కొమ్మినేని షో ఆగడానికి కారణం | Kommineni Srinivas clerifies his quit from KSR live Show

Kommineni srinivas clerifies his quit from ksr live show

KSR, Telagana, KSR Live Show, Ntv, Kommineni, Kommineni Srinivas, కొమ్మినేని శ్రీనివాస్, కొమ్మినేని, ఎన్టీవీ, కేఎస్ఆర్ లైవ్ షో

Famous Telugu Journalist Kommineni Srinivas clerifies his quit from KSR live Show. He release a letter on this issue. He condemn attacks on Media houses and Journalists.

కొమ్మినేని షో ఆగడానికి కారణం

Posted: 05/03/2016 09:24 AM IST
Kommineni srinivas clerifies his quit from ksr live show

ఎన్ టీవీలో రోజూ ఉదయం వచ్చే పాపులర్ కేఎస్ఆర్ లైవ్ షో (KSR Live Show) లో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అందరికీ తెలసు. కొద్ది రోజుల క్రిందట నుండి ఈ ‘ షో ‘ కు కొమ్మినేని రావడం లేదు. దీనికి అధికార పార్టీనే ప్రధాన కారణం అనే వార్త బయటకు వచ్చింది. తాజాగా కొమ్మినేని శ్రీనివాసరావు గారే స్వయంగా వివరణ ఇవ్వడంతో సంచలనమైంది. అధికార పార్టీ అనుకూలంగా జర్నలిస్టులు, టీవీ మీడియా లేకపోతే ఏకంగా టీవీ ప్రసారాలనే అధికార బలంతో అడ్డుకుంటారని తన వివరణలో ఆరోపిస్తూనే, ప్రజాస్వామ్యంలో ఇది మంచిది పద్దతి కాదని సూచించడం జరిగింది.


కొమ్మినేని శ్రీనివాసరావు స్వయంగా ఇచ్చిన వివరణ...

” మిత్రులందరికి ముందుగా క్షమాపణలు. గత ఏభై రోజులుగా ఎందరో మెసేజీలు ఇస్తున్నా, ఈ -మెయిల్స్ పంపుతున్నా సమాధానం ఇవ్వనందుకు మన్నించాలని కోరుతున్నాను. నేనే కావాలనే ఎవరికి సమాధానం ఇవ్వలేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎన్-టీవీలో రోజూ ఉదయం వచ్చే కేఎస్ఆర్ లైవ్ షోలో ఎందుకు మీరు కనిపించడం లేదని చాలామంది అడుగుతున్నారు. కొద్దికాలం ఆగి సమాధానం ఇవ్వాలని అనుకోవడం వల్ల రిప్లై ఇవ్వలేదు తప్ప వేరే కాదు. చాలామంది నా పట్ల ఎంతో అభిమానం చూపుతూ మాట్లాడుతున్నారు. వారందరికి ధన్యవాదాలు.

నిజమే. నేను ఆ షో చేయలేకపోవడానికి ప్రధానంగా రాజకీయాలే కారణం. సహజంగానే అధికారంలోకి వచ్చిన కొందరు పెద్దలు తమ ప్రభావం చూపాలని అనుకున్నారు. అందులో భాగంగానే నన్ను ఆ షో నుంచి తప్పించాలని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒత్తిడి చేశారు. ప్రజాస్వామ్యంలో అన్ని అభిప్రాయాలకు అవకాశం ఉంటుందని నమ్మేవారిలో నేను ఒకడిని, నాకుగా నేను తెలిసి ఎవరికి అనుకూలంగానో, వ్యతిరేకంగానో వ్యవహరించాలని అనుకోను. ఎప్పుడైనా పొరపాట్లు జరిగితే జరిగి ఉండవచ్చు. కానీ నిజాయితీగా, నిర్మొహమాటంగా, నిష్పక్షపాతంగా ఉండాలన్నదే నా అభిప్రాయం. అందుకు అనుగుణంగానే టివీ డిబేట్ లు ఉండాలన్నది నా లక్ష్యం. అందువల్ల పలు సమస్యలు వచ్చే మాట వాస్తవమే. అయినా వాటిని తట్టుకుని ముందుకు సాగాలి. కానీ ప్రభుత్వాలకు ఉండే అపరిమితమైన అధికార బలం ముందు వ్యక్తులు నిలబడడం కష్టం. అదే సమయంలో ఒక వ్యక్తి కోసం సంస్థలు దెబ్బతినరాదని నేను భావిస్తాను. వందల మంది ఆధారపడే సంస్థలు బాగుండాలి. అందుకే నేను ఎన్టీవీ నుంచి తప్పుకోవడానికి సిద్దమయ్యాను.లేకుంటే ఇప్పటికే ఒకసారి మూడు నెలలపాటు ఎపిలో టీవీని బంద్ చేశారు. మళ్లీ నా కారణంగా టీవీ ఆగిపోయే పరిస్థితి రాకూడదు. ఆ ఉద్దేశంతో బాధ్యతల నుంచి తప్పుకోవడానికి నిర్ణయించుకున్నాను. కాని ఎన్టీవీ యాజమాన్యం చైర్మన్ చౌదరి గారు నా పట్ల సహృదయతతో, గౌరవంతో అందుకు ఒప్పుకోలేదు. దాంతో కొంతకాలం టీవీ షో నుంచి తప్పుకోవాలని అనుకున్నాము. కొద్ది కాలం తర్వాత పరిస్థితులు మారతాయని, అప్పుడు తిరిగి షో చేయాలని అనుకున్నాము. ఆ క్రమంలో నేను కొంత కాలం యాజమాన్యం సహకారంతోనే కెనడా వెళ్లి వచ్చాను.

అయితే తిరిగి వచ్చాక కూడా ఇంకా సమస్య ఒక కొలిక్కి రాలేదు. సంప్రదింపులు జరుగుతున్నాయని యాజమాన్యం వారు చెప్పారు. మళ్లీ ఉద్యోగం నుంచి తప్పుకుంటానని, సంస్థ నా వల్ల ఇబ్బంది పడవద్దని యాజమాన్యానికి తెలిపాను. కాని వారు అంగీకరించలేదు. మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. దాంతో నేను కూడా మరీ మొండిగా ఉండరాదన్న ఉద్దేశంతో యాజమాన్యం నా పట్ల చూపిన ఆదరణకు కృతజ్ఞతగా ఉండాలని భావించాను. బహుశా మరి కొంతకాలం షో లోకి రాలేకపోవచ్చని అనుకుంటున్నాను. ఒకందుకు సంతోషంగా ఉంది. నేను ఎక్కడా ఆత్మ గౌరవాన్ని వదులుకోలేదు. ప్రజల పక్షాన, ఎవరు తప్పు చేసినా మాట్లాడే బాట నుంచి వైదొలగలేదు. నా అభిప్రాయాలు కొందరికి నచ్చకపోవచ్చు. కాని ఒక జర్నలిస్టు చేసే వ్యాఖ్యలకే ప్రభుత్వంలో అగ్ర స్థానంలో ఉన్నవారు భయపడతారా ? అనుకునే వాడిని. వాడి ఉద్యోగం తీయించుతారా ? అని అనుకుంటుండేవాడిని. కొందరు గొప్ప జర్నలిస్టులకు ఎదురైన అనుభవాలు తెలుసు. నిజానికి నేను అంత గొప్పవాడినేమీ కాదు. ఆ విషయంలో నాకు స్పష్టత ఉంది. కాని నేను ఎక్కడా రాజీపడకుండా ఉద్యోగం పోగొట్టుకోవడానికి కూడా సిద్దపడి నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అలాగే ఒక పార్టీ పట్ల అభిమానమో, ద్వేషమో లేవు. వ్యక్తులపై ఎలాంటి అగౌరవం లేదు. పరిస్థితులు మారతాయని, అధికారంలో ఉన్నవారు ప్రజాస్వామ్య విలువలకు ఎప్పటికైనా గౌరవం ఇస్తారని ఆశిస్తున్నాను ”

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles