Atal Bihari Vajpayee death: Tributes pour in అటల్ జీ మృతి పట్ల ప్రముఖుల సంతాపం..

Atal bihari vajpayee death tributes pour in

atal bihari vajpayee, atal bihari vajpayee tributes, atal bihari tributes, atal bihari vajpayee condolence, vajpayee crtical, tributes, last rites, delhi, rastriya smruthi sthal, last journey, new delhi, aims, gwalior, special flights, security, hospital, vajpayee house

Former Prime Minister Atal Bihari Vajpayee dies in New Delhi, after a prolonged illness. Leaders from both sides of the aisle have condoled his death.

అటల్ జీ మృతి పట్ల ప్రముఖుల సంతాపం..

Posted: 08/16/2018 08:09 PM IST
Atal bihari vajpayee death tributes pour in

బీజేపీ అదినాయకుడు.. ఆర్ఎస్ఎస్ ధృవతార అటల్ బిహారీ వాజ్ పేయి మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ తమ సంతాపం వ్యక్తం చేశారు. అటల్ జీ ఇకలేరన్న వార్త తమనెంతో కలచివేసిందని, ఆయన కన్నుమూత దేశప్రజలకు తీరనిలోటని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. వాజ్ పేయి దేశప్రజలందరూ అభిమానించే ఒక గొప్ప ప్రధాని మాత్రమే కాదు, అయన ఒక ఉత్తమ పార్లమెంటేరియన్, గొప్ప సంఘ సంస్కర్త , నిస్వార్ధంగా, నిరాడంబరంగా జీవించిన ఒక మహనీయుడు అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు.

దేశం ఒక గొప్ప బిడ్డను కోల్పోయిందని అన్న వెంకయ్య నాయుడు.. వాజ్ పేయ్ క్రమశిక్షణకు మారుపేరని కొనియాడారు. ఆరెస్సెస్స్ ప్రచారక్ గా, భావుకుడైన కవిగా ఆయనను ఏ కోణంలో చూసినా స్పూర్తి ప్రదాతే అని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచి ఆయన్ను అభిమానించేవాడినని 'తరుణ హృదయ సామ్రాట్' అని పిలుచుకునే వాడినని అన్నారు. యువతరం గుండెల్లో నిలిచిన గొప్ప నేత తనపై చాలా ఆప్యాయత చూపేవారని.. మార్గనిర్దేశం చేసేవారని అన్నారు ఉపరాష్ట్రపతి. తనపైనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మందిపై అదే ఆప్యాయతను కనబర్చేవారన్నారు.

దేశంలో సుస్థిర ప్రభుత్వాన్నిఅందించారని, ఆయన నిజమైన భారతీయుడని కొనియాడారు ఉపరాష్ట్రపతి. మహనీయమైన వ్యక్తిత్వం,  చక్కని చాతుర్యంతో ఆయన చేసే ప్రసంగం, బాధ్యతాయుతమైన ఆయన జీవనం, స్నేహానికి ప్రాధాన్యతనిచ్చే గొప్ప లక్షణాలు ఉన్న నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిదని చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు.

ప్రియతమ నేత వాజ్ పేయి మృతితో యావత్తు దేశం శోక సంద్రంలో మునిగిపోయిందని నరేంద్ర మోదీ అన్నారు. దేశం కోసమే జీవించిన వాజ్ పేయి, దశాబ్దాల పాటు సేవలందించారని కొనియాడారు. ఈ సంఘటనతో బీజేపీ కార్యకర్తలు, లక్షలాది మద్దతుదారులు విషాదంలో మునిగిపోయారని అన్నారు. వాజ్ పేయి మరణం తనకు వ్యక్తిగతంగా పూడ్చలేని నష్టాన్ని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాజ్ పేయితో తనకు మర్చిపోలేని జ్ఞాపకాలు కోకొల్లలు ఉన్నాయని, తన లాంటి కార్యకర్తలకు ఆయన ఎంతో స్ఫూర్తి దాయకమని అన్నారు. వాజ్ పేయి ఇచ్చిన స్ఫూర్తి, ప్రేరణ, మార్గదర్శనం ప్రతి భారతీయుడికి అండగా ఉంటాయని, ఆయన ఆత్మకు శాంతి కలగాని ఈశ్వరుణ్ని ప్రార్థిస్తున్నానని మోదీ పేర్కొన్నారు.

వాజ్ పేయి మృతితో భారతదేశం ఒక దిగ్గజ నేతను కోల్పోయిందని, తండ్రిని కోల్పోయినంత బాధగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని వాజ్ పేయి నివాసంలో పార్థివదేహాన్ని మోదీ సందర్శించి నివాళు లర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మోదీ మాట్లాడుతూ, వాజ్ పేయి మరణం దేశానికి తీరనిలోటని, ఆయన మాకు ఎల్లప్పుడూ ప్రేరణగా నిలిచారని, మహానాయకుడికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని అన్నారు. బీజేపీని ఇంటింటికీ తీసుకెళ్లిన ఘనత వాజ్ పేయిదేనని కొనియాడారు.

అటల్ జీ మరణంపై స్పందించేందుకు మాటలు రావట్లేదు. ఆయన సీనియర్ నాయకుడు మాత్రమే కాదని, అరవై నాలుగేళ్లుగా తనకు మంచి మిత్రుడని అన్నారు. ఆర్ఎస్ఎస్ లో ప్రచారక్ గా చేరినప్పటి నుంచి వాజ్ పేయితో తనకు అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. ఎల్ కే అద్వానీ

అటల్ జీ మరణంతో దేశం గొప్పనాయకుడిని కోల్పోయింది. వాజ్ పేయి ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు నా సంతాపం: రాజ్ నాథ్ సింగ్

వాజ్ పేయి మరణంతో ఓ శకం ముగిసింది. గొప్ప ప్రజాస్వామ్యవాదిని కోల్పోయాం. వాజ్ పేయి ఓ సునిశిత విమర్శకుడు. ప్రధానిగా నిరంతరం ఏకాభిప్రాయ సాధన కోసం శ్రమించారు - మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

వాజ్ పేయి గొప్ప ప్రధాని మాత్రమే కాదు, మంచి వక్త కూడా. విశిష్ట ప్రజానాయకుడు, ప్రభావితం చేయగలిగే కవి వాజ్ పేయి - మన్మోహన్ సింగ్

బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని వాజ్ పేయి మృతితో భరతమాత తన ముద్దుబిడ్డను కోల్పోయింది. కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్న గొప్ప రాజకీయవేత్త వాజ్ పేయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను- రాహుల్ గాంధీ

నిబద్ధత కలిగిన రాజకీయవేత్త వాజ్ పేయి. వర్తమాన రాజకీయ నాయకులు ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - ములాయం సింగ్

ఓ మహావ్యక్తి అంతర్థానమయ్యారు. వాజ్ పేయి ఇచ్చిన స్ఫూర్తి, ప్రేరణలు జీవితాంతం నిలిచే ఉంటాయి - అఖిలేష్ యాదవ్

వాజ్ పేయి మృతి తీరని లోటు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పని చేసిన వాజ్ పేయి ఆత్మకు శాంతి చేకూరాలి. వాజ్ పేయ్ దేశానికే కాక యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన వ్యక్తి- సీఎం కేసీఆర్

భారత రాజకీయ భీష్ముడు, గొప్ప రాజనీతిజ్ఞుడిని దేశం కోల్పోయింది. ఉదారవాది, మానవతావాది, కవి, సిద్ధాంత కర్త, వక్త, అత్యుత్తమ పార్లమెంటేరియన్, ఒక్క ఓటుతో ప్రభుత్వం ఓడిపోయినా చలించని మేరునగధీరుడు- ఏపీ సీఎం చంద్రబాబు

వాజ్ పేయి మహాభినిష్క్రమణం భారత దేశానికి తీరని లోటు. ఆయన మన మధ్య ఇక ఉండరన్న విషయం జీర్ణించుకోవడం సాధ్యం కానిదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అవేదన వ్యక్తం చేశారు. అటల్ ఒక వ్యక్తి కాదు..ఒక శక్తి అని.. భారత మాజీ ప్రధానిగా ఆయన సాధించిపెట్టిన విజయాలు సర్వదా ప్రశంస నీయమైనవి అన్నారు. దేశాన్ని అణుశక్తి దేశంగా ఆవిష్కరించడానికి ఆయన చూపిన వజ్ర సంకల్పం, దేశ రక్షణకు కవచంగా మారింది. శత్రువులు మనవైపు కన్నెత్తి చూడడానికి భయపడేలా చేసిందని అన్నారు.

ఆయన హయాంలో మన దేశం అన్ని రంగాలలోను అభివృద్ధి దిశగా పరుగులు పెట్టింది. విలువలతో కూడిన ఆయన రాజకీయం ఈనాటి రాజకీయ నాయకులకు సర్వదా ఆచరణీయమని అన్నారు. బహు భాషా కోవిదుడైన వాజ్ పేయి ప్రసంగాలు రాజనీతి మేళవింపుగా ఎంత సేపు విన్నా వినాలనిపించేవిగా ఉంటాయి. కవిగా, రచయితగా ఆయన మనకు పంచిన కవితా సౌరభాలు చిరంతనంగా పరిమళిస్తూనే ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన భరతమాత ముద్దు బిడ్డగా పుట్టడం మన జాతి అదృష్టం. ఈ పుణ్య భూమికి ప్రధాన మంత్రిగా సేవలు అందిచడం మన భాగ్యం. రాజకీయ భీష్మునిగా కీర్తిని అందుకున్న వాజ్ పేయి చిరస్మరణీయుడని పవన్ ‘జనసేన’ తరపున శ్రద్ధాంజలి ఘటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles