Isis training the children as future terrorists

isis, terrorists, children, weapons, childhood

ISIS' recent video showing a child shooting a man whom the extremist group claimed was an Israeli spy is the latest example of how the militants exploit children in their propaganda.

ప్రత్యేకం: అక్షరం దిద్దాల్సిన చేతితో ఆయుధం.. రక్త చరిత్రకు చిన్నారులే పునాదులు..??

Posted: 03/13/2015 05:17 PM IST
Isis training the children as future terrorists

చిన్న దెబ్బ తగిలినా తల్లడిల్లిపోతారు.. అమ్మ ఏడిస్తే చాలు తాము కూడా కన్నీరు పెడతారు.. ఆకలి వేసినా ఏడుస్తారు.. అలాంటి చిన్న పిల్లలు హంతకులుగా మారుతున్నారు. పాల బుగ్గలు కూడా ఇంకా సమసని చిన్నారులు రక్తం తాగుతూ, మానవ మృగాళ్లలా తయారవుతున్నారు. ప్రపంచం పో్కడ ఏంటో కూడా తెలియని పసి వయసులోనే కసిగా హత్యలు చేస్తూ, రక్తపాతం చేస్తున్నారు. ఆటలు ఆడాల్సిన వయసులో నెత్తుటి క్రీడ ఆడుతున్నారు. ఇదంతా ఎవరి గురించి, ఎందుకంత కసిగా మారారు, వారిని ఎవరు అలా మార్చారో తెలియాలంటే ఈ స్టోరీ చూడండి.

ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ప్రపంచానికి మరో కోణాన్ని చూపుతోంది. నిన్నటి దాకా రక్తదాహానికి మరణించిన వారి అరణ్యరోదనలు విన్న వారు ,తాజాగా వచ్చిన వార్తలను చూసి ఆశ్చర్యపోతున్నారు. తమ మతంలో చేరని, లేదా వ్యతిరేకించే వారిని బందీలుగా పట్టుకోవడం వారిని అతి దారుణంగా హతమార్చి, ఆ వీడియోలను ప్రపంచానికి చూపించడం ఐఎస్ఐఎస్ ప్రవృత్తి. ఒకరు కాదు ఇద్దరు కాదు వేల మంది , లక్షల మంది ఇందులో పాల్గొంటున్నారు. ఒక్క దేశంలోనే కాదు ప్రపంచంలో ప్రతి దేశంలో రక్తదాహానికి మరిగిన ఐఎస్ఐఎస్ మృగాలు సిద్దంగా ఉన్నాయి. తాము నమ్మి సిద్దాంతానికి రక్తపాతమై మార్గమని నమ్మిన కొందరి వ్యక్తుల మెదడులో పుట్టిన అతి దారుణమైన ఆలోచనే చిన్నారులను కూడా ఉగ్రవాదులుగా మార్చడం.

చిన్నతనంలో నేర్చుకున్న ప్రతి విషయం ఎంతో చలాకీగా నేర్చుకోవడం మానవుని సహజనైజం. దీన్నే కొందరు వ్యక్తులు తమ సిద్దాంతాలను సాధించడానికి వాడుకుంటున్నారు. మరణా శాసనాన్ని చిన్నారులతో మొదలు పెడుతున్నారు. కేవలం ఒకరినో ఇద్దరినో కాదు వివిధ దేశాల్లోని చాలా మంది చిన్నారులను తీసుకువచ్చి, ఐఎస్ఐఎస్ రక్త పాతం ఎలా చెయ్యాలి అనే అంశంపై శిక్షణనిస్తోంది. కానీ ప్రపంచం మొత్తం ఐఎస్ఐఎస్ దొంగచాటుగా శిక్షణనిస్తోందని అనుకుంటోంది కానీ అందులో వాస్తవాలు లేవు. కొన్న దేశాల్లో ఐఎస్ఐఎస్ బహిరంగంగా ఉగ్రవాదులుగా మారడానికి పౌరులకు, చిన్నారులకు అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే ఆకలితో ఉన్న వారు ఆయుధాన్ని పట్టక తప్పడం లేదు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులుగా పని చేసే వారికి జీతం కూడా ఇవ్వడం కొసమెరుపు.

ఏదో జీవితాలను ఉద్దరించడానికి అన్నట్లు ఐఎస్ఐఎస్ ఏకంగా డబ్బులు ఇచ్చి మరీ, ఉగ్రవాదాన్ని నేర్పిస్తోంది. అసలు తమ వారు మాత్రమే ఉండాలని, తమ సిద్దాంతాలు మాత్రమే నడిచే కొత్త ప్రపంచానికి తెర తీయాలని, ప్రస్తుతం రక్తపాతానికి పూనుకున్నారు. ఐఎస్ఐఎస్ అంటే అదొక ఉగ్రవాద సంస్థ పేరు మాత్రమే కాదు వేల మంది బంధీల రక్త మాంసాలను రుచి చూసిన ఓ ఉగ్రవాద పిశాచి. గతంలో కేవలం కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమయిన ఈ సంస్థ రానురాను అన్ని దేశాలకు విస్తరిస్తోంది. కేవలం ఆకలి రాజ్య మేలుతున్న దేశాల్లో ప్రారంభమైన ఈ ఉగ్రవాద పిశాచి, అన్ని దేశాలను తన అదుపులోకి తెచ్చుకుంటోంది.  

మతం లేదా సిద్దాంతం ఇలా ఏదో ఒక దానితో మొదలైన రక్తపాతం చివరకు మానవుని ఉనికికే ముప్పుగా మారింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ తన కార్యకలాపాలను వేగవంతం చేసింది. గతంలో రష్యాలో కొందరు సైనికుల భర్తల భార్యలు, తమ వారి చావుకు కారణమైన సైన్యానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదులుగా మారారు. బ్లాక్ ఉలే స్పైడర్ పేరుతో వారు ఉగ్రవాద దాడులకు పాల్పడ్డారు. అయితే అలా జత కట్టిన వారిలో 20 సంవత్సరాల లోపు అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. ఈ ఘటన ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపింది.

అయితే అప్పటి నుండి మహిళలు కూడా ఉగ్రవాదం బాట పడుతున్నారన్న వార్తలు మీడియాలో ఎక్కువగా వచ్చాయి. ఇక అప్పటి నుండి ప్రపంచంలో చాలా చోట్ల ఆడవారు ఆయుధాలు పట్టి ఉగ్రవాదులుగా మారిన ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే అలా మొదలైన ఉద్యమం కేవలం భావోద్రేకంతో మొదలైంది కాబట్టి కొన్ని రోజులకు చల్లారింది. కానీ ఇప్పుడు ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదం మాత్రం అంతకంటే అతి పెద్ద రాక్షసి. ఒక దేశంలో మొదలై అన్ని దేశాలకు తన విష సంసృతిని విస్తరించింది.

తాజాగా చిన్నపిల్లలను కూడా ఉగ్రవాద కార్యక్రమాలకు వాడుకోవడం అందరికి గుబులుపుట్టిస్తోంది. కనీసం 11 సంవత్సరాలు కూడా నిండని ఓ చిన్నారి, ఓ బంధీని కాలుస్తున్న వీడియోను ఐఎస్ఐఎస్ విడుదల చేసి సంచనం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ దీనిపై చర్చసాగింది. నిన్నటి దాకా కేవలం కొంత మంది, ఓ వర్గం వారు, ఓ వయస్సు వచ్చిన వారు మాత్రమే ఉగ్రవాదులుగా మారుతున్నారు అన్న వాదనకు తెర పడేలా కొత్త గా వీడియో ఉంది. చిన్నారి పిల్లలను ఎంచుకొని వారిని సమగ్ర శిక్షణ ఇచ్చి వివిధ దేశాలపైకి యుద్దానికి దిగాలన్నది ఐఎస్ఐఎస్ లెక్క కావచ్చు.

ఐఎస్ఐఎస్ దారుణాల గురించి తెలుసుకున్న వారెవరైనా ఇలాంటి వారికి దూరంగా ఉండాలని అనుకుంటారు. అలాంటిది అభంశుభం తెలియని చిన్నారులు మాత్రం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు చెప్పినట్లు చేస్తున్నారు. మూడు పూటలా తిండి పెట్టి వారికి స్కూల్ లో పాఠాలు చెప్పినట్లు చిన్నారుల మెదడులోకి హింస గురించి బోధిస్తున్నారు. జాలి, దయ, కరుణ లాంటి ఏ మాత్రం చూపకుండా ఎలా చంపాలి అని వారు చిన్నారులకు ప్రత్యేకంగా నేర్పుతున్నారు.

ఇండోనేషియా కు చెందిన ఓ మహిళ, తన పదకొండు మంది చిన్నారులు, భర్తతో కలిసి ఐఎస్ఐఎస్ లో చేరడానికి బయలుదేరి పోలీసులకు దొరికి పోయింది. అయితే ఆమె మాటలు విన్న వారు ఎవరైనా భయపడక తప్పదు.  పదకొండు మంది పిల్లలను ప్రపంచాన్ని భయపెట్టే ఉగ్రవాదులుగా తయారు చేస్తానని, కొత్త సంప్రదాయాలు, సంసృతి ఉన్న కొత్త దేశాన్ని తాము సృష్టించాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపింది.  తూర్పు సిరియా, ఉత్తర ఇరాక్, కొన్ని ఇరాన్ రహస్య ప్రాంతాల్లో చిన్నారుల కోసం ప్రత్యేక శిక్షణి ఇస్తున్నారు.

కత్తులను వాడటం నుండి ఎకె47 వరకు అన్ని రకాల ఆయుధాలను ఎలా వాడాలి అని, ఎంత దారుణంగా మనుషులను హతమార్చాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు చిన్నారులకు శిక్షణనిస్తున్నారు. అయితే వారు తాము చేస్తున్నది ఏంటి అనే కనీస విచక్షణ కూడా లేని చిన్నారులు కాబట్టి వారినే తమ ఆయుధాలుగా మార్చుకుంటున్నారు ఉగ్రవాదులు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా చిన్నారులకు శిక్షణనిచ్చి రక్త పాతానికి ఉసికొల్పిన సందర్భాలు లేవు. కానీ ప్రపంచ చరిత్రలో మాయని మచ్చగా మారిన ఐఎస్ఐఎస్ మాత్రం చిన్నారులనే తన ఆయుధాలుగా వాడుతోంది.  అంతేకాదు ప్రపంచంలో ఎంతో మంది చిన్నారులకు కూడా రహస్యంగా శిక్షణనిస్తోంది. అయితే హ్యుమన్ రైట్స్ వాచ్ వారు వెల్లడించిన వివరాలు మరింత భయపెడుతున్నాయి.

దాదాపు 900 మంది పైచిలుకు చిన్నారులు ప్రస్తుతం ఆసియా దేశాల్లో శిక్షణ పొందుతున్నారని, తొందరలోనే మరి కొందరిని చేర్చుకునేందుకు ఐఎస్ఐఎస్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు తేలింది. అయితే మానవ హక్కుల వివరాలకు అందనంతగా చిన్నారుల సంఖ్య ఉంటుందని కొందరు అంటున్నారు. రక్తాన్ని చూస్తేనే భయపడే వారు రక్త పాతాన్ని ఎలా సృష్టిస్తున్నారన్నది ప్రశ్న. ఐఎస్ఐఎస్ ఎంతో చాకచక్యంగా చిన్నారుల మెదడులోకి ఉగ్రవాదాన్ని, తమ సిద్దాంతాలను చొప్పిస్తోంది. గతంలో నేను కేవలం పిస్టల్ వాడకం మాత్రమే నేర్చుకున్నాను, కానీ ఇప్పుడిప్పడే కొత్తగా ఎకె47 వాడకం ఎలాగో నేర్చుకుంటానని, ఓ 8 సంవత్సరాల చిన్నారి మాటలను బట్టి వారిని ఐఎస్ఐఎస్ ఎంతలా వాడుకుంటోందో తెలుస్తోంది.

ఉగ్రవాదులుగా మారుతున్న చిన్నారులు భవిష్యత్ లో మరింత రక్తపాతానికి కారకులు అవుతారు అన్నదాంట్లో ఎలాంటి అసత్యం లేదు. అయితే అక్షరాలు దిద్దాల్సిన చిన్నారులు ఇలా ఆయుధాలను చేతబట్టి మారణకాండకు దిగడం ప్రపంచానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎంతో ఉజ్వల భవిష్యత్ కలిగిన చిన్నారులు ఇలా ఉగ్రవాదులుగా మారడం ప్రపంచ దేశాలకు పెనుముప్పుగా మారనుంది. రోజురోజుకు పెరుగుతున్న ఉగ్రవాద శిక్షణ శిబిరాల్లో చిన్నారుల సంఖ్య రానున్న ప్రపంచపు మరణ మృదంగానికి సూచిక. ఇప్పటికైనా ప్రపంచ దేశలు ఏకమై ఐఎస్ఐఎస్ ఉగ్రవాదంతో పాటు, మరిన్ని ఉగ్రవాద సంస్థలను మట్టుబెట్టకపోతే జరిగే విపరీత పరిణామాలకు, రక్తపాతానికి అందరం బలి కావాల్సి వస్తుంది. ఏ ఒక్క చిన్నారి కూడా ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా, ప్రపంచపు బంగారు భవిష్యత్ కు వెలుగు దివ్వెలు కావాలని కోరుకుందాం...

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : isis  terrorists  children  weapons  childhood  

Other Articles