Abn tv9 news channels ban in telangana

telangana, andhrapradesh, ap news channels, telugu tv news channels, telangana news channels, news papers, online news, latest news, tv9, ban on tv9, abn, ban on abn, kcr, ktr, journalist, police, hyderabad, warangal

journalistst protest against government of telangana for not taking action on mso's for ban on abn, tv9 : kcr warns media not to publish, telecast news against telangana if so will crush them undergruond

తెలంగాణలో మీడియాపై నిషేధం...

Posted: 09/09/2014 05:30 AM IST
Abn tv9 news channels ban in telangana

తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ఛానెళ్ళ ప్రసారాలు నిలిపివేసి మూడు నెలలు దాటింది. చానెళ్లను ప్రసారాలను పునరుద్ధరించాలని జర్నలిస్టులు ఎన్నో ఉద్యమాలు చేశారు, నిరసనలు తెలిపారు అయినా ఎం.ఎస్.ఓ.ల వైఖరి మారలేదు. చివరకు కోర్టులు చెప్పినా.., కేంద్రం హెచ్చరించినా వారు బేఖాతరు చేస్తూ ఛానెళ్ల ప్రసారాలను నిలిపేస్తున్నారు. అటు ప్రసారాలను కొనసాగించాలని చెప్పమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే మాకేం సంబంధమని పక్కకు తప్పుకుంటోంది. ప్రభుత్వ వైఖరిపై జర్నలిస్టులు నిరసనలు తెలిపితే అరెస్టులు, దాడులతో భయపెడుతున్నారు. వాస్తవాలైనా.., వార్తలు రాయాలంటే జర్నలిస్టులు భయపడాల్సిన దుస్థితి తెలంగాణలో ఇప్పుడు ఏర్పడింది.

నిషేధం మొదలైందిలా

తెలంగాణ అసెంబ్లీలో శాసనసభ్యుల ప్రమాణస్వీకారాల సందర్బంగా దొర్లిన తప్పులపై టీవీ9, ఏబీఎన్ ఛానెళ్ళు వ్యంగ్య కధనాలు ప్రసారం చేశాయి. దీంతో ఆగ్రహించిన ముఖ్యమంత్రి శాసనసభ్యులను, శాసనసభను అవమానించేలా కధనాలు రాశాయని అసెంబ్లీలో నిప్పులు చెరిగారు. ఈ రెండు చానెళ్లపై అసెంబ్లీకి ఫిర్యాదు చేయటంతో పాటు.., నియంత్రణ కోసం అవసరమైతే తమిళనాడు తరహాలో కేబుల్ చట్టం తెస్తామన్నారు. ఆరోజు నుంచి ఎం.ఎస్.ఓ.లు తెలంగాణలో రెండు చానెళ్ళ ప్రసారాలను నిలిపివేశారు. మొదట రెండు చానెళ్ళ యాజమాన్యాలు ఎం.ఎస్.ఓ.ల.ను విజ్ఞప్తి చేశాయి. విన్పించుకోకపోవటంతో కోర్టులో పిటిషన్లు వేశాయి. అయినా సరే ఆపరేటర్ల వైఖరి మారలేదు. చివరకు కేంద్ర సమాచార మంత్రికి తమకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పాయి. స్పందించిన మంత్రి వెంటనే చానెళ్లను ప్రసారం చేయాలని ఆదేశించారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.., ఆపరేటర్లు విన్పించుకోలేదు. నిషేదం మూడు నెలలుగా కొనసాగుతూనే ఉంది.

చట్టం ఏం చెప్తోంది ?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) ప్రకారం ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్చ హక్కు ఉంది. అంటే దేశంలో ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలను, భావాలను వెల్లడించే హక్కు ఉంది. ఈ హక్కు వల్లే మీడియా ఇంతకాలం స్వేచ్చగా వార్తలు ప్రజలకు అందించగలుగుతోంది. పలు సందర్బాల్లో ఆంక్షలు ఎదురైనా కోర్టులు జోక్యం చేసుకుని మీడియాకు ఆ స్వేచ్చ ఉందని స్పష్టం చేశాయి. అయితే తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి ఎక్కడా లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేశారని చానెళ్ళను బంద్ చేశారు. ఈ చెడు సంస్కృతి ఇలాగే కొనసాగితే ప్రభుత్వ తప్పులను ఎవరు ప్రశ్నిస్తారు? అన్యాయాలు.., అక్రమాలు.., అవినీతిపై ప్రజలను ఎవరు అప్రమత్తం చేస్తారు? మీడియాకు స్వేచ్చ ఉంది అంటూనే గొంతు పిసికేస్తుంటే ఎలా గళం విన్పించగలుగుతారు.

ఎవరు చెప్పినా కేబుల్ ఆపరేటర్లు విన్పించుకోకపోవటంతో చానెళ్ల ప్రసారాల కోసం తామే ఉద్యమించాలని తెలంగాణ జర్నలిస్టులు రంగంలోకి దిగారు. ఉద్యమం సమయంలో వారికి పూర్తి మద్దతు తెలిపిన టీఆర్ఎస్ నేతలు - ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు మాత్రం మాకేం సంబంధం అంటున్నారు. ఎక్కువ చేస్తే.., అరెస్టులు చేయిస్తూ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. అలాంటి ఘటనే మంగళవారం జరిగింది. హైదరాబాద్ లోని సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన మహిళా జర్నలిస్టులపై తెలంగాణ పోలిసులు దౌర్జన్యం చేశారు. నిరసన తెలపకుండా అడ్డుకుని, అరెస్టు చేశారు. ఓబీ వ్యాన్ల వైర్లను కట్ చేశారు.

అటు వరంగల్ లో కాళోజి జయంతి వేడుకలకు వెళ్లిన కేసీఆర్ కు జర్నలిస్టులు నిరసన తెలిపారు. ప్రసారాలను పునరుద్దరించేలా చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. వీరిని కూడా పోలిసులు అరెస్టు చేశారు. పైపెచ్చు ఈ ఆందోళనపై ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. తెలంగాణలో ఉంటూ ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా, ప్రజల మనోబావాలకు వ్యతిరేకంగా పనిచేసే ఛానెళ్లు అవసరం లేదన్నారు. వ్యతిరేక కధనాలు రాస్తే నిషేదం కాదు పది కిలోమీటర్ల లోతున పాతరేస్తాం అని ఘాటుగా హెచ్చరించారు. ఇక మఖ్యమంత్రి తనయుడు, ఐటి మంత్రి మీడియా నియంత్రణతో ప్రభుత్వానికేం సంబంధం అని ఎదురు ప్రశ్నించారు. తప్పు చేస్తే క్షమాపణలు కోరండి.., కేబుల్ ఆపరేటర్లతో చర్చలు జరిపి పరిష్కరించుకోండి కాని ప్రభుత్వానికి వివాదం రుద్దకండి అని సూచించి వెళ్లిపోయారు.

మీడియా స్వేచ్చను ఎవరూ అడ్డుకోలేరు. అలా అని ఆధార రహితంగా వ్యక్తిగత కధనాలు రాయటాన్ని ఎవరూ అంగీకరించరు. అలాంటి కధనాలు ప్రసారం కాకుండా, ప్రచురితం కాకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ప్రభుత్వం కూడా వ్యక్తిగత అంశాల కోసం మీడియాను ప్రభావితం చేసేలా వ్యవహరించటమూ సరికాదు. మీడియా నిజంగా తప్పు చేసి ఉంటే క్షమాపణలు కోరటానికి సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా కేబుల్ ఆపరేటర్లకు ఆదేశాలు ఇస్తే వారి తప్పు లేదు అని చెప్పవచ్చు కాని ఇంతవరకు అలా చేయలేదు. ఇలాంటి విధానాల వల్లనే గతంలో మోడిని ఫాసిస్టు అన్న కేసీఆర్ ను ఇప్పుడు హిట్లర్, తుగ్లక్ అంటున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tv9  abn andhrajyothy  kcr  telangana  

Other Articles