Holi The festival of colours and Joy

Holi the festival of colours and joy

Holi, Holi festival, colours Festival

Holi is a colourful and happy Hindu holiday celebrated primarily in India on the last full moon of the lunar month of Phalguna at the end of the winter season. It falls in either late February or early March. It is also known as the Festival of Colours.

హోళీ.. ఆనందకేళి

Posted: 03/23/2016 06:10 AM IST
Holi the festival of colours and joy

హోళీ పండుగ వచ్చిందంటే.. ఆనందం వెల్లివిరిసినట్లే… జీవితంలో రంగులకు దర్పణం, శాంతి ఆనందాలకు ప్రతీకగా రంగుల పండుగ హోళీని జరుపుకుంటారు. వసంతకాలం లో వచ్చే తొలి పండుగ హోళీ. హోళీని కాముని పున్నమిగా, వసంత పున్నమిగా, డోలికోత్సవంగా దేశం వివిధ ప్రాంతాల్లో జరుపుకుంటారు. భారతదేశంలోనే కాదు.. నేపాల్, బంగ్లాదేశ్ వంటి తదితర దేశాల్లో ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు.

హోళీ.. అంటే కృష్ణుడు, రాసలీలలే గుర్తుకువస్తాయి. ఉత్తరాదిలో ముఖ్యంగా కృష్ణుడు నడయాడిన వ్రజ భూమి, భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథుర, బందావన్, నందగావ్, ద్వారకా, గుజరాత్, బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు. శ్రీ బాలకృష్ణుని ఫాల్గుణ మాసం పూర్ణిమ తిధినాడు ఊయలలో (డోలికలో) వేసినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల బెంగాల్ రాష్ట్రంలో ఈ రోజును శ్రీకృష్ణుని ప్రతిమను డోలీకలోవేసి ఊపుచూ డోలికోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు.

శివ పార్వతులను కలిపేందుకు మన్మధుడు ఆత్మార్పణ చేసిన దినం ఇది. పార్వతీ కల్యాణాన్ని దేవకార్యం గా భావించి.. పార్వతీదేవి పరమేశ్వరునకు సపర్యలు చేయు సమయాన్ని తగు సమయముగా ఎంచుకుని పరమేశ్వరునిపై పూల బాణం వేస్తాడు. దాంతో ఆత్మధ్యానంలో ఉన్న పరమశివుని ధ్యానం మరలి, కామ ఉద్దీపన జరుగుతుంది. ఈ విధంగా పార్వతీ పరమశ్వరుల కళ్యాణానికి కారకుడైన మన్మధుడు శివుని మూడో కంటికి దహనమవుతాడు. అదే. కామదహనం. రతీదేవి వేడుకతో మన్మధుని అశరీర రూపంలో సజీవంగా ఉండేలా శివ అనుగ్రహం. అనంతరం శివకల్యాణం.. ఆనందం.. హోళీ…

మన దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎంతో ఉత్సాహం తో జరుపుకునే పండుగలలో హోళీ ఒకటి . ఈ పండుగ ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు వస్తుంది. చంద్రమానం ప్రకారం మాస నిర్ణయం రెండు పద్దతులుగా చేస్తారు. మొదటి పధ్ధతి ప్రకారం పౌర్ణమితో నెల పూర్తయి, మరుసటి రోజునుంచీ కొత్త మాసం మొదలవుతుంది. దీన్ని‘పూర్ణి మంత' విధానం అంటారు.ఈ ప్రకారం ఫాల్గుణ పున్నమితో సంవత్సరం ముగిసి మరుసటి రోజునుంచి వసంత ఋతువు ప్రవేశంతో నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. వసంతాగమనాన్నీ, కొత్త సంవత్సరాన్నీ ఆహ్వానిస్తూ చేసుకునే పండుగ కనుక ఈ పండుగని వసంతోత్సవం అని కూడా అంటారు.

ఈ పండుగ గురించి రక రకాలైన కథలు ప్రాచుర్యంలో వున్నాయి. వాటిల్లో విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడూ, అతని తండ్రి హిరణ్య కశిపుల గురించిన కథ ముఖ్యమైనది. హిరణ్య కశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుని హరి భక్తి నుంచి దూరం చేయలేక, కుపితుడై అతడిని చంపదలచి చితిపై తన సోదరి హోళిక వొడిలో కూర్చోనమని కుమారుని ఆదేశిస్తాడు. మంటల్లో ప్రవేశించినా దహనం కాని విధంగా వరం పొందిన హోళిక నూ, ఆమె ఒడిలోని ప్రహ్లాదుడినీ అగ్ని ముట్టడిస్తుంది. ప్రహ్లాదుని నిర్మల భక్తికి మెచ్చిన నారాయణుడు అతడిని కాపాడగా, వరాన్ని పొందిన హోళిక ఒంటరిగా కాకుండా మరొక వ్యక్తితో కలిసి అగ్నిలో ప్రవేశించినందున అగ్ని దేవుని ఆగ్రహానికి గురై దహనమై పోతుంది. ఆనాటినుంచి నలుగురూ గుమిగూడే ఆవరణలో పెద్ద భోగిమంటను వెలిగించి హోళికను దగ్ధం చేస్తూ చెడుపై మంచి సాధించే గెలుపునీ , భగవంతుని పట్ల భక్తునికి గల అవిరళ భక్తి పొందే విజయాన్నీ పండుగగా జరుపుకోవడం మొదలైనదని చెప్పుకుంటారు. హోళి రోజున ‘హోళికా దహనం' పేర పనికిరాని పాత సామానులనీ కాగితాలనీ మంటల్లో వేసి కొత్త భావాలకూ, మంచి మార్పులకూ స్వాగతం పలుకుతారు.

హోళీ గురించి మరొక కథ ఉంది.చిన్నపిల్లల్ని వేధించే దుండి రాక్షసిని పిల్లలంతా కలిసి హోళీ పండుగ నాడు తరిమికొట్టారనీ ,ఆ రోజునుంచీ ఈ పండుగ పిల్లల విజయోత్సవంగా జరుపుకోవడంకూడా మొదలైందనీ చెప్పుకుంటారు.అందుకే ఈ హోళికా దహనం వేళ పెద్దలు పిల్లల అల్లరికి అడ్డు చెప్పకపోవడం పరిపాటి. పసిబాలుడైన చిన్ని కృష్ణుడి ప్రాణాలు హరించమని కంసుడు పూతన అనే రాక్షసిని పంపించగా ,కృష్ణుడు పాలతోపాటుగా పూతన ప్రాణాలనుకూడా హరించిన భాగవత కథ మనకు తెలిసినదే. శీతాకాలాన్ని పూతనగా, చలికాలం అంతమై వాతావరణం వెచ్చబడదాన్ని పూతన సంహారంగా భావించడం ఈ పండుగకున్న మరో కోణం.

బెంగాల్ లో ఊయలోత్సవంగా, డోలోత్సవంగా పిలవబడే ఈ పండుగ నాడు విద్యార్ధులు కేసర వర్ణం లేదా తెల్లని రంగు బట్టలు ధరించి ఏకతార, వీణ వంటి సంగీత వాద్యాలకనుగునంగా నర్తిస్తారు. నగర వీధుల్లో రాధా కృష్ణుల విగ్రహాలను పల్లకీ లో ఊరేగిస్తూ ఊయలూపుతూ భక్తి గీతాలను ఆలపిస్తారు. పురుషులు ఆబీర్ చల్లుతూ రంగు నీరు చిమ్ముతూ వెంట నడుస్తారు.ఇంటి పెద్ద ఉపవాసముండి , శ్రీ కృష్ణుడినీ , అగ్ని దేవుడినీ పూజించి కృష్ణ ప్రతిమకు గులాల్ పులిమి పిండివంటలు స్వామికి నైవేద్యం గా సమర్పిస్తారు. కృష్ణ భక్తులు ఎక్కువగా వుండే మధుర, బృందావన్ , నందగాంవ్ ప్రాంతాలు ఈ పండుగ సమయానికి యాత్రా స్థలాలుగా రూపు దిద్దుకుంటాయి. ఇక్కడ హోళీ ని పదహారు రోజుల పండుగ గా జరుపుతారు.

ఒరిస్సా లో కూడా హోళీ దాదాపు ఇదేవిధంగా జరిగినా రాదా కృష్ణుల స్థానంలో వీరు జగన్నాధుని పూజిస్తారు.గోవా లోనూ , కర్నాటక ,మహారాష్ట్ర ,కేరళ లోనూ కొంకణులు హోళీని శిశిరోత్సవంలో భాగంగా జరుపుకుంటారు. హోళీ మిలన్ పేర పరిచయస్తుల ఇళ్ళకు వెళ్లి హోళీ పాటలు పాడి , ఆత్మీయంగా రంగులు పులిమి స్నేహాన్నీ. సోదర ప్రేమనూ పంచుకుంటారు. ఉత్తర భారతంలో కొన్ని చోట్ల హోళీ నాటి సాయంత్రమే కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ పంచాంగ శ్రవణం చేస్తారు. గుజరాత్ లో ఈ పండుగ నాడు భోగిమంటలు వెలిగించి నృత్య గానాలతో సందడి చేస్తారు.వీధిలోనే ఎత్తుగా ఉట్టి కట్టి పిరమిడ్ ఆకారంలో ఒకరిపై ఒకరు ఎక్కుతూ ఉట్టి కొట్టాలని ప్రయత్నిస్తారు.వెన్నదొంగని ఆపే ప్రయత్నంలో భాగంగా ఆడపిల్లలు గోపిక వేష ధారులై ఉట్టి కొట్ట నివ్వకుండా రంగునీల్లు చల్లుతూ అడ్డుపడతారు.

మహారాష్ట్ర లో ఇది ఐదురోజుల పండుగ.పండుగకు వారంరోజుల ముందే యువకులంతా కలిసి చందాలు పోగుచేస్తారు. ప్రతి కుటుంబం నైవేద్యానికి భోజన పదార్ధాలనూ, పిండివంటలనూ అందించి సంబరంలో పాలుపంచుకుంటుంది.. పాత శత్రుత్వాలేవున్నా మరచి పోయి సుహృద్భావాలను పెంపొందించుకోవాలని ఈ పండుగ సమయంలో పెద్దలు చెపుతారు. మణిపురి వాసులు ఇదే పండుగను ఆరు రోజుల పాటు చేసుకుంటారు.గడ్డి కప్పిన పూరి పాకను దహనం చేయడంతో ఇక్కడ పండుగ సంబరాలు మొదలవుతాయి.'తాబల్ చొంగ్బ ' అనే బృంద నాట్యం ఈ పండుగ సంబరాలలో మణిపురి వాసుల ప్రత్యేకత .

కర్నాటక గ్రామ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి వంటచెరకు పోగు చేసి ' కామ దహనా'నికి వాడడం,చందాలు వసూలు చేసి ఉత్సవానికి ఖర్చు చేయడం పరిపాటి. ఈ రంగుల పండుగ ముఖ్యంగా హిందువులదే అయినా ఈ పండుగ జరుపుకోవడం లో మత సామరస్యం వెల్లివిరిసేలా అన్ని మతాల వారూ ఉత్సాహంతో పాల్గొంటారు. హోళీ సంబరాలు జరుపుకునే వేళ వయసు, స్త్రీ పురుష వ్యత్యాసం,హోదా ,కుల మత భేదాలకు సంబంధించిన సామాజిక కట్టు బాట్లలో సడలింపు కనిపిస్తుంది. ధనిక ,పేద వర్గ విభేదాలు మరచి హిందువులంతా కలసి మెలసి ఈ పండుగ జరుపుకుంటారు. పాత చీపుర్లూ, తట్ట బుట్టలూ, పనికిరాని చెక్క వస్తువులూ , కాగితాలూ , రాలిన ఎండుటాకులూ కుప్పగా పేర్చి దహనం చేస్తారు. హోళీ మంట తర్వాత మిగిలిన భస్మాన్ని బొట్టుగా ధరించి శరీరానికి పులుముకుంటారు. కొత్త చిగుళ్లకూ నవ చైతన్యానికీ స్వాగతం పలుకుతారు.

ఇంత ప్రాశస్త్యం ఉన్న హోళీ పండగను జాగ్రత్తగా, ఎంతో ఆనందంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ హోళీ మీ జీవితాల్లో కొత్త రంగులు నింపాలని.. ఆనందాలను తీసుకురావాలని తెలుగు విశేష్ మనసారా కోరుకుంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Holi  Holi festival  colours Festival  

Other Articles