India the center for schams and corruption

petro leak case, schams, corporate circles, neeraradia, tata, reliance,

india facing several schams every day. from the independence india saw lot of schams. tata motors, neeraradia etc like many schams. corpotate circles are corrupted for their benefits.

ప్రత్యేకం: ఇది నా స్కాముల భారతం..

Posted: 02/21/2015 05:14 PM IST
India the center for schams and corruption

దేశంలో స్కాంలు కొత్త కాదు. స్వతంత్రం రాకముందు తెల్లవాళ్లు దోచుకుంటే, స్వతంత్రం తర్వాత మన వాళ్లే దోచుకుంటున్నారని ఓ మహానుభావుడన్నాడు. నిజంగా ఆయన మాటలు అక్షరసత్యాలు. దోచుకోవడానికి అలవాటుపడ్డ వాడు ఎవరినైనా దోచుకుంటాడు, ఎలాంటి పరిస్థితిలోనైనా దోచుకుంటాడు. అయినా దోచుకునే వారిది అసలు తప్పు లేదు..ఎందుకంటే దోపిడికి గురయ్యేవారు ఉన్నంత కాలం వారు దోచుకుంటూనే ఉంటారు. దేశంలో స్కాంల గురించి గూగుల్ లో వెతికితే వందల పేజీలు వస్తున్నాయి. స్కాంల విలువ లక్షల కోట్లలో ఉంటున్నాయి. మొన్న పది కోట్లు, నిన్న లక్ష కోట్లు ఇలా ఇంతకింతకు పెరుగుతూనే ఉంది స్కాం భూతం. అయితే స్కాంలు ఇలా పెరగడానికి ఎవరు కారణం అంటే మన వ్యవస్థ కారణ:. భారతదేశంలో అందరికి స్వేచ్ఛ ఉంది, ఎంతలా అంటే ఎవరు ఎవరినైనా దోచుకోవచ్చు కానీ చట్టబద్దంగా.

కార్పోరేట్ సంస్థలు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను, విలువైన ఖనిజాలను, ప్రజల ప్రాణాలను దోచుకుంటున్నారు. అయినా అలాంటి వారికి ఈ ప్రభుత్వాలు ఎర్రతివాచీ పరిచి, స్వాగతం పలుకుతున్నాయి. రండి బాబు రండి మా దేశానికి రండి అంటు మన వాళ్లు చాలరన్నట్లు బయటి వాళ్లకు ఆహ్వానాలు పంపుతున్నారు. మొత్తానికి స్కాం అనే పదం విని విని ప్రజలకు కూడా విసుగుపుట్టింది. పలానా నేత, పలానా కార్పోరేట్ సంస్థ ఇంత మొత్తం మోసం చేసిందట అనగానే, పక్కవాడే అంతేనా మా వాడు ఎంత చేశాడో తెలుసా అని గర్వంగా చెప్పుకునే వాళ్లున్న పవిత్ర నేల మనది.

ఎవరు ఎన్ని చెప్పినా తమ స్వార్థమే పరమావధిగా పని చేసే కార్పోరేట్ వర్గాలు భారతదేశంలో కోకొల్లలు. వంద కోట్లు సంపాదించిన వారు, వెయ్య కోట్లకు పరుగుపెడతాడు కానీ ఆ పరుగులో విలువలను మరిచి ప్రవర్తిస్తున్నాడు. తాజాగా పెట్రోలియం శాకలో కీలక పత్రాలు మాయమయ్యాయన్న వార్త దేశంలో సంచలనమే రేపింది. కానీ ఇది వరకు ఇలాంటి వార్తలు చూసిన వాళ్లు మాత్రం ఇది మామూలే అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇదేం కొత్త కాదు, అలాగని ఇక భారతదేశంలో ఇదే ఆఖరు అని కూడా చెప్పలేం. ఎందుకంటే ఇది స్వేచ్ఛాభారతం.

దేశ భవిష్యత్తు ప్రభావితం చేసే కీలక ప్రభుత్వ పత్రాలు ఎలాంటి అడ్డుఅదుపు లేకుండా కొందరు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు చేరుతున్నాయి. వారు వాటిని తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. పెట్రోలియం శాఖ వ్యవహారంలో దాదాపు ఐదు కార్పోరేట్ సంస్థలకు చెందిన ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. వారు ఆ కార్పోరేట్ సంస్థల్లో కీలక ఉద్యోగులు. తమ కార్పోరేట్ సంస్థలకు కోసం స్వామి కార్యం మీద ఉన్న వారిని, పోలీసులు ఇలా అరెస్టు చెయ్యడం న్యాయం కాదు. గతంలోనూ టాటా మోటర్స్ వ్యవహారంలోనూ ఇలానే జరిగింది. టాటా నుండి వస్తున్న కొత్త వాహనం, ప్లాంట్ కు సంబందించిన విషయాలను ఆ సంస్థ పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి సమర్పించిన పత్రాలు గుట్టుచప్పుడు కాకుండా చేతులు మారాయి. దాంతో టాటా మోటర్స్ మార్కెట్ పై ప్రభావం పడింది. అయినా వ్యవస్థలో ఎలాంటి మార్పు రాలేదు.

నీరా రాడియా టేపుల వ్యవహారంలోనూ అంతే జరిగింది. అప్పటికప్పుడు దేశంలో ఏదో జరగరాని విధ్వంసం జరుగుతోందన్నట్లు మీడియా, కొందరు నేతలు తెల బాధపడ్డారు. అయినా చీమ కుట్టినంత కూడా కాలేదు ప్రభుత్వానికి . ఇలా గతంలోనూ కార్పోరేట్ వర్గాల ఆదిపత్యం నడిచింది. భవిష్యత్తులోనూ అదే జరుగుతుంది. ప్రభుత్వాలు మారుతుంటాయి, పాత పార్టీ మారి కొత్త పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పటి దాకా ఆ ప్రభుత్వానికి కొమ్ముకాసిన వర్గాలు కొత్త ప్రభుత్వానికి వంతపాడాలి. ఇలా కార్పోరేట్ వర్గాలు ఏ ఎండకాగొడుగు పడుతూ, తమ పబ్బం గడుపుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోని కొందరు వ్యక్తులు అవినీతికి అలవాటుపడి, కార్పోరేట్ వలలో పడుతున్నారు. అలా చిన్నచిన్న ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి కార్పోరేట్ వర్గాలు.

దేశంలో కార్పోరేట్ వర్గాలు అన్నీ ఇదే తరహా వ్యవహారాలను నడుపుతున్నాయన్నది ఉద్దేశం కాదు. కానీ ఇలాంటివి కూడా ఉంటాయన్నది నిజం. దేశంలో కార్పోరేట్ వర్గాల కొత్త కోణాన్ని బయటకు తీసుకువచ్చింది తాజా వ్యవహారం. మేక వన్నె పులుల్లాంటి కార్పోరేట్ వర్గాల పట్ల జాగ్రత్తగా ఉండండి అంటు ప్రభుత్వానికే కొత్త పాఠాన్ని బోధిస్తున్నాయి. ప్రభుత్వం అనే పుస్తకంలో కార్పోరేట్ వర్గాల అవినీతి అనే పేజీకి పేజీలు దక్కాయి. ప్రభుత్వానికి, కార్పోరేట్ వర్గాల మధ్య ఉన్న మరో ప్రపంచానికి తలుపులు తెరిచిన ఘటన ఇది. ఇందులో నిందితునిగా అరెస్టు చేసిన జర్నలిస్ట్ మాటలు వింటే నిజం ఏంటో బోధపడుతుంది. ఇది కేవలం పది వేల కోట్ల స్కాం మాత్రమే, నేను విషయాన్ని దాచిపెట్టాను అంతే అన్న అతని మాటలు విషయం ఏంటో చెబుతున్నాయి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన విషయం చాలా చిన్నది, ఇలా వెలుగు చూడని నిజాలు చాలా ఉన్నాయని దాంట్లో దాగి వున్న నిజం. అయినా నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయని తాతల కాలం నుండి విన్నాం. మరి కోరికోరి ఆ చేదును రుచి చూడటం ఎందుకు. ఇలా దేశ భవిష్యత్తును పణంగా పెడుతున్న ఘటనలు పురావృతం కాకుండా ఉండలని ఆశిద్దాం. అవినీతి మకిలీలు లేని కొత్త ఉదయాల కోసం ఎదురు చూద్దాం..
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petro leak case  schams  corporate circles  neeraradia  tata  reliance  

Other Articles

Today on Telugu Wishesh