Pandavula guttalu

pandavula guttalu, where is pandavula guttalu, how to reach pandavula guttalu, pandavula guttalu district, pandavula guttalu history, pandavula guttalu special story, pandavula guttalu warangal district, famous telangana tourist places

Pandavula guttalu. The Telangana region is believed to have been mentioned in the Mahabharata as the Telinga Kingdom

అమితాసక్తిని కలిగించే "పాండవుల గుట్టలు"

Posted: 12/27/2014 03:18 PM IST
Pandavula guttalu

పాండవుల గుట్టలు వరంగల్ జిల్లాకేంద్రానికి 50 కి.మీ. దూరంలో, వరంగల్-మహదేవ్ పూర్ రహదారిపై రేగొండ మండలం రావులపల్లె పరిసరాల్లో ఈ పాండవులగుట్టలున్నాయి. ఎక్కువ మట్టుకు సున్నపురాళ్ళతో, అవక్షేపశిలలతో ఏర్పడిన ఈ గుట్టల్లో పొరలు పొరలుగా ఒకదాని మీదొకటి పేర్చినట్టుగా అనేక శిలాకృతులు కన్పిస్తాయి. ఎత్తైన బండరాళ్ళ మధ్య లోతైన అగాధాలతో లోయలు, అడుగడుగునా అబ్బురపరిచేవిధంగా పడిగెలెత్తి నిల్చున్న కొండవాళ్ళు. ఆ కొండగోడలపై అపురూపమైన ప్రాచీన రాతిచిత్రాలు.

పాండవులగుట్టల్లో ఎదురుపాండవులు,గొంతెమ్మగుహ, పంచపాండవులు, పోతిరాజు చెలిమె, మేకలబండ, ముంగీసబండ, తుపాకులగుండు, యానాదుల గుహలు చూడాల్సిన ప్రదేశాలు. వాటిలో ఎదురుపాండవులు దానికి కుడిపక్కన వెనకవైపు గుహలు, గొంతెమ్మగుహ, పంచపాండవుల దొనెల్లో అద్భుతమైన శిలాశ్రయచిత్రాలున్నాయి. ప్రాక్ యుగం నుండి చారిత్రకయుగం దాకా వేయబడిన రాతిచిత్రాలెన్నో అప్పటి జీవనశైలీ వైవిధ్యాల్ని కనువిందు చేస్తున్నాయి. కొన్నిచోట్ల పాతబొమ్మల మీదనే కొత్తబొమ్మలు వేసిన జాడలగుపిస్తున్నాయి. ఆరుచోట్ల వున్న చిత్రిత శిలాశ్రయాల్లో అన్నిబొమ్మలు ముదురు ఎరుపురంగుతో చిత్రించబడ్డవే. మందమైన గీతలతో చదునైన పూతలతో గీయబడిన ఈ బొమ్మల్లో శాఖాహార, మాంసాహార జీవులు, మనుషుల బొమ్మలు వున్నాయి. వీటిలో జింకలు, చేపలు, మేకలు, కుక్కలు, ముళ్ళపందులు, కుందేళ్ళు, తాబేలు, పాము, చిలుక, సీతాకోకచిలుకలు, కొండెంగ, నెమలి, కప్ప,బల్లి, ఎలుగుబంటి, పెద్దపులులు, పండు, వలతో మనుషులు, పులి వంటి జంతువును చంపిన సరీసృపం వంటి పెద్ద జంతువు, కుందేళ్ళను తరుముతున్న కుక్కలు, కుక్కలు చుట్టి నిలుచున్న మనిషి, ఈనిన జింక, జింకపిల్లను నాకుతున్న దృశ్యాన్ని చూస్తున్న మనిషి, త్రిభుజాలు, త్రిశూలం, చుక్కల వంటి రేఖాకృతులు, కొన్ని శిథిలచిత్రాలు, ఇవేకాక గొంతెమ్మగుహలో చేతిగుర్తులు, యుద్ధం చేస్తున్న వీరుల బొమ్మ లున్నాయి. పంచపాండవుల గుహలో రంగులలో పంచపాండవులు, కుంతి, ద్రౌపది, ద్రుపదుడు, పాండవుల పెండ్లి, శేషశాయి, గణేశుడు, శివలింగం, ఆంజనేయుడు, బ్రహ్మ, సరస్వతుల చిత్రాలున్నయి.

ఈ బొమ్మలన్నింటిలో ఎదురు పాండవులనే కొండచరియలో వేసివున్న రాతిచిత్రాలు అతి పురాతనమైనవి, అపూర్వమైనవి. ఈ చిత్రాలొకచోట 6 అడుగుల కంటె ఎత్తుగా వున్నాయి. ఈ చిత్రాలు వేసిన తీరు, శైలి, మొరటుదనం, వాటిలోని జంతు జీవజాలం అన్నింటిని పరిశీలించి కాలానుశీలన చేస్తే ఇవి మనదేశంలోని మధ్యప్రదేశ్ బింబేట్కా గుహల్లోని రాతిచిత్రాల కన్నా ప్రాచీనమైనవని తెలుస్తుంది. ప్రపంచ వారసత్వ సంపద సంస్థ వారు చెప్తున్నవిధంగా బింబేట్కా చిత్రాలు 30 వేల యేళ్ళనాటివైతే మనపాండవుల గుట్టబొమ్మల్లో అశ్వికులు, యుద్ధ సన్నివేశాలు, ఆయుధాలు, వివిధ వాహనాలు, అలంకరణలు వంటి ఆధునికరూపాలేవీలేవు కనుక ఇవి వాటికన్నా ప్రాచీనకాలానికి చెందినవని రుజువవుతున్నది.ఒక్క పంచపాండవుల గుహల్లలో మాత్రమే వర్ణచిత్రాలున్నాయి.(అవి 12, 13 శతాబ్దాల నాటివిగా పురాశాఖ వారు అనుమానిస్తున్నారు.) భారతదేశంలో దాదాపు 2,500 చిత్రిత శిలాశ్రయాలున్న 400ల స్థావరాలు 100 శిలాచిత్రలేఖన మండలాల్లో కన్పిస్తున్నాయి. తెలుగునాట 28 చోట్ల, తెలంగాణాలో 14 తావుల్లో ఈ రాతిచిత్రాలున్నాయి. పాండవుల గుట్టల్లోని చిత్రాలు అంత్యప్రాచీన శిలాయుగం నుండి మధ్యశిలాయుగంవరకు తర్వాత చారిత్రకయుగంలో చిత్రించబడినవి. పాండవులగుట్టలో రాళ్ళను చూస్తే కొలరాడో గుర్తొస్తుంది. రాతిచిత్రాలను చూస్తే పాండవుల గుట్ట తెలంగాణాలోని చిత్రిత శిలాశ్రయాల విశ్వవిద్యాలయం అనిపిస్తుంది. ప్రాక్ యుగం నుండి చారిత్రయుగం దాకా మానవజీవన పరిణామాన్ని ఒకేచోట నిలుపుకున్న గుహాచిత్రాల సమూహమిది. ఈ గుట్టలమీది రాతిచిత్రాలను తొలిసారి గుర్తించింది, పురావస్తువారికి రిపోర్టు చేసింది చారిత్రకపరిశోధకులు, రచయిత డా.ఈమని శివనాగిరెడ్డిగారే.

పాండవుల గుట్టల్లో అన్నీ విశేషాలే. "ఎదురు పాండవుల" గుహలకు కుడిపక్కన వెనక వైపున 5 చోట్ల రాతిచిత్రాల దొనెలతో పాటు ఒకచోట అద్భుతమైన సహజసిద్దమైన అవిచ్ఛిన్న శిలాతోరణం వుంది. ఒక రాతిగుండులో రెండు నిలువుల ఎత్తున ఈ శిలాతోరణం ఎంతో అందంగా కనిపిస్తున్నది.

గొంతెమ్మగుహ కూడా విశేషాలున్న తావు. ఇక్కడి గుహలో చేతిముద్రలు, చిత్రాలు, లిపులున్నాయి. వివిధ చిత్రితశిలాశ్రయాల్లో మాదిరిగానే ఇక్కడ ముదురు ఎరుపురంగులో (కుడి)చేతిముద్రలు వున్నాయి.గుహ బయట వీరుల యుద్ధసన్నివేశం చిత్రించబడివుంది. రంగు, గీతలను బట్టి ఈ బొమ్మ చారిత్రకయుగం నాటిదనిపిస్తున్నది. గుహలో ఒక రాతిగో మీద బూడిదవన్నె రంగుతో రాసిన లిపి వుంది. అట్లాంటి రాతలే ఎరుపురంగులో పంచపాండవుల గుహలో కూడా వున్నాయి. లిపిని బట్టి 6,7 శతాబ్దాలనాటివని తోస్తున్నది ఆ రాతలు.

పాండవుల గుట్టల్లో మరొక చారిత్రకయుగ విశేషముంది. గొంతెమ్మగుహ తూర్పున బండరాయి అంచున ఒక లఘుశాసనం వుంది. అది శ్రీ ఉత్పత్తి పిడుగు శాసనం. ఈ శాసనం గురించి పురావస్తుశాఖ వారు వివరించి రాయలేదు. కాని, ఇదే పేరుతో గల ఇట్లాంటి లఘుశాసనాలు తెలుగునాట 11చోట్ల, మహారాష్ట్రలో ఒకచోట లభించాయి. ఆరుచోట్ల శ్రీ ఉత్పత్తి పిడుగు అని తప్ప సంపూర్ణశాసనాలు లభ్యం కాలేదు. తక్కిన ఆరు తావుల్లో శాసనాలని చదివి తెలిసిందానిమీద చర్చోపచర్చలు చేసిన చారిత్రక పరిశోధకులు శ్రీ ఉత్పత్తి పిడుగు అనేది ఒక శిల్పకారుల సంఘం పేరై వుంటుందనే నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. కాని శ్రీ ఉత్పత్తి పిడుగు మీద పరిశోధక గ్రంథం రాసిన తెలుగు గోష్టి వ్యవస్థాపక అధ్యక్షులు చీమకుర్తి శేషగిరిరావు గారు ఈ శ్రీ ఉత్పత్తి పిడుగులు కాలాముఖశైవులై వుంటారని, వారు అప్పట్లో 6,7 శతాబ్దాలలో బౌద్ధ, జైన ఆరామ, విహార, చైత్యాలను, దేవాగారాలను ధ్వంసం చేస్తూ మేం బౌద్ధ, జైన మతాలనే ప్రమాదాలకు(ఉత్పత్తి అంటే ప్రమాదమని అర్థం) పిడుగు (వజ్రం)లాంటి వాళ్ళం అని (కృష్ణమూర్తి 'వేల్పుల కథ') వేసిన హెచ్చరిక శాసనాలై వుంటాయని తేల్చారు. దానికి వారు చూపిన ఆధారాలు సబబుగానే వున్నాయి. కర్నూలు సాతానికోటలో శ్రీ ఉత్పత్తి పిడుగు ఏకాన్త నివాసి లోక శీలాభిమాన అర్జునన్ మహేశ్వర కాలాముఖ అని, నంద్యాల కడమల కాల్వలోని గుడిలో శ్రీ ఉత్పత్తి పిడుగు ఏకాన్త నివాసి అని, మహానందిలో "శ్రీ ఉత్పత్తి పిడుగు కాలాముఖ" అని వుండడం వల్ల, మహబూబ్ నగర్ సంగమేశ్వరాలయంలో శ్రీ ఉత్పత్తి పిడుగు ఏకాన్తనివాసి అనే శాసనం వల్ల, ఇపుడు మన పాండవులగుట్ట గొంతెమ్మగుహ (బహుశః బౌద్ధుల వర్షావాసం అయివుంటుంది )లోని శాసనంలో "శ్రీ ఉత్పత్తి పిడుగు ఏకాంతవాసి పరమ మహేశ్వర భతన్ మహాముని" అని రాసి వుండడం వల్ల చీమకుర్తి గారి వాదమే నిజమనే సాక్ష్యం లభించినట్లైంది. ఆ శాసనంలో చెక్కబడివున్న గదలాంటిది (ఇంద్రుని వజ్రాయుధం లేదా కంటకశిల కాదు) లకులీశుని( ఆలంపురం దేవాలయ మ్యూజియంలోని లకులీశుని విగ్రహం) చేతిలోని ఆయుధం "లగుడం" వలెనె వుంది. సున్నా గుర్తు బౌద్ధుల శూన్యవాదాన్ని సూచించే చిహ్నం అని పరిశోధకులు రాంభట్ల కృష్ణమూర్తి వేల్పుల కథలో రాసారు.


హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pandavula guttalu  waranagal district  famous tourist place  

Other Articles