నిన్న నలుగురు ఎమ్మెల్యేలు .. నేడు మరో ఎమ్మెల్యే.. జగన్ కు షాకులమీద షాకులు


వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ నేతలు మామూలుగా షాకులివ్వట్లేదు. నిన్ననే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. ఇప్పుడు మరో ఎమ్మెల్యే జగన్ కు షాకివ్వడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి టీడీపీ లోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కూడా కలిసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అశోక్ రెడ్డి పార్టీలోకి చేరుతున్నారన్న వార్తలు రాగానే.. ఆ నియోజకవర్గ టీడీపీ నేతలు రంగంలోకి దిగి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో భేటీ అయ్యేందుకు యత్నించారు. అయితే లోకేశ్ హైదరాబాదులో లేరని, విజయవాడలో ఉన్నారని తెలుసుకుని అక్కడికీ పయనమయ్యారు. ఎట్టకేలకు అక్కడ లోకేశ్ తో భేటీ అయి.. అశోక్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దని.. పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జీ అన్నే రాంబాబు బాగానే పనిచేస్తున్నారని, ఆయన నేతృత్వంలో పార్టీ బాగానే బలపడిందని, కొత్తగా అశోక్ రెడ్డి పార్టీలోకి రావడంతో ఒరిగేదేమీ లేదని చెప్పారు.

 

అయితే లోకేశ్ మాత్రం పార్టీలోకి చేరతామంటూ ఎవరు ముందుకు వచ్చినా కాదనవద్దని వారికి సూచించారు. అయినా పార్టీలో చేరుతున్న విపక్ష ఎమ్మెల్యేలకు చెందిన నియోకవర్గాలకు సంబంధించిన పార్టీ నేతలకు సర్దిచెప్పిన తర్వాతే ముందడుగు వేస్తున్నాం కదా అని కూడా లోకేశ్ వారికి చెప్పారు. దీంతో అశోక్ రెడ్డి పార్టీ మార్పు పై స్పష్టత వచ్చినా.. ఎప్పుడు పార్టీ మారుతారో ఇంకా అధికారికంగా మాత్రం ప్రకటించలేదు.