Unanswered questions in devyani s case

devyani khobragade, Sangita Richard, Devyani Visa fraud case, US Embassy, Indian Diplomat Devyani Khobragade

unanswered questions in Devyani's case

భారత దౌత్యవేత్త దేవయాని ఘటన వెనక అసలు కారణమేమిటి

Posted: 12/24/2013 06:06 PM IST
Unanswered questions in devyani s case

భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగడె ఘటన మీద వెనక్కి తగ్గేది లేదంటోంది అమెరికా.  అమెరికా ప్రభుత్వానికెందుకంత మంకు పట్టు?  దేవయాని చేసిన నేరం అంత కఠిన చర్యకు నోచుకునేదా?  జరిగినదానికి సంజాయిషీ కానీ క్షమాపణ కానీ కోరేది లేదంటూ అమెరికా ప్రభుత్వం అంత గట్టిగా చెప్పటం వెనుకనున్న అంతర్యమేమిటి?  దీని ద్వారా భారత ప్రభుత్వానికి ఏం సంకేతాలనిద్దామనుకుంటోంది? 

పై ప్రశ్నలకు సమాధానం లభించాలంటే ముందుగా మనం ఆ ఘటన వెనుకనున్న పాత్రధారులు, వారు తీసుకున్న చర్యలు ఏమిటన్నది పరిశీలించాల్సివుంటుంది.  

ఈ ఘటనలో ప్రస్తుతానికి ఇద్దరిని తీసుకుందాం.  నిందితురాలు దేవయాని ఖోబ్రాగడె, బాధితురాలు సంగీతా రిచర్డ్,  కేరళవాసి సంగీతా రిచర్డ్ అమెరికాలో పని చేసి ఎక్కువ డబ్బుని సంపాదించాలని ఆశపడటంలో తప్పేమీ లేదు.  ఆ ప్రయత్నంలో ఢిల్లీలో ఆమెకు దేవయాని తారసపడటం, సంగీత రిచర్డ్ ని అమెరికా తీసుకుని వెళ్ళటం తనదగ్గర ఇంటిపనికి పెట్టుకోవటానికి దేవయాని అంగీకరించటం,  ఆమెను ఏ-3 వీసా మీద తీసుకెళ్ళటం జరిగింది.   

సంగీత రిఛర్డ్ కోరికైన అమెరికా వెళ్ళటం వరకు జరిగింది కానీ అక్కడ ఆశించిన స్వేచ్ఛ లభించలేదు.  ఏ-3 వీసా మీద సంగీత దౌత్యవేత్తల దగ్గర తప్పితే మరెక్కడా పనిచెయ్యటం సాధ్యంకాని పని.  అమెరికా వరకు వచ్చి ఇంటి పని, పిల్లల సంరక్షణ వరకే పరిమితమవటం సంగీత రిఛర్డ్ కి నచ్చలేదు, అది ఆమె కన్న కల కాదు.  ఆ విషయంలో తనకు ఎటువంటి సాయం చెయ్యటానికీ దేవయానిలో సంసిద్ధత ఉన్నట్టుగా సంగీతకు కనిపించలేదు.  ఫలితంగా సంగీత రిఛర్డ్ దేవయాని ఇంట్లోంచి వెళ్ళిపోయింది.  ఎక్కడికి వెళ్ళిందీ దేవయానికి తెలియదు.  అందువలన ఆమె పోలీస్ లకు ఫిర్యాదు చెయ్యటం జరిగింది కానీ పోలీసుల నుంచి ఆమెకు ఎటువంటి సాయమూ లభించలేదు.  

తన ఇంట్లోంచి డబ్బు, సెల్ ఫోన్ లను దొంగిలించి పారిపోయినట్లుగా దేవయాని చేసిన ఫిర్యాదులో ఎంతవరకు నిజముందో కూడా మనకు తెలియదు.  మనిషి కనపడటం లేదు అనేదానికంటే దొంగతనం మరింత ఊతమిస్తుంది కానీ ఆ ఫిర్యాదుకీ పోలీసుల నుంచి దేవయానికి ఎటువంటి స్పందనా లభించలేదు.  దేవయాని సంగీత రిఛర్డ్ మీద, ఆమె భర్త ఫిలిప్ రిఛర్డ్ మీద చేసిన ఫిర్యాదుని మనదేశంలో మాత్రం నమోదు చెయ్యటం జరిగింది, వాళ్ళ మీద నేరారోపణ జరిగింది.  

నేరారోపణ ఉన్న సమయంలో వాళ్ళకి దేశం వదిలి పోవటానికి మరో దేశం సహకరించదు.  కానీ సంగీత రిఛర్డ్, ఆమె భర్త ఫిలిప్ రిఛర్డ్ కి, ఆమె మామగారికీ కూడా సినిమాలో జరిగినంత సులభంగా చకచకా అమెరికా వీసా లభించింది, వాళ్ళు దేశం వదిలి వెళ్ళిపోయారు.  అప్పటి వరకూ ఎటువంటి కదలికలూ బయటకు కనిపించని అమెరికన్ పోలీసు శాఖలో ఉన్నట్టుండి అన్యాయానికి అడ్డుకట్ట వేసి న్యాయానికి పెద్దపీట వెయ్యాలనే చేతన పెల్లుబికింది.  

ఫలితంగా దేవయాని మీద రెండు నేరారోపణలు జరిగాయి.  ఒకటి ఆమె వీసా విషయంలో తప్పు సమాచారం ఇచ్చిన నేరంలో బాధితురాలు సంగీత రిఛర్డ్ కి అమెరికా దేశ నియమం ప్రకారం కనీస వేతనం ఇవ్వలేదు.  రెండవ నేరారోపణ, ఆమె చేత రోజుకి 18 నుంచి 19 గంటల వరకు పని చేయించటం..  ఆ దేశ నియమాల ప్రకారం వారానికి 40 గంటలకంటే ఎక్కువ పని చేయించుకుంటే అందుకు తగ్గ వేతనం ఇవ్వటం కూడా అవసరం.  అయితే చట్టం ప్రకారం చెల్లించాల్సిన 4500 డాలర్లు చెల్లించలేదని ఆమె మీద అభియోగం మోపటం జరిగింది.  అయితే దేవయానికి భారత ప్రభుత్వం నుంచి లభించే వేతనం అందుకు సరిపోతుందా అన్నది అమెరికన్ ప్రభుత్వానికి అనవసరం.  

ఇలాంటి వీసా నేరాల వలన ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలో పనిచేసే ఎందరో ఉద్యోగుల విషయంలో జరిగింది మాత్రం అన్యాయం కాదా?  బి-1 వీసా మీద తీసుకునివచ్చిన ఉద్యోగుల చేత పని చేయించుకోవటం, పని లేని సమయానికి జీతం లో కోతలు విధించటం లాంటి నేరాలకు పాల్పడినట్టుగా అభియోగాన్ని మోపిన ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణ మూర్తికి అరదండాలు వేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళి కూర్చోబెట్టలేదే!  అలా వాళ్ళ పట్ల కూడా ప్రవర్తించమని కాదు.  ఆయా కంపెనీల వీసా నేరాలకు వాళ్ళమీద పెనాల్టీ మాత్రమే విధించినవాళ్ళు దేవయాని ఖోబ్రాగడే విషయంలో మహిళ అని, భారత దేశం తరఫున ఉన్నత పదవిలో పనిచేస్తున్న దౌత్యవేత్త అని కూడా చూడకుండా ఒక స్మగ్లరో గ్యాంగ్ స్టర్ విషయంలో చేసినట్లుగా బయటినుంచి పట్టుకెళ్ళటం అవసరమా?  ఇంకా అంతకంటే మార్గమే లేదా?  స్కూల్ కి వెళ్ళిన దేవయాని అక్కడి నుంచి చట్టానికి దొరకకుండా పారిపోతుందని భయమా?  ఆమె ఇంటికి వెళ్ళవచ్చు కదా!  లేదా మీ మీద నేరారోపణ జరిగింది, పోలీస్ స్టేషన్ కి వచ్చి మీ తరఫునుంచి చెప్పవలసిందేమైనా ఉంటే చెప్పమని అంటే అలా జరిగేది కాదా? 

తప్పు ఎవరు చేసినా తప్పే!  అంతే కాదు అందరూ చేస్తున్నారు కదా అనే వంక చట్టం దృష్టిలో పరిగణనలోకి తీసుకునేది కాదు కాబట్టి మిగిలిన దౌత్యవేత్తలు తక్కువ ఇస్తున్నారన్న ఆరోపణ కానీ, ఇతర దేశస్తులు- ఉదాహరణకు రష్యన్స్ చేసే బీమా నేరాలు కానీ ఎత్తి చూపటం వలన పడ్డ నేరారోపణలో సడలింపు జరగదు.  తప్పు జరగలేదని ఎవరూ అనలేరు,  అక్కడ అందరూ చేస్తున్నట్టుగానే తాను కూడా చేసిన దేవయాని తప్పుని సమర్ధించనూ లేరు.  అందరినీ వదిలేసి ఆమెనే ఎందుకు శిక్షించటం అని అనటం కూడా సబబు కాదు.  అయితే ఆ నేరానికి ఆమెను బహిరంగంగా సంకెళ్ళు వేసి తీసుకెళ్ళటం అది కూడా ఆమె కూతురు చదివే స్కూల్ దగ్గర నుంచి తీసుకెళ్ళటం, పెద్ద పెద్ద నేరగాళ్ళ పట్ల ప్రవర్తించినట్లుగా వివస్త్రను చేసి శల్య పరీక్ష చెయ్యటం అవసరమా అంటే అది మామూలే అంటోంది అమెరికన్ ప్రభుత్వం.

ఇక ఈ ఉదంతంలో మూడవ పాత్రధారి ప్రస్తావన తెస్తే అతను ప్రీత్ భరారా.  ఆయన మాన్ హట్టన్ లో అమెరికన్ ప్రాసిక్యూటర్ గా పనిచేస్తున్న భారత మూలాలు గల అమెరికన్ వాసి.  ఆయన చిన్నప్పుడే ఆయన తండ్రి అమెరికాలో స్తిరనివాసం ఏర్పరచుకున్నారు.  రాజకీయరంగంలో పైకి రావాలనే సంకల్పంగల మనిషి.  చిన్నప్పటి నుంచీ అమెరికాలోనే పెరిగిన భరారా మానసికంగానూ ప్రవర్తనాపరంగానూ అమెరికన్ అన్న విషయం నిజమే కానీ దాన్ని నిరూపించుకోవటానికి అవకాశం దేవయాని వలన లభించిందేమో అనే అనుమానాలను మీడియా వెలిబుచ్చింది.  ఒక భారతీయ వ్యక్తి పట్ల కఠినంగా ప్రవర్తించినట్లయితే భరారా తను భారత పక్షపాతి కాదని నికార్సుగా అమెరికన్ పౌరుడనే పేరు గడించే అవకాశం ఉంటుందన్నది వాదన.  

పత్రికా కథనాల ప్రకారం భరారాకు అందుకు అవకాశం సంగీత రిచర్డ్ రూపంలో లభించింది.  అమెరికాలో స్తిరపడదలచుకున్న సంగీత రిఛర్డ్ కి పెద్దల ఆసరా కావాలి, ఆ పెద్దలకు భారతీయ వాసి మీద ఆరోపణలు చేసి గట్టిగా నిలబడే వ్యక్తి కావాలి.  భారత దేశంలో ఆమె భర్త, మామలను తీసుకుని రావటం ద్వారా ఆమెకు స్వదేశంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రమాదమూ లేదు.  సంగీత రిఛర్డ్ కిచ్చిన వాగ్దానం ప్రకారం అన్నీ పూర్తి చేసిన తర్వాత ఇక మిగిలిందల్లా దేవయాని మీద నేరారోపణ, ఆమె మీద వార్తలలోకి ఎక్కేంత స్థాయిలో న్యాయపరమైన చర్యలు.  అది కూడా డిసెంబర్ 10 న రిఛర్డ్ కుటుంబాన్ని ఇండియా నుంచి తీసుకెళ్తే వాళ్ళు 11 న క్షేమంగా అమెరికాలో దిగి కాలుపెట్టిన తర్వాత డిసెంబర్ 12 న దేవయాని ఖోబ్రాగడే ని నాటకీయంగా అరెస్ట్ చెయ్యటం ఇవన్నీ ఎన్నో అనుమానాలకు దారితీస్తున్నాయి.  

జరిగిన ఒక నేరం, దాని మీద జరిగిన పోలీసు చర్యకు భారత్ ఇంత ఇదయిపోవాలా అని భరారా అడుగుతున్నారు.  మరి ఒక పనిచేసే మనిషి ఆమె భర్త పట్ల జరిగినది అన్యాయం కాదా అని కూడా ప్రశ్నిస్తున్నారు భరారా.  ఒక్క సంగీతా రిఛర్డ్ విషయంలో అంతగా స్పందించిన చట్టం వేలాదిమంది ఉద్యోగుల విషయంలో వీసా చట్టం కింద చట్ట వ్యతిరేకంగా జరిగిన నేరాల విషయంలో ఉదాసీనత చూపించటం లేదా కేవలం వాళ్ళ మీద పెనాల్టీ మాత్రం విధించటం ఎందుకు జరిగింది?

ఇదంతా తెలిసిన తర్వాత భారత దేశవాసులకు హృదయం రగిలిపోవటం సహజం.  అలాంటప్పడు మన రాజకీయ నాయకులకూ దాన్ని తలకెక్కించుకోవటం తప్పని సరి.  

ఇక్కడ ఉదయించే ప్రశ్నలు చాలా ఉన్నాయి.  సాధారణంగా వచ్చే ప్రశ్నలు ఇవి: 

1.    దేవయాని నేరం చేసి ఉంటే అదెంత పెద్ద శిక్షకు అర్హమైంది?  నేరం చేసిందెవరు, దానికి గురైందెవరు, నిజంగా నష్టపోయినవారెవరు?

2.    అమె నేరం చేసింది కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, చట్టం దృష్టిలో అందరూ సమానమే అని నొక్కి వక్కాణించే అమెరికా ప్రభుత్వానికి ఆదరాబాదరాగా బాధితురాలి భర్త, మామలను భారతదేశం నుంచి తరలించాల్సిన అవసరమేమొచ్చింది, అంతకంటే ముఖ్యంగా దాన్ని గోప్యంగా ఉంచి అదను చూసి వేటు వెయ్యాల్సిన అవసరమేమిటి?

3.    నేరస్తులెంత పెద్దవాళ్ళయినా సరే చట్టాన్ని గౌరవించాల్సిందే, అలా చెయ్యనివాళ్ళకి శిక్ష తప్పదు అని చెప్పే అమెరికా ప్రభుత్వం మరి ఇతర దేశంలోని చట్టాలకు గౌరవమివ్వదా.  భారతదేశంలోని నేరస్తుల వీసా ఇచ్చి అమెరికా తీసుకెళ్ళటం భారత దేశ చట్టాలను అగౌరవపరచటమవదా?

4.    మరి నేరమే జరిగినట్లయితే అందులో దేవయాని మాత్రమే బాధ్యురాలు అవుతుందా.  సంగీతా రిఛర్డ్ కి వీసా జారీ చేసిన అధికారి, ఆదాయ పన్ను తర్వాత దేవయాని చేతికి వచ్చే నెలసరి జీతం 4000 డాలర్ల లోంచి ఆమె 4500 డాలర్లు ఎలా ఇవ్వగలుగుతారని నమ్మారు.  వీసా ఇచ్చే ముందు సవాలక్ష ప్రశ్నలు వేసే వీసా అధికారికి ఈ విషయం తట్టలేదా లేకపోతే తప్పు జరగటానికే అవకాశమిచ్చారా.  అలాంటప్పుడు యుఎస్ కాన్సలర్ కూడా ఆ నేరంలో భాగస్వామి కారా.  ఆయనకు కూడా శిక్షలో భాగం ఉండవద్దా? 

మరొకరికి కూడా శిక్ష పడితే దేవయాని శిక్ష తగ్గుతుందని కాదు కానీ తన తప్పులు ఎంచకుండా ఇతర తప్పులు ఎంచటం ఎంతవరకు సరైనదన్నదే ప్రశ్న. 

5.    ఈ చర్య ద్వారా అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ఎటువంటి సంకేతాన్నిద్దామనుకుంటోంది? 

ఇక విశేషమైన ఈ క్రింది ప్రశ్నలు నా చిన్ని బుర్రలో ఉదయించాయి.  అయితే వాటికి నా దగ్గర ఎలాంటి సమాధానాలూ లేవు.

1.    దేవయాని స్థానంలో మరో దేశవాసి ఉదాహరణకు ఏ ఫ్రెంచ్ లేదా ఇటలీ దేశవాసి ఉంటే ఇలాగే చేసేవారా?

2.    సంగీత రిచర్డ్ స్థానంలో మరెవరో ముంతాజ్ అనే పేరున్న మనిషికి ఇలాగే ఆశ్రయమిచ్చివుండేవారా?

3.    అమెరికా కాకుండా మరో దేశంలో ఏ శ్రీలంకలోనో లేక గల్ఫ్ లోనో దేవయాని భారత దౌత్యవేత్తగా పనిచేస్తున్నట్లయితే ఆమె దగ్గర పని చేసే సంగీత రిచర్డ్ ఇలాగే చట్టాన్ని ఆశ్రయించి ఉండేదా?  కేవలం అమెరికాలో స్థిర నివాసం కోసమే ఇదంతా చెయ్యటం జరిగిందా.  యుఎస్ లో ఉండటానికి వీసా కోసమే కానీ నిజంగా తనకి వేతనం తక్కువ లభించిందన్నది కాదా?  అందుకోసమే దేవయాని మీద అభియోగం మోపటం జరిగిందా?

4.    సంగీతా రిఛర్డ్ కి తక్కువ వేతనం లభిస్తున్న సంగతి ఆమెకు మొదటి నెలలో తెలియలేదా?  ఆమెకు వీసాలో ఏమున్నదో తెలియకపోవచ్చు కానీ జీతం తనకు చెప్పినంత ముట్టిందో లేదో కూడా తెలియలేదా?  9 నెలలకు కాని ఆ విషయం ఆమెకు అర్థం కాలేదా?

5.    ప్రస్తుతం రాజకీయాల్లో సతమతమవుతున్న అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల స్థానంలో ఏ నరేంద్ర మోది కానీ లేదా ములాయమ్ సింగ్ యాదవ్ కానీ ఉంటే ఇలాగే ప్రగల్భాలు పలికి తిరిగి చప్పబడివుండేవారా? మాకు ఎటువంటి షరతులూ లేని క్షమాపణ కావాలని, దేవయాని ఖోబ్రాగాడే మీద అభియాగాలను సత్వరమే ఎత్తివేయాలని గట్టిగా కోరిన విదేశాంగ మంత్రి ఇరు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఈ విషయంలో పరిష్కారాన్ని వెతుక్కోవలసి వుంటుందని అన్నారు.

ఈ పై ప్రశ్నలతో ప్రతివారిలోనూ వాళ్ళకి తెలియకుండానే అంతర్మథనం జరగటమే దేశంలో దేవయాని ఘటన పట్ల అందరికీ సానుభూతి లభించటమే కాకుండా అమెరికా ప్రభుత్వం పట్ల నిరసన వెల్లువెత్తటానికి కారణం అని అనిపించటం లేదూ?

-SriJa

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles