National media fires on kcr

kcr, national media, kuldeep nayar, arnab goswami, venkat narayana, Tv9, abn andrajyothi

national media condems attitude of Kcr, Questions cm's criminal language

సీఎం కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగిన జాతీయ మీడియా

Posted: 09/11/2014 11:20 AM IST
National media fires on kcr

తెలంగాణ రాష్ట్ర సాధన క్రెడిట్ తో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్... ఏకపక్షంగా వ్యవహరించడంపై జాతీయ మీడియా నిలదీసింది. ఎదురు తిరిగిన ప్రత్యర్థులనే కాదు, వ్యతిరేక కథనాలు ప్రచురించిన మీడియాపై కూడా ఆంక్షలు విధించడంపై ధ్వజమెత్తింది. తెలంగాణలో ఇలానే వుండాలన్న నియంతృత్వ వాదాన్ని తప్పబట్టింది. సీఎంగా కేసీఆర్ వాడుతున్న క్రిమినల్ బాష సమంజసం కాదని మండిపడింది. హుందాగా వుండాల్సిన ముఖ్యమంత్రి నోట ఇలాంటి మాటలా అంటూ ప్రశ్నల వర్షం. ఫోర్త్ ఎస్టేట్ గా పరిగణింపబడే మీడియా స్వేచ్ఛను కాలరాసేయత్నాన్ని జాతీయమీడియా ముక్తకంఠంతో ఖండించింది.

చర్చలు, విశ్లేషణలు, ప్రత్యేక కథనాలతో సీఎం కేసీఆర్ వ్యవహార శైలిపై జాతీయ మీడియా విమర్శలు గుప్పించింది. ‘ఇవేం మాటలు? ఇదేం పద్ధతి? ఒక ముఖ్యమంత్రి ఇలాగా మాట్లాడాల్సింది?’ అంటూ విరుచుకుపడింది. ఆయనది హంతక భాషగా నిరసించింది. ఇదంతా ఎందుకంటారా..? తెలంగాణలో మూడు నెలలుగా ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసారాలను నిలిపివేయడం... దానికి తోడు వరంగల్‌లో జరిగిన సభలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు జతకలవడం.. జాతీయ స్థాయిలో రచ్చరేపింది.

జాతీయ మీడియా జరిపిన చర్చలో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ నేతలు టీవీ9 ప్రసారం చేసిన కథనాన్నే ప్రస్తావించారు. ఏబీఎన్‌ చేసిన తప్పేమిటో చెప్పలేకపోయారు. ఇదేవిషయాన్ని జాతీయ మీడియా సూటిగా అడిగేసరికి టీఆర్ఎస్ నేతలు నీళ్లు నమిలారు. ‘ప్రసారాల నిలిపివేతతో మాకు సంబంధంలేదు.. అది ఎంఎస్‌వోలను నిర్ణయం వారినే అడగండి’ అంటూ పాతపాటే పాడారు. ఆయా చానళ్లలో చర్చలో పాల్గొన్న పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు కేసీఆర్‌ తీరును తీవ్రంగా ఆక్షేపించారు. కేసీఆర్‌ తక్షణం క్షమాపణ చెప్పాలని, ఆయనపై చర్య తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు. మీడియాపై ఆంక్షల విషయంలో కేసీఆర్ వైఖరిని చర్చలో పాల్గొన్న విశ్లేషకులే కాదు.. సీనియర్ జర్నలిస్టులు కూడా తప్పబట్టారు.

మాట వినకుంటే మర్డర్ చేస్తారా? టీఆర్ఎస్ నేతలకు టైమ్స్ నౌ సూటి ప్రశ్న

‘హిట్లర్‌ను... హిట్లర్‌ తాతను’ అంటూ గతంలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ‘టైమ్స్‌ నౌ’ ఇప్పుడు గుర్తు చేసింది. కేసీఆర్‌ తాజా హెచ్చరికలను ప్రస్తావిస్తూ... ‘ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? వీధి ముఠాను నడుపుతున్నారా?’ అంటూ ప్రశ్నించింది. ‘21వ శతాబ్దపు హిట్లర్‌ ముఖ్యమంత్రి’ శీర్షికతో ప్రత్యేక కథనం ప్రసారం చేస్తూ.. నియంతృత్వంలో హిట్లర్ కు కేసీఆర్ కు పెద్ద తేడా లేదని విమర్శించింది. ‘టైమ్స్‌ నౌ’ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ ఆర్ణబ్‌ గోస్వామి కేసీఆర్‌ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చర్చల్లో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ను ఉద్దేశించి.. ‘చంపేస్తారా? పది కిలోమీటర్ల లోతున పాతేస్తారా? మెడలు విరిచేస్తారా?’ అంటూ ఆర్ణబ్‌ గోస్వామి  ప్రశ్నించారు.

కేసీఆర్‌ది హంతకులు వాడే భాషగా అభివర్ణించారు. మీడియాపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయనపై తక్షణం కేసు పెట్టాలన్నారు. ఇంత చేసినా కేసీఆర్ కనీసం క్షమాపణ చెప్పకపోవడం దారుణమన్నారు. కేసీఆర్‌ వైఖరి చాలా ఆందోళనకరమని, ఆయన మీడియాతో ఘర్ష్షణ వైఖరిని అవలంబిస్తున్నారని ఎన్డీటీవీ విమర్శించింది. తెలంగాణ ప్రజలను, ఉద్యమాన్ని మేం ఎప్పుడు అవమానించలేదని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ స్పష్టం చేశారు. కానీ మా ఛానెల్ ను ఎందుకు నిలివేశారని ఆయన ఎన్డీటీవీ చర్చలో భాగంగా ఎంపీ కవితను అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేకపోయారు.

ప్రజాస్వామ్య మూలాలకు విఘాతం కలిగిస్తున్న కేసీఆర్‌: కులదీప్

తెలంగాణ సీఎం వ్యాఖ్యలు పత్రికా స్వేచ్ఛకేగాక, ప్రజాస్వామ్య మూలాలకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్‌ నయ్యర్‌ విమర్శించారు. ఆ వ్యాఖ్యలను దురదృష్టకరమైనవిగా అభివర్ణించారు. ‘కేసీఆర్‌కు ఏమైంది..’’ అంటూ ఆయన విస్మయం వ్యక్తం చేశారు. చానళ్ల ప్రసారాలను నిలిపివేయడాన్ని పిల్లచేష్టగా అభివర్ణించారు.  ఈ వ్యాఖ్యాలతో  కేసీఆర్ కు పరిపక్వత లేదని, విశాల హృదయం ఉన్న ప్రజాస్వామికవాది కాదని ఈ వ్యాఖ్యలతో తేలిపోయిందంటూ మండిపడ్డారు.

తెలంగాణ అనేది ఏర్పడింది. జరిగిందంతా చరిత్ర.. అవన్నీ మరిచిపోయి, విమర్శకులందర్నీ కలుపుకొని పోవాలి. అందరూ చేతులు కలిపితేనే తెలంగాణ అభివృద్ది జరుగుతుంది’’ అంటూ ఆయన హితవు పలికారు. తెలంగాణ ఏర్పాడటంలో మీడియా పాత్రకూడా ఉందన్నారు. కేసీఆర్‌ ఇకనైనా చానళ్లు పునఃప్రసారమయ్యేలా చూసి, ప్రజాస్వామి కంగా పాలనపై దృష్టి కేంద్రీకరించి, అభివృద్దికి పాటుపడాలని కులదీప్ హితవు పలికారు.

ఇంత దారుణంగా మాట్లాడే సీఎంను చూడలేదు: రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌

అధికారంలోకి వస్తూనే మీడియాపై దాడి చేయడం తెలంగాణ సీఎం కేసీఆర్‌ అసహనానికి నిదర్శనమని మరో ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ మండిపడ్డారు. కేసీఆర్ పరిపక్వత ఇంతేనా అంటూ అయన నిలదీశారు. కలసి రాకుంటే వేటు వేస్తామని హెచ్చరించడం కేసీఆర్ నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. తన 40 ఏళ్ల జర్నలిస్టు జీవితంలో ఇంత దారుణంగా మాట్లాడిన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని ‘ఔట్‌లుక్‌’ ఎడిటోరియల్‌ చీఫ్‌ వినోద్‌ మెహతా పేర్కొన్నారు.

కేసీఆర్ తీరును తప్పుబట్టిన వెంకట్ నారాయణ

తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్టు ఎస్‌.వెంకట్‌నారాయణలు సైతం కేసీఆర్‌ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. అలుపెరుగని వీరునిగా 13 ఏళ్లు పాటు ఉద్యమాన్ని నడిపి.. తెలంగాణను సాధించిన కేసీఆర్ మీడియాతో కలగలసి వుండాలని హితవు పలికారు. మీడియాతో శత్రుత్వం పెంచుకోవడం సరికాదని సూచించారు. ఇప్పటికీ తాను ఉద్యమకారుడినే అనుకుంటున్న కేసీఆర్.. ముఖ్యమంత్రినన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాకముందే మీడియాతో ఘర్షణ ఎందుకని ఆయన ప్రశ్నించారు. మీడియాలో ఏమైనా తప్పుడు వార్తలు వస్తే వాటిపై చర్య తీసుకోవడానికి న్యాయస్థానాలు, ప్రెస్‌ కౌన్సిల్‌తో సహా అనేక వేదికలున్నాయని, మీడియా యాజమాన్యంతో కూడా మాట్లాడవచ్చునని సూచించారు.

కేబుల్‌ ఆపరేటర్ల ద్వారా మీడియాను నియంత్రించడం సరైంది కాదని, ప్రజలే ఏది చూడాలో ఏది చూడకూడదో నిర్ణయించుకుంటారని ఆయన చెప్పారు. చట్టం, న్యాయస్థానాలు ప్రజాస్వామిక వ్యవస్థలపై గౌరవం పెంచాల్సిన ముఖ్యమంత్రి, అరాచకాన్ని ప్రోత్సహించరాదని స్పష్టంచేశారు. దీనివల్ల జాతీయ స్థాయిలో కూడా కేసీఆర్ తన ఇమేజ్ ను పోగొట్టుకుంటున్నారని సూచించారు. కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలరి.. సంయమనం పాటించాలని కోరారు. తక్షణం టీవీ9, ఏబీఎన్ అంధ్రజ్యోతి ఛానళ్లను పునరుద్దరించాలని వెంకట్ నారాయణ అభ్యర్థించారు.
 
ఎంతో అనుభవం గడించిన సీనియర్ జర్నలిస్టులు తమదైన శైలిలో సీఎం కేసీఆర్ ను నిలదీసినా.. ప్రశ్నించినా.. మీడియా స్వేచ్ఛకు విఘాతం కలగరాదన్న అంశమే తప్ప.. కేసీఆర్ ను విమర్శించాలని మాత్రం కాదు. మీడియా విషయంలో జోక్యం చేసుకోరాదని ఇప్పటికైనా టీఆర్ఎస్ నేతలు.. శ్రేణులు కేసీఆర్ చెవిన వేస్తే బాగుండు.. బంగారు తెలంగాణా నిర్మాణానికి మీడియా సఫోర్టు కావాలా..? వద్దా..? అన్నేది కూడా కేసీఆర్ తేల్చుకోవాల్సిందే. ఏకపక్షంగా వెళ్లి సాధించలేదని ‘ఐక్య’పక్షంగా కలసి సాధించవచ్చన్న విషయం ఉద్యమనేత కేసీఆర్ చెప్పాల్సిన అవసరం వుందంటారా..? ఇక ఇప్పడు ఏం చేయాలనేది ఆయనే నిర్ణయించుకోవాలి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : kcr  national media  arnab goswami  senior journalists  

Other Articles