Forgive us mahatma

mahatma Gandhi, Mohandas karamchand Gandhi, Gandhi's ideology, youth, westernization, freedom struggle, social network

forgive us mahatma..as we are n0t implementing your ideology

మహాత్మా..! మమ్ము క్షమించవూ..!

Posted: 10/02/2014 08:44 AM IST
Forgive us mahatma

కృషి వుంటే మనుషులు రుషులవుతారు, మహాపురుఫులవుతారు.. తరతరాలకీ తరగని వెలుగవుతారు, ఇలవేలుపులు అవుతారంటూ ఓ కవి రాసిన పాట మన జాతిపిత మహాత్మా గాంధీకి అచ్చంగా సరిపోతుంది. సత్యము, అహింసలను దేవతలు ఆరాధించిన గాంధీజీ.. సహాయ నిరాకరణ, సత్యాగ్రహములను పూజాసామాగ్రిలా వాడారు. అందుచేతనే ప్రపంచ వ్యాప్తంగా ఆరాధ్యుడయ్యాడు. పలువురు మహనీయులకు ఆదర్శప్రాయుడయ్యాడు. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా సీఎన్ఎన్ జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు.

కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటిన మహనీయుడు గాంధీజీ. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీరుడు. మూడు శతాబ్ధాల ఆంగ్లేయుల పాలనను తరమికోట్టి.. స్వయం పాలన, స్వరాజ్యం కోసం యావత్ దేశాన్ని ఒక తాటిపైకి తీసుకువచ్చి.. ఉద్యమం దిశగా ఉరిగోల్పిన మహనీయడు, మానవీయుడు గాంధీజీ. ఏ దేశ స్వాతంత్ర సంగ్రామం చూచినా హింసోత్పతాలు, రక్తచరిత్రలే. కానీ భారత దేశ స్వాతంత్య్రోద్యమనం ప్రపంచానికి శాంతి, సహనం, అహింస మార్గాలను నేర్పింది. వాటినే అయుధాలుగా మలచి యావత్ భారతదేశానికి స్వతంత్ర్యాని తీసుకువచ్చేలా చేసింది.

స్వాంతంత్ర సంగ్రామంలో గాంధీజీ అనుసరించిన బాట ప్రపంచ దేశాలకు దిక్సూచీలా మారింది. అఖండ భారతానికి స్వాంతంత్ర్యం లభించి ఆరున్నర దశాబ్ధాల కాలం పూర్తయినా.. ఇప్పటికీ ఆయన త్యాగాలను యావత్ ప్రపంచం గుర్తుంచుకుందంటే ఆదీ ఆయనలోని గోప్పదనం. అయన నడిచిన మార్గం, పాటించిన సిద్దాంతాలే ఆయనను చిరంజీవిని చేశాయి.

గుజరాత్‌లో గల పోర్‌బందర్ అనే గ్రామంలో 1869 అక్టోబర్ రెండవ తేదీన ఓ సామాన్య బ్రహ్మణ సాంప్రదాయ కుటుంబానికి చెందిన కరంచంద్ గాంధీ, పుతలీ బాయి దంపతులకు గాంధీ జన్మించారు. ఆయన పూర్తి పేరు మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ.  చిన్నతనం నుంచి కాస్త మెతక వైఖరితో పెరిగిన గాంధీకి ఆనాటి ఆచారం ప్రకారం తన 13వ ఏట కస్తూరీబాయితో బాల్యవివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం కూడా విద్యాభ్యాసాన్ని కొనసాగించి.. ఇంగ్లాండ్ వెళ్లి న్యాయశాస్త్రం పట్టభద్రుడై 1891లో భారత్‌కు తిరిగివచ్చారు.

అనంతరం 1893లో ఉద్యోగ రీత్యా దక్షిణాఫ్రికా చేరుకున్నారు. దక్షిణాఫ్రికాలో విపరీత ధోరణకి దారి తీసిన జాతి వివక్ష ఎదుర్కొని, ఉద్యమాలు చేశారు. గాంధీజీ సాగించిన ఈ ఉద్యమాల ఫలితంగా అధికారంలోని బ్రిటీష్ పాలకులు అక్కడ కొన్ని సంస్కరణలు ప్రవేశ పెట్టారు. ఇలా దక్షిణాఫ్రికాలో విజయం సాధించిన గాంధీ 1914 ప్రాతంలో భారత్‌కు తిరిగి వచ్చారు.

భారత్‌కు చేరిన గాంధీజీ కొద్ది రోజులకే ఆనాటి జాతీయ కాంగ్రెస్‌లో స్థానం సంపాదించారు. అయితే తొలి రోజుల్లో భారత్‌లో పాలన సాగిస్తున్న బ్రిటీష్ పాలకులకు అనుకూలంగా గాంధీ మాట్లాడేవారు. ఇది ఆనాటి కాంగ్రెస్‌లోని చాలామంది నేతలకు నచ్చేది కాదు. కానీ బ్రిటీష్ పాలనలో స్వేచ్ఛ, అధికారం కోరుకునేటప్పుడు వారి పాలనను సైతం సమర్థించాల్సిన అవసరం ఉందంటూ గాంధీ పేర్కొనేవారు.

అలా భారత రాజకీయాల్లో క్రమంగా క్రీయాశీలక పాత్ర పోషించడానికి సిద్ధమైన గాంధీ ఆ తర్వాతి కాలంలో బ్రిటీష్‌వారి పాలనలో జరుగుతోన్న అన్యాయాలు, అక్రమాలను ఎదిరించి అనేక ఉద్యమాలు చేశారు. అయితే దేనికోసం ఉద్యమం చేసినా సత్యం, అహింస అనే సిద్ధాంతాన్ని మాత్రం గాంధీ విడిచిపెట్టలేదు. ఇలా తాను నమ్మిన సిద్ధాంతంతో ముందుకు వెళ్లడం ప్రారంభించిన గాంధీ అనతికాలంలోనే ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు.

స్వాతంత్ర సంగ్రామ ఉద్యమంలో ఓ సామాన్యునిగా ప్రజలకు పరిచయమైన గాంధీ.. కొద్ది కాలానికే మహాత్ముడిగా, పూజ్య బాపూజీగా ప్రజల చేత పూజింపబడ్డారు. అలా కొంతకాలానికి జాతీయ కాంగ్రెస్‌లో ముఖ్య నేతగా మారిన తర్వాత బ్రిటీష్ వారిని దేశం నుంచి పూర్తిగా పంపించి వేయడానికి కారణభూతులయ్యారు. అయితే ఏనాడు తన ఆశయాన్ని గానీ, తన సిద్ధాంతాలను కానీ ఆయన విడిచి పెట్టలేదు.

చివరకు గాంధీ పోరాటం ఫలించి 1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. దాదాపు 300ఏళ్లు బ్రిటీష్ పాలనలో మగ్గిపోయిన భారతదేశం ఓ సామాన్యుడైన గాంధీ నాయకత్వంలో చివరకు స్వేచ్ఛా వాయువులు పీల్చగలిగింది. ఎక్కడో ఓ కుగ్రామంలో పుట్టి మంచి చదువులు చదివిన గాంధీ తన ఆలోచనలను, విద్యను కేవలం స్వీయ సంపాదనకు, సొంత ఆనందాలకు పరిమితం చేయకుండా దేశ ప్రజలందరి స్వేచ్ఛ కోసం పాటుపడడం ఓ గొప్ప విషయం. ఇంతటి గొప్ప త్యాగాన్ని చేయగలిగారు కాబట్టే మహాత్మాగాంధీ భారతావనికే కాక ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయుడైనారు. సత్యం, అహింస గురించి ఎవరు ఆలోచించినా వారి మనోఫలకంపై మెదిలే స్థాయిలో ఆ మహాత్ముడు ప్రజలందరిలో చెరిగిపోని ముద్ర వేశారు.

అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రప్రథమ నల్లజాతి అధ్యక్షుడిగా చరిత్ర తిరగరాసిన ఒబామా బారక్ తనకు నిలువెల్ల ప్రేరణ ఇచ్చిన మేటి వ్యక్తి మహాత్మా గాంధీయేనని పేర్కొన్నారు. జీవితానికి సంబంధించిన వాస్తవ సందేశం గురించి మహాత్మాగాంధీ తనకు ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటారని ఒబామా చెప్పారు. ప్రపంచ శాంతి దూత అయిన మహాత్మాగాంధీ పట్ల చెక్కుచెదరని ప్రేమ భావాన్ని హృదయంలో నిలుపుకునేందుకోసం తన సెనేట్ ఆఫీసులో మహాత్ముడి నిలువెత్తు చిత్రపటాన్ని ఒబామా అలంకరించుకున్నారు. అంతేకాదు, అమెరికాలో నల్లజాతి చైతన్యాన్ని 1960లలో రగుల్కొల్పిన మార్టిన్ లూథర్ కింగ్ నుంచి ఒబామా దాకా ఎందరో ప్రపంచ ప్రసిద్ధ ప్రముఖులు గాంధీ ప్రేరణ ప్రభావాల ఔన్నత్యం గురించి కొనియాడుతూ వస్తున్నారు.

అయితే ఇక్కడే మనం కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం వుంది. మహాత్ముని ఆశయాల కోసం మనం ఏం చేస్తున్నాం. ఎటుగా వెళ్తున్నాం. భారత్‌లో గాంధీ ఆశయాలు కనుమరుగు కావడమే విషాదకరం... రాను రాను యువతరం మరింత జఠిలమవుతున్నారు. గాంధీ ఆయుధాలు, ఆశయాలు వ్యతిరేకించే వారు ఆయన సమకాలికులలో ఎందరో వున్నా.. గాంధీనే ద్వేషించే స్థాయిని నేటి యువతరం దిగజారుతున్నారు. ఫ్యాషన్ పేరుతో పాశ్యాత దేశాల సంస్కృతిని అనుకరిస్తున్న యువతరం.. వంటిపై దోతి, టవల్ తప్ప ఏమీ వాడని గాంధీని విధ్వేషించే హక్కు ఎక్కడిది.

గాంధీజీ బొమ్మను ముద్రించిన కరెన్సీ నోట్లపై అమిత ప్రేమ చూపుతున్న యువతరం.. ఆయన ఆశయాల సాధన దిశగా ఎందుకు ముందుకు రారు. ప్రపంచ దేశాలు ఆయనను స్ఫూర్తిప్రదాతగా కొనియాడుతుంటే.. మనకెందుకు ఆయన మహనీయుడు అనిపించడంలేదు. మహనీయుడని అంగీకరిస్తే.. అహింస, సత్యములను ఆచరించాలనా..? ఇదేనా మనం మహాత్మునికి ఇచ్చే గౌరవం..? ఇదేనా మన పెద్దలు మనం నేర్పిన పాఠం..? నిజం చెప్పడానికి కూడా దడిచే వారు మనిషెలా అవుతాడు. హింసామార్గం విడనాడ లేని వాడు వింత పశువు కాక మరేమవుతాడు.?

టెలి కమ్యూనికేషన్ రంగాలలో వచ్చని విప్లవాత్మక మార్పలతో అందుబాటులోకి సోషల్ నెట్ వర్కింగ్, సెల్ ఫోన్ లలోని సమాచార స్రవంతిలో యువతరం విపరీత పోకడకు వెళ్తోంది. అక్టోబర్ 2న నా జయంతి.. అందుకనే ముందుగానే స్టాక్ తెచ్చిపెట్టుకోండంటూ మెసేజ్ లు వైరస్ లా వ్యాప్తిస్తోందంటే.. అహింస పరమోధర్మహ: అని చెప్పిన మహాత్ముని జయంతి రోజున మందు, విందులతో గడువుతోంది యువతరం. ఇదేనా మనం ఆయనకు ఇచ్చే గౌరవం. ఇదేనా మహాత్ముని మనమిచ్చే నివాళి. మన దేశంలో గాంధీ ఆశయాలు కనుమరుగు కావడం సహేతుకరమేనా..    

 ఏ సమాచార స్రవంతి లేని రోజుల్లోనే గాంధీజీ.. యావత్ దేశాన్ని ఒక్క తాటిపై నడిపినప్పడు.. విప్లవాత్మక మార్పులతో అన్ని సమాచారం సవ్రంతులను పునికి పుచ్చుకున్న నేటి యువతం ఇంకా ఎంతో సాధించే శక్తి వుంది. దానిని మనం వినియోగిస్తున్నామా..? అంటే లేదనే చెప్పాలి. మనకున్న తెలివితేటలతో మార్స్ గ్రహంపైకి తొలి ప్రయత్నంలోనే ప్రయోగాన్ని పంపాం. కానీ.. గాంధీజీ అశయాల సిద్ది కోసం మనం ఏం చేస్తున్నాం.. ప్రపంచ దేశాలు మన దేశాన్ని వేనోళ్ల పోగడుతున్నా. మనం ఎందుకు స్వీకరించడం లేదు. కేవలం ఒకటి, రెండు శాతం ప్రయోజకులతోనే దేశానికి ఇంత ఖ్యాతి వస్తుండగా, 20 నుంచి 30 శాతం మంది ప్రయోజకులుగా మారితే.. వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే ప్రపంచానికి మనమే దిక్సూచీలం అవుతామనడంలో అతిశయోక్తి కాదు. ఇకనైనా గాంధీజీ ఆశయాలు కొనసాగిస్తూ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ముందుకు సాగాలని కాంక్షిస్తుంది తెలుగు విశేష్

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles