Interview with director sukumar

Sukumar Interview, movie interviews, actor interviews, actress interviews, music director interviews, directors interviews, political person interviews,tollywood, indian, films, movies, entertainment, reviews, ratings, film star interviews, pictures,, travel, Money,Movies, box office, gossip, film industry news, indian songs, music, latest box office hits, telugu movie, albums,stills,Audio,songs, telugu, cine, actors, actresses, film star, indian culture, USA, AP, Andhra,DVD,VCD, CD,VHS, tapes, India, andhra

Sukumar Interview, movie interviews, actor interviews, actress interviews, music director interviews, directors interviews, political person interviews

Interview with director Sukumar.GIF

Posted: 02/17/2012 12:16 PM IST
Interview with director sukumar

Interview_with_director_Sukumar

ప్రేమను అమితంగా ప్రేమించే ప్రేమ చిత్రాల దర్శకుడు సుకుమార్ ‘‘నాకు ఏదైనా పాతబడినకొద్దీ నచ్చుతుంది’’ అంటారు. పాత బిల్డింగులు, పాత వస్తువులు, పాత ప్రేమలు... ఇప్పటి ఈ క్షణం జ్ఞాపకంగా మారాక మరింత బాగుంటుందంటారు. రేపటికి ఇవ్వాళ నిన్నవుతుంది కాబట్టి, మళ్లీ ఇవ్వాళన్నా ఆయనకు ప్రేమే అయ్యుండాలి. ఎందుకంటే, రేపెప్పుడో తీపి గురుతులుగా మిగిలిపోయే సినిమాలను నిర్మించుకునే అవకాశం ఈరోజు ఇస్తుంది కాబట్టి. క్లారిటీతో కన్‌ఫ్యూజ్ చేసే ఈ యువ సంచలన దర్శకుడు... ఆర్య, జగడం, ఆర్య-2, 100 పర్సెంట్ లవ్ చిత్రాల ద్వారా ప్రేమకు భిన్నమైన నిర్వచనాలిస్తున్నాడనుకోవచ్చు. లేదూ ప్రేమను ఎన్ని రకాలుగా నిర్వచించుకుంటూ పోయినా ఇంకా ఏదో మిగిలివుంటుందని చెబుతున్నాడనుకోవచ్చు. మరి ఈ మాజీ లెక్కల టీచర్ అంతరంగం... మీకొసం...

Sukumarఒక వయసొచ్చాక, ఎమోషన్స్‌ కన్నా కాలిక్యులేషన్స్ ముఖ్యమవుతాయి. నా స్వచ్ఛమైన ఎమోషన్స్ అన్నీ నా బాల్యంలోనే ఉన్నాయి.
కొబ్బరిచెట్లు, ఏటిగట్లు, పిల్లకాలువలు ఉన్న అందమైన ఊరు మాది. ధాన్యం, బియ్యం, కొబ్బరి... ఇలా నాన్న రకరకాల వ్యాపారాలు చేశారు. పైకొచ్చారు, చితికిపోయారు, మళ్లీ పైకిరావడానికి పోరాటం చేశారు. అందుకే నాన్నే నాకు ఇన్‌స్పిరేషన్. మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా పెంచారు. అప్పుడు తెలియలేదుగానీ నాకు కూతురు పుట్టాక అర్థమవుతోంది, ఆయన మాపట్ల ఎంత ఎమోషనల్‌గా ఉండేవారో!మావైపు సాధారణంగా వీరవేంకట సత్యనారాయణ తరహా పేర్లెక్కువ. అయితే, ఎక్కడో ఒక కేరళ సంబంధిత వార్తలో ‘ఇన్‌స్పెక్టర్ సుకుమార్ పరిశోధిస్తున్నారు’ అని నాన్న చదివారట. ఈ పేరేదో బాగుందని నాకు పెట్టారు. రేర్ నేమ్ కదా... స్కూల్లో ఒక్కడే సుకుమార్, కాలేజీలో ఒక్కడే సుకుమార్, లెక్చరర్‌గా చేసినా ఒక్కడే సుకుమార్!నాకు ముగ్గురు అన్నయ్యలు, ఇద్దరు అక్కయ్యలు. చిన్నాణ్ని కదా! ముద్దొస్తే అందరూ ముద్దుచేసేవారు. తేడావస్తే వరుసగా ఫాట్‌మని కొట్టేవారు.

అనుకరణే జీవితం
చిన్నప్పట్నుంచీ స్కూలు పుస్తకాలకన్నా కవిత్వం, నవలలంటే పిచ్చి. పెద్దన్నయ్య మధుబాబు నవలలు తెచ్చేవాడు. చదివి ఎప్పుడు పక్కన పెడతాడా? అని చూసేవాణ్ని. పెట్టేయగానే అటక ఎక్కేసేవాణ్ని. ఎందుకంటే రెండో అన్నయ్య తీసుకోవచ్చు, లేదంటే చిన్నక్క ‘ఇవ్వరా’ అని చేతిలోంచే లాక్కోవచ్చు. అలాగే ఊరి గుళ్లో ఒక యువపూజారి ఉండేవారు. వీక్లీల్లో వచ్చే సీరియల్స్ అన్నీ చించి ఫైల్ చేసేవారు. నాకు చదవడానికి ఇచ్చేవారు.నేనేమనుకుంటానంటే, జీవితం అనేది ఇంప్రెషన్. వేరే ఎవరో ఏదో చేస్తున్నారంటే మనమూ చేయడానికి ప్రయత్నిస్తాం. ఆయన వెన్నెల్లో కూర్చుని కథలు చెబుతుండేవాడు, అన్నవాక్యం చదివితే నేనూ కూర్చుని ఫ్రెండ్సుకు కథలు చెప్పేవాడిని. ఆయన గోదారి మీద కవిత చెప్పాడంటే నాకూ రాయాలనిపించేది. అది రాసి ఏం చేస్తామనే ఐడియా ఉండేదికాదుగానీ రాయాలన్న తపప ఉండేది. శివకోడులో చదువుకున్నప్పుడు రామతులసమ్మ అని హిందీ టీచరుండేవారు. జిల్లెళ్లమూడి అమ్మలా ఉండేది. ఆప్యాయంగా మాట్లాడేది. ఆమెకు ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు వస్తే సన్మానసభలో చదవడానికి ఏదో రాశాను. ఉపాధ్యాయిని నువ్వు, ఉత్తమ ఉపాధ్యాయిని నువ్వు... లాంటి కవిత్వం! అయినా, ‘మీ అబ్బాయి కవిత రాశాడు విన్నారా’ అని ఎవరైనా నాన్నతో చెబుతుంటే నాకు గొప్పగా ఉండేది.

రాజోలులో ‘సాహితీ స్రవంతి’ అనే సంస్థ ఉంది. కొత్తవాళ్లు కవిత్వం రాస్తే ఎంకరేజ్ చేసేవారు. ఇంటర్ చదువుతున్నప్పుడు నా కవితలు అందులో అచ్చయ్యాయి. ఓరోజు మా ఫ్రెండు సైకిల్ మీద స్పీడుగా వచ్చి, ‘రేయ్ నీ పేరు పేపర్లో పడిందిరా’ అన్నాడు. చూస్తే ‘చేరాతలు’ కాలమ్. చివర్న నా గురించి ‘ఇదొక అద్భుతమైన ప్రతిభావంతమైన గొంతు’ అని రాశారు. చేకూరి రామారావంతటాయన మెచ్చుకోగానే, ఎక్కడికో వెళ్లిపోయాను.కవిత్వపు లెక్కలు

నాకు రాయడం ఇష్టం, కవిత్వం చదువుకోవడం ఇష్టం, ఏదో వ్యక్తీకరించడం ఇష్టం... అలాంటిది ఈ లెక్కల్లో చిక్కుకుపోయానే! ఈ మథనానికి కారణం ఉంది. చిన్నప్పుడు సైంటిస్టు కావాలనుకునేవాణ్ని. అప్పుడేకదా, లోకం మనగురించి మాట్లాడుతుంది! ఒక సైన్సు ఫెయిర్‌కెళ్లి అక్కడి విద్యార్థుల ప్రాజెక్టులు చూశాక, నేనింక ఐన్‌స్టీన్ కాలేనని డిసైడ్ చేసుకున్నా. ఓసారి మా స్కూలుకు ఎదురుగా ఉన్న బిల్డింగులోనే ‘కనక మహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్’ షూటింగ్ జరుగుతుంటే దర్శకుడు వంశీని చూశాను. ఆయన అందరినీ కమాండ్ చేస్తున్నారు. అబ్బా! నేనుకూడా ఇలా అయిపోవాలనుకున్నా. అలాగే యండమూరి రచనలు నన్ను కుదిపేసేవి. కాబట్టి నేను కూడా రైటర్ కావాలనుకున్నా. అయితే ఆయన ‘స్ట్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్’ డెరైక్షన్ చేస్తున్నారని తెలిసింది. అంటే, రైటర్‌కంటే డెరైక్టర్ సూపరేమో! ఒక మనిషి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఏ ఒక్కటో కారణం కాదు, వంద ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. అలా ఇవన్నీ నేను డెరైక్టర్ అయిపోవాలనే కలకు బీజం వేసి, నీళ్లు పోశాయి.

సినిమా అడుగులు

ఇక సినిమా ఆలోచన నన్ను నిలవనీయకుండా చేసిన క్షణాన ఉద్యోగం వదిలేసి హైదరాబాద్ వచ్చేశాను. చాలామంది దర్శకులను కలిశాను. కొందరిని కలవడానికి కూడా అనుమతి దొరకలేదు. అలా రెండున్నరేళ్లు గడిచాయి. ఇప్పుడు నాకు అర్థం అవుతోంది ఏంటంటే, మీరు కావాలంటే ఐఏఎస్ ఆఫీసర్ కావొచ్చు. దానికో మార్గం ఉంది. బాగా చదివితే సెలెక్ట్ అవుతారు. కానీ అసిస్టెంట్ డెరైక్టర్ కావాలంటే? ఒక విధానం లేదు. ఇలా వెళ్తే అవుతామని లేదు. చిట్టచివరికి లెక్చరర్ ఆకునూరి సుబ్బారావు ద్వారా రైటర్ ఆకుల శివ పరిచయమయ్యారు. ఆయన ద్వారా ఎడిటర్ మోహన్ పరిచయం కలిగింది. ఆయనకు నా మీద మంచి ఇంప్రెషన్ కలిగింది. ‘మనసిచ్చి చూడు’, ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ సినిమాలకు పనిచేశాను. అయితే మళ్లీ డైలమా! నెలకు 30-35 వేల సంపాదన వదులుకొని వచ్చానే, ఇక్కడ నెలకు పదిహేనొందలు కూడా రావట్లేదే, ఇక నావల్ల కాదు, అని తిరిగి ఊరెళ్లిపోయాను. డెరైక్టర్ అయిపోతామని గొప్పలు చెప్పి వచ్చాం కదా! అందుకే, కాకినాడలో మొహం చెల్లక ‘ఆదిత్య’వాళ్లదే భీమవరం శాఖలో ఏడాది పనిచేశాను. అయితే మోహన్‌గారే ‘హనుమాన్ జంక్షన్’కు పిలిపించారు. ఇక్కడో కీలక మలుపు చెప్పాలి. ఈ సినిమాకు వి.వి.వినాయక్ తమ్ముడు విజయ్ కెమెరా అసిస్టెంట్. ఆయన నన్ను వినాయక్‌కు పరిచయం చేశారు. అలా (వినాయక్, రాజు ఇద్దరికీ తొలిచిత్రం) ‘దిల్’కు పనిచేసే అవకాశం వచ్చింది. అప్పుడే నా భవిష్యత్ నిర్మాత ‘దిల్’ రాజు పరిచయమయ్యారు.

ఆర్య ప్రేమ

అప్పుడు అమ్మాయిల మీద యాసిడ్ దాడుల వార్తలు ఎక్కువున్నాయి. ప్రతి మగవాడూ ఎవరో ఒకరిని ప్రేమిస్తుండొచ్చు, ఆ అమ్మాయి అతణ్ని రిజెక్ట్ చేయవచ్చు, మొత్తంగా ఆ లవ్ ఫెయిల్ కావొచ్చు. అయినంతమాత్రాన హింసకు దిగడమేంటి?
చంద్రుడు వెన్నెలను ఇస్తాడు, మననుంచి ఏమీ కోరడు. సూర్యుడు వెలుతురు ఇస్తాడు, బదులుగా మనం ఏమీ ఇవ్వం. ఆశించకుండా ఇచ్చే స్వచ్ఛమైన ప్రేమ అది. ఆ హింసాపూరిత ప్రేమకూ దీనికీ ముడిపెట్టి ఇందులోంచి ఏమైనా రాబట్టవచ్చా? నేను చదివిన పొయెట్రీ కూడా దీనికి హెల్ప్ అయ్యింది. అలా, నేను ప్రేమిస్తాను... నువ్వు ప్రేమించకపోయినా సరే నా ప్రేమను ఫీల్ అవ్వు చాలు... అన్న ఆలోచన వచ్చింది. అది రాజుకూ, బన్నీ(అల్లు అర్జున్)కీ నచ్చడమూ సినిమా ప్రారంభించడమూ జరిగిపోయింది.ఆర్యకు ముందు నేను అనుకున్న పేరు నచికేత. మరీ హెవీగా ఉందని రాజు ‘ఆర్య’ సూచించారు. అయితే ఆయనకు అజయ్ అనే పేరున్న సినిమా నడవదని ఒక సెంటిమెంట్. అజయ్, ఆర్య.. అ, ఆ.. ఇలావుంటే బావుంటుందని నేను.. విజయ్ అని మార్చమని ఆయన.. షూటింగ్ అయిపోయి, డబ్బింగ్‌కొచ్చేదాకా ఇది నడుస్తూనే ఉంది. ఆయనను నమ్మించడానికి ఒక రెండు రీళ్లు విజయ్ అని చెప్పించి వినిపించాను కూడా. కానీ చివరికి అజయ్ అనే ఉంచేశాను. ఒకరకంగా ఆయన్ను మోసం చేశానన్నమాట!సుకుమార్య ప్రేమ

లవ్ అంటే నిజం అనేది అబద్ధమైతే, లవ్ అనేది నిజం కాదనేది కూడా అబద్ధమే అవ్వాలి. లవ్ అంటే లవ్వే. అది ఫిల్టర్ చేయని, లెక్కలు తెలియని, సహజాతి సహజమైన రా ఫీలింగ్. ఒకమ్మాయిని చూసినప్పుడు కలిగే అనుభూతి చాలా స్వచ్ఛమైంది. ఒక యానిమల్ ఇంకో యానిమల్‌ను చూసుకోవడం లాంటిది. ప్రిమిటివ్ స్టేజ్. కాని ఎప్పుడైతే నీ పేరేంటి? అని మాట్లాడటం మొదలయ్యిందో సమస్య ప్రారంభమవుతుంది. ఆమె చదువు మనకు తెలుస్తుంది. ఓహో, నేను తక్కువ చదువుకున్నాను. వాళ్లది ఫలానా కులం, నేను అది కాదు. వాళ్లకు అంత డబ్బుంది, నాకు లేదు. ఇక ఇద్దరి మధ్యా దూరం పెరిగిపోతుంది. ఇద్దరూ చేరువ కావాలంటే వాటన్నింటినీ దాటుకుని రావాలి.అయితే, సమాజ నిర్మాణం ధ్వంసం కాకుండా ఉండాలంటే, మనలోని జంతువుని మనిషిని చేయాలి. అందుకే పెళ్లి! షూటింగుల్లో పడిపోతే సరిగ్గా పట్టించుకోలేనేమోనని ఒక దశలో పెళ్లి చేసుకోకూడదనుకున్నా. ఆర్య విడుదలై సక్సెస్ అయ్యాక ఆటోగ్రాఫ్ కోసం వచ్చిన ఒకమ్మాయి స్నేహితురాలిగా హంసిని పరిచయం. అయితే ఆమెకు సినిమాల గురించి ఏమీ తెలిసినట్టు లేదు. ‘రైటర్ రాస్తాడు, నటీనటులు నటిస్తారు, కెమెరామన్ షూట్ చేస్తాడు... మరి డెరైక్టర్ ఏం చేస్తాడు?’ అంది. నా ఈగో దెబ్బతింది. ‘డెరైక్టరు అంటే ఎంత గొప్పవాడో తెలుసా?’ అని ఆమెను నమ్మించే క్రమంలో ఆమెతో మాటల్లో పడిపోయాను, అటుపై ప్రేమలో పడిపోయాను. ఇప్పటికీ మునకలు వేస్తూనే ఉన్నా. ఇబ్బందులు ఎదుర్కొని, ఇద్దరిళ్లల్లో ఒప్పించి పెళ్లయ్యేసరికి ఐదేళ్లు పట్టింది. పెళ్లయ్యి పాప పుట్టిందిగానీ సినిమాకు డెరైక్టరు ఎంత గొప్పో అని మాత్రం ఇప్పటికీ ఆమెను నమ్మించలేకపోతున్నా.

100 పర్సెంట్ లైఫ్

నా స్వేచ్ఛను భగ్నం చేసి ఆ శిథిలాలతో నువ్వు కారాగారం నిర్మించుకున్నావు’ అని రవీంద్రుడి కవిత. అమ్మాయికి ఫోన్ చేస్తాం... ఎంగేజ్ వస్తుంది... ఎవరితో మాట్లాడుతోందో! ఇక ఆమెతో డిస్కషన్ పెడతాం. ఏం చేస్తున్నామిక్కడ? అమ్మాయి స్వేచ్ఛను భగ్నం చేస్తున్నాం. నిరంతరం అనుమానంలో ఉండి, మనమే ఖైదీ అవుతున్నాం. కాబట్టి ప్రేమ అంటేనే నిజం. ఇంకా నిజమైన ప్రేమ, అబద్ధపు ప్రేమ అనేది ఉండదు. ప్రేమలో ఉండటమంటే సంపూర్ణంగా ఉండటమే.అలాగే పెళ్లి తర్వాత నా ప్రేమ కూడా ఏమీ తగ్గలేదుగానీ అన్నిసార్లూ అటెన్షన్ ఇవ్వలేం. ఒకసారి మా ఆవిడ ఏదో షాపింగ్‌కు వెళ్దామంది. చీర తీసుకొని ‘ఇదెలా ఉంది’ అంటే బావుందని తల ఊపాను. త్వరగా ముగించేస్తే బయటపడొచ్చు కదాని నా ఉద్దేశం. అయితే, ‘100 పర్సెంట్ లవ్’లో ఒక సీన్‌లో తమన్నాకు వేసిన డ్రెస్ నాకు నచ్చలేదు. ఇంకేదో చూపిస్తే అదీ నచ్చలేదు, దానివల్ల గంటసేపు షూటింగ్ ఆగిపోయింది. మళ్లీ ఇంకోటి తెప్పించాం. ఈ హడావుడి జరుగుతున్నప్పుడే తలతిప్పి చూస్తే... వెనక మా ఆవిడ. తన కళ్లల్లో నీళ్లు. విషయం అర్థమైపోయింది. తనకోసం టైమ్ ఇవ్వలేదు, హీరోయిన్ డ్రెస్ కోసం ఇంత గాలిస్తున్నాను! బాధ కలిగింది. కానీ ఏం చెప్పాలి? సినిమా అనేది ఒక అబద్ధం. కాబట్టి దాన్ని నిజం అని నమ్మించడానికి ఎంతో కలరింగ్ ఇవ్వాలి. కానీ జీవితం నిజం కదా! దాన్ని ప్రత్యేకించి నమ్మించే పనేముంది? అలాగే నా ప్రేమ!

ప్రొఫైల్Sukumar-family

పూర్తిపేరు : బండ్రెడ్డి సుకుమార్
పుట్టినతేదీ : జనవరి 11 (మగవాళ్లు అయితే మాత్రం సంవత్సరం చెప్పాలా!)
స్వగ్రామం : తూర్పు గోదావరి జిల్లా మట్టపర్రు
విద్యాభ్యాసం : శివకోడు, రాజోలు
చదువు : ఈ రహస్యాన్ని ఇన్నేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్నా. డిగ్రీ ఫెయిల్. సెకెండియర్ ఫిజిక్స్ ఉండిపోయింది.
అభిమాన రచయితలు : చలం, యండమూరి
నచ్చిన ప్రేమపుస్తకం : శ్వేతరాత్రులు
నచ్చిన ప్రేమసినిమా : గీతాంజలి
బలహీనతలు : కన్‌ఫ్యూజన్, నిర్ణయం తీసుకోలేకపోవడం, సరిగ్గా వ్యక్తీకరించలేకపోవడం
బలం : దేనిమీదైనా ఒక అభిరుచి ఉండటం
ఇష్టంగా తినేవి : పళ్లు; పత్యేకించి సీతాఫలాలు, మామిడిపళ్లు
ఆరోగ్యం కోసం : గుర్తొచ్చినప్పుడు వాకింగ్ చేస్తా, కొన్నిసార్లు కాఫీ మానేస్తా!
దేవుడు : ఏమో ఉన్నాడేమో! ఎందుకైనా మంచిది, దణ్నం పెట్టుకోవాలి.

సుక్కు హార్‌‌ బీట్స్

‘నిన్నెటూ నేను చిన్నప్పుడు చూళ్ల్లేదు కదా, ఇదిగో మన పాపలో నిన్ను చూస్తున్నా’ అని చెప్పి మా ఆవిడను ఐస్ చేస్తుంటాను.

ప్రేమ పుట్టడానికి వందేళ్లు అక్కర్లేదు, ఒక్క క్షణం చాలన్నట్టుగానే... అది పోవడానికి కూడా అంత బలమైన క్షణం చాలు. అందుకే, ప్రేమ అనేది స్వల్పకాలవ్యవధిలో ఉండే ఉద్వేగం. దాన్ని మరికొన్ని స్వల్పవ్యవధులుగా పెంచుకుంటూ పోయి, మొత్తం సంపూర్ణ జీవితం చేయాలని నా ఆశ.

మా పాప గురించి ఎంతయినా చెప్పాలనిపిస్తుంది. ఈరోజు ఏం చేసిందీ, కొత్తగా ఏం మాట్లాడిందీ... ఆపుకోలేను. కవిత్వం చదివితే వచ్చే ఉద్వేగపూరితమైన అంశమేదో తన నుంచి నాకు అందుతోంది. కాలిక్యులేషన్స్ లేని ఎమోషన్.

కొన్నిసార్లు ఏమీ చేయకుండా ఖాళీగా ఉండటం ఇష్టం. పరుగు, తాపత్రయం తగ్గించుకోవాలనుంది. ప్రపంచం మొత్తం చుట్టిరావాలనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr short political review on his birthday
Interview with gundu hanumantha rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles