Comfortable posture for meditation

comfortable posture for meditation, Meditation means doing nothing, Right posture for miditation, Meditation practice, Sitting posture is a stable one, Stable and comfortable posture for meditation

comfortable posture for meditation

ధ్యానంలో స్థిరంగా కూర్చోవటం ఎందుకు?

Posted: 02/26/2014 12:52 PM IST
Comfortable posture for meditation

ధ్యానానికి స్థిరసుఖాసనం సరైన ఆసనం అని ఎందుకు చెప్తారు?  ఏమిటా స్థిర సుఖాసనం?     

ధ్యానం అంటే నిజానికి ఏమీ చెయ్యకుండా ఉండటం.  ఇంకా వెనక్కిపోయి అసలు చెయ్యటమంటే ఏమిటో చూస్తే, మనం మన కాళ్ళూ చేతులు మొదలైన శరీరాంగాలను ఉపయోగించటం.  వాటిని ఉపయోగించి ఏ పని చేసినా మన శరీరంలోని శక్తిని వినియోగించుకోవటం జరుగుతుంది.  అంటే, శక్తి వినియోగం లేకపోవటమే ఏమీ చెయ్యకుండా ఉండటమని అర్థం చేసుకోవచ్చు. 

శరీరంతో మనం చేసే పనులతో ధ్యానంలో ఉన్నప్పుడు పని లేదు, శరీరంలో లోపల శరీర వ్యవస్థ తనంతట తాను చేసుకునే పనులకు మన అవసరం లేదు.  శరీరం తనంతట తాను చేసుకునే పనులకు శక్తి వినియోగం జరుగుతుంటుంది.  కాబట్టి పూర్తిగా శక్తి ఉపయోగం జరగటం లేదని కాదు కానీ మనంతట మనం ఉపయోగించకుండా ఉండటమే మనం ఏ పనీ చెయ్యకుండా ఉన్నట్లు.  ఎలక్ట్రిక్ మీటర్ ముందుకు పరిగెడుతుందీ అంటే ఇంట్లో ఎక్కడో ఏదో ఉపకరణాన్ని మనం ఉపయోగిస్తున్నామన్నమాట.  అన్నిటినీ ఆఫ్ చేస్తే మీటర్ నడవదు. 

అందువలన ధ్యానంలో శరీరాన్ని స్థిరంగా ఉంచుకుంటే చాలు.  స్థిరంగా ఉంచుకోవటమంటే బ్యాలన్స్ చేసుకునే అవసరం కూడా పడగూడదన్న మాట.  శరీరం అటూ ఇటూ ఊగుతుంటే దాన్ని నిలపటానికి కూడా మనం ఏ కండరాలనో లేక కీళ్ళనో గట్టి గా పట్టుకుని శరీరాన్ని కదలకుండా ఉంచవలసివస్తుంది.  అలాగని పడుకుంటే నిద్రలోకి జారుకునే అవకాశం ఉంది.  కాబట్టి పడుకోగూడదు, బ్యాలన్స్ కోసం కూడా శరీరంలోని శక్తిని ఉపయోగించగూడదు.  అంటే మనం ఉన్న భంగిమలో శరీరాన్ని స్థిరంగా నిలపటం కోసం కూడా శక్తిని ఉపయోగించుకునే అవసరం పడగూడదు.  అటువంటి శరీర భంగిమే స్థిరాసనం.  స్థిరంగా కూర్చునే ఆసనం స్థిరాసనమైతే, ఇబ్బంది లేకుండా హాయిగా ఎంతసేపైనా ఉండగలిగేది సుఖాసనం.  ఈ రెండూ కలిసినట్లయితే స్థిరసుఖాసనమౌతుంది.  అప్పుడు శక్తి వినియోగమూ జరగదు, ఇబ్బంది లేకుండా ఎక్కువ సేపు కూర్చోగలుగుతారు కనుక ఎక్కువ సేపు ధ్యానం చెయ్యగలుగుతారు.  అందుకే ధ్యానానికి స్థిర సుఖాసనాన్ని సూచించారు గురువులు. 

అలా ధ్యానంలో స్థిరసుఖాసనాన్ని సూచించటానికి ఇంకా కూడా కారణాలున్నాయి.  అందులో ముఖ్యమైనవి ఇవి-

1. ధ్యానం వలన శరీర వ్యవస్థ శక్తిని పుంజుకుంటుంది.  ప్రకృతిలోని శక్తి నుంచి శరీర వ్యవస్థ శక్తిని గ్రహించాలంటే అందుకు ఒకటే మార్గం.  అదేమిటంటే శక్తి వినియోగం జరగకూడదు.  అంటే శరీరంతో చేసే ఏ పనిలోనూ ఉండగూడదు.     

2. ధ్యానంలో మనసుని నియంత్రించటం జరుగుతుంది.  నియంత్రించే పని పెట్టుకుంటే మళ్ళీ అది కూడా పనే అవుతుంది, అక్కడా శక్తి వినియోగం జరుగుతుంది.  ధ్యానంలో మనసు నియంత్రించబడుతుంది.  మనమా పనిని ప్రత్యేకంగా పెట్టుకోనక్కర్లేదు.  శక్తి ఎలాగైతే దానంతటది వస్తుందో అలాగే మనసు నియంత్రణ కూడా దానంతటదే జరిగిపోతుంది దానికోసం ప్రత్యేకంగా మనమేమీ చెయ్యకుండానే. 

3. వస్తు గుణాలతో మనకు కనిపించే శరీరాన్నే నియంత్రించలేకపోతే, మనసు చేతికి అందనిది, కంటికి కనపడనిది, సూక్ష్మరూపంలో ఉండేది అలాంటిదాన్ని ఎలా నియంత్రించగలుగుతారన్నది ప్రశ్న.  మనసు మనం చేసే పనులను, ఆలోచనలను అనుసరించి పనిచేస్తుంది కాబట్టి శరీరాన్ని స్థిరంగా ఉంచగలిగితే మనసు కూడా స్థిమితపడే అవకాశం ఉంది- గ్యారెంటీ లేకపోయినా.  కానీ శరీరమే స్థిరంగా లేకుండా కార్యకలాపాలలో మునగితే ఇక మనసు స్థిమితంగా ఎలా ఉండగలుగుతుంది. 

ఇంటి యజమాని అలజడిలో ఉన్నా లేక ఏదైనా పనితొందరలో ఉన్నా ఇంట్లో సభ్యులంతా అలజడికి లోనవుతారు కదా.  అలాగే శరీరంతో ఏదైనా కార్యకలాపానికి పూనుకున్నప్పుడు మనసు అక్కడికి పోకుండా ఎలా ఉంటుంది. 
అందువలన, స్థిరంగా కూర్చోవటమన్నది ధ్యానానికి సంసిద్ధత.  సుఖంగా కూర్చోవటం వలన ధ్యానం కొనసాగుతుంది.  కాబట్టి స్థిర సుఖాసనం ధ్యానానికి అనువైన భంగిమ అని ఆధ్యాత్మిక సాధనలో అనుభవంకలవారు చెప్పారు. 

కాళ్ళు మడుచుకుని కింద కూర్చోవటం వలన శరీరం కింది భాగం వెడల్పుగా ఉండటంతో గరిమనాభి నేలకు దగ్గర్లో ఉండటం జరుగుతుంది, దానితో ఆ ఆకారానికి స్థిరత్వం ఏర్పడుతుంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles