చి, కథలు రాయటానికి ప్రోత్సహించిన ఆయన తండ్రి 1997 లో చనిపోవటమే తనకి జీవితంలో పెద్ద లోటు అంటారాయన.  అంత ఆదరించిన తండ్రికి తన రాబడిలో ఒక కప్పు కాఫీ కూడా ఇవ్వలేకపోయానే అన్నదే తన ఆవేదన అంటారు మురుగదాస్.  వయసులో పెద్దవారైపోయి ఇల్లు సరిగ్గా గడపలేని స్థితిలో కూడా తన తండ్రి తనను మాత్రం, "ఇవ్వన్నీ మర్చపో నాయనా నువ్వు చెన్నైలో నీ లక్ష్యంలో ముందుకు పో" అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించిన తన తండ్రే తనకి నిజమైన హీరో అంటారందుకే! 

ధీనా తర్వాత ఆయనకి వెనక్కి తిరిగి చూడవలసిన పనిలేకుండా పోయింది.  హీరో సూర్య తో మురుగదాస్ తీసిన "గజని" సినిమాను కూడా హిందీలో అమీర్ ఖాన్ తో తీసి హిందీ సినిమారంగంలో కూడా పేరు తెచ్చుకున్నారాయన.

gajani

అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లలో తేడా

గజని లో అమీర్ ఖాన్ తో పనిచేసి హాలిడే లో అక్షయ్ కుమార్ తో పనిచేస్తున్న మురుగదాస్ ని ఇద్దరిలో తేడా ఏమిటని అడినప్పుడు, "ఇద్దరూ తమ పాత్రకు పూర్తి న్యాయం చెయ్యాలని కోరుకునేవారే కానీ అమీర్ ఖాన్ సీరియస్ గా తన పాత్రలోకి వెళ్ళిపోయి అది తప్ప వేరో లోకం లేదన్నట్లుగా 100 శాతం న్యాయం చెయ్యటానికి చూస్తారు.  అక్షయ్ కుమార్ కాస్త మధ్యలో రిలాక్సై సరదాగా ఉంటారు.  అంతే తేడా" అన్నారు.  

akshay-kumar

సమాజం మీద కోపం

మురుగదాస్ సినిమాలలో హింసాత్మక దృశ్యాలు ఎక్కువగా ఉంటాయి.  ఈవిషయంలో, మౌలికంగా తను యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారని, పైగా తనకి సమాజంలోని దుష్టతత్వం మీద చాలా కోపం ఉందని చెప్పిన మురుగదాస్ సమాజం మీద కోపం రావటానికి చిన్న చిన్న సంఘటనలే కారణమని అన్నారు.  ఉదాహరణకు మురుగదాస్ తండ్రి హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడుతున్నప్పుడు ఇక ఎంతో సేపు బ్రతకరని తెలిసిన డాక్టర్ చేసిన వ్యాఖ్య, అందుకు డ్యూటీలో ఉన్న నర్సు నవ్విన నవ్వు ఆయనకు ఎంతో కోపాన్ని తెప్పించాయట.  చనిపోతున్న మనిషి పట్ల ఎకసక్కాలాడుతున్న వాళ్ళ మీద వచ్చిన ఆగ్రహాన్ని ఆయన గబ్బర్ సినిమాలో చూపించారు.  తండ్రి చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ కోసం పోయినప్పుడు వాళ్ళు లంచాలు ఆశిస్తుంటే, "ఈ సర్టిఫికేట్ నాకు ఉద్యోగం ఇచ్చేదేమీ కాదు" అన్నారటాయన.  డబ్బులివ్వనందుకు సర్టిఫికేట్ పొందటానికి నెలరోజులు పట్టిందట. 

action-scene

తాను చెయ్యలేని పని హీరోలతో!

ఇలాంటి చేదు అనుభవాలతో సమాజంలోని కుళ్ళు, కుతంత్రాల మీద ఆగ్రహావేశాలున్న మురుగదాస్ వాళ్ళందరితో తాను పోరాడలేనని తెలుసు కాబట్టి ఆ పనిని తన హీరోల చేత చేయిస్తానంటున్నారు! 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles