Snoring bothers ohers but an indication to self

Snoring bothers ohers but an indication to self, Snoring menace, remedies for snoring, causes of snoring

Snoring bothers ohers but an indication to self

గురక ఇతరులకు ఇబ్బంది, ఆ మనిషికి సంకేతం

Posted: 05/10/2014 03:58 PM IST
Snoring bothers ohers but an indication to self

పెద్ద హోరుతో గురక పెడుతున్న గదిలో హాయిగా నిద్ర పోతున్న మనిషి ఒక్కడే.  ఆ గురకపెడుతున్న పెద్దమనిషి!  ఆయనకు ఆయన గురక వినపడదు కనుక!  మధ్యవయస్కులలో చాలా మందికి స్త్రీ పురుష భేదం లేకుండా గురక మొదలవుతుంది.  గురక పెడుతున్నాం, ఇతరులను ఇబ్బందిపెడుతున్నాం అనే భావన గురకపెట్టే వాళ్ళని బాధిస్తుంది.  కానీ వాళ్ళేమీ చెయ్యలేరు దానికి.  ఎందుకంటే వాళ్ళు ఆ పని చేసేది వారు స్పృహలో లేని సమయంలో కాబట్టి, వారి చైతన్యావస్థలోని నిర్ణయాలు అందుకోలేని నిద్రావస్తలో ఆ పని జరుగుతుంది కాబట్టి.  

అసలేమిటీ గురక, ఎందుకు వస్తుంది? 

మెలకువలో ఉన్నప్పుడు మనం గాలి పీల్చినప్పుడు రాని శబ్దం పడుకోగానే ఎందుకు వస్తుందో అర్థమయినప్పుడు దానికి పరిష్కార మార్గాన్ని కూడా వెతుక్కోవచ్చు.  శరీరంలోకి పీల్చే గాలి, వదిలే గాలి వెళ్ళే మార్గంలో ఆ సమయంలో కలిగిన ఒత్తిడి, మార్గం మూసుకుపోవటాలే ప్రధాన కారణాలు.  మార్గం సన్నగా అయ్యేటప్పటికి అందులోంచి గాలి వెళ్తున్నప్పుడు శబ్దం రావటం సహజం.  

ఏయే కారణాల వలన గురక వచ్చే సందర్భం కలుగుతుంది?

1. భారీకాయం ఉన్నవారికి గురక ఎక్కువగా వస్తుంది.  అందుకు కారణం మెడ భాగంలో పేరుకుపోయిన కొవ్వు పదార్థం పడుకున్న సమయంలో శ్వాస మార్గానికి అవరోధం కలిగిస్తుంటుంది.  దీనికి మార్గాంతరం కొవ్వు పదార్థాలను తగ్గించుకోవటం.  అది ఆహారపదార్థాల సేవనంలో తేడా తీసుకుని రావటం ద్వారానూ, శారీరక వ్యాయామం ద్వారా సాధ్యమౌతుంది.

2. పడుకునే భంగిమ కూడా శ్వాస మార్గానికి వత్తిడి కలిగించే అవకాశం ఉంది.  వెల్లకిలా పడుకున్నప్పుడు శ్వాసకోశం దగ్గరగా వస్తుంది.  అందువలన అలాంటివాళ్ళు పక్కకు తిరిగి పడుకుంటే దీన్ని అధిగమించవచ్చు.

3. నోటి ద్వారా శ్వాస పీల్చుకోవటం వలన కూడా గురక వస్తుంది.  ముక్కు ద్వారా పీల్చుకున్నప్పడు శ్వాస నాళం అందుకు తగ్గట్టుగా ఏర్పడిందే కనుక శ్వాస సరిగ్గా సాగుతుంది.  కానీ నోటి ద్వారా పీల్చుకోవటం జరిగినప్పుడు పీల్చుకున్న గాలి గొంతుకి ముందు అడ్డంగా తగిలి ఆ తర్వాత లోపలి వైపుకి పోతుంది.  అప్పడు శబ్దం ఏర్పడే అవకాశం ఉంటుంది.  పడుకున్నప్పుడు నోరు తెరుచుకుంటుందేమో గమనించి అలా జరగకుండా జాగ్రత్తలు తీసకుంటే నోటి ద్వారా గాలి పీల్చుకోవటం వలన వచ్చే శబ్దాలు ఆగిపోతాయి.

4. ముక్కు రంధ్రాలు సన్నగా ఉన్నవాళ్ళకి గురక వస్తుంది.   దీనికి ఉపాయం డైలేటర్స్ ని ఉపయోగించటం.  ఇవి మెత్తటి ప్లాస్టిక్ తో చేసిన ఉపకరణం.  ఇది ముక్కు రంధ్రాలు మూసుకోకుండా ఉంచుతుంది.  దానితో గురక ఆగిపోతుంది.

5. ముక్కు లోపల గ్రంధులలో ఎలర్జీల వలన కూడా గురక వస్తుంది.  ఎలర్జీ వలన కలిగిన ఇన్ ఫెక్షన్ తో ముక్కు, గొంతు లోపలి భాగాలు వాపుకి గురౌతాయి.  అప్పుడు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది కలుగుతుంది.  పడుకున్నప్పుడు ఇన్ ఫెక్షన్ అయిన భాగంలోంచి వచ్చే ద్రవపదార్థం గొంతుకి అడ్డం పడి కూడా గురక వస్తుంది.  ఆ ఇన్ఫెక్షన్లు, వాపులకు చికిత్స తీసుకుంటే గురక తగ్గిపోతుంది.

6. మద్యపానం, ధూమపానాల వలన గొంతు లోపలి కండరాలు పట్టు వదులుతాయి.  దానివలన శ్వాస తీసుకునేటప్పడు అవి శబ్దతరంగాలను సష్టిస్తాయి.  నిద్ర మాత్రలు కూడా ఇలాంటి ఫలితాన్నే ఇస్తాయి.  దీనికి మార్గం అటువంటి అలవాట్లను మానుకోవటం.  
అందువలన ముందుగా మీకు గురక వస్తున్నట్లు తెలిసినప్పుడు అది ఎందుకు వస్తోందో తెలుసుకుని దాన్ని నయం చేసుకోవటానికి మార్గాలను వెతకాలి.  
సురక్షితమైన పరిష్కారం

గురక వచ్చేది శ్వాసతోనే అయినా ఆ శ్వాసే మనలను ప్రాణాలతో నిలబెట్టేది కాబట్టి దాన్ని నియంత్రించటానిక ఉన్న ఏకైక సహజసిద్ధమైన మార్గం ప్రాణాయామం.  క్రమం తప్పకుండా ప్రాణాయామం చేసినట్లయితే దానివలన ఒనగూడే ఇతర లాభాలతో పాటు శ్వాసనాళాలు, శ్వాస కోశంలోని లోపాలను సరిదిద్దుకోవటం జరుగుతుంది.  అంతకు ముందు గొంతు, ముక్కు లోపలి కండరాలలోని లోపాల వలన గురక వస్తున్నట్లయితే ఆ కండరాలు ఆరోగ్యవంతంగా తయారవటం జరుగుతుంది కనుక శబ్దాలు క్రమక్రమంగా ఆగిపోతాయి.  శరీరంలోని ఇతర ప్రదేశాలలో కొవ్వు పదార్థం పేరుకుపోయి ఉన్నా, ప్రాణాయామం వలన మొట్టమొదట కలిగే ఉపయోగం, శ్వాసనాళం, శ్వాసకోశం లోని కండరాలు శక్తివంతంగా తయారవటం, దాని వలన సంకోచ వ్యాకోచాలలో ఇబ్బంది కలగకుండా ఉండటం.

మనం గురక పెడుతున్నామన్న సంగతి ఇతరులు చెప్తే కాని మనకు తెలియదు కనుక, వాళ్ళు గేలి చేస్తున్నట్లు మాట్లాడినా సరే, అందులోంచి మీకు కావలసిన వివరాలను గ్రహించి, ఆ గురకకు కారణాలేమిటో తెలుసుకుని దాన్ని నివారించుకునే ప్రయత్నం చెయ్యటం మంచిది.  

నా గురక నాకైతే ఇబ్బంది కలిగించదు కదా ఇతరుల గురించి నాకేమిటి అని కూడ కొందరు అనుకోవచ్చు.  కానీ, గురక అనేది శ్వాస సాఫీగా సాగటం లేదనటానికి సంకేతం.  సంకేతాలను ఎప్పుడూ విస్మరించగూడదు.  శరీరం ఒక్కసారిగా కూలబడిపోదు.  ఎన్నో సంకేతాలిస్తుంది.  వాటిని మనం గ్రహించి సరిచేసుకుంటే దీర్ఘాయుష్షుతో చివరి రోజుల వరకు ఆరోగ్యంగా జీవిస్తాం.  తక్కువ తక్కువ ప్రాణవాయువు శరీరానికి తగినంత ప్రాణ శక్తిని శరీరానికి అందకుండా చేస్తుంది.  

అందువలన, గురకే కదా అని తేలిగ్గా తీసుకోగూడదు.  ఆ గురక ఒక సంకేతం కాబట్టి అది ఏ సంకేతాన్నిస్తోందో గ్రహించటం ముఖ్యం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles