The world facing terrorism problem

terrorism, wto attack, peshawar blasts, terrorist attack, afghan terrorism

the world facing terrorism problem : terrorism getting more power every day. all nations in the world are suffering from terrorism.

ప్రత్యేకం: ఉగ్రవాదపు ఉచ్చులో నేటి ప్రపంచం

Posted: 02/13/2015 04:39 PM IST
The world facing terrorism problem

ఉగ్రవాదం..రాయడానికి నాలుగే అక్షరాలు కానీ ఈ పేరు వింటేనే చాలా మందికి వెన్నులో వణుకు పుడుతుంది. ఉగ్రవాద దాడుల్లో తృటిలో తప్పించుకున్న వారిని అడిగితే కన్నీళ్లు తప్ప మాటలు రావు. ప్రపంచంలోని ఏ దేశమైనా అభివృద్దిని చూసి ఉండకపోవచ్చు కానీ ఉగ్రవాదాన్ని మాత్రం తప్పక చూసి ఉంటుంది. ఏదో రకంగా తమ దేశంపై లేదా దేశం లోపల ఉగ్రవాద మూకలు దాడులకు దిగడం జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆకలి కేకల నుండి పుట్టేది ఉద్యమం, తమ హక్కుల కోసం, స్వచ్ఛ కోసం చేసేదే ఉద్యమం. కానీ ఒక వ్యక్తి లేదా ఓ సమూహం ఆలోచనల నుండి పుడుతున్న రక్తదాహానికి అసలు రూపమే ఈ ఉగ్రవాదం.

ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇది విలయతాండవం చేస్తోంది. అమెరికా నుండి చిన్న దేశాలైన యుగాండా, సొమాలియా వరకు ఇలా అన్ని దేశాల్లోనూ విస్తరించింది ఉగ్రవాదం. అన్ని దేశాల ప్రజలు, ప్రభుత్వాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. మరి ఇంత వ్యతిరేకిస్తున్నా ఎందుకు ఉగ్రవాదం రోజురోజుకు పెరుగుతోంది. కొన్ని దేశాలు, సంస్థలు చేస్తున్న సహకారం. చాలా దేశాలకు చెందిన బ్లాక్ మని ఉగ్రవాద సంస్థలకు తరలిపోతోంది.

ఉగ్రవాద సంస్థలకు చెందిన వారు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. విదేశాల్లో రహస్య ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహిస్తు, దాడులు ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎక్కువ మంది చనిపోతారని ప్రత్యేకంగా బోధిస్తుంటారు. అయితే ఉగ్రవాదానికి సహకరిస్తున్న వారు చివరకు అదే ఉగ్రవాద కోరల్లో చిక్కుకొని చనిపోతున్నారు. ముఖ్యంగా ముస్లిం వర్గానికి చెందిన వారే ఉగ్రవాదులుగా మారుతున్నారని ఆ మధ్య కథనాలు వచ్చాయి. కానీ రక్త పాతాన్ని సృష్టించే ఏ పనిని ఏ మతమూ స్వాగతించదు. కేవలం కొన్ని వర్గాలు మాత్రమే ఉగ్రవాదానికి ఆకర్షితులవుతున్నారన్నది అబద్దం. అన్ని వర్గాలకు చెందిన వారు, అన్ని దేశాలకు చెందిన వారు ఇందులో భాగస్వాములవుతున్నారు.

ఉగ్రవాదులు చేసిన అతిపెద్ద దాడుల్లో అమెరికా ట్విన్ టవర్స్ కూల్చివేత , పెషావర్ ఆర్మీ స్కూల్ పై దాడులు ఉన్నాయి. అగ్రరాజ్యంగా పేరు పొందిన అమెరికాకు ఉగ్రవాదం రక్తపు మరకనంటించింది ట్విన్ టవర్స్ కూల్చివేత ఘటన. ప్రపంచ వాణిజ్య సముదాయాన్ని కూల్చడం ద్వారా తమ ఉనికిని ప్రపంచానికి చాటింది. అయితే ఈ ఘటనపై అందరూ విమర్శలు చేశారు. ఇది ఒక కొణం మాత్రమే. ట్విన్ టవర్స్ కూల్చివేత తర్వాత వివిధ ఉగ్రవాద సంస్థలకు చేరుతున్న నిధులు రెట్టింపయ్యాయన్న వార్త అందరిని కలవరపెడుతుంది. ఈ ఘటన తర్వాత చాలా మంది ఉగ్రవాదులు, ట్విన్ టవర్ కూల్చివేతనే తమ ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఇది వినాశనానికి నాంది లాంటిది.

అభం శుభం తెలియని చిన్నారులను అతి కిరాతకంగా చంపి, జిహాద్ అంటూ ప్రపంచానికి చాటింది ఉగ్రవాదం. కానీ జిహాద్ అంటే యుద్దం కాదు రక్త పాతం అసలే కాదు, సత్యం కోసం జరిగే యుద్దం. ఉగ్రవాదంలో చాలా మంది అసలు ప్రపంచంలో జరిగిన తప్పులను చూపిస్తు, వాటిపైనే ఉగ్రవాదులకు శిక్షణనిస్తుంటారు. ఏ మత గ్రంథంలొనైనా మంచే ఉంటుంది. ఏ మతంలోనైనా మంచే చెయ్యమని ఉంటుంది. ఏ మతం, తన వారు మాత్రమే మనుషులు మిగిలిన వారు మనుషులు కారు, వారు ఉండడానికి వీలు లేదని ఎక్కడా చెప్పదు. కానీ కొందరు ఉగ్రవాద నాయకులు మాత్రం ఫలానా గ్రంథంలో ఇలా ఉంది అంటూ చేసిన తప్పులు మళ్లీమళ్లీ చేస్తుంటారు.

ఆ మధ్య రష్యా దళాల చేతిలో భర్తలను, తమను ప్రేమించే వాళ్లను కోల్పోయిన మహిళలు  ఉగ్రవాదులుగా మారడం సంచలనం  సృష్టించింది. ఇలా కొందరు మహిళలు బ్లాక్ విడోస్ పేరుతో ఓ సంస్థగా ఏర్పడ్డారు.  ఎక్కువమంది వయసు 15 నుంచి 19 సంవత్సరాల వయస్సున్న మహిళల ఇందులో సభ్యులుగా చేరారు. బ్లాక్ విడోస్‌కు ఎలాంటి ఆయుధ శిక్షణ ఉండదు. శరీరానికి పేలుడు పదార్థాలు అమర్చుకుని, మానవ బాంబ్ లా మారడమే వారి పని. ఇలా ఒక్క రష్యాలోనే కాదు చాలా దేశాల్లో ఉగ్రవాద సంస్థలు పుడుతున్నాయి. అయితే ఉగ్రవాద సంస్థల పుట్టుక వేరే వేరే కారణాలు ఉన్నా, వారి లక్షం మాత్రం ఒక్కటే అదే రక్తపాతం.

మన దేశంలో ఇప్పటికి 36 రకాల సంస్థలపై కేంద్రం నిషేదం విధించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరిస్తున్నారని వీటిపై నిషేదం విధించింది కేంద్రం. అయితే మన దేశం పై ఉగ్రవాద దాడులు గతంలో జరిగాయి, ప్రస్తుతం జరుగుతున్నాయి, భవిష్యత్తులో జరగవని ఎలాంటి నమ్మకమూ లేదు. తాజాగా పాకిస్థాన్ లోని పెషావర్ లో మసీదు దగ్గర ఉగ్రవాదులు దాడులు చెయ్యడంతో పది మంది చనిపోయారు. ఉగ్రవాద దాడుల్లో ఎక్కువ శాతం పెషావర్ లోనే చోటుచేసుకుంటున్నాయి. పాకిస్థాన్ లో గత సంవత్సరం జరిగిన ఆర్మీ స్కూల్ పై దాడితో పాక్ ప్రభుత్వం కూడా ఉగ్రవాద ఏరివేతకు పూనుకుంది. అయినా ఇంకా ఉగ్రవాద ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి.

రక్తపాతానికి, అరాచకత్వానికి చిరునామా అయిన ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే గత కొన్ని సంవత్సరాలుగా అన్ని దేశాలు కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాయి. కానీ ఆ నిర్ణయాలను అమలు పరచడంలో సమన్వయం లోపించింది. ఇదే ఉగ్రవాదం మరింత బలపడడానికి కారణమవుతోంది.  ప్రపంచంలోని సార్క్, జి 10, జి 5, ఓపెక్, బార్క్ ఇలా అన్ని కూటములు కలిసి కట్టుగా ముందుకు కదిలితే ఉగ్రవాదం నామరూపాలు లేకుండాపోతుంది. శాంతి, సౌభ్రాతృత్వాలతో కూడిన ప్రపంచాన్ని మనం ఆశిద్దాం.
 
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : terrorism  wto attack  peshawar blasts  terrorist attack  afghan terrorism  

Other Articles