President rule in ap

Preesident rule in AP, AP Chief Minister Kiran Kumar Reddy, Sonia Gandhi, TRS party, KCR, Shankara Rao, D Srinivas

President rule in AP

రాష్ట్రపతి పాలననే వజ్రాయుధంతో రాష్ట్రాన్ని ముక్కలు?

Posted: 01/09/2014 03:16 PM IST
President rule in ap

రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం, రాష్ట్ర స్థాయిల్లో దోబూచులు, దొంగాటలు, ఎత్తుకు పై ఎత్తులు జరుగుతున్నాయి.  ఎవరికీ ఏ విషయమూ క్షుణ్ణంగా తెలిసినట్లుగా లేదు.  చెయ్యరు చెయ్యరు అని ఆశించిన రాష్ట్ర విభజన తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీ చేసేసింది, రాదు రాదు అని అనుకున్న తెలంగాణా బిల్లు వచ్చేసింది,  జరగదు జరగదు అన్న చర్చ శాసన సభలో ప్రస్తతుతం జరుగుతోంది.  దాన్ని అడ్డుకుంటానన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ స్వయంగా, ఇప్పడు దాని మీద చర్చ జరగాలి అని అన్నారు.  ఇక్కడ చర్చ జరుగుతున్నందుకు కేంద్రం నుంచి సంతోషాన్ని కూడా వ్యక్తంచేసారు దిగ్విజయ్ సింగ్. 

జనవరి 23 వరకు రాష్ట్ర విభజన బిల్లు మీద అసెంబ్లీ నుంచి వ్యాఖ్యానాలను కోరిన రాష్ట్రపతికి ఆ సమయంలోగా అందకపోతే రాష్ట్రపతిపాలన విధించైనా సరే విభజన జరపాలన్న కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిప్పికొట్టారు. 

చర్చ జరగకుండా తాత్సారం చేసే పక్షంలో రాష్ట్రపతి పాలన విధించటానికి అవకాశముంటుందని భావించిన కేంద్రానికి రాష్ట్రంలో సొంత పార్టీలోనే కొరకరాని కొయ్యగా తయారైన కిరణ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి పాడే పాట ఒకటే- రాష్ట్రం సమైక్యంగా ఉండాలి, తెలంగాణా బిల్లు వీగిపోవాలి.  దానికోసం ఏమేం చెయ్యాలో అది చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారాయన. 

అయితే కిరణ్ కుమార్ ని తొలగించటం అనుకున్న పనిని సాధించటం కేంద్ర ప్రభుత్వానికి కష్టమూ కాదు, కొత్తా కాదు.  1973 లో పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి పాలనను విధించటం జరిగింది.  అందుకు కారణం వేరైనా చూపించిన కారణం వేరొకటి.  పివి ఆ సమయంలో భూసంస్కరణలను తీసుకుని రావటం కోసం మంత్రి వర్గ మార్పిడి చేసారు.  మంత్రి వర్గాన్ని మార్చే అధికారం ముఖ్యమంత్రికి ఉంది కాబట్టి దాన్ని తప్పుపట్టటానికి లేదు.  అందువలన ఆ సమయంలో జై ఆంధ్ర ఉద్యమాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి కొత్త మంత్రి వర్గం కనీసం ప్రమాణ స్వీకారానికి కూడా నోచుకోకుండా చెయ్యటం జరిగింది. 

ఇప్పుడు అడ్డుగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని తొలగించటానికి కూడా అదే విధంగా రాష్ట్రంలో ప్రాంతీయ పోరాటం ఎక్కువగా ఉన్నందువలన విభజన బిల్లుని తీసుకునివస్తే కనీసం దాన్ని చర్చకు కూడా రానంత గొడవలు జరుగుతున్నాయంటూ రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉండటంతో ఆ అవకాశాన్ని లేకుండా చెయ్యటం కోసం కిరణ్ కుమార్ రెడ్డి శాసన సభలో చర్చను మొదలుపెట్టించటం జరిగింది. 

మరోపక్క సోనియా గాంధీ భజన చేస్తున్నారు తెలంగాణా కాంగ్రెస్ నాయకులు.  మాజీ పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ సోనియాగాంధీ ప్రతిష్టను తెలంగాణాలో పెంచుతూ తెలంగాణా రాష్ట్ర అవతరణ సోనియే పెట్టే భిక్ష అనకపోయినా వరాల తల్లిగా పొగుడుతున్నారు.  అందులో రెండాకులు ఎక్కువే చదివిన మాజీ మంత్రి శంకరరావు ఏకంగా సోనియా గాంధీకి గుడే కట్టించి నిత్య పూజలు జరిపిస్తున్నారు. 

జరుగుతున్నదంతా నిశ్శబ్దంగా చూస్తున్న తెరాస అధ్యక్షుడు కెసిఆర్ చాలారోజుల తర్వాత మీడియా ముందుకి వచ్చి తనకు అలవాటైన ఇతర పార్టీలను తీవ్రస్థాయిలో విమర్శించే పనిలో పడకుండా తన వ్యవసాయ క్షేత్రంలో సాధించిన ప్రగతిని గురించి ఏకరవుపెట్టారు.  అందుకు కారణం మూడు నెలల్లో అంతమవబోతున్న ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్నులేని ఆదాయాన్ని చూపించటం కోసమే నంటూ కొందరు ఇతర పార్టీల నాయకులు ఎలుగెత్తారు. 

కానీ అదికమైన దిగుబడిని సాధించిన కెసిఆర్ అందుకు కారణాలను తెలియజేసారు.  మారుతున్న కాలంలో అందుబాటులో ఉన్న ఆధునాతనమైన సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకుని ఏ విధంగా దిగుబడిని పెంచుకున్నారో వివరించారు.  సంవత్సరంలో తాను తిరిగి కట్టేసిన బ్యాంక్ ఋణాల గురించి విపులీకరించిన కెసిఆర్ మాటలను వింటుంటే, మరి ఈ సూత్రాలను తెలంగాణా ప్రజలకు అందించి తెలంగాణాను సుభిక్షం చేసినట్లయితే ఇక తెలంగాణా ప్రాంతం వెనకబడివుండటం కానీ మా ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి మా తెలంగాణా మాకు ఇచ్చేయండి అనే అవసరం కూడా ఉండదేమో. 

నిన్న మంత్రి వట్టి వసంత కుమార్ శాసన సభలో చర్చను ప్రారంభించినా మూడు నిమిషాల్లోనే శాసనసభలో గందరగోళ పరిస్ధితి ఏర్పడి సభ వాయిదా పడింది.  అయితే ఈ రోజు దాని మీద చర్చ జరుగుతోంది. 

ఈరోజు తెలంగాణా బిల్లు మీద మాట్లాడుతూ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని వట్టి వసంతకుమార్ అన్నారు. 

మొత్తానికి చర్చ మొదలవటంతో అధికారికంగా శాసనసభ రికార్డ్ లో చోటుచేసుకునే విధంగా వ్యతిరేక వాదనలు వినిపించటానికి అవకాశం దొరికింది.  లేకపోతే అవికేవలం అనధికార ప్రకటనలు, వ్యక్తిగత భావాలు అయ్యుండేవి.  దానితో రాష్ట్రపతి పాలనకు కేంద్రానికి అవకాశం లేకుండా పోయింది. 

అసెంబ్లీలో చర్చ జరగటం లేదు కదా అని రాష్ట్రపతి పాలన విధించే అవకాశాన్ని కేంద్రానికి లేకుండా చేస్తూ ముఖ్యమంత్రి తన వంతు ప్రయాసతో అందరినీ ఒప్పించి చర్చను మొదలైతే పెట్టించారు కాబట్టి కేంద్రం వ్యూహం దెబ్బతిన్నట్టుగా తోస్తున్నది. 

రాష్ట్రపతిపాలన విధించి రాష్ట్రాన్ని విడగొట్టనట్లయితే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరపటానికి సంవత్సరకాలం ఆగవలసి వస్తుంది కాబట్టి ఈ లోపులో పరిస్థితిని సమీకరించుకుని భావి ప్రణాళికలను వెయ్యవచ్చన్న కేంద్ర ప్రభుత్వ ఆశలు నీరుకారాయి.  అసెంబ్లీలో చర్చ ప్రారంభమైంది కాబట్టి ఒకవేళ 23 వరకు పూర్తి కానట్లయితే సమయాన్ని పొడిగించమని అడిగే అవకాశం ఉంది కానీ చర్చే జరగకపోతే సమయాన్ని పొడిగించమని అడగలేరు. 

ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన పెట్టి పబ్బం గడుపుకోవాలనుకున్న వ్యూహానికి కిరణ్ కుమార్ రెడ్డి పై ఎత్తు వలన గండిపడింది. 

కానీ కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా తన సొంత పార్టీ అధికారంలో ఉండగానే రాష్ట్రపతి పాలన విధించాలనుకోవటం సబబా?  ఒకవేళ అదే ఇప్పుడు జరిగితే దాదాపు 40 సంవత్సరాల తర్వాత మరోసారి రాష్ట్రం రాష్ట్రపతి పాలనలోకి పోతున్నట్టు!

పోయినసారి జనవరి 11, 1973 నుంచి డిసెంబర్ 10 1973 వరకు సంవత్సరంకాలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో నడిచింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles