'Sye Raa Narasimha Reddy' movie review ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ రివ్యూ

Teluguwishesh ‘సైరా నరసింహారెడ్డి’ ‘సైరా నరసింహారెడ్డి’ Narasimha Reddy (Chiranjeevi) is the territorial administrative and military ruler of Uyyalawada. Following his guru Gosayi Venkanna's (Amitabh Bachchan) advice, he becomes a fierce warrior and leader. Directed by Surender Reddy, takes the safe route in showcasing the fight to freedom. Product #: 91285 4.00 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ‘సైరా నరసింహారెడ్డి’

  • బ్యానర్  :

    కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ

  • దర్శకుడు  :

    సురేందర్ రెడ్డి

  • నిర్మాత  :

    రాంచరణ్ తేజ్

  • సంగీతం  :

    అమిత్‌ త్రివేది, జూలియస్‌ ఫాఖియం

  • సినిమా రేటింగ్  :

    4.004.004.004.00  4.00

  • ఛాయాగ్రహణం  :

    ఆర్ రత్నవేలు

  • ఎడిటర్  :

    ఏ.శ్రీకర్ ప్రసాద్

  • నటినటులు  :

    నటినటులు: చిరంజీవి, నయనతార, తమన్న. అమితాబ్ బచ్చన్, అనుష్క, విజయ్ సేతుపతి, జగపతిబాబు, కిచ్చా సుదీప్, హ్యూమా ఖురేషి, రవికిషన్‌, నిహారిక, బ్రహ్మానందం, రఘుబాబు, బ్రహ్మాజీ తదితరులు

Sye Raa Narasimha Reddy Movie Review Excellent Patriotism And Secularism

విడుదల తేది :

2019-10-02

Cinema Story

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టుగా.. ఆయన నాలుగు దశాబ్దాల సినీకెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏకంగా రూ.300 కోట్ల బడ్జెట్ తో తన తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ తెరకెక్కించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తొలితరం స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను ఆదారంగా చేసుకుని దర్శకుడు సురేందర్ రెడ్డి రూపోందించిన చిత్రం విడుదలకు ముందే విమర్శకుల నోట నుంచి కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమన్న సంకేతాలను అందుకుంది.

అంగ్లయులపై తొలి తిరుగుబాటుకు నేతృత్వం వహించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథకు కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలపడంతో పాటు చిరంజీవి స్టార్ డమ్ రిత్యా ఎక్కడా కించిత్ లోపం లేకుండా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నరనరాన భారతీయతను, జాతీయ వాదాన్ని పెంపోందించే విధంగా రూపోందింది. పలు సన్నివేశాల్లో రోమాలు నిక్కబోడుచుకునేలా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాలతో ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర కథలోకి ఎంట్రీ ఇస్తే..

బ్రిటిష్ వాళ్లు భారత దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో తెలుగు గడ్డ మీద పాలెగాళ్ల వ్యవస్థ నడుస్తుంటుంది. రాయలసీమలోని రేనాటి ప్రాంతానికి మజ్జారి నరసింహారెడ్డి (చిరంజీవి) పాలెగాడు. బ్రిటిష్ వాళ్ల అరాచకాలు అంతకంతకూ పెరిగి.. కరువు విలయతాండవం చేస్తున్న సమయంలోనూ బలవంతంగా శిస్తు వసూలు చేస్తున్న సంగతి తెలిసి నరసిహారెడ్డి వారికి ఎదురు తిరుగుతాడు. పన్నుల కోసం తన జనాల్ని వేధించి - కొందరి ప్రాణాలు కూడా తీసిన జాక్సన్ అనే ఇంగ్లిష్ దొరను నరసింహారెడ్డి మట్టుబెడతాడు. దీంతో బ్రిటిష్ పాలకులు ఆగ్రహించి.. నరసింహారెడ్డిని - అతడి సైన్యాన్ని ఎలాగైనా అంతం చేయాలని పంతం పడతారు. మరి వాళ్లను నరసింహారెడ్డి ఎలా ఢీకొట్టాడు.. చివరికి ఎలా వీర మరణం పొందాడు అన్నది మిగతా కథ.

అమితాబ్‌ బచ్చన్‌తో పాటు పలువురు స్టార్‌ నటులు ఇందులో నటిస్తుండటం, రామ్‌చరణ్‌ నిర్మిస్తుండటం, స్టైలిష్ డైరెక్టర్‌గా పేరున్న సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తుండటం, యాక్షన్‌ సన్నివేశాల కోసం హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్స్‌ పనిచేయడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్‌ విడుదలైన నాటి నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూసిన మెగా ఫాన్స్ ముందుకు ఆ తరుణం రానే వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘సైరా’ ఎలా ఉన్నాడు? బ్రిటిష్‌ వారిపై అతని పోరాటం ఎలా సాగింది? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరు ఎలా అలరించారు? అన్నది చిత్రం చూసి తెలుసుకోవాల్సిందే.

cinima-reviews
‘సైరా నరసింహారెడ్డి’

విశ్లేషణ

ఝాన్సీపై ఆంగ్లేయులు దాడి చేయటంతో కథ ప్రారంభమవుతుంది. తొలి స్వాతంత్ర్య పోరాటం చేస్తున్నది మనం కాదని, అంతకుముందే ఆంగ్లేయులను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే వ్యక్తి గడగడలాడించాడని అతని గురించి లక్ష్మీబాయి(అనుష్క) తన సైనికులకు వివరించడంతో ‘సైరా’ కథ మొదలవుతుంది. రేనాడులోని చిన్న చిన్న సంస్థానాలు, వాటి మధ్య ఐకమత్యం లేకపోవడం, మరోపక్క పంటలు పండకపోయినా పన్నులు కట్టాలని ఆంగ్లేయులు ప్రజలను హింసించడంతో నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే, ఆరంభ సన్నివేశాలన్నీ పాత్రల పరిచయం కోసం వాడుకున్నాడు. 61 సంస్థానాలు వాటిల్లో పన్నులు వసూలు చేసేందుకు ఆంగ్లేయులు చేసే అకృత్యాలను కళ్ల కట్టినట్లు చూపించారు.

ప్రజల కష్టాలను చూసిన నరసింహారెడ్డి ఆంగ్లేయులపై పోరాటం చేయడానికి ఏం చేశాడు? ఐకమత్యంలేని సంస్థానాలు ఏకతాటిపైకి పైకి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలతో ప్రథమార్ధం సాగుతుంది. ముఖ్యంగా విరామానికి ముందు ఆంగ్లేయులతో నరసింహారెడ్డి చేసే పోరాట సన్నివేశాలు ఒళ్లు గగురుపొడుస్తాయి. దీంతో కథలో ప్రేక్షకుడు మరింత లీనమవుతాడు. బ్రిటిష్ అధికారి జాక్సన్‌ తల నరికి ఆంగ్లేయులకు పంపడంతో సెకండాఫ్‌లో ఏం జరుగుందన్న ఉత్సుకత ఏర్పడుతుంది.

అయితే, అందుకు తగ్గట్టుగానే ద్వితీయార్ధాన్ని కూడా మలిచాడు దర్శకుడు. కథ, కథనాల్లో వేగం పెంచాడు. రేనాడులో నరసింహారెడ్డి పోరాటం గురించి బ్రిటిష్‌ ప్రభుత్వానికి తెలియడం, దాన్ని అణచివేసేందుకు ఆ ప్రాంతానికి అత్యంత క్రూరుడైన మరో అధికారిని పంపడంతో ద్వితీయార్ధం ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచే కథ మరింత రసకందాయంలో పడుతుంది. కథలో నాటకీయత మొదలవుతుంది. ఒకపక్క నరసింహారెడ్డి మిగిలిన సంస్థానాధీశుల్లో స్వాతంత్ర్యపోరాట స్ఫూర్తిని రగిలించి అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేయడం తదితర సన్నివేశాలతో సాగుతుంది. ఇక్కడే దర్శకుడు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. చిరంజీవిలోని మాస్‌ ఇమేజ్‌. స్టార్‌ డమ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయా సన్నివేశాలను రాసుకున్నాడు.

అవుకురాజు, వీరారెడ్డి, బసిరెడ్డి పాత్రలు నరసింహారెడ్డికి సహకరిస్తున్నాయా? లేక వెన్నుపోటు పొడుస్తున్నాయా? అన్న ఉత్కంఠను ప్రేక్షకుల్లో కలిగించేలా సన్నివేశాలు ఉంటాయి. ముఖ్యంగా చిరంజీవి నుంచి ప్రేక్షకులను ఏం ఆశిస్తారో అవన్నీ దర్శకుడు దృష్టిలో పెట్టుకున్నాడు. దీంతో ద్వితీయార్ధంలో తీసిన పోరాట ఘట్టాలు రోమాంచితంగా చిరు అభిమానులకు పండగలా ఉంటాయి. అయితే, అతి చిన్నదైన సైరా సైన్యం 10వేలమంది ఆంగ్లేయ సైన్యాన్ని చంపడం ఇవన్నీ కొంత లాజిక్‌కి దూరంగా సాగే సన్నివేశాలే. క్లైమాక్స్‌లో మరింత లిబర్టీ తీసుకున్నాడు దర్శకుడు. చరిత్రలో ఆంగ్లేయులు నరసింహారెడ్డిని ఉరితీసినట్లుగా ఉంది.  అయితే క్లైమాక్స్‌కు భావోద్వేగాలు జోడించడంతో సినిమా విషాదాంతంగా ముగించినట్లు అనిపించకుండా జాగ్రత్తపడ్డాడు దర్శకుడు.

నటీనటుల విషాయానికి వస్తే..

మెగాస్టార్ చిరంజీవి పుష్కరం క్రితం కలను సాకరం చేసుకోవడంలో సర్వశక్తులొడ్డి మరీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెరిసారు. తొలిసారి తన కెరీర్ లో చారిత్రక చిత్రంలో నటించిన ఆయన ఇందుకు తన 150 చిత్రలా అనుభవం ఎలాంటిదో ఈ చిత్రంలో ప్రదర్శించాడు. చారిత్రక నేపథ్యమున్న పాత్రలో పర్ ఫెక్ట్ గా ఫిట్ అయ్యాడు. చిరంజీవి తనయ సుస్మిత అందించిన ఆహార్యం కూడా నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ ను ఒదిగిపోయేలా చేసింది.

యుద్ధ సన్నివేశాల్లో చిరంజీవి నటన అద్భుతంగా వుంది. నేటి తరం యువ కథానాయకులకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఆయన తనదైన మార్కును ప్రదర్శించారు. అభిమానుల అంచనాలను ఎక్కడా కొద్దిగ కూడా తక్కువ కాకుండా అన్ని అంశాలను పరగణలోకి తీసుకుని మరీ వెండితెరపై సువర్ణమయంగా తన నటనా వైవిద్యాన్ని ప్రదర్శించారు. అయితే ఎమోషనల్ సన్నివేశాల్ని చిరు తన నటనతో రక్తి కట్టించిన తీరు ఆకట్టుకుంటుంది. సంభాషణలు పలకడంలోనూ చిరు తనదైన మార్కును చూపించారు. చివరి 20 నిమిషాల్లో చిరు నటన మాటలకు అందని విధంగా సాగింది.

ఉయ్యాలవాడ గురువు పాత్రలో స్వాతంత్ర్యపోరాట స్ఫూర్తిని రగిలించే గురువు గోసాయి వెంకన్నగా అమితాబ్ బచ్చన్ చక్కగా సరిపోయారు. తన కళ్లలో ఇంటెన్సిటీ చూపించి తన స్థాయిని చాటుకున్నారు. ఇక అవుకు రాజుగా సుదీప్‌ నటనను మెచ్చుకోకతప్పదు. నరసింహారెడ్డి అంటే అసూయ కలిగిన వ్యక్తిగా చక్కగా నటించారు. అదే సమయంలో ఆంగ్లేయులపై చేసే పోరాటంలో నరసింహారెడ్డికి సహకరించడం ఆకట్టుకుంది. ఇక వీరారెడ్డిగా జగపతిబాబు పాత్ర భిన్న కోణాల్లో సాగుతుంది. మొదటి నుంచి నరసింహారెడ్డి వైపు ఉండే వీరారెడ్డి అనుకోని పరిస్థితుల్లో మారతాడు. బసిరెడ్డిగా రవికిషన్‌ మోసపూరిత పాత్రలో కనిపించారు.

నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మగా నయనతార చక్కగా సరిపోయింది. ఆ పాత్రలో చక్కగా నటించింది. ఇక ‘సైరా’లో మరో ప్రధాన పాత్ర తమన్నా, నరసింహారెడ్డి ప్రియురాలు లక్ష్మిగా చాలా చక్కగా నటించింది. తన డ్యాన్స్‌, పాటలతో ప్రజల్లో స్వాతంత్ర్యకాంక్షను రేకెత్తిస్తుంది. పాండిరాజాగా విజయ్‌సేతుపతి నటన ఆకట్టుకుంటుంది. ఆంగ్లేయులపై నరసింహారెడ్డి చేస్తున్న పోరాటానికి తనవంతు సహకారాన్ని అందిస్తాడు. ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. పవన్‌కల్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌, చివరిలో నాగబాబు స్వరం వినిపించడం మెగా అభిమానులను ఆకట్టుకుంటాయి.

టెక్నికల్ అంశాలకు వస్తే..

‘సైరా’ దర్శకుడు సురేందర్‌రెడ్డి చిత్ర కథ, కథనాన్ని మెగా ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దిన తీరు అమోఘం. ఆయన తీసుకున్న జాగ్రత్తలు చిత్రంలో ప్రతీ ఫ్రేమ్ లో కనిపిస్తాయి. చరిత్ర అర్థం చేసుకోవడం మొదలు.. చిరంజీవి స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకుని సన్నివేశాలు రాసుకోవడం వరకు.. తన అనుకున్న కథ, కథనాన్ని తెరపై కూడా అలాగే మలిచే విధానంలోనూ ఆయన సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.  పరుచూరి బ్రదర్స్‌ అందించిన కథకు మెరుగులు దిద్ది అద్భుతమైన విజువల్‌ వండర్ గా రూపొందించాడు. స్టైలిష్‌ దర్శకుడిగా పేరున్న ఆయన చరిత్ర ప్రాధాన్యమున్న కథను అద్భుతంగా మలిచాడు.

ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ వహించిన రత్నవేలు ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. దర్శకుడి ఊహలకు ఆయన ప్రతిబింబంగా నిలిచారు. ఈ సినిమా ప్రధాన బలం సంగీతం. అమిత్‌ త్రివేది, జూలియస్‌ ఫాఖియంలు ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా జూలియస్‌ నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశంలో ప్రేక్షకుడు లీనమయ్యేలా చేసింది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్‌లో వినిపించే నేపథ్య సంగీతంతో ఒళ్లు గగురుపొడుస్తుంది.

‘సైరా’లో యాక్షన్‌ సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్స్‌, గ్రెగ్‌పావెల్‌ అతని బృందం, రామ్‌లక్ష్మణ్‌లు తీర్చిదిద్దిన పోరాట ఘట్టాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాయి. బుర్రా సాయిమాధవ్‌ డైలాగ్‌లు చిరు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాజీవన్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ ఆనాటి రోజులను కళ్లకు కట్టింది. ఇక చిత్ర నిర్మత రామ్ చరణ్‌ ఎక్కడా తగ్గలేదు. చిత్ర నిర్మాణంలో నూటికి నూరుశాతం ఖర్చు చేయడంలో వెనుకాడలేదు. దీంతో తన తండ్రి కలల ప్రాజెక్టు అద్భుతంగా రావడానికి నిజంగా ఎంతో శ్రమించారు. ప్రతి ఫ్రేములోనూ భారీదనం కనపడుతుంది.

తీర్పు..

‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం వీక్షకుడిలో నరనరాన దేశభక్తిని రగిలిస్తుంది. వందల ఏళ్ల క్రితం నాటి స్వతంత్ర్య పోరాటాన్ని.. నేటి తరం ముందు అవిష్కరించింది.

చివరగా... రోమాలు నిక్కబోడుచుకనే స్వతంత్ర సంగ్రామ చిత్రం ‘సైరా’..!

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh