సీన్ ఓపెన్ చేస్తే... సమయం : తెల్లవారుజామున... ఒక రూంలో శ్రీధర్, సుదర్శన్, చంటీ అనే ముగ్గురు ఫ్రెండ్స్ ఫుల్లుగా నిద్రపోయివుంటారు. కట్ చేస్తే.. ఒకమ్మాయి ఓఎల్ఎక్స్ వెబ్ సైట్ లో ఐఫోన్ 5 యాడ్ వేస్తుంటుంది. కట్ చేస్తే.. మళ్లీ ముగ్గురు ఫ్రెండ్స్ దగ్గరకు సీన్! అందులో శ్రీధర్ అనే అబ్బాయికి ఫోన్ వస్తుంది. అది రాంగ్ నెంబర్ అని కట్ చేస్తాడు.. మళ్లీ వస్తుంది.. అది కూడా రాంగ్ నెంబర్! ఆ దెబ్బతో ముగ్గురు లేచి కూర్చుంటారు. తనేమో తన గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుందని వెయిట్ చేస్తుంటాడు కానీ.. తరుచుగా రాంగ్ నెంబర్లు వస్తుంటాయి. వాళ్లంతా ఓఎల్ఎక్స్ లో ఐఫోన్ యాడ్ చూసి ఫోన్ చేస్తున్నామని చెబుతారు.
ఇంతవరకు ఆ ఫోన్ ముఖమే చూడని మేము.. యాడ్ ఎలా పెట్టామని అనుకుంటారు ముగ్గురు. అయితే కంటిన్యూగా ఫోన్లు వస్తుండటంతో సుదర్శన్ తన ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ తీసుకుని.. ఫోన్లు చేస్తున్నవారందరినీ తన కామెడీ పంచ్ తో బురిడీ కొట్టిస్తుంటాడు. ఇలాగే ఫైనల్ వరకు నడుస్తుంది. ఇక చివరగా అసలు విషయం బయటపడుతుంది. ఓఎల్ఎక్స్ లో యాడ్ పెట్టింది ఎవరోకాదు.. శ్రీధర్ గర్ల్ ఫ్రెండేనని! మరి ఆమె అలా ఎందుకు చేసింది..? ఈ డ్రామా మొత్తం ఎందుకు నడిపించింది..? అనేది ఈ షార్ట్ ఫిలిం స్టోరీ!
ఈమధ్య బ్రేక్ అప్ మరీ ఎక్కువగా పెరిగిపోయిన విషయం తెలిసిందే! ప్రేమించుకోవడానికి ముందు ఏమీ ఆలోచించకుండా కమిట్ అయిపోయే యూత్.. ప్రేమించిన తర్వాత మాత్రం కచ్చితంగా ఏవో కండిషన్లు పెట్టుకుంటారు. ఇక నలుపు-తెలుపు తేడా అయితే అంతగా లేదు గానీ.. కొంతమంది అమ్మాయిలు మాత్రం కాస్త సీరియస్ గానే తీసుకుంటారు. ప్రేమ గుడ్డిది అంటారు కదా.. మొదట్లో ఎలావున్నా ప్రేమించేస్తారు.. తర్వాత ఏవో సాకులు చెప్పి బ్రేక్ అప్ అని చెప్పేస్తారు. ఆ కోణంతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇక నటీనటుల విషయానికొస్తే.. ఇందులో కూడా సుదర్శన్ తన కామెడీతో బాగానే నవ్వులు పడ్డించాడు. మూవీ స్టార్ట్ అయిన మొదటినుంచి చివరిదాకా తమ మాటలతో బాగానే కవ్వింతలు పెట్టించాడు. ఇక శ్రీధర్ పాత్రలో చిరంజీవి కూడా తన లుక్స్ తోనే కామెడీ పండించాడు. చంటీ పాత్రలో కనిపించిన అబ్బాయి ఓ మోస్తరు ఫర్వాలేదు. మొత్తానికి ఈ షార్ట్ ఫిలిం ఓ స్వీట్ కామెడీ ఎంటర్ టైనర్ గా వర్ణించుకోవచ్చు.