Samajwadi party stumps bjp wins 8 seats in uttar pradesh

ruling parties, by poll results, voters, favour, 3 Mp, 33 Mla, bjp, samajwadi, Vadodara, rajasthan, lok sabha

voters turn in favour of ruling parties

ఉపపోరులో బీజేపికి ఎదురుగాలి

Posted: 09/16/2014 04:48 PM IST
Samajwadi party stumps bjp wins 8 seats in uttar pradesh

దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో అనుహ్య ఫలితాలు వచ్చాయి. సరిగ్గా మూడు నెలల క్రితం కేంద్రంలో ఏకపక్షంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపికి అవకాశమిచ్చన తరువాత..  వచ్చిన రెండో విడత ఉప ఎన్నికలలో కూడా మోడీ మానియా సరిగా పనిచేయలేదు. నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిని చేసిన ఓటర్లు.. మూడు నెలల్లోపు ఆయనను ఎందుకు దూరం చేసుకుంటున్నారన్న విషయమై పార్టీలో ఆత్మపరిశీలన జరగాల్సిన అవసరముంది. కేంద్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల తీర్పుగా ఈ ఫలితాలను పరిగణించాల్సిన అవసరం లేదని బీజేపి పార్టీ వర్గాలు చెబుతున్నా.. మోడీ 100 రోజుల పాలనకు నిదర్శంగా ఈ ఎన్నికల ఫలితాలు నిలుస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఓటర్లు అధికార పక్షాన నిలిస్తే, రాజస్థాన్ లో ఓటర్లు ప్రతిపక్షాన నిలిచారు.

మినీ భారత్ ఎన్నికలను తలపించిన ఈ ఎన్నికలలో బీజేపి ప్రతిష్ట మసకబారింది. మోడీ మానియా తగ్గింది. యూపీ, రాజస్థాన్, అస్సోం, పశ్చిమ బెంగాల్ లలో బీజేపికి ప్రతికూల పవనాలు విచాయి. భారీ మెజార్టీతో కేంద్రంలో అధికారం దక్కించుకున్న బీజేపీ  చాలా చోట్ల గట్టి పోటీ ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లోని 3 లోక్ సభ, 33 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో బీజేపి ఎదురుగాలి వీచింది. మూడు లోక్ సభ స్థానాలలో గుజరాత్ లోని వడోదర నుంచి బీజేపి అభ్యర్థి రంజన్ భట్ గెలుపొందగా, మెదక్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఉత్తర్ ప్రదేశ్ లోని మెయిన్ పురి నుంచి ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మనవడు తేజ్ ప్రతాప్ యాదవ్ గెలుపోందారు.

గుజరాత్ లో..
గుజరాత్లో తొమ్మిది అసెంబ్లీ, ఓ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగగా, వడోదర లోక్ సభ స్థానాన్ని అధికార బీజేపి కైవసం చేసుకుంది. ఈ స్థానం నుంచి బరిలో నిలిచిన బీజేపి అభ్యర్థి రంజన్ భట్ లక్షా 83 వేల ఓట్ల మెజారిటీతో గెలుపోందారు. తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఆరింట మాత్రమే బీజేపి గెలిచింది. మరో మూడు స్థానాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. చుకోటగా నిలిచిన గుజరాత్ లోనే బీజేపి కాంగ్రెస్ తో పోరాడాల్సి వచ్చించి. అనేక చోట్ల బీజేపి అభ్యర్థులు కాంగ్రెస్ నుండి గట్టి పోటీని ఎదుర్కోన్నారు. గడిచిన 12 ఏళ్లలో గుజరాత్‌లో మోడీ లేకుండా జరిగిన తొలిఎన్నికలలో.. పార్టీ పరాభవం అంచున నిలిచింది. మితిమీరిన ఆత్మవిశ్వాసం బీజేపీని ఇబ్బందుల్లో నెట్టినట్టు కనిపిస్తోంది.  ఉపఎన్నికల్లో సీనియర్‌ నేతలెవరూ ప్రచారం చేయలేదు.  మోడీ ఎమ్మెల్యేగా ఉన్న మణినగర్‌ నియోజకవర్గంలో కేవలం 33 శాతం పోలింగ్ నమోదవటం గుజరాత్‌ ఓటర్ల నిరాకస్తతను తెలిపింది.

రాజస్థాన్ లో..
రాజస్థాన్ లో అధికార బీజేపి పార్టీపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఇటీవలే అధికార బీజేపి వంద రోజుల పాలనను పూర్తి చేసుకోగా ప్రభుత్వ పరిసాలనకు ఓటర్లు వ్యతిరేక తీర్పునిచ్చారు. కాంగ్రెస్ ఈ ఉప పోరులో తన సత్తాను చాటింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిచిన బీజేపి అభ్యర్థుల రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికల ఫలితాలలో బీజేపి ఖంగుతినింది. బీజేపికి చెందిన నాలుగు స్థానాలను తిరిగి సంపాదించడంలో పార్టీ విఫలమైంది. నాలుగింట మూడు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వియర్, సురజ్గఢ్, నసీరాబాద్ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. కోట దక్షిణ నియోజవర్గంలో బీజేపీ అభ్యర్థి సందీప్ శర్మ విజయం సాధించారు. తమ అభ్యర్థులను గెలిపించినందుకు కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ రాజస్థాన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఉత్తర్ ప్రదేశ్ లో...
ఉత్తర్ ప్రదేశ్ లోని 11 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో కూడా ప్రజలు బీజేపి ప్రతికూలంగా తీర్పునిచ్చారు. బీజేపి పార్టీకి చెందిన పది మంది ఎంపీలతో పాటు ఎస్పీకి చెందిన మరో ఎంపీ.. వారి ఎమ్మెల్యే సీట్లను వదులుకోవడంతో.. ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. మొత్తం 11 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో అధికార సమాజ్ వాదీ పార్టీ 8 స్థానాలలో గెలువగా బీజేపి కేవలం మూడు స్థానాలను మాత్రమే దక్కించుకుంది. ఉప పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ బీజేపికి తలదన్నే జవాబునిచ్చింది. మంచి రోజుల వస్తాయని లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చురకలంటించారు. మంచి రోజులే కాదు మంచి పరిణామాలకు కూడా వుంటాయని అఖిలేష్ వ్యాఖ్యానించారు.

అసోంలో...
అసోం రాష్ట్రంలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల లెక్కింపులో  రెండు స్థానాలలో ఏఐయూడీఎఫ్ అభ్యర్థులు ముందంజలో ఉండగా మరో స్థానంలో బీజేపీ అభ్యర్థి దూసుకుపోతున్నారు. రాష్ట్రంలోని మూడు శాసనసభ నియోజకవర్గాలైన సిల్చెర్, జమునాముఖ్, లక్ష్మీపూర్లో ఉప ఎన్నికలు జరిగాయి. అటు బెంగాల్ లో ఉపఎన్నికలు జరిగిన రెండు చోట్ల ఓ స్థానంలో తృణమూల్‌ కాంగ్రెస్‌, మరో స్థానంలో బీజేపీ విజయం సాధించాయి. సిక్కింలోని రాన్ గ్యాంగ్ యాన్ గ్యాంగ్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో తమ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరిగి నిలబెట్టుకుంది. పశ్చిమ బెంగాల్ లో రెండు స్థానాలకు జరిగిన ఉపఎన్నికలలో అధికార తృణముల్ కాంగ్రెస్, బీజేపిలు చెరోస్థానాన్ని నిలబెట్టుకున్నాయి.

తెలంగాణలో ‘కారు హవా
ఇటు మెదక్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి 2లక్షల 67 వేల 900 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలవగా, బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో టీఆర్ఎస్ తొలి రౌండ్ నుంచి ఆదిక్యం కనబరుస్తూ వచ్చింది. సంగారెడ్డి, గజ్వల్ లలో బీజేపి, నర్సాపూర్, పటాన్ చెరువు నియోజకవర్గాలలో కాంగ్రెస్ రెండవస్థానంలో నిలువగా, అన్ని నియోజకవర్గాల్లో కారు మొదటిస్థానంలోనే నిలిచింది. అధికార పక్షాన్ని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ చేసిన ప్రయత్నాలను మెదక్ ప్రజలు తిప్పికొట్టారు. టీఆర్ఎస్కే మళ్లీ పట్టం కట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామాతో వచ్చిన ఎన్నికలలో మరోమారు టీఆర్ఎస్ నే గెలిపించారు.

బంగారు తెలంగాణకు కృషి: కొత్త ప్రభాకర్ రెడ్డి
మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఊహించిందేనని ఆ పార్టీ లోక్ సభ అభ్యర్తి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఓటింగ్ శాతం తగ్గినా.. ఓటు వేసిన ప్రజలు మాత్రం టీఆర్ఎస్ పక్షాన నిలిచారన్నారు. మంచి మెజార్టీతో గెలిపించినందుకు తాను ప్రజలకు రుణపడి వుంటానన్నారు. గెలుపుకు కృషి చేసిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు టీఆర్ఎస్ను విశ్వసించారని, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ది చెందుతుందని నమ్మారని కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి టీఆర్ఎస్ కట్టుబడి ఉందని చెప్పారు

ఆంధ్రప్రదేశ్ లో సైకిల్ జోరు
కృష్ణాజిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని తంగిరాల సౌమ్య భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబూరావుపై ఆమె 74,827 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంతకుముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించిన తంగిరాల ప్రభాకరరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకముందే మరణించారు. దాంతో ఉప ఎన్నిక నిర్వహించారు. మొదటి రౌండు నుంచి చివరి వరకు తంగిరాల సౌమ్య ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చారు. చివరకు ఆమెకు మొత్తం 99748 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి బాబూరావుకు 24,921 ఓట్లు మాత్రమే వచ్చాయి.

నాన్నకు నందిగామ ప్రజలిచ్చిన నివాళి: సౌమ్య
తనకు దక్కిన ఈ విజయాన్ని తన తండ్రి తంగిరాల ప్రభాకరరావుకు ప్రజలు ఇచ్చిన నివాళిగా భావిస్తానని నందిగామ ఎమ్మెల్యేగా ఉప ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థిని తంగిరాల సౌమ్య చెప్పారు. విజయవాడను రాజధానిగా చేసినందుకు ప్రజలిచ్చిన కానుకగా అభివర్ణించారు. మొదటినుంచి ఎన్నికల ప్రచారంలో ఎంతో సహకరించిన రాష్ట్ర మంత్రులకు అమె కృతజ్ఞతలు. తెలిపారు. నమ్మి ఓటు వేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. అందరి సహకారంతో నందిగామను అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. విజయం ఊహించాను గానీ ఇంత భారీవిజయం ఊహించలేదని చెప్పారు. నియోజక అభివృద్ధికి పాటుపడతానన్నారు.

వంద రోజలు పాలనకు వచ్చిన తీర్ప: చంద్రబాబు
కృష్ణా జిల్లా నందిగామలో టీడీపీ విజయం సాధించడంపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. తమ 100 రోజుల పాలనపై ప్రజల తీర్పునకు నిదర్శనమని అన్నారు. విజయం సాధించిన తంగిరాల సౌమ్యకు చంద్రబాబ అభినందనలు తెలిపారు. నిరంతర విద్యుత్, ధరల నియంత్రణ నిర్ణయాలకు ప్రజామోదమే ఈ విజయమని చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్ లో మరింత అభివృద్దితో ప్రజామోదాన్ని పోందుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ruling parties  by poll results  voters  favour  3 Mp  33 Mla  bjp  samajwadi  lok sabha  

Other Articles