కావేరి జలాలు విడుదల చేసిన కర్ణాటక, కొనసాగుతున్న ఆందోళనలు | amid protests Karnataka releases Cauvery water to Tamil Nadu

Amid protests karnataka releases cauvery water to tamil nadu

Cauvery water issue, Cauvery water clashes, Karnataka releases Cauvery water, protests in Karnataka

Amid protests Karnataka releases Cauvery water to Tamil Nadu.

కావేరి చిచ్చు ఎప్పటికి చల్లారేనో?

Posted: 09/07/2016 01:02 PM IST
Amid protests karnataka releases cauvery water to tamil nadu

బ్రతకండి…బ్రతికించండి అంటూ తమిళనాడుకు కావేరి జలాలివ్వాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వటం పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కారు చిచ్చును రాజేసింది. చర్చోప్ప చర్చలు, మల్లాగుల్లాల తర్వాత సిద్ధరామయ్య సర్కార్ ఎట్టకేలకు బుధవారం కృష్ణరాజసాగర్ (కేఆర్ఎస్) నుంచి 11 వేలు, కబిని జలాశయం నుంచి నాలుగు వేల క్యూ సెక్కుల నీరు తమిళనాడుకు విడుదల చేశారు. మంగళవారం రాత్రి జరిగిన అఖిల పక్ష భేటీలో కర్ణాటక సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రైతుల నిరసన మధ్యనే కావేరి జలాలలను విడుదల చేసేశారు. నీటిని విడుదల చెయ్యరాదని డిమాండ్ చేస్తూ శ్రీరంగపట్టణం దగ్గర సూరి అనే అన్నదాత జోరుగా ప్రవహిస్తున్న కావేరీలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే విషయం గుర్తించిన పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. నదిలో కొట్టుకువెలుతున్న సూరిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. మండ్య జిల్లాలో అనేక ప్రాంతాల్లో అన్నదాతలు ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డారు.

తమ రాష్ట్రంలో 40 వేల ఎకరాల్లో సాగవుతున్న సాంబపంటకోసం 50.52 టీఎంసీల నీటిని విడుదల చేసేలా కర్ణాటకను ఆదేశించాలంటూ తమిళనాడు ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో తమిళనాడుకు రోజూ 15,000 క్యూసెక్కుల చొప్పున పదిరోజులపాటు నీటిని విడుదల చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై కన్నడ రైతాంగం తీవ్రనిరసన వ్యక్తం చేస్తూ చేపట్టిన నిరసనలు బుధవారం కూడా కొనసాగాయి. ఆందోళనకారులు బస్సులపై దాడి చేసే ప్రమాదం ఉందనే హెచ్చరికలతో తమిళనాడు నుంచి కర్ణాటకకు బస్సు సర్వీసులను రద్దు చేస్తూ జ‌య‌ల‌లిత ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. దీంతో తమిళనాడులోని వివిధ బ‌స్ స్టేష‌న్ల‌ నుంచి కర్ణాటకకు వెళ్లే అన్ని రకాల బస్సు స‌ర్వీసులు నిలిచిపోయాయి.

ఆ రాష్ట్ర రాజ‌ధాని చెన్నైలోని కోయంబేడు బస్టాండ్లో ప్ర‌యాణికులు క‌నిపించ‌డం లేదు. హోసూర్ సరిహద్దులో కొన్ని బ‌స్సులు నిలిచిపోయాయి. మ‌రోవైపు మాండ్యాలో బంద్‌కు పిలుపునిచ్చిన నేప‌థ్యంలో అక్క‌డి ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ఆందోళ‌న‌లు విస్త‌రిస్తున్నాయి. న్యాయ‌వాదులు కూడా రైతుల‌కు మ‌ద్ద‌తుగా నిర‌స‌న‌లో పాల్గొంటున్నారు. భారీ ర్యాలీ నిర్వ‌హించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ర్యాలీలో కొంతమంది ఆందోళ‌న‌కారులు జయలలిత పోస్టర్లతోపాటు, అనుకూల నిర్ణయం తీసకున్న క‌ర్ణాట‌క సీఎం సిద్ధరామయ్య ఫోటోలతో కూడిన పోస్టర్లను చింపివేయ‌డం అల‌జ‌డి రేపింది. మాండ్యాలో భారీ ఎత్తున పోలీసులను మోహ‌రించారు. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

jaya posters in cauvery issue


కావేరి చిచ్చు ఎందుకు...

కావేరి జలాల పంపకం వివాదం ఈనాటిది కాదు. 120 ఏళ్లకు మించిన చరిత్ర ఉంది. బ్రిటీష్ పాలనలోని మద్రాస్ ప్రెసిడెన్సీ, మైసూర్ రాజ్యం మధ్య ఈ వివాదం 19వ శతాబ్దంలోనే మొదలైంది. నదిపై ఆనకట్టలు కట్టడానికి రెండూ పోటీపడ్డాయి. దీంతో 1892లో కావేరి జలాల పంపకంపై నాటి బ్రిటీష్ ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని కుదిర్చింది. అనంతరం తిరిగి 1924లోనూ ఇరుపక్షాల మధ్య మరో ఒప్పందం కుదిరింది. వీటిప్రకారం.. మద్రాస్ ప్రెసిడెన్సీకి (తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలకు) 556 టీఎంసీలను, మైసూర్ రాజ్యానికి (కర్ణాటక) 177 టీఎంసీలను, కేరళకు 5 టీంఎసీలను కేటాయించారు. ఈ ఒప్పందం కాలవ్యవధి 50 ఏళ్లు. ఈ ఒప్పందం ప్రధానంగా మైసూర్ రాజ్యంలోని మాండ్య జిల్లాలో కావేరి నదిపై 1924లో నిర్మించిన కృష్ణరాజసాగర్ నిర్వహణకు సంబంధించినదే కావటంతో కావేరి మిగులు జలాల వినియోగంపై స్పష్టత కొరవడింది. స్వాతంత్య్రానంతరం రాష్ర్టాల పునర్విభజనతో సమస్య మరింత జఠిలమైంది.

బ్రిటీష్ హయాంలో కుదిరిన ఒప్పందంలో తమకు అన్యా యం జరిగిందని, తాము దానికి కట్టుబడి ఉండమని కర్ణాటక వాదించింది. కావేరి నదిపై ఆనకట్టలను కట్టడానికి కర్ణాటక చేసిన ప్రయత్నాలను తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ వివాదాల నేపథ్యంలో.. కేంద్రప్రభుత్వం 1972 లో ఒక నిజనిర్ధారణ సంఘాన్ని నియమించింది. తమిళనాడులో కాలువల నీటి తో సాగు అవుతున్న వ్యవసాయభూములు 14.4 లక్షల ఎకరాల నుంచి 25.8 లక్షల ఎకరాలకు పెరుగగా, కర్ణాటకలో ఇది 6.8 లక్ష ల ఎకరాలకే పరిమితమైందని ఈ సంఘం వెల్లడించింది. కేంద్రప్రభుత్వం 1990లో కావేరి ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేసింది. ట్రిబ్యునల్ 2007లో తుది తీర్పును ప్రకటించింది. తమిళనాడుకు 419 టీఎంసీలను, కర్ణాటకకు 270 టీఎంసీలను, కేరళకు 30 టీఎంసీలను, పుదుచ్చేరికి ఏడు టీఎంసీలను ట్రిబ్యునల్ కేటాయించింది. కానీ తమకు 512 టీఎంసీలు కావాలని తమిళనాడు, 465 టీఎంసీలు కావాలని కర్ణాటక డిమాండ్ చేశాయి. ట్రిబ్యునల్ కేటాయింపుల్ని వ్యతిరేకిస్తూ రెండు రాష్ట్రప్రభుత్వాలూ సుప్రీంకోర్టులో కేసులను దాఖలు చేశాయి. 2013లో ట్రిబ్యునల్ కేటాయింపుల్ని అధికారికంగా గుర్తిస్తూ కేంద్రప్రభుత్వం గెజిట్ ప్రకటన జారీ చేసింది. అయితే, వివాదం మాత్రం కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తుతం రెండురాష్ర్టాల్లో వర్షాలు సరిగా పడలేదు. దీంతో కావేరి వివాదం మరోసారి భగ్గుమన్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : protests  Karnataka  Cauvery water  Tamilnadu  

Other Articles