సూరి (రాజ్ తరుణ్) ఓ పల్లెటూల్లో ఉంటూ కోడి ఎరువు అమ్ముకుంటూ హాయిగా జీవనం సాగిస్తుంటాడు. ఇతనికి ఉమ (అవిక) అనే మేన మరదలు ఉంటుంది. చిన్నప్పటి నుండి సరదాగా ఉండే వీరిద్దరి మధ్య ఎప్పుడు చిన్న చిన్న తగాదాలు జరుగుతుంటాయి. క్షణం కూడా వీరిద్దరు పోట్లాడుకోకుండా ఉండలేరు. యుక్త వయస్సు వచ్చాక ఉమ సూరిని ఏడిపించడానికి వేరే అతన్ని ప్రేమిస్తుంది. అతడు ఉమ మోసం చేయబోతే అతని నుండి కాపాడుతాడు. ఆ సంఘటన వారిద్దర్ని మరింత దగ్గరికి చేరుస్తుంది. అంతేకాకుండా సూరిపై తనకు ఉన్న ఇష్టం ప్రేమ అని ఉమకు అర్ధమవుతుంది. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా ఓ పెళ్లి సంబంధాన్ని ఖాయం చేస్తాడు. ఉమ ఆ పెళ్లి చేసుకుంటుందా ? లేక సూరికి తన ప్రేమను తెలుపుతుందా ? సూరినే ఉమ ప్రేమను అర్థం చేసుకుంటాడా అనేదే ఈ చిత్రం యొక్క కథ.
చిన్న సినిమాలకు ఆదరణ తగ్గిపోతున్న ఈ కాలంలో... ప్రముఖ నటుడు నాగార్జున, బడా నిర్మాత సురేష్ బాబు లాంటి వారు చిన్న సినిమాలను నిర్మించి వాటికి పెద్ద సినిమా రేంజ్ లో ప్రమోషన్ చేసి విడుదలకు ముందే క్రేజ్ తెస్తున్నారు. అలా అందరి దృష్టిని ఆకర్షించిందే ‘ఉయ్యాలా జంపాలా ’ చిత్రం. ఆడియో, ట్రయిలర్స్ తో ఓ మంచి ప్రేమ కథా చిత్రంగా జనాల్లో క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మాత్రం ఆకట్టుకుందో రివ్యూ ద్వారా చూద్దాం.
ఇటీవలి కాలంలో వస్తున్న మాస్ అండ్ యాక్షన్ స్టోరీల కన్నా సాదా సీదా స్టోరీలే సక్సెస్ అవుతున్నాయి. అలాంటి కోవకు చెందినదే ఉయ్యాలా... జంపాలా... పల్లెటూల్లో బావా మరదళ్ల మధ్య జరిగే సన్నివేశాలు, అల్లరినే దర్శకుడు కథాంశంగా తీసుకొని వెండితెర పై అద్బుతంగా ఆవిష్కరించాడు.
తమతో పాటే పెరిగిన వారితోనే ప్రేమలో పడ్డామనే సంగతి రియలైజ్ అవడమే ఈ చిత్ర కథాంశం. ఈ చిత్రంలో దర్శకుడి ట్రీట్ మెంట్, గోదావరి అందాలు, భాష, యాస ఉయ్యాల జంపాలకు మరింత శోభను తెచ్చాయి. కోస్తాంధ్ర గ్రామీణ నేపథ్యంతో అశ్లీలత, అసభ్యత లేని స్వచ్చమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్‌హాఫ్ అసలు టైమ్ తెలీకుండా సాగిపోతుంది. సెకాండాఫ్ లో కథనంలో వేగం తగ్గినా.. క్లైమాక్స్ లో సర్దుకుంది. దర్శకుడు అక్కడక్కడా తడబాటుకు గురైనట్టు అనిపించినా దాన్ని బాగా మేజేజ్ చేసి ఓకే అనిపించుకున్నాడు.
ఈ చిత్రంలో ముఖ్యంగా డైలాగ్స్, కామెడీ ఆకట్టుకున్నాయి. రొటీన్ కథలు, యాక్షన్ ఎపిసోడ్ లను వెండితెర పై చూపించి మైండ్ తినే సినిమాలు వస్తున్న ఈ కాలంలో... మన చుట్టూ జరిగే లవ్ స్టోరీలను ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలంటే ‘ఉయ్యాలా... జంపాలా ’ సినిమా చూడాల్సిందే.
సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి ఎన్నో హంగు హార్బాటాలతో వెండితెరకు లాంచ్ అవుతున్న హీరోల కన్నా ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వెండితెరకు వస్తున్న యువ నటులే బాగా నటిస్తున్నారని చెప్పడానికి ఉదాహారణ రామ్ తరుణ్ ఒకడు. వెండితెర పై చేసింది మొదటి సినిమా అయినా ఎంతో బాగా చేశాడు.
ఈ సినిమాలో క్యారెక్టర్ కి రాజ్ తరుణ్ అతికినట్లు సరిపోయాడు. చక్కని హావభావాలతో, హాయిగొలిపే గోదావరి యాసతో తన పాత్రకి జీవం పోసాడు. ఇక బుల్లితెర ‘చిన్నారి పెళ్లి కూతురు ’ సీరియల్ ద్వారా పాపులర్ అయిన అవిక తొలిసారి వెండితెర పై కనిపించింది. ఈ సినిమాలో ఉప పాత్రను పోషించిన అవిక పల్లెటూరి పిల్లగా బాగా సూట్ అయ్యింది. మంచి ఎక్స్ ప్రెషన్స్, కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ పలికించింది. మొత్తంగా చెప్పాలంటే ఈ సినిమాలో వారిద్దరు నటించారనడం కంటే జీవించారని చెప్పవచ్చు.
నితా చౌదరి, రవి వర్మ ఇద్దరికీ హీరో తల్లి, హీరోయిన్ తండ్రిగా చెప్పుకునే పాత్రలు దక్కాయి. హీరోని ప్రేమించే యువతి పాత్రలో పునర్నవి నటన సహజంగా ఉంది. హీరో స్నేహితుడిగా నటించిన గంగాధర్ ఆకట్టుకుంటాడు. మిగతా పాత్రల్లో ప్రతి ఒక్కరు తన పాత్రల మేరకు నటించి ఫర్వాలేదనిపించి ఉయ్యాలా జంపాలాను ఓ మంచి ఫీల్ గుడ్ మూవీగా మలిచారు.
సాంకేతిక వర్గం :
వెండితెరకు ఎంతో మంది యువ సంగీత దర్శకులు వస్తున్న ఈ రోజుల్లో ఈ సినిమాకు ఎం.ఆర్ సన్నీ అందించిన సంగీతం ప్రేక్షకుల హార్ట్ ని టచ్ చేయకపోయినా, ఫర్యాలేదనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓ ఫీల్ ను కంటిన్యూ చేయడంలో నూరుపాళ్లు సఫలమైంది. కెమెరామెన్ విశ్వ పల్లెటూరి అందాలను బాగా బందించాడు. ఎడిటర్ పనితీరు మెరుగ్గా కనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
గతంలో చాలా షార్ట్ ఫిలిం చిత్రాలు తీసిన విరించి వర్మ చాలా సింపుల్ స్టోరీని ఎంచుకొని ఏం చెప్పాలనుకున్నాడో చాలా సాదా సీదాగా చెప్పడంలో సఫలం అయ్యాడు. పల్లెటూల్లో బామ మరదళ్ళ మధ్య ఉండే సహజత్వాన్ని ఈ సినిమాల్లో చాలా చక్కగా చూపించాడు. కొత్త నటులు అయినా వారి నుండి కావాల్సినంత అవుట్ పుట్ ను తీసుకోవడంలో విరించి బాగా సక్సెస్ అయ్యాడు.
చివరగా : ‘ఉయ్యాలా... జంపాలా ’ ఓ సారి చూసి ... హాయిగా ఊహల్లో ఊగి రావచ్చు.