Chandra Shekhar Azad to sacrifice on their tributes

Chandra shekhar azad to sacrifice on their tributes

Chandrashekhar Azad, Freedom fighter, India, Azad

Chandrashekhar Azad was a great Indian freedom fighter. His fierce patriotism and courage inspired others of his generation to enter freedom struggle. Chandrasekhar Azad was the mentor Bhagat Singh, another great freedom fighter, and along with Bhagat Singh he is considered as one of the greatest revolutionaries that India has produced.

చంద్రశేఖర్ ఆజాద్ వర్దింతి నేడు

Posted: 02/27/2016 10:37 AM IST
Chandra shekhar azad to sacrifice on their tributes

‘నీలో ఉన్నది ఉప్పునీరా? అయితే నీకోసమే బతుకు. కాదూ ఉడుకు రక్తమంటావా? అయితే దేశం కోసం మరణించు. నీ దేహం నిప్పుకణాల కొలిమి అయితే అనుక్షణం నీ ప్రాణాన్ని సంఘానికి సమర్పించు. నీ గుండెకాయ పత్తికాయ అయితే భరతమాతను మరిచిపోయి నీ సుఖమే చూసుకో’ - ఇలా రోమాలు నిక్కబొడుచుకునేలా పలికిన వీరుడు చంద్రశేఖర్ ఆజాద్. కాస్త పొట్టి. దృఢమైన శరీరం. చామనఛాయ. కుడి మోకాలి దగ్గర రివాల్వర్. ముఖమంతా మశూచి గుర్తులు. విశాలమైన నుదురు. మెలి తిరిగిన మీసం. దాన్ని మరింత మెలివేస్తూ ఎడమచేయి. ఇదీ ఆజాద్ రూపం.

‘బతికుండగా నన్ను తెల్లవాళ్లు పట్టుకోలేరు. వాళ్లకంత దమ్ము లేదు’ - ఇదే మాట పదేపదే అనేవాడు చంద్రశేఖర్. 1906 జూలై 23న మధ్యప్రదేశ్‌లోని జాబ్వా జిల్లా భావ్రా గ్రామంలో పుట్టాడు. తండ్రి పండిట్ సీతారాం తివారి. తల్లి జగరాణీదేవి. అంతగా డబ్బున్న కుటుంబం కాదు వారిది. పిల్లాణ్ని సంస్కృత పండితుణ్ని చేయాలని తల్లి అనుకునేది. కాశీలో చదివించాలని కలలు కనేది. కాని చదువంటే గిట్టేది కాదు చంద్రకి. దాంతో తల్లి కట్టడి చేసేది. అది నచ్చలేదు చంద్రకి. ఇల్లొదిలి ముంబై పారిపోయాడు 13 ఏళ్లప్పుడు. అక్కడ కూలీనాలీ చేశాడు. వేరుశనగకాయలు తిని బతికాడు. మురికివాడల్లో కార్మికుల గదుల్లో తలదాచుకున్నాడు.

ఓ పక్క గాంధీజీ సహాయనిరాకరణోద్యమంతో దేశం అట్టుడికిపోతోంది. దేశం నలుమూలలా నడుస్తున్న ఆందోళనలు ఆజాద్‌ను వెర్రెక్కించాయి. స్వాతంత్య్రం కోసం ఏదో ఒకటి తానూ చేయాలనుకున్నాడు. అంతే! పాఠశాల ముందే ధర్నా చేశాడు. పోలీసులు పట్టుకెళ్లారు. మెజిస్ట్రేట్ ముందు నిలబెట్టారు. పెళ్లికెళ్లినంత సంబరం 15 ఏళ్ల చంద్రశేఖర్‌లో! మెజిస్ట్రేట్ అడిగారు ‘‘నీ పేరేంటి?’’ అని. అసలు పేరు చెప్పలేదు. ‘‘ఆజాద్’’ అన్నాడు. స్వాతంత్య్రమే నా పేరంటూ కాలరెగరేశాడు. ‘‘నీ తండ్రి పేరు?’’ అని అడిగారో లేదో ‘‘స్వేచ్ఛ’’ అన్నాడు కన్నెగరేస్తూ. ఆవేశాన్ని అణుచుకుంటూ మెజిస్ట్రేట్ అడిగారు - ‘‘నీ ఇల్లు’’ అని. టక్కున చెప్పాడు ‘చెరసాల’ అని. ఆయనకు ఒళ్లు మండింది. 15 రోజుల జైలుశిక్ష విధించారు. చిలిపి చంద్ర ఊరుకోలేదు. ‘‘నాకు తెలుసు సర్. నన్ను మా ఇంటికే పంపుతారని’’ అన్నాడు. ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. ఖైదు రద్దుచేసి 15 కొరడా దెబ్బల్ని ఖరారు చేశారు. చర్మం చీలిపోయేలా, ఒళ్లంతా రక్తం కారేలా చితకబాదారు పోలీసులు. ఏడవలేదు ఆ కుర్రాడు. ఒంటిపై పడిన ప్రతి దెబ్బా కర్తవ్యబోధ చేసింది.

 ‘తాను పుట్టిందే జన్మభూమి రుణం తీర్చుకునేందుకు’ అని అనుకున్నాడు. చంద్రశేఖర్ తివారీ కాస్తా చంద్రశేఖర్ ఆజాద్ అయ్యాడు. రాంప్రసాద్ బిస్మిల్ స్నేహంతో ఆజాద్‌లో విప్లవ బీజాలు బలంగా నాటుకున్నాయి. బిస్మిల్, అష్నుకుల్లా ఖాన్, రోషన్‌సింగ్‌లు రైలు దోపిడీకి పన్నిన కుట్రలో పాల్గొన్నాడు. 1924 ఆగస్టు 9న ఈ విప్లవకారులంతా కాకోరి అనే ఊరు వద్ద రైల్ ఆపి ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారు. ఈ కుట్ర కేసులో ముందో వెనకో అందరూ పోలీసులకు చిక్కారు - ఒక్క ఆజాద్ తప్ప. ఆజాద్ మాత్రం రహస్య జీవితంలోకి వెళ్లిపోయాడు. అజ్ఞాతవాసంలో ఆజాద్ రహస్య కేంద్రం-ఉత్తరప్రదేశ్‌లోని ఓర్చా అరణ్యం. ఇక్కడ సతార్ నది ఒడ్డున ఆంజనేయుడి గుడి పక్క ఓ కుటీరం కట్టాడు. జన్మతః బ్రాహ్మణుడు కాబట్టి, సంస్కృతం వచ్చు కాబట్టి హరిశంకర బ్రహ్మచారి అనే సాధువుగా వేషం మార్చాడు. అన్ని కుట్రలకూ ప్రణాళిక వేసింది ఇక్కడి నుంచే.   

 1929 మే 2న. పార్లమెంటుపై బాంబు దాడి కేసులో భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు ఉరిశిక్ష ఖరారు చేశాయి న్యాయస్థానాలు. ఎంతగా విచలితుడయ్యాడో ఆజాద్. వారిని విడిపించేందుకు ఎంతకైనా తెగించాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. 1931 ఫిబ్రవరి 27న తెల్లారగట్ల జవహర్‌లాల్ నెహ్రూని కలిశాడు ఆజాద్. విప్లవ వీరులైన భగత్‌ సింగ్ తదితరుల్ని విడిపించేందుకు సహకరించమన్నాడు. నెహ్రూ అందుకు అవుననలేదు, కాదనలేదు. ఆజాద్ అక్కడి నుంచి నేరుగా అలహాబాద్‌లోని ఆల్ఫ్రెడ్ పార్కుకి వెళ్లాడు. ఓ చెట్టు కింద ఇద్దరు విప్లవ మిత్రులతో కూచున్నాడు. భగత్ త్రయాన్ని ఎలాగైనా విడిపించేందుకు వారితో చర్చిస్తున్నాడు.

అంతలో వారిలో ఒకరు పోలీసు ఇన్‌ఫార్మర్ అని అనుమానమేసింది. ఆజాద్ మెదడు పాదరసంలా పనిచేసింది. కుడిచేయి మోకాలి దగ్గరి రివాల్వర్ దగ్గరకు వెళ్లింది. క్షణంలో సగం వంతు కాలంలో చుట్టూ పోలీసులు. అంతకన్న వేగంగా కాల్పులు జరిపాడు ఆజాద్. ముగ్గురు పోలీసులు తూటాలకు బలైపోయారు. ఒక్క పోలీసు కూడా తనను ముట్టుకోకుండా తుపాకీని కాలుస్తూనే ఉన్నాడు ఆజాద్. ఒక్క బుల్లెట్ మాత్రమే మిగిలింది. అది కూడా అయిపోతే, పోలీసులకు తాను పట్టుబడటం ఖాయం. ఛీ! బతికుండగా బ్రిటిష్ వారికి చిక్కడమా? నెవ్వర్! అంతే! ఆ ఒక్క తూటాతో తననే కాల్చుకున్నాడు ఆజాద్. నేలకూలాడు.భరత జాతి స్వేచ్ఛా వాయువులను అనుభవించక ముందే తన తుది శ్వాసను విడిచినా కానీ భారతదేశం ఉన్నంత కాలం ఆయన సేవలను అందరూ గుర్తు చేస్తూనే ఉంటారు. అలాంటి ఆజాద్ లు మన దేశంలో మళ్లీ మళ్లీ పుట్టాలని.. కోరుకుందాం.


చంద్రశేఖర్ ఆజాద్ అమర్ రహే.. అమర్ రహే జై హింద్ జై బారత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrashekhar Azad  Freedom fighter  India  Azad  

Other Articles