telangana government to reduce property tax in GHMC limits

Property tax to rebate in ghmc soon

property tax to rebate in ghmc, telangana chief minister KCR, government to reduce property tax in GHMC, GHMC officials, proposals to reduce property tax, property tax announcement soon

As per the announcement off telangana chief minister KCR, government and GHMC officials has made proposals to reduce property tax in GHMC limits

గ్రేటర్ ప్రజలకు సర్కారు తాయిలం.. అందించేనా పీఠం..?

Posted: 12/01/2015 12:36 PM IST
Property tax to rebate in ghmc soon

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలలోనూ తామ విజయం సాధిస్తామని ఇటీవల జరిగిన వరంగల్ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేసింది. దీంతో ఎలాగైనా ఈ ఎన్నికలలో గెలుపొందేందుకు కలసి వచ్చే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటోంది టీఆర్ఎస్. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని నివాస గృహాల యజమానులకు త్వరలో తీపి కబురు అందనుంది.

గ్రేటర్ పరిధిలో సొంత నివాసాలు ఏర్పర్చుకున్న వారికి భారీ మొత్తంలో ఆస్తి పన్ను రాయితీ నజరానా ప్రకటించేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. గ్రేటర్ పరిధిలో రూ.1,200, ఆలోపు వార్షిక ఆస్తి పన్ను చెల్లిస్తున్న పేద, మధ్య తరగతి నివాస గృహాల యజమానుల నుంచి ఇకపై రూ.101 మాత్రమే వసూలు చేయాలని గతంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన త్వరలో కార్యరూపం దాల్చనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 15 తర్వాత ఏ క్షణంలోనైనా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆ లోగానే ఆస్తి పన్ను రాయితీని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

 నివాస గృహాలపై రూ.1,200లోపు ఆస్తి పన్నుకు బదులు రూ.101 మాత్రమే విధించడంతో పాటు పనులకు అనుమతుల జారీ విషయంలో ఆర్థికపర అధికార పరిమితులు పెంచాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ కమిషనర్, ప్రత్యేకాధికారి బి.జనార్దన్‌రెడ్డి తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనల అమలుకు జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ కోసం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ చర్యలు ప్రారంభించింది. ప్రతిపాదనలను రాష్ట్ర ఆర్థిక శాఖ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించిన వెంటనే జీహెచ్‌ఎంసీ చట్టాన్ని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండేళ్ల వరకు స్థానిక అవసరాలకు తగ్గట్లు ఇరు రాష్ట్రాలూ పాత చట్టాలకు సవరణలు జరుపుకోవచ్చని రాష్ట్ర పునర్విభజన చట్టంలో కల్పించిన వెసులుబాటు ఆధారంగా జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ సులువుగా పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. మరో వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదనలు అమలైతే జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.1,200 లోపు ఆస్తి పన్ను గల 5,09,187 గృహాల యజమానులకు లబ్ధి చేకూరనుంది.

వీరు ప్రస్తుత సంవత్సరంలో రూ.29.40 కోట్ల ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉండగా, పాత బకాయిలు రూ.57.99 కోట్లు ఉన్నాయి. మొత్తం కలిపి రూ.87.39 కోట్ల పన్నులు మాఫీ కానున్నాయి. ఈ మొత్తాన్ని ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి చెల్లించాలని ప్రతిపాదనల్లో కోరారు. ప్రస్తుతం రూ.600 లోపు ఆస్తి పన్ను ఉంటే పూర్తిగా మాఫీ చేస్తుండగా, ఈ పరిమితిని రూ.1,200కు పెంచి నామమాత్రంగా రూ.101 మాత్రమే వసూలు చేస్తారు. మరీ ఈ తాయిలం టీఆర్ఎస్ ప్రభుత్వానికి గ్రేటర్ పీఠాన్ని అందిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ghmc  Greater elections  Government  

Other Articles