Greyhounds police pulli obulesu held for kbr park fire incident case

nityananda reddy, firing, KBR park, Aurobindo Pharma vice president, AK 47, Assailant, hyderabad, police comissioner, mahinder reddy, obuleshu

greyhounds police pulli obulesu held for kbr park fire incident case

కటకటాల వెనక్కి.. కానిస్టేబుల్ ఓబులేశు..

Posted: 11/21/2014 06:36 PM IST
Greyhounds police pulli obulesu held for kbr park fire incident case

కేబీఆర్ పార్క్ కాల్పుల కేసులో నిందితుడు కానిస్టేబుల్ పులి ఓబులేశేనని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. అతడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు తెగబడింది ఓబులేశేనని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. అతనొక్కడే ఈ నేరం చేశాడని చెప్పారు. బెల్ ఫామ్(తుపాకులను శుభ్రం చేసే చోటు) నుంచి ఎత్తుకుపోయిన ఏకే 47 రైఫిల్, లోడెడ్ మేగజీన్ తో అతడీ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిపారు.

కడప జిల్లా కోరుమామిళ్ల మండలానికి చెందిన ఓబులేసు పోలీసు కానిస్టేబుల్ గా చేరాడని, తర్వాత గ్రేహౌండ్స్ కు మారాడని చెప్పారు. దొంగిలించిన ఆయుధాన్ని కర్నూలు జిల్లా ఓర్వకల్లు ప్రాంతంలో గుట్టల్లో దాచాడన్నారు. గత ఫిబ్రవరిలో కేబీఆర్ పార్క్ వద్ద ఒకరిని అపహరించి సఫలమయ్యాడన్నారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరు వరకు తీసుకెళ్లి రూ.10 లక్షల వసూలు చేశాడని చెప్పారు. అయితే బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో ఇది వెలుగులోకి రాలేదన్నారు.

నిత్యానంద రెడ్డిని కూడా కిడ్నాప్ చేసి డబ్బు గుంజాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో దొరికిపోయాడని వివరించారు. కాల్పులు జరిగిన ఆరేడు గంటల్లోనే నిందితుడిని గుర్తించామన్నారు. కాల్పులు జరిపిన తరువాత అన్నపూర్ణ స్టూడియోస్ వైపు పరిగెత్తిన నిందితుడు అమీర్ పేట్ కు చేరుకున్నాడని, అక్కడి నుంచి ఆటోల ఇమ్లిబన్ బస్టాండ్ కు వెళ్లి అక్కడి నుంచి బస్సులో కర్నూలు పారిపోయాడని చెప్పారు. 37 ఏళ్ల ఓబులేశుకు ఇంకా పెళ్లికాలేదని, విలాసాలకు అలవాటు పడి వక్రమార్గం పట్టాడని మహేందర్రెడ్డి తెలిపారు.

వీఐపీలను అపహరించి డబ్బు వసూలు చేసేందుకు ప్రణాళిక రచించాడన్నారు. ఖరీదైన కార్లు వున్నావారినే తాను కిడ్నాప్ కోసం ఎంచుకునే వాడని పోలీసులు తెలిపారు. ఓబులేశు గతంలో ఏపీఎస్పీ బెటాలియన్‌లో పనిచేశాడని, గ్రేహౌండ్స్‌లో 12 ఏళ్లపాటు పనిచేశాడని పోలీసులు తెలిపారు. సెలవులో ఉండి కూడా శుభ్రం చేస్తానన్న సాకుతో బెల్లా ఫామ్స్‌కు వచ్చాడని, ఫామ్స్ ఇన్‌ఛార్జికి తెలియకుండా ఓబులేశు వచ్చివెళ్లాడని పోలీసులు తెలిపారు. 2013 డిసెంబరులో ఏకే 47ను లోడెడ్ మ్యాగజీన్‌ను దొంగిలించాడన్నారు.

కిడ్నాప్ ప్లాన్ రచించేప్పుడు అతడు ఎవ్వరినీ తన వద్దకు రానిచ్చే వాడు కాదని చెప్పారు. అయితే తన వెనుక మరో ముగ్గురు వున్నారన్న కథనాలను పోలీస్ కమీషనర్ తోసిపుచ్చారు. ఓబులేశు ఒక్కడు మాత్రమే ప్రణాళికను రచించి అమలు పరుస్తాడని చెప్పారు. నిత్యానందరెడ్డిని కిడ్నాప్ చేసే ముందు రోజు కేబీఆర్ పార్కు వద్ద రెక్కీ నిర్వహించాడని నగర పోలీస్ కమీషనర్ మహిందర్ రెడ్డి తెలిపారు

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles