Coastal people are scared of october

Cyclone Hudhud, Visakhapatnam, Bay of Bengal, Cyclone, Andhra Pradesh, north coastal areas, vishaka city, October

coastal people are scared of danger cyclones in October

అమ్మో.. అక్టోబర్...!

Posted: 10/14/2014 11:05 AM IST
Coastal people are scared of october

అమ్మో..! అక్టోబర్..అంటూ కోస్తా జిల్లావాసులు వణికిపోతున్నారు. అక్టోబర్ పేరు చెబితేనే తీరప్రాంత వాసులు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా జల్ తుపాన్, నీలం, పైలీన్, ప్రస్తుతం హుదుద్ తుపాను అల్లకల్లోలం సృష్టించడమే దీనికి కారణం. ఈనెల వచ్చిందంటే పెను తుపాన్లు ముంచేస్తాయని ప్రజల్లో కలవరం మొదలవుతుంది. చేతికందవచ్చిన పంటలను తుపాను పూర్తిగా ధ్వంసం చేస్తుందని రైతుల్లో ఆందోళన నెలకొంటుంది. ప్రధానమైన దసరా, దీపావళి పర్వదినాలతో కూడిన ఈ నెలలోనే అధిక సంఖ్యలో తీవ్రమైన తుపాన్లు వచ్చి తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాలు కలిగిస్తుండమే ఇందుకు కారణం. పండగ వేళ్ల ఇళ్లలో విషాదాన్ని నింపుతున్న అక్టోబర్ మాసం అంటేనే హడలిపోతున్నారు కోస్తావాసులు. తమ బతుకులను ఛిద్రంచేస్తున్న తుపాన్లతో, అక్టోబర్ నెలతో భయకంపితులవుతున్నారు.

ఈ ఏడాది కూడా కోస్తా ప్రజల భయం నిజమైంది. హుద్ హుద్ పేరుతో వచ్చిన పెను తుఫాను ప్రళయగీతాన్ని రచించింది. వేల కోట్ల రూపాయల అస్తులను ధ్వంసం చేసింది. గత ఏడాది అక్టోబర్ 10-15 తేదీల మధ్య పైలీన్,  నవంబర్‌లో హెలెన్, లెహర్ తుపాన్లవల్ల కకావికలమైన సంఘటనలను ప్రజలు మరువకముందే ఈ ఏడాది హుదూద్ పెను విపత్తు ఉత్తరాంధ్రలో విధ్వంసం సృష్టించింది. 1891 నుంచి అందుబాటులో ఉన్న గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటి వరకూ 76 తుపాన్లు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. వీటిలో 31 అక్టోబర్‌లోనే రావడం గమనార్హం. అందుకే ఈ నెలను వాయుగుండాల (గండాల) మాసంగా కోస్తావాసులు అభివర్ణిస్తుంటారు.
123 ఏళ్లలో మొత్తం 76 తుపాన్లు రాగా అందులో 52 (మూడింట రెండొంతులు) అక్టోబర్, నవంబర్ నెలల్లోనే సంభవించాయి. రాష్ట్ర చరిత్రలో అతి పెద్ద పెను విపత్తుగా నమోదైన దివిసీమ ఉప్పెన కూడా నవంబర్ నెలలోనే  సంభవించింది. 1977 నవంబర్ 15-20 తేదీల మధ్య సంభవించిన దివిసీమ ఉప్పెన పదివేల మందిని పొట్టన పెట్టుకుంది. 123 ఏళ్లలో అత్యధిక (23)  తుపాన్లు నెల్లూరు జిల్లాలోనే తీరం దాటాయి. మరో 16 కృష్ణా జిల్లాలో తీరం దాటాయి. కోస్తాలోని తొమ్మిది జిల్లాలు సముద్రతీరంలోనే ఉన్నా నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోనే ఎక్కువ తుపాన్లు తీరం దాటాయి. పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాల్లో ఇప్పటి వరకూ ఒక్క తుపాను కూడా తీరాన్ని దాటిన దాఖలాలు లేవు. 1892 అక్టోబర్‌లో వారం వ్యవధిలోనే రెండు తుపాన్లు, 1987 అక్టోబర్‌లో పక్షం వ్యవధిలో మూడు తుపాన్లు ముంచెత్తాయి.

నైరుతి రుతుపవనాల కాలంలో కంటే ఈశాన్య రుతుపవనాల సమయంలో తుపాన్ల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరీ ముఖ్యంగా అక్టోబర్‌లోనే మనకు ఎక్కువ తుపాను విపత్తులు సంభవిస్తుంటాయి. 1891 నుంచి రాష్ట్రాన్ని 76 తుపాన్లు రాగా, వాటిలో 31 అక్టోబర్‌లోనే  సంభవించాయి. ఈశాన్య రుతుపవనాల సమయంలో అధికంగా, తీవ్రంగా తుపాన్లు వచ్చి కోస్తా తీరంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో సముద్ర ఉష్ణోగ్రతలు తుపాన్లకు చాలా అనువుగా ఉంటాయని, అల్పపీడనాలు తుపాన్లుగా మారుతుంటాయని వాతావరణ నిపుణులు తెలిపారు.. అందుకే ఈ నెలల్లోనే మనకు అత్యధిక తుపాన్లు, విపత్తు నష్టాలు సంభవిస్తుంటాయన్నారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles