Assembly sessions getting ugly face in india

assembly, constitution, kerala, ap, karnataka, roja, ysrcp, abbuse

assembly sessions getting ugly face in india. in an india consitution provided to assemble for discuss the progress and future plans as assembly sessions. but nowadays its getting bad angel in that. some honrable members misuses their rights.

ప్రత్యేకం: అసెంబ్లీ సమావేశాలు - పక్కా 'A' సర్టిఫికేట్

Posted: 03/19/2015 05:21 PM IST
Assembly sessions getting ugly face in india

ప్రజా సమస్యలను చర్చించడానికి, ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి, కొత్తగా ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం బడ్జెట్ ను ప్రవేశపెట్టి ప్రజలకు మేలు చెయ్యడం కోసం అసెంబ్లీని ఏర్పాటు చెయ్యడం రాష్ట్రాలకు ఎంతో కీలకం. అయితే గతంలో అసెంబ్లీలో కేవలం ప్రజా సమస్యలను మాత్రమే చర్చించడం జరిగింది. కానీ ప్రస్తుతం మాత్రం పరిస్థితులు మారాయి. ఇప్పుడు ప్రజా సమస్యలతో పాటు పర్సనల్ గా తిట్టుకోవడం..వీలైతే కొట్టుకోవడం కూడా చేసేస్తున్నారు. అయితే ప్రజలు ఎంతో విలువైన ఓట్లను వేసి తమ భవిష్యత్తును మారుస్తారని అనుకుంటే.. వారి ఆశలకు కన్నం వేస్తూ.. వివాదాల ద్వారా వార్తలకెక్కుతున్నారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కొందరు గౌరవ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు అసెంబ్లీ చరిత్రలోనే చీకటి కోణాన్ని తట్టి లేపింది. అసెంబ్లీలో కూడా జరగకూడనివి జరుగుతాయని కొత్త పేజీ తెరుచుకుంది. అసెంబ్లీ అంటే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ అనే కాదు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన అసెంబ్లీలు ఇందులో భాగాలే. అయితే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు నిద్రపోవడం అనేవి ఎన్నో సార్లు జరిగిన, భవిష్యత్తులో జరిగే సాధారణ ఘటన. అందుకే చాలా మంది దాన్ని గురించి పట్టించుకోవడం కూడా మానేశారు. అయితే అసెంబ్లీలో నిద్ర పోయినా పెద్దగా పట్టింరకోవాల్సిన అవసరం లేదు కానీ ఒకరి మీద మరొకరు కారాలు మిరియాలు నూరుకోవడం నుండి ఏకంగా బూతులు తిట్టుకోవడం వరకు అసెంబ్లీ సమావేశాలు మార్పు చెందాయి.

ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తోంది. ప్రజా సమస్యలను గురించి ప్రస్తావించి, వాటి పరిష్కాలను వెతకాల్సిన అసెంబ్లీ హౌజ్ కాస్తా బూతుల దండకంతో కంపు కొడుతోంది. ఎంతగా అంటే సెన్సార్ బోర్డు గనుక అసెంబ్లీ సమావేశాలను చూస్తే ఖచ్చితంగా ఎ సర్టిఫికేట్ ఇచ్చేంతగా.. అంతే కాదు చిన్న పిల్లలకు ప్రవేశ లేదు.. చిన్న పిల్లలు చూడకూదడు అని అసెంబ్లీ ఎదుట పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డులు ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందకంటే మనం అనుకున్న దానికన్నా అసెంబ్లీ హాల్ లు దారుణంగా తయారవుతున్నాయి. అందుకే అసెంబ్లీ హాల్ అంటే అంతోకొంతో గౌరవం ఉన్న వారు కూడా దాన్ని మర్చిపోతున్నారు. కొత్తగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన సభ్యులు.. అసెంబ్లీలొ ఎలా ప్రవర్తించాలి.. ఎలాంటి నియమాలు పాటించాలని అనే సూచనలను అసలు చదవకుండానే లోపలికి ప్రవేశిస్తున్నారు. ఇక పాత సభ్యుల మాట ఎత్తకపోవడం మంచిది ఎందుకంటే వారు మీడియా ముందు ఎంత రెచ్చి పోతే అంత మంచిది అంత పాపులారిటీ వస్తుందనే ఆలొచిస్తున్నారు తప్పితే మిగితా ఏ విషయాలను పట్టించుకోవడం మానేశారు.

కేరళ రాష్ట్ర అసెంబ్లీలో చోటు చేసుకున్న కొన్ని సన్నివేశాల గురించి జాతీయ మీడియాలోనూ కథనాలు ప్రసారమయ్యాయి. ఓ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, మంత్రులు వీధి రౌడీల కన్నా దారుణంగా కొట్టుకొని, ఒకరంటే ఒకరికి ఎంత కసి ఉందో నిరూపించుకున్నారు. ఆడా, మగా అనే తేడా కానీ సీనియర్, జూనియర్ అనే తేడా కానీ ఎంత వీలైతే అంత నీచంగా ప్రవర్తించడానికి సర్వశక్తులు వడ్డుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సి ఉండగా, అవినీతి మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు వీలు లేదంటూ ప్రతిపక్షాలు చేసిన దాష్టీకం చిన్న విషయం కాదు.

కేరళ రాష్ట్ర అసెంబ్లీలో ఉద్రిక్తతల నడుమ ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి సర్వత్రా విమర్శలు కూడా వచ్చాయి. అసలు ప్రజలకు ఎంతో మేలు చేసే బడ్జెట్ గొడవల మధ్య ఏదో పెట్టాలి కదా అన్నట్లు ప్రవేశపెట్టడం ఏంటని మీడియాలో పలు కథనాలు వచ్చాయి. అయితే ఈ ఘటన జరిగేపుడు కొంత మంది ఎమ్మెల్యేలు ఇదే అవకాశంగా బావించారేమో కానీ కొంత మంది ఎమ్మెల్యేలతో అసభ్యంగా ప్రవర్తించారు. తాజాగా విడుదల చేసిన ఫోటోల్లో వారి దాష్టీకం ఎంటో బయటపడింది. ఓ ఎమ్మెల్యేగా ఉంటూ పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన వారు ఇలా పది మంది తలదించుకునేలా ప్రవర్తించడం రాజ్యాంగానికే అవమానం లాంటి ఎందుకంటే అసెంబ్లీలను రాజ్యాంగం ఎంతో ప్రాధాన్యతతో ఏర్పరిచింది. కానీ కొంత మంది గౌరవ సభ్యుల మాత్రం అసెంబ్లీని నీచంగా తయారు చేస్తున్నారు.

ఇక పక్క రాష్ట్రం గురించి వదిలేస్తే..మన తెలుగు రాష్ట్రంలోనే కనీసం రాతల్లో రాయలేని.. మాటల్లో చెప్పలేని ఘటనలు, బూతులు అసెంబ్లీలో వినిపించాయి. ప్రభుత్వం మీద ఎప్పుడూ కాలు దువ్వడం ప్రతిపక్షాలకు అలవాటు. కానీ అది మంచిదే ప్రభుత్వం చేసే పనిపై ఆరాలు తీయ్యడానికి ప్రతిపక్షానికి రాజ్యాంగం ఇలా అవకాశాన్ని కల్పించింది. అయితే రాజ్యాంగం కల్పించిన ఈ అవకాశాన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు కొంతమంది రాజకీయ నాయకులు. ఏపి రాష్ట్ర అసెంబ్లీలో రాజకీయ నాయకులు చేసిన చేతలు, మాట్లాడిన మాటలు నిజంగా అసెంబ్లీ చరిత్రలో కొత్తగా చీకటి కోణాన్ని ఆవిష్కరించాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన నాయుకులు ప్రతిసారి టిడిపి నాయకుల మీద ఏదో ఆరోపణలు చెయ్యడం తరువాత ఏదో ఓ చిన్న విషయాన్ని పట్టి రాద్దాంతం చెయ్యడం మామూలే. అయితే రాద్దాంతం కొంత వరకు ఉంటే పరవాలేదు కానీ హద్దులు దాటితేనే కంపరంగా ఉంటుంది.. అయితే ఏపి అసెంబ్లీలో జరిగింది అదే. మాటామాటా పెరిగి ఏకంగా చేతల దాకా వెళ్లాయి. చూసుకుందాం రా..  అంటూ ఓ నేత అంటే మరో నేత పాతరేస్తా అని అనడం నిజంగా ఏ మాత్రం స్వాగతించాల్సిన విషయాలు కాదు. ఇక మీడియా ముందుకు వస్తే పూనకం వచ్చినట్లు ఊగిపోయే మన నేతా గణం ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడంలేదు. ఫలానా వాళ్లు అట్లా.. వీళ్లు ఇట్లా అని చిన్న పిల్లల్లా చాడీలు చెప్పుకుంటున్నారని ఓ సరదా వ్యాఖ్య కూడా ఉంది.

అసెంబ్లీ సమావేశాల ప్రసారాన్ని టీవీలో చూపిస్తూ ఏంటిది నాన్నా అని చిన్న పిల్లలను ఎవరిని అడిగినా .. ఆ ఆంటీ అంకుల్ ను తిడుతుంది.. ఆ అంకుల్ కొడుతున్నాడు.. తంతున్నాడు అనో సమాధానం వస్తుంది. అలా ఉంది మన ఏపి అసెంబ్లీ పరిస్థితి. అయితే నేతల మాటలపై మాత్రం ఎవరూ సంతృప్తిగా లేరు. నోరు మూసుకో.. లావు పెరగడం కాదు బుర్ర పెంచు.. నాది ఐరన్ లెగ్గా చూడు.. చీరకట్టుకో అని తాజాగా ఎమ్మెల్యే రోజా రెచ్చిపోయింది.  ఇక అసెంబ్లీలో ఇంతగా రెచ్చిపోయిన రోజా మీడియా ముందుకు వచ్చే సరికి మరింత రెచ్చిపోయింది. వాళ్లకు రేప్ చేసే దైర్ఘ్యం లేదు ఎస్సీ, ఎస్టీ కేసు పెడతారు లేదంటే చంపుతారు అంతకన్నా ఏమీ పీకలేరు అని రోజా మాటలు అందరికి విస్మయాన్ని, విసుగును పుట్టించాయి. ఓ ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇలా బజారు మనిషిలా తిట్ల దండకం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయినా అసెంబ్లీలో ఇలానే ఉండాలి లేదా ఏవైనా చెయ్యకూడని పనులు చేస్తే ఏకంగా జైలుకు కూడా పంపేలా చట్టాలుంటే అప్పుడు కానీ మన నేతాగణానికి కొంతైనా బుద్ది వచ్చేదేమో.. కానీ మనది ప్రజాస్వామ్య దేశం అందరికి స్వేచ్ఛ ఉంది.. ఇక ప్రజా ప్రతినిధులకు అయితే అది ఇంకొంచెం ఎక్కువే ఉంది. ఇలా దూషణల పర్వానికి అసెంబ్లీల్లో ఎప్పుడు తెర పడుతుందో దేవుడికే తెలియాలి. ఇలాంటి ఘటనలు జరుగుతాయని నాడు అంబేద్కర్ కు తెలిసి ఉంటే అసెంబ్లీల ఏర్పాటునే రద్దు చేసేలా చూసే వారేమో. అయినా మనం అనుకోవడం తప్పితే ఏమీ చెయ్యలేము. మీడియా వారు చూపిస్తే..పల్లి బఠాణిలు తింటూ ఓ హో అలా అన్నాడు.. అని అనుకుంటూ కాలం వెల్లదీయడం తప్ప  ఏమీ చెయ్యలేము.. చెయ్యం కూడాను. ఎందుకంటే మనం మనమే కాబట్టి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : assembly  constitution  kerala  ap  karnataka  roja  ysrcp  abbuse  

Other Articles