Godavari pushkaralu | Telangana | AP | Bhadrachalam, Rajamandry

Rajahmundry and bhadrachalam gearing up for godavari pushkaram

Godavari pushkaralu, Telangana, AP, Bhadrachalam, Rajamandry

Rajahmundry and Bhadrachalam gearing up for Godavari pushkaram Godavari Puashkaras will start in few hours. Telangana and ap govt did all arrangements for Godavari pushkaralu.

మా తల్లి గోదారి పిలుస్తోంది.. పుష్కరాలొచ్చె సంబరాలు తెచ్చె

Posted: 07/13/2015 04:44 PM IST
Rajahmundry and bhadrachalam gearing up for godavari pushkaram

చల్లని చూపుల గోదారమ్మ తన బిడ్డలను రారామ్మని పిలుస్తోంది. తల్లి తన బిడ్డలను ఎంతో ప్రేమతో పిలిచినట్లు గోదారి తల్లి మనల్ని ఎంతో ప్రేమతో రమ్మని పిలుస్తోంది. గోదావరి మహాపుష్కర వేడుక ప్రారంభానికి ఇవాళ మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. సుమారు కోటిన్నర మంది భక్తులు పుణ్యస్నానాల కోసం రాజమండ్రి వస్తారని అంచనా అధికారులు వేస్తున్నారు. పుణ్యస్నానాలు, పిండ ప్రదానాల కోసం ఇక్కడ 17 ఘాట్‌లు రెడీ అయ్యాయి. కిలోమీటర్ పైగా పొడవుతో దేశంలోనే అతి పెద్ద ఘాట్‌గా చెబుతున్న కోటిలింగాల సహా సరికొత్త డిజైన్‌తో వి.ఐ.పి.ల స్నానాల కోసం సరస్వతి ఘాట్‌ సిద్ధంగా ఉన్నాయి. ఒక్క రాజమండ్రిలోనే ప్రతిరోజూ 15 లక్షల మందికి పైగా యాత్రికులు పుణ్యస్నానాలు చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. రోడ్ల పక్కన గోడల్ని సైతం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చి దిద్దుతున్నారు.

పుష్కరాల కోసం 1600కు పైగా బస్సులు నడుపుతోంది ఏపీఎస్‌ ఆర్టీసీ. ఇవిగాక తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే బస్సుల్ని నిలిపేందుకు రాజమండ్రి బయట తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు చేశారు. యాత్రికుల బస, భోజనాల కోసం రాజమండ్రిలో 5 చోట్ల పుష్కరనగర్‌లు ఏర్పాటు చేసి ఒక్కో దానిలో ప్రతిరోజూ 50 వేలమందికి బస కల్పించేలా సిద్ధం చేశారు. పారిశుధ్య సమస్యలు రాకుండా ఎక్కడికక్కడ 1486 తాత్కాలిక టాయిలెట్లను ఏర్పాటు చేశారు.

godavari-pushkaralu02

అటు తెలంగాణలోనూ పుష్కరాల ఏర్పాట్లు ఓ కొలిక్కి వచ్చాయి.  వరంగల్‌ జిల్లాలోని మూడు ఘాట్లు సిద్ధం చేసిన అధికారులు.... అక్కడ గజ ఈతగాళ్ళు, వైద్యులతో పాటు పోలీస్‌ పహారా కోసం ఎత్తైన మంచెలను ఏర్పాటుచేశారు. ఎక్కడికక్కడ  సీసీ కెమెరాలు అమర్చారు. రామన్నగూడెం, ముల్లకట్ట, మంగపేటలో పుష్కర ఘాట్ల దగ్గర భారీ ఎత్తున పోలీసుల్ని మోహరిస్తున్నారు. ఒక వేళ నదిలో నీటి సమస్య వచ్చినా ట్యాప్‌ల కింద స్నానాలు చేసేలా ఏర్పాట్లున్నాయి. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలంతో పాటు మిగతా ఘాట్లన్నింటి దగ్గరా పుష్కర స్నానాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఘాట్‌ దగ్గర నాలుగు అంబులెన్స్‌లతో పాటు మందుల్ని కూడా సిద్ధంగా ఉంచారు.

 గోదావరి పుష్కరాల కోసం రాజమండ్రి స్పెషల్‌గా ముస్తాబవుతోంది. కడియం నర్సరీల నుంచి లక్షలాది మొక్కలను తెప్పించి నగరంలోని ప్రధాన ప్రాంతాలకు కొత్త హంగులు అద్దుతున్నారు. మరో నెలరోజుల్లో మొదలయ్యే పుష్కర వేడుకకు వచ్చే భక్తులకు పచ్చదనం ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. వచ్చేనెల 14 నుంచి మొదలయ్యే పుష్కరాల కోసం రాజమండ్రిని సుందరీకరిస్తున్నారు. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి వీలుగా ఘాట్‌లు సిద్ధమవుతున్నాయి. అలాగే పుణ్యక్షేత్రాలను సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. వీటికి తోడు ప్రత్యేక ఆకర్షణగా ఉండేందుకు నగర సుందరీకరణపై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం.

 దేశంలోనే అతిపెద్ద మొక్కల ఉత్పత్తి కేంద్రంగా ఉన్న కడియం నర్సరీ రైతుల భాగస్వామ్యంతో అందమైన మొక్కలు, ల్యాండ్ స్కేపింగ్‌లతో సుందరీకరణ పనులు చేపట్టారు. దాదాపు 4 కోట్ల రూపాయలతో సుందరీకరణ ప్రణాళిక రూపొందించారు. తొలకరి వర్షాలు ప్రారంభం కావటంతో గ్రీనరీని అభివృద్ధి చేసే పనులు మొదలయ్యాయి. సుమారు 3 లక్షల మొక్కలతో పుష్కరాల సమయానికి రాజమండ్రి నగరాన్ని మునుపెన్నడూ లేనంత అందంగా తీర్చిదిద్దుతామంటున్నారు కడియం రైతులు.

 సాధారణంగా నగరాల్లో సుందరీకరణ అంటే రోడ్ల మధ్య ఉండే డివైడర్‌లకు ల్యాండ్ స్కేపింగ్ చేస్తారు. అయితే ప్రస్తుతం రాజమండ్రిలో దీనికి భిన్నంగా రోడ్డుకు ఇరువైపులా అందమైన మొక్కలతో అలంకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కడియం నర్సరీల్లో కొలువుదీరిన పలు రకాల అందమైన మొక్కలతో సరికొత్త డిజైనింగ్‌ గ్రీనరీని అభివృద్ధి చేయనున్నారు. ఇప్పుడు ఇంత కష్టపడి చేస్తున్నా ఈ సుందరీకరణ ఎన్ని రోజులు నిలిచి ఉంటుందనేది క్వశ్చన్‌ మార్క్‌. నీరు - చెట్టు కార్యక్రమంలో భాగంగా నగరంలో లక్షకు పైగా మొక్కులు నాటారు. సరైన నిర్వహణలేక వాటిలో చాలా శాతం చనిపోయాయి. ప్రస్తుతం 4 కోట్ల రూపాయలతో సుందరీకరణ చేపడుతున్న దృష్ట్యా పుష్కరాల 12 రోజులకే పరిమితం కాకుండా శాశ్వతంగా గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.మున్సిపల్‌ కార్పొరేషన్‌కు కాకుండా ఏడాది పొడవునా పచ్చదనం నిర్వహణ బాధ్యతలను కడియం నర్సరీల రైతులకే అప్పగించాలంటున్నారు స్థానికులు. అధికారులు కూడా ఇదే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

godavari-pushkaralu03

గోదావరి నీళ్లు ఎంత మధురమో గోదావరి తీర ప్రాంత వంటకాలు అంత రుచికరం... సర్వపిండి, తాపేశ్వరం కాజా, సకినాలు, తరవాణి, పాలతాలికలు, పూతరేకులు ఒక్కటేంటి ఆదిలాబాద్‌ నుంచి తూర్పు గోదావరి వరకూ అన్ని వంటకాలు ప్రత్యేకమే. తాపేశ్వరం కాజా.. మడతల మధ్య చిక్కటి తియ్యటిపాకంతో కాజా నోరు ఊరుతుంది . జిల్లాకు వచ్చిన ప్రముఖులు ఎవరైనా సరే ముందు ఇష్టంగా రుచిచూసేది ఈ కాజానే... చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ శుభకార్యమైనా ఈ కాజా ఉండాల్సిందే. లేకుంటే లోటు చేసినట్లే...అంతెందుకు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖుల ఇళ్లలో పంక్షన్లు జరుగుతుంటే తాపేశ్వరానికి స్పెషల్‌ ఆర్డర్‌ అందాల్సిందే. 

 ఇక నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే గమ్మతైన పూతరేకులు తూర్పుగోదావరి జిల్లాలోని ఒక్క ఆత్రేయపురం గ్రామంలోని మహిళలు మాత్రమే తయారుచేయగలరు. కోనసీమలో అంతర్భాగమైన ఈ చిన్న గ్రామానికి అంతర్జాతీయంగా అంత పేరు రావడానికి కారణం ఈ పూతరేకులే.ఈ పూతరేకుల రుచిని చూసేందుకు పర్యాటకులు పెద్దసంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఇక కోనసీమ ప్రాంతం లోని అంబాజీపేట గ్రామంలో పొట్టెంకల అల్పాహరం కోసం ప్రముఖులే పోటీపడతారు. ఇడ్లీ పిండిని పనసఆకులో చుట్టి ఆవిరిపట్టించి వండటమే దీని ప్రత్యేకత. కోనసీమ గ్రామాలలో కొబ్బరిపాలతో వండే కొబ్బరిఅన్నంకు అంతే స్ధాయి గుర్తింపు ఉంది. ఇంకా కోనసీమ మామిడితాండ్ర, బొబ్బట్లు రుచి అమోఘమే. బొబ్బట్లు కనిపిస్తే షుగర్‌ పేషెంట్లు కూడా ఆగలేరు...

godavari-pushkaralu04

గోదావరి నదిలో మాత్రమే వరదల సీజన్ లో లభ్యమయ్యే పులస చేప కోసం గోదావరి వాసులైతే ఎగబడతారు అంటే  అతిశయోక్తి కాదు.రాష్ట్రస్దాయిలో బదిలీల పైరవీలకు ఈ చేప కూర సాయపడుతుందంటేనే తెలుస్తుంది పులస పులుసు రుచేంటో.ఈ చేప రుచి చూసేందుకు వరదల సీజన్‌లో ఇక్కడికి పర్యాటకులు క్యూకడతారు. రేటెంతైనా ఓసారైనా టేస్ట్‌ చేయాల్సిందే అంటారు. పుస్తెలు తాకట్టుపెట్టైనా పులసకూర తినాలని చెబుతారు. తెలంగాణ సకినాలు, సర్వపిండి రుచుల గురించి ఎంత చెప్పినా తక్కువే. మాములుగానే వీటి రుచి అధికం...ఉల్లి, పచ్చిమిర్చి,  అల్లం, నానబెట్టిన శనగపప్పు, బియ్యప్పిండిని కలిపి చేత్తో ఒత్తి వేడి పెనంపై కానీ మూకుడుపై కానీ పెట్టి వండుతారు. ఇక కరీంనగర్‌ జిల్లాల్లో సల్లచారు చాలా ప్రసిద్ధి. గోదారి నీటితో వండే మాంసాహారం టేస్ట్‌ అదుర్స్‌ అనిపిస్తుంది. గోదావరి తీరం వెంబడి కనిపించే పనసపొట్టు కూర, పులిహోర, పాలతాలికలు, ఉక్కెర, తిమ్మనం, తరవాణి, పాఠోళి, కజ్జికాయలు, గుడాలు... ఇలా ఒకటేమిటి అన్నీ అమృతంతో సమానమే.

 త్రయంబకేశ్వరుని జటాజూటంలోని గంగకు పోటీ వస్తూ
పార్వతీదేవి పాదాల పారాణి కడిగిన నీరులా
తొలిసంధ్య చల్లిన సిగ్గుపూలకళ్లాపికి ఎరుపెక్కినట్లుగా
అరుణుడి చురుకు చూపులకి వళ్ళంతా కందిపోయినట్లుగా
ప్రత్యూషంలోని సప్తాశ్వాల గిట్టలధూళి రాలి రంగిల్లినట్లుగా
ఎర్రబడిన తొలిపొద్దు అందాన్ని చూపే అద్దంలా
సూరీడు పంపిన కాంతులపేర్లు వేసుకొని
ఎంతో అందంగా కనిపిస్తోంది మా గోదారి.

కదిలే చేపలతో మిలమిలలాడుతూ
మత్స్యకారుల వలల చిక్కక తప్పించుకొని తోవచేసుకుంటూ
తెల్లని తెరచాపల అందాలను తిలకిస్తూ
నావికుల గీతాలకు మైమరుస్తూ
ఆ హైలెస్సలకు కదం తొక్కుతూ
వారి తాపాన్ని చల్లార్చేందుకు చల్లని తుంపర్లను చల్లుతూ
వడివడిగా కదిలిపోతుంది మా గోదారి.

సాయంసంధ్యను ప్రతిఫలిస్తూ
ఒడ్డునున్న జంటల గుసగుసలను ఓ చెవితో ఆలకిస్తూ
తీరాన్నున్న రెల్లుకొసల చక్కిలిగింతలకు మెలికలు తిరుగుతూ
అస్తాద్రి గుండెల్లో ఒదిగిపోయే సూరీడుకి వీడ్కోలు చెప్తూ
తొంగిచూసే మామను స్వాగతిస్తూ
సాగిపోతుంది మా గోదారి.

కొబ్బరాకుల వీవనలకు సేదదీరుతూ
నిశాకాంతులన్నిటినీ తానే తాగేయాలనే తపనతో
చంద్రుడినీ తారలను పట్టేసి తనలో దాచేస్తూ
నౌకావిహారాలు చేసే పడుచుజంటల చిలిపిచేష్టలకి చిన్నగా నవ్వుకుంటూ
తాను రేయంతా సాగరునితో చేసే అల్లరిని తలుచుకుంటూ
బిడియంగా కదిలిపోతుంది మా గోదారి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Godavari pushkaralu  Telangana  AP  Bhadrachalam  Rajamandry  

Other Articles