ప్రముఖ చారిత్రక నగరం ఇది 16వ శతాబ్దపు నిర్మాణశైలికి ప్రతీక మొఘల్ చక్రవర్తి మనసు దోచిన చోటు కొత్త మతం దీన్- ఇ- ఇలాహి పుట్టిన నేల తాన్‌సేన్ రాగాలకు చెవులొగ్గిన ప్యాలెస్‌లు సలీం ఛిష్టీ సూక్తులను ఆచరించిన దర్బారు విజయద్వారం బులంద్ దర్వాజా... చారిత్రక ఆనవాలు లాల్ దర్వాజాలతో ఘనచరిత్రకు ప్రతిబింబం ఈ నగరం ఈ ప్రపంచ వారసత్వం మన సంపద ఫతేపూర్ సిక్రీ గురించి తెలుసుకుందాం.
ఫతేపూర్‌సిక్రీ మొఘల్ చక్రవర్తి అక్బర్‌కు ఇష్టమైన ప్రదేశం. ఇది రాజరికపు ఆనవాళ్ల నిలయం. ఇండో- ముస్లిం నిర్మాణశైలిలో ఉన్న నగరం. ఈ రాజనగరం ఆగ్రాకు 40 కి.మీల దూరంలో ఉంది. ఆగ్రా రాజధానిగా లాల్‌ఖిలా నుంచి పాలన సాగిస్తున్న అక్బర్ తర్వాత రాజధానిని ఫతేపూర్ సిక్రీకి మార్చాడు. కానీ పదిహేనేళ్లు పూర్తికాకనే తిరిగి ఆగ్రాకు వెళ్లాల్సి వచ్చింది. తీవ్రమైన నీటి ఎద్దడి కారణంగా రాజధానిని మార్చక తప్పలేదు అక్బర్‌కి. ఇది ఎత్తై రాతి ప్రదేశం. రాజులు రక్షణ కోసం కొండల మీద కోటలు కట్టిన క్రమమే దీనిది కూడ. అక్బర్ రాజధానిని మార్చిన కొద్ది సంవత్సరాలకే తీవ్రమైన కరువుతో ఇది ఎడారిగా మారింది. ప్యాలెస్‌లకు ఒంటెలతో నీళ్లు మోసేవారు. ఆ నీటిని నిల్వ చేయడానికి సంప్‌ల వంటివి ఉన్నాయి. వర్షపు నీటిని నిల్వ చేసుకునే సౌకర్యం కూడా ఉంది.
ఒక్క పాలరాతి భవనం !
అక్బరుకు పిల్లలు లేకపోవడంతో మతగురువు సలీం చిష్టీ దగ్గరకు వెళ్లాడు. ఆయన అనుగ్రహంతో పుట్టిన కొడుకుకి సలీం అని అతడి పేరునే పెట్టాడు. ఆయన మరణించాక కోటలోనే దర్గా కట్టించాడు అక్బర్. ఆ తెల్లని పాలరాతి సమాధి చిన్నదే కానీ అందంగా, ముత్యంలాగ ఉంటుంది. నగరంలో రాజభవనాలన్నీ ఎర్రరంగుతో ఉంటే చిష్టీ సమాధి పాలరాతితో తెల్లగా ఉంటుంది. రచయితలు దీనిని పగడపుదీవిలో ఆణిముత్యంతో పోలుస్తారు. నగరంలో జోధాబాయ్ ప్యాలెస్, పంచ్‌మహల్, బీర్బల్ నివాసం, రాజదర్బారు, దివానీ ఖాస్, దివానీ ఆమ్, బులంద్ దర్వాజా ప్రధానమైనవి. జోధాబాయ్‌ప్యాలెస్ చాలా పెద్దది. ఎక్కువ గదులు, భవనం చుట్టూ నాలుగువైపులా విశాలమైన వరండాలు ఉంటాయి. మధ్య భాగం రెండస్తుల భవనం. పంచ్‌మహల్... పేరుకు తగ్గట్లే ఐదంతస్తుల భవనం. దీనిని విండ్ టవర్ అంటారు. ఫతేపూర్ సిక్రీ అన్న వెంటనే గుర్తొచ్చే భవనం ఇదే. ఇందులో తోరణాలుగా ఉండే అరలు 176 ఉన్నాయి. గదులన్నీ ఓపెన్‌గా ఉంటాయి.
ప్రతి కట్టడమూ ఓ జ్ఞాపకం...
ఈ నిర్మాణాల్లో దాదాపుగా ప్రతిదీ ప్రత్యేక ఉద్దేశంతో కట్టినదే. బులంద్ దర్వాజా అంటే మహాద్వారం అని అర్థం. దీనిని గుజరాత్‌పై విజయానికి చిహ్నంగా నిర్మించాడు అక్బర్. మొఘల్ సామ్రాజ్య వైభవానికి, రాజరిక ఠీవికి దర్పణం ఇది. మొఘల్ నిర్మాణశైలి అక్బర్ హయాంలో మొదలై షాజహాన్ హయాంలో అత్యున్నత దశకు చేరింది. ఫతేపూర్ సిక్రీ భవనాలు ప్రధానంగా రాజస్థాన్ నిర్మాణశైలినే తలపిస్తాయి. మొఘల్ నిర్మాణాలకు పైన గుమ్మటం ఉంటే, రాజస్థాన్ నిర్మాణాలు విచ్చుకున్న గొడుగును తలపిస్తాయి. నౌబత్ ఖానా... ముఖద్వారానికి దగ్గరగా ఉంటుంది. సంగీతకళాకారులు డ్రమ్స్ వాయిస్తూ చక్రవర్తి వస్తున్నాడన్న విషయాన్ని ప్రకటిస్తారు.
దివాన్ ఇ ఆమ్... విశాలమైన మండపం. చక్రవర్తి సందర్శనార్థం వచ్చిన సామాన్య ప్రజలు వేచి ఉండే హాలు. దివాన్ ఇ ఖాస్... ప్రభుత్వంలో ఆంతరంగికులు రాజుతో సమావేశమయ్యే దర్బారు. దీని నిర్మాణం మరింత నైపుణ్యంగా ఉంటుంది. గుజరాతీ నిర్మాణశైలిలో చిత్రించిన 36 అరలు ఉంటాయి. మొఘలుల కోటల్లో ఈ రెండూ తప్పక ఉంటాయి. ఇక్కడ ఉన్న దివానీ ఖాస్, దివానీ ఆమ్ ఆగ్రా, ఢిల్లీ రెడ్‌ఫోర్ట్‌లలో ఉన్న వాటి కంటే పెద్దవి. ఇక బీర్బల్ ఇల్లు... ఇది మనకు బాగా తెలిసిన పేరు. అక్బరు మంత్రిగా మనకు జానపద కథల్లో పరిచయమైన వ్యక్తి బీర్బల్. అక్బరుకు ఇష్టమైన మంత్రి. అతడి ఇల్లు కోటలో ఉంది.
మరియ్ ఉజ్ జమాని... ప్రధాన భవనాలకు అనుబంధంగా ఉన్న వరండా ఇది. దీనిని కూడా గుజరాతీ నిర్మాణశైలిలోనే నిర్మించారు. జమామసీదు... నగరంలో ప్రముఖ ప్రార్థనామందిరం. చారిత్రక ఫతేపూర్ సిక్రీ అక్బర్ రాజకీయ ఆలోచనలకు, సెక్యులర్ భావాలకు నిదర్శనంగా ఉండేది. ముస్లిం రాణి, హిందూ రాణి (జోధాబాయి ప్యాలెస్) ప్యాలెస్‌లు ఉన్నాయి. కృత్రిమమైన సరస్సును తయారు చేశాడు. ఈ నగరం అక్బర్ పర్సనాలిటీకి, విజన్‌కి ప్రతిరూపం. ఏదైనా విశాలమే ఇక్కడ. అక్బర్ హృదయానికి, మనసుకు ప్రతిబింబంగా ఉంటుంది నగరం. ఈ ప్యాలెస్‌లలో సున్నితమైన పనితనం కంటే విశాలత్వం, రాజసం ఉంటాయి. ఇందులో తిరుగుతుంటే మధ్యయుగం నాటి రాజరిక జీవనశైలి కళ్లముందు మెదలుతుంది. అక్బర్ టైమ్‌లో ఉన్న తాంజూర్ లలిత కళలు, రాతి చెక్కడాలు ఎక్కువ. పాలరాతిలో రత్నాలను పొదగడం వంటి కళాత్మకత షాజహాన్ కాలానికి అభివృద్ధి చెందింది, అక్బర్ టైమ్‌లో అంత పరిణతి లేదు.
కొత్త మతం పుట్టిన చోటు...
ఇబాదత్ ఖానా... ఇది ప్రార్థనామందిరం. సమావేశ మందిరంగా ఉపయోగించేవారు. అక్బర్ కొత్త మతం దిన్ ఇ ఇలాహి ఇక్కడే రూపం పోసుకుంది. అక్బర్ అన్ని మతాల్లోని మంచి అంశాలను సుమహారంగా మలిచి ఈ మతాన్ని రూపొందించాడు. కానీ ఇది ఏ మతం వారినీ ఆకట్టుకోలేకపోవడంతో త్వరగా అంతరించిపోయింది. సిక్రీలో రాజమందిరాలతోపాటు పరిపాలనకు అవసరమైన అధికారిక భవనాలు తక్సాల్, దఫ్తర్ ఖానా, ఖార్ఖానాలు, ఖజానా ఉన్నాయి. టర్కీ శైలి స్నానవాటికలు, హకీంల నివాసాలను కూడా చూడవచ్చు.
ఈ నగరాన్ని యునెస్కో 1986లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. చరిత్ర పరిశోధకులు ఫతేపూర్ సిక్రీని రెండు రకాలుగా చెబుతారు. రాతిలో ఇంత అందమైన నిర్మాణాలు చేశాడని కొందరు ‘పొయెట్రీ ఇన్ రాక్’ అనీ, నీటి వసతి చూసుకోకుండా ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకు ‘ఏరగెన్స్ ఆఫ్ ది ఎంపరర్’ అనీ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు.
ఇప్పుడూ జనావాసమే!
ఫతేపూర్ సిక్రీ... అంటే మనకు వాడుకలో లేని రాజప్రాసాదాలే గుర్తొస్తాయి. కానీ ఇందులో ప్రజలు నివసిస్తున్నారు. దాదాపుగా ముప్పై వేల జనాభా ఉంది. ఇక్కడ అక్షరాస్యత యాభై శాతానికి లోపే. ఆగ్రా జిల్లాలో ఉన్న 15 బ్లాక్‌లలో ఇదొకటి. దీని పరిధిలో 52 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.
ఫతేపూర్‌సిక్రీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఆగ్రా జిల్లాలో ఒక పట్టణం. దీని పురాతన పేరు సిక్రీఘర్. ఈ నగరాన్ని క్రీ.శ 1500లో సిక్రీవాల్ చివరి రాజపుత్ర రాజు మహారాణా సంగ్రామ్ సింగ్ నిర్మించాడని చెబుతారు. అక్బర్ ఈ రాజ్యం మీద దండెత్తి దండెత్తి ఏడవ ప్రయత్నంలో స్వాధీనం చేసుకున్నాడనీ, రాజపుత్ర రాజు ప్యాలెస్ వదిలి పారిపోయాడని చెబుతారు. అక్బర్ తన విజయానికి చిహ్నంగా దీనిని ఫతేహాబాద్‌గా మార్చాడు. అరబిక్ భాషలో ఫతే అంటే విజయం అని అర్థం. ఇది రాజపుత్రుల స్థానం అనడానికి చిహ్నంగా సిక్రీఘర్ ముఖద్వారం లాల్ దర్వాజా ఎదురుగా రాజపుత్రుల కులదైవం చమద్‌దేవి ఆలయం ఉంది. అక్బర్ దీనిని రాజధాని చేసుకుని 1571 - 1585 వరకు ఇక్కడి నుంచి పాలించాడు. రాజధానిగా కొనసాగించాలన్న ఉద్దేశంతో హరేమ్, కోర్టు, మసీదులు, ఉద్యోగులకు నివాసాలు... ఇలా చాలా నిర్మాణాలు చేశాడు. దాంతో ఇది అక్బర్ నిర్మించిన నగరంగానే ప్రసిద్ధి చెందింది. క్రమంగా ఫతేపూర్ సిక్రీగా వాడుకలోకి వచ్చింది.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more