Rama Nawami | Bhadrachalam

Srirama navami special article

sri rama, hindu, navami, bhadrachalam, ayodhya

Rama Nawami is a Hindu festival, celebrating the birth of the god Rama to King Dasharatha and Queen Kausalya in Ayodhya. Rama, the seventh avatar of Vishnu, is the oldest known god having human form.he holy day falls in the Shukla Paksha on the Navami, the ninth day of the month of Chaitra in the Hindu calendar.

ప్రత్యేకం: పితృవాక్పరిపాలకుడు ఒకే ఒక్కడు 'రాముడు'

Posted: 03/27/2015 03:53 PM IST
Srirama navami special article

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. కాబట్టి ప్రజలు రాముడికి సంబందించిన రెండు ముఖ్య ఘట్టాలు ఒకే రోజు రావడంతో ఆ రోజును శ్రీరామ నవమిగా జరుపుకుంటారు.

మానవుడే భగవంతుడు ఎలా కాగడో, ఆ భగవంతుడే స్వయానా నిరూపించాడు. విష్ణువు తానే స్వయంగా రాముడిగా అవతరించి, సకల లోకాలకు సన్మార్గాన్ని చూపించారు. ప్రపంచంలో అందరూ మాతృవాక్పరిపాలకులే కానీ ఒక్క నా రాముడు మాత్రమే పితృవాక్పరిపాకుడు అని రామాయణంలో వాల్మీకి మహర్షి వర్ణించాడు. ప్రజలు నిత్యం అనుభవిస్తున్న మామూలు కష్టాలకు వేరాసి పోతుంటే, ఆ భగవంతుడే భువిపై వెలిసి అసలు కష్టాలు అంటే ఎలా ఉంటాయో, వాటిని ఎలా ఎదుర్కోవాలో చూపించాడు రాముడు.

ఏకపత్నీవ్రతుడు రాముడు. కానీ తన పత్ని సీతాదేవిపై వచ్చిన అపనిందకు పరీక్షకు సాహసించాడు రాముడు. అసలు రాజు అంటే ఎలా ఎండాలో అయోధ్యను పాలించి చూపించాడు. రాముడు ఒ తండ్రికి కొడుకుగా, భర్తగా, అన్నగా, తండ్రిగా, రాజుగా అన్నింటికి మించి మంచి మనిషిగా ఎలా మెలగాలో రాముడు మనకు చూపించాడు. రాముని మార్గం సదా అందరికి అనుసరణీయం.

కథ :
దశరథ మహారాజు, అతని భార్యలలో ఒకరైన కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. అయితే భరతుడిని పట్టాభిషేకం జరిపించాలని దశరథుని మరోభార్య అయిన కైకేయి శ్రీరాముడిని రాజ్యం నుంచి బహిష్కరించాలని తలచుకుంటుంది. అప్పుడు ఆమె తన 14 సంవత్సరాలవరకు రాముడిని అడవులకు పంపమని దశరథునితో కోరుకుంటుంది. ఇది తెలుసుకున్న రాముడు.. తన తండ్రి ఆజ్ఞను పాటించి అరణ్యవాసం చేయడానికి బయలుదేరుతాడు. అతనితోపాటు లక్ష్మణుడు, సీతమ్మ కూడా వెళతారు. రామబంటు అయిన హనుమంతుడు ఎల్లప్పుడూ రాముడికి తోడుగా వున్నాడు. ఆ తరువాత రావణుడు సీతను తీసుకెళ్లడం... రాముడు హనుమంతుడు, సుగ్రీవుని సహాయంతో రావణుడిని హతమార్చి సీతను తిరిగి పొందడం జరుగుతుంది. తరువాత రాముడు పట్టాభిషిక్తుడై తన రాజ్యాన్ని పరిపాలించుకుంటాడు. తండ్రి ఆజ్ఞను ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా పరిపాలించిన ఏకైక పత్నీవ్రతుడు అయిన శ్రీరాముడిని ఎంత కీర్తించినా తక్కువే. రామాయణాన్ని తరుచూ పారాయణం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతుంటారు.

''శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నమ తత్తుల్యం రామ నామ వరాననో''

అనే పవిత్ర మంత్రాన్ని పూజా సమయంలో తొమ్మిదిసార్లు స్మరించుకోవడం వల్ల ఎలాంటి కష్టనష్టాలూ ఉండవని, సకల సంపదలూ కలుగుతాయని పెద్దలు విశ్వసిస్తారు. కొందరు శ్రీరామనవమిని దసరా నవరాత్రులలాగా తొమ్మిదిరోజులపాటు పండుగ చేస్తారు. కొందరు చైత్ర శుక్లపక్ష నవమినాడు మాత్రమే ఈ పండుగను చేసుకుంటారు. ఈ పండుగను పురస్కరించుకుని అనేక ప్రాంతాల్లో హోలీని తలపించే వసంతోత్సవం జరుపుకుంటారు. శ్రీరామనవమి పర్వదినాలలో రథయాత్ర నిర్వహిస్తారు. రామభక్తులు ఈ పండుగరోజు ఉపవాసం వుంటారు. ఉపవాసం లేనివారు పానకం, పండ్లు సేవిస్తారు. శ్రీరామనవమి రోజున రామునికి సంబంధించిన ఆలయాలలో భక్తులు చాలామంది తమ పూజాకార్యక్రమాలను నిర్వహించుకుంటారు. శ్రీరాముడు మధ్యాహ్నం పుట్టాడు కాబట్టి కళ్యాణం కూడా అదే సమయంలో చేస్తారు.

బెల్లం, మిరియాలపొడి, నీళ్ళలో కలిపి తయారుచేసిన పానకం, పెసరపప్పు నానబెట్టి చేసిన వడపప్పు , బియ్యప్పిండిలో బెల్లం, నీళ్ళు కలిపి చేసిన చలిమిడి రామ నవమి ప్రసాదాలు. శాస్త్రీయంగా చూస్తే ఇవన్నీ చలవ చేసే పదార్థాలు. ఈ పండుగ వచ్చేది ఎండాకాలం కనుక వీటిని సేవిస్తే మంచిదనే ఉద్దేశంతో ప్రసాదంగా రూపొందించారు. కొన్ని ఆలయాలలో సీతారాముల విగ్రహాలను కనులపండగ్గా జరుపుకుంటారు. . శ్రీరాముని భక్తిగీతాలు, భజనలతో ఆలయాలు దివ్యత్వాన్ని సంతరించుకుంటాయి.

శ్రీరామనవమి అంటే ఎవరికైనా భద్రాద్రి పేరు గుర్తుకురాక తప్పదు. ఆ మరుక్షణమే సీతారామ కల్యాణోత్సవ శోభ కనులముందు సాక్షాత్కరిస్తుంది. ఆ సమయంలోనే అక్షతలతో కలసిన స్వామి వారి ముత్యాల తలంబ్రాలు గుర్తుకు వస్తాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా భద్రాద్రిలో జరిగే రామనవమి వేడుకలు ఈసారి మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక్కడ ఎంతో సంప్రదాయ బద్ధంగా నిర్వహించే సీతారామ కల్యాణం, శ్రీరామ పట్ట్భాషేకం చూసేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. వేడుకలను అంగరంగ వైభవంగా జరపాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ప్రాంతాలతో సంబంధం లేకుండా రామభక్తులంతా ఇక్కడికి భారీ సంఖ్యలో చేరుకుంటారు గనుక ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేశారు.రంగురంగుల విద్యుల్లతలతో, చలువ పందిళ్లతో ఆలయం ముస్తాబైంది.

తెలంగాణ ఆవిర్భవించాక జరుగుతున్న తొలి రామనవమి కావడంతో వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత సన్నాహాలు చేసింది. కల్యాణోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు. కాగా, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నప్పటికీ ఖర్చంతా భద్రాద్రి ఆలయమే భరించాల్సి వస్తోంది. గతంలో శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని దేవస్థానం కోరింది. ఏటా రూ.2కోట్లు అవసరమని కూడా ఆలయ అధికారులు విన్నవించారు. మేడారం జాతర తరహాలో భద్రాద్రి ఆలయానికి శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు నిధులు ఇవ్వాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.

భద్రాద్రిలో సీతారామ కల్యాణం సందర్భంగా ఆసక్తి కలిగించే కొన్ని సంప్రదాయాలు, విశిష్టతలు అనాదిగా కొనసాగుతున్నాయి. మండపేట (తూర్పు గోదావరి)కు చెందిన కె.వి.ఏ రామిరెడ్డి 20 ఏళ్లుగా కల్యాణ వేడుకలకు కొబ్బరి బొండాలు తెస్తున్నారు. కొబ్బరి చెట్టుకు కాయలు రాగానే పసుపు రాసిన గుడ్డ కట్టి పూజలు చేస్తారు. ఆ కాయలు 9 అంగుళాల పొడవు వచ్చేసరికి చెట్టు నుంచి కోసి, దీక్షతో నవమి నాడు స్వామికి సమర్పిస్తారు. ఈ కొబ్బరి బొండాలపై శ్రీరామ, జయరామ, జయజయ రామ, శ్రీరామరక్ష, జైశ్రీరామ్, సర్వజగద్రక్ష అనే అక్షరాలు రాస్తారు. వీటిని కల్యాణ మండపంలో ఉంచుతారు. కల్యాణ తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది. అక్షతలు ఎల్లవేళలా శుభం కలుగజేస్తాయి. ధాన్యం పరబ్రహ్మ స్వరూపం. పసుపు మంగళప్రదం. సాక్షాత్తూ అమ్మవారి స్వరూపం. ఈ రెండింటి కలయికే శ్రీసీతారాములు. మరి భద్రాచలంలో ఈ సారి ఎంత రంగవైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతాయో కనులారా చూడాలి. ఆ రాముడి కరుణ, కటాక్షాలు మనందరిపై ఉండాలని కాంక్షిద్దాం...

జై జానకి రామ.... జై సీతారామా..

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sri rama  hindu  navami  bhadrachalam  ayodhya  

Other Articles